అనంతపురం

ఉగాదికి ఉపాధి పోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, మార్చి 28: ఉగాది పండుగ ఉపాధి కూలీల ఇళ్లల్లో చేదు మాత్రమే మిగల్చనుంది. గత కొన్ని మాసాలుగా కూలీ డబ్బులు రాకపోవడంతో పండుగ ఎలా జరుపుకోవాలని కూలీలు మదనపడుతున్నారు. జిల్లాలో నెలకొన్న కరవు దృష్ట్యా వలస వెళ్ల లేక కేవలం ఉపాధి హామీ పనులను మాత్రమే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న వారికి నిరాశే మిగిలింది. పెద్ద పండుగ అయిన ఉగాది నాటికైనా ఉపాధి బిల్లులు రాకపోతాయా, పండుగను సంతోషంగా గడుపుకోలేమా అని ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్న కూలీలు ఉపాధి హామీ పనుల బిల్లులు రాకపోవడంతో పండుగ సంతోషానికి దూరం కావాల్సి వస్తోంది. పల్లెల్లో ఇళ్లకు సున్నం కూడా పూసుకోలేదు, పిల్లలకు కొత్త దుస్తులు కొనలేదు. చేతిలో చిల్లిగవ్వ లేక పండుగ ఎలా చేసుకుంటామని ఉపాధి కూలీలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పండుగ రోజు పిల్లలకు పిండి వంటలు వండి పెట్టాలన్న తలంపుతో ఉపాధి పనులకెళ్లే మహిళలు రోడ్లపై పడ్డ కానుగ కాయలు సేకరించి వాటి విత్తనాలు అమ్ముకునే పనిలో వున్నారు. కిలో కానుగ విత్తనాలు అమ్మితే రూ. 20 వస్తుందని 5న ంచి 10 కిలోల విత్తనాలు సేకరించుకుంటే వాటితో వచ్చే డబ్బుతో పిల్లలకు పిండివంటలు వండిపెడతామని అన్నారు. గత కొన్ని మాసాలుగా ఉపాధి బిల్లుల మొత్తాలు అందజేయని ప్రభుత్వం కనీసం పండుగ ముందైనా బిల్లులు ఇచ్చివుంటే ఉపాధి కూలీల ఇళ్ళల్లో పండుగ సందడి కనిపించేది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ప్రజలకు పండుగ..
ప్రభుత్వానిది ప్రచారం...
ధర్మవరం, మార్చి 28: ప్రస్తుతం ప్రతి పండుగను ప్రభుత్వం స్వయంగా అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే పరిస్థితి మనం చూస్తూనే వున్నాం. అయితే ఇది ప్రజలకు పండుగ, ప్రభుత్వం పనికి అదనపు ప్రచారంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రతి ఏడాది గతంలో కేవలం జనవరి 26న రిపబ్లిక్ డే, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం, అక్టోబర్ 2న గాంధీ జయంతితోపాటు మరికొన్ని ముఖ్యమైన రోజులను అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించేది. వీటికి అధికారులు సైతం ఎలాంటి అసంతృప్తులు లేకుండా తమ విధిలో భాగంగా హాజరై వాటిని ఎంతో ఘనంగా నిర్వహించి తద్వారా ప్రజలకు కూడా సందేశాలను వెళ్ళేలా చేసేవారు. కానీ నేటి ప్రభుత్వాల తీరు చూస్తుంటే ఏడాదిలో వచ్చే ఏ పర్వదినమైనా, మహాత్ముల జయంతి, వర్ధంతులు, మరికొన్ని ముఖ్య దినాల్లో సైతం అధికారులకు ఆదేశాలిచ్చి వాటిపై కార్యక్రమాలు నిర్వహించాలని జిఓలే జారీ చేసే పరిస్థితి నెలకొంది. గతంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల సాంప్రదాయాల ప్రకారం కేవలం వారు మాత్రమే స్వయంగా పండుగలు నిర్వహించుకునే వారు. నేడు కూడా ఉన్నంతలో అలాగే నిర్వహించుకుంటున్నారు. కానీ నేటి పాలకులు మాత్రం పర్వదినాలను సైతం ప్రచార అస్త్రంగా మార్చుకుని