అనంతపురం

మాటల్లోనే డిజిటల్ విద్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, ఏప్రిల్ 15: విద్యా వ్యవస్థలో సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సంస్కరణలు చేపట్టామని కార్పొరేట్, కానె్సప్ట్ పాఠశాలలకంటే మెరుగైన విద్యను సాంకేతిక పరిజ్ఞానంతో అందిస్తామని అనునిత్యం మన నేతాశ్రీలు, విద్యా శాఖ అధికారులు మాటలు చెబుతూనే ఉన్నారు. అవి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, విద్యార్థులతోపాటు విద్యా వ్యవస్థపై పరిజ్ఞానం కలిగిన ప్రతి ఒక్కరూ వింటూనే ఉంటారు. ఇలా ప్రతిసారి వారు చెప్పడం, మనం వినడానికే ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానం ఉందని అటు ఉపాధ్యాయ వర్గాల్లోనూ, విద్యార్థుల్లోనూ అసంతృప్తి నెలకొంటోంది. జిల్లా వ్యాప్తంగా 549 ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలుండగా కేవలం ప్రభుత్వపరంగా 23 పాఠశాలలకే డిజిటల్ విద్యను అందించేందుకు లక్ష రూపాయలు విలువ చేసే ప్రొజెక్టర్‌తోపాటు కంప్యూటర్, ల్యాప్‌టాప్‌ను అందించారు. అయినా అందుకు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులు లేకపోవడంతో అవి పాఠశాలల్లోని ఓ గదికే పరిమితమయ్యాయి తప్ప డిజిటల్ విద్యను మాత్రం ఇంతవరకు అభ్యసించ లేదు. అంతేగాక మరికొన్ని పాఠశాలల్లో దాతల సహకారంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ప్రొజెక్టర్లు సైతం ఉపాధ్యాయులు సేకరించారు. వాటికి కూడా సాంకేతిక పరిజ్ఞాన నిపుణులు లేకపోవడంతో డిజిటల్ విద్యను విద్యార్థులకు ప్రతి ఏడాది దూరమవుతూనే ఉంది. అలాగే డిజిటల్ విద్యను అందించేందుకు సామగ్రిని అందించినా నెట్ సౌకర్యం కల్పించనట్లు ఉపాధ్యాయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కొన్ని పాఠశాలల్లో కేవలం పెన్‌డ్రైవ్ ద్వారా కాపీ చేసుకున్న పాఠాలను ల్యాప్‌టాప్ సాయంతో ప్రొజెక్టర్‌కు అనుసంధానం చేసి డిజిటల్ విద్యను అలంకారప్రాయంగా అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలలను డిజిటలైజేషన్ చేస్తున్నారని ఇక ప్రతి విద్యార్థి డిజిటల్ విద్యను పొందవచ్చన్న ఆశ ప్రతి ఏడాది నిరాశగానే మిగులుతోంది. ఈ ఏడాదైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి డిజిటల్ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించేందుకు చర్యలు తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గకుండా ఉంటుందని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.
ఈ ఏడాదైనా డిజిటల్ విద్య అందేనా..?
- రియాజ్‌బాషా, హిందీ పండిట్, జడ్పీహెచ్‌ఎస్, వెల్దుర్తి.
ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో డిజిటల్ విద్య కూడా విద్యార్థులకు ఎండమావిలాగా తయారవుతోందని వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ పండిట్ రియాజ్‌బాషా అన్నారు. అధికారులు లెక్కలు చూపించుకునేందుకే కంప్యూటర్లు గదులకే పరిమితమైన డిజిటల్ విద్యను అందిస్తున్నామని చెప్పుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలకు వచ్చి ఉపాధ్యాయులను నిలదీస్తున్నారన్నారు. ఆ పరిస్థితి ఉపాధ్యాయులకు రాకుండా విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ విద్యను అందిస్తే కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకంటే నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన ఫలితాలను సాధిస్తామన్నారు.
డిజిటల్ విద్యాభ్యాసం అవసరం
- నారపరెడ్డి, జడ్పీహెచ్‌ఎస్, కేశాపురం, కొత్తచెరువు మండలం.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యకు దీటుగా ఎదగాలంటే అన్ని పాఠశాలలను డిజిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందని కేశాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారపరెడ్డి అన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు డిజిటలైజేషన్ విద్య లేక కార్పొరేట్ స్కూళ్లలో లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి డిజిటలైజేషన్‌కు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలి.
అయిదేళ్లుగా ఆ గదిలోనే కంప్యూటర్లు
- విద్యార్థి మహేష్, 9వ తరగతి, జడ్పీహెచ్‌ఎస్, వెల్దుర్తి.
తాను ఈ ఏడాది 9వ తరగతి చదువుతున్నానని, వచ్చే ఏడాది పదో తరగతిలోకి వెళ్తున్నానని, ఆరో తరగతి చేరినప్పటి నుంచి పాఠశాలల్లో ఒకే గదిలోనే కంప్యూటర్లు పరిమితమయ్యాయి తప్ప దాని ద్వారా తాము ఏనాడు విద్యను అభ్యసించ లేదని చెనే్నకొత్తపల్లి మండలం వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వతరగతి చదువుతున్న విద్యార్థి మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రధానోపాధ్యాయులు తన స్వంత ల్యాప్‌టాప్ ద్వారా ఈ ఏడాది కంప్యూటర్ ఎలా ఉంటుందో... ఎలా పనిచేస్తుందో తెలిపారన్నారు. డిజిటల్ విద్యను అభ్యసించి మెరుగైన విద్యను పొందాలన్న కోరికను ప్రభుత్వం వెంటనే తీర్చాలని మాలాంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిజిటల్ విద్యే ఎంతో మెరుగ్గా ఉంటుందని, ఈ ఏడాదైనా అందించాలని విద్యార్థి తెలిపారు.