అధికారుల ద్వారా పర్వదినాలను జరిపిస్తున్నారంటే ఇది కేవలం అధికారంలో వున్న పాలకుల ప్రచార యావకు నిదర్శనమన్నది బహిరంగ సత్యం. పండుగ రోజు సెలవుల్లో సైతం అధికారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాల్సిన పరిస్థితిలో ప్రభుత్వ ఉద్యోగులైన పాపానికి కుటుంబాన్ని, పిల్లల సంతోషాన్ని పక్కన పెట్టి పర్వదినాలను తమ విధుల్లో భాగంగా నిర్వహించాల్సి వస్తోందని పలువురు అధికారులు ఎక్కడ చూసినా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు, శివరాత్రి ప్రాశస్త్యం, ఉగాది ఉత్సవాలు ఇలా ప్రతి పర్వదినాన్ని ప్రభుత్వం అధికారుల సమక్షంలో నిర్వహించడం కొంతవరకు బాగున్నా ఉద్యోగుల్లో మాత్రం పర్వదినం రోజైనా కుటుంబ సభ్యులతో కలిసి వుండే పరిస్థితి లేకపోయిందనే అసంతృప్తి నెలకొంటూనే వుంది. ఇందుకు ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయకుండానే ఉత్సవాలు ఘనంగా చేయాలంటు ఆదేశాలు జారీ చేయడంపై కూడా అధికారుల్లో అసంతృప్తిలే నిండుకున్నాయి. పండుగ రోజు ఇంటిని వదిలి పర్వదినం ప్రాశస్త్యాన్ని ప్రజలకు చెప్పి తిరిగి అన్నం మాత్రం ఇంటికెళ్లి తినాల్సిన పరిస్థితి వుందని ఓ అధికారి తన ఆవేదనను వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో సెలవు రోజైనా పనిచేసే మాకు కేవలం పర్వదినాల్లోనైనా తమను సంతోషంగా కుటుంబ సభ్యులతో గడుపుకునేలా ప్రభుత్వ పాలకులు కార్యక్రమాలు నిర్వహించకుండా వుండాలని పలువురు కోరుతున్నారు.
రేషన్ సరుకుల్లో కోత!

ధర్మవరం, మార్చి 28: చౌక దుకాణాల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేస్తున్న సరుకుల్లో క్రమంగా కోత విధిస్తున్నారు. ఇప్పటికే అదనపు చక్కెర, కిరోసినన్‌పై కోత పడింది. రానున్న రోజుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వలేని పరిస్థితి నెలకొనబోతోంది. రేషన్ డీర్లు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా సక్రమంగా సరుకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రజా పంపిణీలో అమలుచేస్తున్న నూతన సంస్కరణలు లబ్ధిదారులకు తీరని ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానం ద్వారా నాటి నుండి నేటి వరకు ప్రతి చౌక దుకాణంలోను లబ్ధిదారుడు తమ వేలిముద్రలు నమోదు గాక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. దీనికితోడు లబ్ధిదారుడు చౌక దుకాణాలకు వెళ్లినపుడు సర్వర్ పనిచేయలేదంటూ డీలర్లు చెప్పడంతో దుకాణానికి వెళ్లడం, రావడం జరుగుతూనే వుంది. దీనికితోడు ఆధార్ అనుసంధానం కాలేదంటు మరికొందరికి కష్టాలు. రేషన్ పంపిణీలో ప్రభుత్వం పారదర్శకంగా వుండాలని ప్రవేశపెట్టిన ఈ-పాస్ విధానం లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూనే వుంది. అది కొంచెం గాడిన పడేలోగానే ఇటీవల నగదు రహిత విధానం రేషన్‌దారులకు ఇబ్బందులు తెచ్చిపెట్టడంతో కాస్త తగ్గిన పౌర సరఫరాల శాఖ నగదు ద్వారానే రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికి అధికారులు మాత్రం చౌక దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు జరపాలంటూ డీలర్లపై ఒత్తిడి తేవడంతో పలువురు డీలర్లు ఈ విధానాన్ని అనుసరిస్తుండడంతో లబ్ధిదారులకు నగదు రహిత విధానం నరకప్రాయంగా తయారవుతోంది. ప్రధానంగా ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ప్రజా సాధికారిక సర్వే, రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వాహనాలు వున్నట్లు రేషన్ కార్డుల లబ్ధిదారులకు అనుసంధానం చేయడంతో ద్విచక్ర వాహనం లేని వారికి కూడా వున్నట్లు అనుసంధానం కావడంతో ప్రతి గ్రామంలోను పలువురు లబ్ధిదారులు మార్చి నెలలో రేషన్‌ను కోల్పోతున్నారు. దీంతో తమ రేషన్ కోసం మీ-సేవా కార్యాలయాలకు, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ అనునిత్యం లబ్ధిదారుడు ప్రదక్షిణలు చేస్తూనే వున్నారు. ఇటీవల నిర్వహించిన ప్రజా సాధిక సర్వేలో ప్రతి కుటుంబ సభ్యుని వివరాలు సర్వేలో నమోదు చేశారు. దీంతో రవాణా శాఖ అధికారులు సైతం ద్విచక్ర వాహనదారుల వివరాలు సర్వేలో పొందుపరచాలని ప్రభుత్వం ఆదేశించడంతో నెట్ ద్వారా ఆధార్ కార్డులను డౌన్‌లోడ్ చేసి ఏదో ఒకరి రేషన్ కార్డుకు వాహనం వున్నట్లు ఆధార్ అనుసంధానం చేయడంతో ఈ ఇబ్బందులు తలెత్తి అర్హులైన వారికి మార్చి నెలలో రేషన్ అందకుండాపోతోంది. జిల్లాలో 10,90,784 తెల్ల రేషన్ కార్డులు వుండగా ఇందులో 32,68,515 యూనిట్లు, 833 అన్నపూర్ణ కార్డులకుగాను 1116 యూనిట్లు, అంత్యోదయ కార్డులు 1,05,073 వుండగా 2,99,415 యూనిట్లకు ప్రతి నెలా పౌర సరఫరాల శాఖ నుండి బియ్యం పంపిణీ జరుగుతోంది. ఇందులో ఇటీవల జన్మభూమిలో కొత్తగా మంజూరైన కార్డులతోపాటు పిల్లలను రేషన్ కార్డుల్లోకి చేర్చుకున్న కార్డులు ఉన్నాయి. రవాణా శాఖ అధికారులు తమ పని ఏదో విధంగా పూర్తిచేయాలన్న ఆతృతతో ఆధార్ కార్డులను ఏదో ఒక రేషన్ కార్డుకు అనుసంధానం చేయడంతో చివరకు 10సంవత్సరాల లోపు వున్న పిల్లలకు సైతం ద్విచక్ర వాహనం లేకున్నా వున్నట్లు పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డుల్లోకి అనుసంధానం కావడంతో ఈ వివాదం తలెత్తింది. దీంతో మార్చి నెలలో దాదాపు లక్షలమంది తమకు రేషన్ దక్కనట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదనపు చక్కెర హాంఫట్........
ఉగాది పర్వదినం సందర్భంగా ప్రభుత్వం అదనంగా ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారునికి అర కిలో చక్కెర పంపిణీ చేయాలని ఆదేశించినా అమలుకావడం లేదు. ప్రతి నెల రాగానే అర కిలోతోనే పలువురు డీలర్లు సరిపెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై పలువురు లబ్ధిదారులు తహసీల్దార్ల సమక్షానికి ఇప్పటికే తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ చౌకదుకాణాల్లో రూపాయి బియ్యం కోసం నెల తర్వాత నెల మీ-సేవాకు వచ్చి వందలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంటోందని, ప్రభుత్వం విధానాలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తీసుకొస్తున్నట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జూన్ నుండి కిరోసిన్ లేనట్లే.......
చౌక దుకాణాల్లో కేవలం జూన్ నెల నుండి బియ్యం పంపిణీ మాత్రమే జరుగుతుందని అటు అధికారుల్లోను, డీలర్లల ద్వారా తెలుస్తోంది. వచ్చే నెల నుండి చక్కెర ఇచ్చే అర కిలో కూడా వుండదని, అలాగే జూన్ నుంచి కిరోసిన్ కూడా చౌక దుకాణాల్లో పంపిణీ జరగదని తెలుస్తోంది. ప్రభుత్వం సబ్సిడీల భారం తగ్గించుకునేందుకే ఈ విధానాలను అవలంబిస్తున్నట్లు సమాచారం.
సత్యసాయి సన్నిధిలో
నేడు ఉగాది సంబరాలు
* పర్తియాత్రగా విచ్చేసిన హైదరాబాద్ భక్తజనం
పుట్టపర్తి, మార్చి 28: భగవాన్ సత్యసాయి బాబా సన్నిధిలో ఉగాది వేడుకలకు ముస్తాబైంది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాది వేడుకలను, తమిళ నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు తెలుగు, తమిళ అశేష భక్తబృందం పుట్టపర్తికి చేరుకున్నారు. సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాయికుల్వంత్ సభామందిరం ప్రత్యేక అలంకరణ చేశారు. ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌లోని శివం భక్త బృందం వందలాది మంది తమిళనాడుకు చెందిన సాయి భక్తులు, దేశ, విదేశీయులు ప్రశాంతినిలయంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం శివం భజన బృందం సంగీత కచేరీ నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి బాబా ఉగాది వేడుకల ప్రసంగాన్ని సభికులకు వినిపించారు. పుట్టపర్తి పట్టణంలో హైదరాబాద్ భక్తబృందం కోలాటన్నలు, భజన కార్యక్రమాలు, పల్లకీ సేవ నిర్వహించారు.
శిల్పారామంలో రెండు రోజులు ఉగాది సంబరాలు
పుట్టపర్తిలోని శిల్పారామంలో రెండు రోజులపాటు ఉగాది సంబరాలు నిర్వహిస్తున్నట్లు పాలనాధికారి గణేష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం శిల్పారామంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు సంస్కృతి, కళలు ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలు వుంటాయన్నారు. నేడు మదనపల్లికి చెందిన సూర్య డ్యాన్స్ అకాడమీ నృత్య ప్రదర్శనలు, అనంత కళాఖండం వారి అమరావతి-చంద్రన్న ధ్యేయం ప్రదర్శనలు, ఇదే రోజు సాయంత్రం 5:30గంటల నుండి 8గంటల వరకు వివిధ కార్యక్రమాలు వుంటాయన్నారు. బుధవారం నటరాజ ఆర్ట్ అకాడమీ వారి ఆంధ్ర నాట్యం, భరతనాట్యం, నిమ్మలకుంట గ్రామ కళాకారులతో తోలుబొమ్మలాట నిర్వహించడం జరుగుతుందన్నారు. సాయంత్రం చెక్క్భజనలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉగాది పచ్చళ్ళు, పచ్చని తోరణాలు, సంస్కృతిని ప్రతిబింబించే వేషధారణలు ప్రదర్శింపబడతాయన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
నగరంలో ఉగాది సందడి
అనంతపురం కల్చరల్, మార్చి 28: ఉగాది పండుగ సందర్భంగా నగరంలోని దుకాణాలు, మార్కెట్‌లు కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. నూతన సంవత్సరాదిగా ఉగాదిని హిందువులందరూ ఎంతో వైభవంగా జరుపుకునే ప్రధానమైన పండుగ. ఇంటిల్లిపాది కొత్త దుస్తులు ధరించి, ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించి, పిండి వంటలు చేసుకుని, ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం, దేవాలయాలకు వెళ్లడం గ్రామాల్లో క్రీడలు నిర్వహించడం మొదలైనవి జరుపుకోవడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇంతటి ప్రాధాన్యత కలది కావడంతో నగర ప్రజలతోపాటు గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పండుగ కొనుగోళ్లకు తరలిరావడంతో నగరంలోని కిరాణా షాపులు, దుస్తుల షాపులు, కూరగాయల మార్కెట్‌లు, పూలు, పండ్లు, ఉగాది పచ్చడి వస్తువులు, మామిడాకులు అమ్మకాలతో ప్రధాన కూడళ్లన్నీ కిక్కిరిసాయి. ప్రధానంగా పాతవూరు, టవర్‌క్లాక్ సర్కిల్‌లో విపరీతమైన రద్దీతో ట్రాపిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు పాతవూరులో తాడిపత్రి వైపు నుండి వచ్చే వాహనాలను చెరువుకట్టపై గల రోడ్డుగుండా కలెక్టర్ ఆఫీస్ వైపు మళ్లించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.
టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని
ఘనంగా నిర్వహించాలి
అనంతపురం సిటీ, మార్చి 28: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక మంత్రి నివాసంలో విలేఖర్లతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో తెలుగుదేశం జెండా ఎగురవేయాలని తెలిపారు. తెలుగుదేశం 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని 36వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రతి గ్రామంలోను పార్టీ జెండాను ఆవిష్కరించాలని తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునే తెలుగువారి పెద్ద పండుగ ఉగాది కూడా రావడం విశేషమన్నారు.
కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తలకు 2 లక్షల ప్రమాద బీమా, ఎన్‌టిఆర్ మోడల్ స్కూల్ ద్వారా పార్టీ కార్యకర్తల పిల్లలకు ఉచిత విద్య, ఎన్‌టిఆర్ బ్లడ్ బ్యాంకు ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందజేయడం జరుగుతోందన్నారు. జిల్లాకు నీటిని తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయగలగిన సత్తా తెలుగుదేశం పార్టీకి, ఒక్క చంద్రబాబునాయుడుకే ఉందని తెలిపారు. జిల్లాలోని ప్రజలందరికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసారు.
మద్యం దుకాణాలకు
పోటాపోటీగా దరఖాస్తులు
మడకశిర, మార్చి 28: నియోజకవర్గంలో మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి పోటాపోటీగా దరఖాస్తులు చేస్తున్నారు. మడకశిర పట్టణంలో మూడు, రొళ్ళ, అగళి, అమరాపురం, గుడిబండ మండలాల్లో ఒక్కో మద్యం దుకాణం ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. దీంతో ఈమారు మద్యం దుకాణాలను దక్కించుకొంటే మంచి లాభాలు పొందవచ్చని కొందరు వ్యాపారులు భావిస్తున్నారు. అదేవిధంగా కొందరు కొత్త వ్యక్తులు సైతం మద్యం షాపులను దక్కించుకొనేందుకు దరఖాస్తు చేసేందుకు ముందుకొస్తున్నారు. గతంలో కాంగ్రెస్, టిడిపి వర్గీయులు సిండికేట్‌గా మారి ఎక్కువమంది దరఖాస్తు చేయకుండా మంతనాలు సాగించారు. అయితే 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు, 2019లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో వ్యాపారాలు బాగా ఉంటాయని భావించి మద్యం షాపులను దక్కించుకొనేందుకు దరఖాస్తు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే మద్యం వ్యాపారాలు సాగిస్తున్న కొందరు వ్యాపారులు కొత్త వ్యక్తులు దరఖాస్తు చేయకుండా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొత్త వ్యక్తులు మాత్రం వ్యాపారంలో తాము ఎవరికి భాగస్వామ్యం కల్పించమని, లాటరీలో తమకు దుకాణాలు దక్కితే తామే నిర్వహించుకొంటామని తెగేసి చెబుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా నియోజకవర్గంలో ఏడు మద్యం దుకాణాలకు పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరెవరికీ షాపులు దక్కుతాయో వేచి చూడాల్సిందే.

అనంత, కేతిరెడ్డికి గన్‌మెన్ల తొలగింపు

అనంతపురం, మార్చి 28 : వైకాపాకు చెందిన ఇద్దరు మాజీ ప్రజా ప్రతినిధులు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డికి పోలీసు శాఖ గన్‌మెన్‌లను మంగళవారం తొలగించింది. హైదరాబాద్‌లోని ఉన్నతాధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు వీరిని తొలగించినట్లు జిల్లా పోలీసు శాఖాధికారులు వెల్లడించారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి టూ ప్లస్ టూ, మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డికి వన్ ప్లస్ వన్ చొప్పున వ్యక్తిగత భద్రతా సిబ్బందిని కేటాయించారు. అయితే వీరికి మంగళవారం హఠాత్తుగా వ్యక్తిగత భద్రతను తొలగించడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. వీరికి కేటాయించిన గన్‌మెన్‌లు అనంతపురంలో రిపోర్టు చేసుకున్నారు.
పంచాంగ శ్రవణం
చిలమత్తూరు, మార్చి 28: ఉగాది సందర్భణగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉగాది సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఈశ్వర్ శర్మ పంచాంగ శ్రవణం గావించారు. కార్యక్రమంలో ఎంపిపి నౌజియాభాను, ఎంపిడిఓ శకుంతల, ఎపిఓ అమరావతి, నాయకులు అన్సా ర్, మన్సూర్, ముద్దన్న, ప్రవీణ్, కిష్టప్ప, గంగాధర్ పాల్గొన్నారు.
పాలకుల వైఫల్యంతోనే
తాగునీటి సమస్య
హిందూపురం టౌన్, మార్చి 28: హిందూపురం మున్సిపల్ పాలకులు, అధికారుల నడుమ సమన్వయం కొరవడి పిఎబిఆర్ తాగునీటి పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని పిసిసి అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నాగరాజు, 9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి వడ్డె రాధ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, 9వ వార్డు ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో నుండి తప్పించేందుకు టిడిపి నేతలు ఎన్నో ప్రయత్నాలు, ప్రలోభాలకు గురిచేశారన్నారు. చివరకు జిల్లాకు చెందిన మంత్రి, ఎంపిలు సైతం తమ అభ్యర్థిని బరిలో నుండి తప్పించాలని తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు చేశారన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, మున్సిపల్ పాలకవర్గం వైఖరిని చూస్తే ప్రస్తుత ఉప ఎన్నికలో టిడిపికి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితుల్లో లేరన్నారు. కనీసం పండుగ నాడు కూడా ప్రజలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో పాలకులు ఉన్నారని విమర్శించారు. అధికారులు, పాలక వర్గానికి సమన్వయం లేకపోవడంతో ప్రజా సమస్యలు ఏమాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. హిందూపురం పట్టణంలో తీవ్రమైన నీటి సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారన్నారు. అధికార పార్టీ నాయకులు అధికార మదంతో అధికారులపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారన్నారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం, దౌర్జన్యాలు చేయడమే అధికార పార్టీ అజెండా ఉంటోందని విమర్శించారు. అధికార వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ఘనత ఒక్క టిడిపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి ప్రజా సమస్యలను గాలికి వదిలి అమరావతి పేరిట రాజధాని నిర్మాణం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఇకపోతే స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు హిందూపురం నియోజకవర్గం షూటింగ్ స్పాట్‌గా ఉంటోందని ఎద్దేవా చేశారు. గత ఏడెనిమిది నెలలుగా ఇటు వైపు కనె్నత్తి చూడటం లేదన్నారు. అధికార పార్టీ నాయకులే ఆ పార్టీలో ఉంటున్న వారిపై ఆరోపణలు చేసుకొంటూ అభివృద్ధిని కాలరాస్తున్నారన్నారు. ఉప ఎన్నికలో ఓటమి భయంతో నామినేషన్‌ల దాఖలు నుండి ఉపసంహరణ వరకు తమ అభ్యర్థిని బరి నుండి తప్పించేందుకు టిడిపి నేతలు ఎన్నో కుయుక్తులు పన్నారన్నారు. అయినా వాటికి ఎదురొడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బరిలో దించడం జరిగిందని, ప్రజలు అధికార పార్టీ దౌర్జన్యాలు, సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని గుర్తెరిగి కాంగ్రెస్ అభ్యర్థి రాధను గెలిపించాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు కదిరీష్, మహబూబ్‌బాషా,నాగేంద్ర, రహమత్, సంపత్‌కుమార్, రఫిక్ తదితరులు పాల్గొన్నారు.

మృతి చెందిన లారీ డ్రైవర్
కుటుంబానికి ఆర్థిక సహాయం
అనంతపురం సిటీ, మార్చి 28: నగరంలోని బాబానగర్‌కు చెందిన ఖాదర్ బాషా(50) అనే లారీ డ్రైవర్ అనారోగ్యంతో సోమవారం ఇంట్లో మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎఐటియూసి నగర కార్యదర్శి రాజేష్‌గౌడ్, లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ యూనియన్ నాయకులు మంగళవారం ఆ కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా రాజేష్‌గౌడ్ మాట్లాడుతూ ఖాదర్‌బాషా 25 సంవత్సరాలుగా లారీ డ్రైవర్‌గా పనిచేసుకుంటు కుటుంబాన్ని పోషించేవారని, లారీ డ్రైవర్స్ యూనియన్‌లో కూడా చురుగ్గా పనిచేసేవాడని తెలిపారు. బాషా కుటుంబానికి లారీ డ్రైవర్స్ యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటియూసి నగర నాయకులు బ్రహ్మనందరెడ్డి, మల్లికార్జున, చలపతి పాల్గొన్నారు.
3న చలో తాడిమర్రి
* ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కుళ్లాయప్ప
అనంతపురం కల్చరల్, మార్చి 28: తాడిమర్రిలో ఏర్పాటుచేసిన డా.అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 3న ఆవిష్కరించనున్నట్లు ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డి.కుళ్లాయప్ప పేర్కొన్నారు. ఈమేరకు నగరంలోని లిటిల్ ఫ్లవర్ కళాశాలలో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్.అంబేద్కర్ విగ్రహావిష్కరణకు జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమాజం కోసం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. సమావేశంలో నాయకులు చెన్నంపల్లి ఓబిలేసు, సాకే కుళ్లాయప్ప, బేసాని పెద్దన్న, బేసాని నరసింహుడు, మధు, సాకే పెద్దన్న, కుళ్లాయప్ప పాల్గొన్నారు.
ఉగాది ఉత్సవాల్లో అధికారులు పాల్గొనాలి
ఆత్మకూరు, మార్చి 28: ఆత్మకూరు మండల కేంద్రంలోని శివాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ వౌఖిక ఉత్తర్వుల మేరకు ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నామని, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఎంపిడిఓ ఆదినారాయణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి పంపకం, కవి సమ్మేళనం, సాంప్రదాయ శాస్ర్తియ నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని ఎంపిడిఓ పేర్కొన్నారు.
పివికెకె ఐటి, ఈఈఈ విద్యార్థుల ప్రతిభ
అనంతపురం సిటీ, మార్చి 28: పివికెకె ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం చివరి సంవత్సరం విద్యార్థులు మానవ నిత్య జీవతంలో ఉపయోగపడే విధంగా ప్రాజెక్టును తయారుచేసి ప్రతిభను కనబరచారని కాలేజి ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్‌రెడ్డి, కాలేజి యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ప్రతిభ కనబరిచిన విద్యార్థులు కళాశాలలో ప్రిన్సిపాల్, యాజమాన్య ప్రతనిధి, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఇంటెలిజెంట్ స్ట్రీట్ లైట్ కంట్రోల్ అనే పరికరాన్ని తయారుచేశారు. ఈ పరికర టెక్నాలజీని ఉపయోగించి వీధి దీపాలను మనం ప్రత్యేకంగా ఆఫ్ చేయాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఈ పరికరాన్ని చివరి సంవత్సరం ఈఈఈ విద్యార్థులు తయారుచేశారు. అలాగే అండర్ గ్రౌండ్ కేబుల్ పార్టీ డిటెక్షన్ యూజింగ్ రోబోట్ అనే పరికరాన్ని తయారుచేసి ఇంటర్నెట్, టెలిఫోన్ కేబుళ్లల్లో ఎక్కడైనా కట్ అయితే వాటిని ఫొటోలతో సహా మనకు సమాచారం అందించే రోబోట్‌ను తయారుచేశారు. ఈ బైసికల్ మనకు రెండు విధాలుగా ఉపయోగపడే విధంగా తయారుచేశారు. ఈ బైసికల్‌లో అమర్చిన బ్యాటరీని ఒక్కసారి రీచార్జి చేస్తే 40 కిలోమీటర్లు ప్రయాణించే విధంగా విద్యార్థులు తయారుచేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కరవు నివారణ చర్యలు చేపట్టాలి
అనంతపురం కల్చరల్, మార్చి 28: జిల్లాలో కరవునివారణ చర్యలు వెంటనే చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర నాయకులు ఓబులు, జిల్లా నాయకులు నల్లప్ప, రాయుడుతో కలసి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. జిల్లాలోని 63 మండలాలను ప్రభుత్వం కరవు మండలాలుగా ప్రకటించిందని, ఇప్పటి వరకు ఎటువంటి కరవు నివారణ చర్యలు, సహాయక చర్యలను చేపట్టలేదని ఆయన విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంట నష్టపోయిన రైతుకు హెక్టారుకు రూ.15వేలు అందిస్తామని ప్రకటించారన్నారు. మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికీ అందించలేదన్నారు. కరవు కారణంగా జిల్లా ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారని, కొందరు బిక్షాటన కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధి హామీ పనుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ఉపాధి పనులు కల్పించి వలసలు నివారించాలన్నారు. అదేవిధంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందనీ, ఇప్పటికే గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారన్నారు. కరవు కారణంగా ఉగాది పండుగ కూడా సంతోషంగా జరుపుకోలేని స్థితిలో ప్రజలు ఉన్నారన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆపాలని సుప్రీం కోర్టు ప్రభుత్వాల్ని ఆదేశించినా ఏమాత్రం స్పందించ లేదన్నారు. కరవు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలన్న డిమాండ్‌తో సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 31 నుండి జిల్లాలో ప్రచార యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4, 6వ తేదీల్లో తహశీల్దారు కార్యాలయాల ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు.
ఘనంగా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్
ఆవిర్భావ దినోత్సవం
అనంతపురం కల్చరల్, మార్చి 28: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘమైన వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈమేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఎమ్మెల్సీగా ఎన్నికైన వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎర్రిస్వామి రెడ్డి, రాగే పరశురామ్, కొర్రపాడు హుసేన్‌పీరా, యుపి.నాగిరెడ్డి , నదీమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి యూనియన్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికుల సమస్యలు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను మండలిలో ప్రస్తావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఇతర నాయకులు మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్‌గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికుల పక్షాన అనేక పోరాటాలు చేసిందన్నారు. అనంతరం ట్రేడ్ యూనియన్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు ఎమ్మెల్సీగా ఎన్నికైన గోపాల్‌రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మీసాల రంగన్న, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, చింతకుంట మధు, రంగంపేట గోపాల్‌రెడ్డి, మహిళా నాయకురాళ్లు సుశీల, శ్రీదేవి తదితరులతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కంబైన్డ్ డ్యూటీ విధానం రద్దు చేయాలి
అనంతపురం కల్చరల్, మార్చి 28: తపాలా శాఖలో పనిచేస్తున్న బిపియం, ఎబిపియం, డాక్ సేవక్స్‌లకు కంబైన్డ్ డ్యూటీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయం ముందు తపాలా ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాబడి, వ్యయం ఆధారంగా జిడియస్ పోస్ట్ఫాసులను ఎబిసిడి విభాగాలుగా విభజించాలనే సిఫార్స్ అమలుచేయకూడదని, ప్రస్తుతమున్న విధంగానే జిడియస్ పోస్ట్ఫాసులన్నీ ఒకే వర్గంగా ఉండాలని డిమాండ్ చేశారు. జిడియస్‌లకు లీగల్ స్టేటస్ కల్పించాలని, కొత్త పని గంటలు, వేజ్ స్కేల్స్ లెవల్స్ ప్రస్తుతమున్న వాటిని సవరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఏప్రిల్ 6న ఢిల్లీలో పార్లమెంటు వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్లు, నాగేశ్వర్, చంద్రమోహన్, రమేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.