నగదు రహితంపై కార్డుదారుల విముఖత!
* వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు..
* ఖాతాల్లో డబ్బున్నా ప్రక్రియలో ఆలస్యం..
* చౌక దుకాణాల్లో నామమాత్రంగా అమలు..
* నాలుగు నెలల్లో 8 శాతానికి మించని వైనం...

అనంతపురం, ఏప్రిల్ 15 : పిడిఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ)లో నగదు రహితంపై కార్డుదారులు విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈపాస్ మిషన్లు మొరాయిస్తుండటం, సర్వర్‌పై భారం, గ్రామీణ ప్రాంతాల్లో సిగ్నల్స్ సమస్య, క్యాస్ లెస్ ట్రాన్సాక్షన్ కోసం ఎక్కువ సమయం పడుతుండటం, లబ్ధిదారుల ఖాతాల్లో నగదు ఉంచుకోలేక పోతుండటంతో నగదు రహిత లావాదేవీలపై అనాసక్తితో ఉన్నట్లు సమాచారం. వీటికితోడు నిత్యావసర సరుకులకు సరిపడగానీ, అంతకంటే కొంచెం ఎక్కువగాగానీ నగదు ఖాతాల్లో వేయాలంటే పనులు మానుకుని, లేదా ఇంట్లో ఎవరో ఒకరు వెళ్లి బ్యాంకుల్లో వేచి ఉండాల్సి రావడం కూడా ఈ ప్రయోగం విఫలం కావడానికి కారణమని తెలుస్తోంది. ఇటీవల బ్యాంకులు సైతం విత్‌డ్రా, డిపాజిట్లలపై నిబంధనల్ని కఠినతరం చేయడంతోపాటు కనీస డిపాజిట్ ఉండాలని, లేకుంటే అపరాధ రుసుం భరించక తప్పదని ఆదేశాలు జారీ చేయడం మరో కారణం. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ మంత్రి సైతం నగదు రహితం తప్పనిసరి కాదని, నగదు ఇచ్చి సరుకులు కొనుగోలు చేయవచ్చని ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో 90 శాతం మంది లబ్ధిదారులు నగదు ఇచ్చి సరుకులు కొంటున్నారు. జిల్లాలో గతేడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ అధికారిక గణాంకాల మేరకు కేవలం 7.96 శాతం మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరిగాయి. జిల్లాలో మొత్తం 2970 ఎఫ్‌పి షాపులుండగా, బిపిఎల్ కార్డులు 11,96,163, పింక్ కార్డులు(ఎపిఎల్) 66,001 చొప్పున మొత్తం 12,62,164 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి పిడిఎస్, ఎఎవై, అన్నపూర్ణ కార్డులకు బియ్యం, గోధుమలు, చక్కెర, కిరోసిన్ పంపిణీ చేస్తున్నారు. కాగా 2482 ఎఫ్‌పి షాపులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 488 మాత్రమే పట్టణాల్లో ఉన్నాయి. వీటిలో 408 చౌక దుకాణాల్ని ఎస్‌సిలు, 149 షాపుల్ని ఎస్‌టిలు, 49ని దివ్యాంగులు, డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో 261, మైనార్టీలు 107, బిసిలు 649, ఓసిలు 1185, అన్ని కేటగిరీలకు చెందిన మహిళలు 1081 చొప్పున నిర్వహిస్తున్నారు. ఇంకా 73 చౌక దుకాణాలకు డీలర్లు లేరు. వీటిలో డీలర్లను నియమించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మహిళలు, వికలాంగులు, గ్రామీణ ప్రాంత డీలర్లు సాంకేతికతను పూర్తిస్థాయిలో అందిపుచ్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీనిప్రభావం కూడా నగదు రహిత లావాదేవీలపై పడుతోందనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,964 ఈ-పోస్ మిషన్లు ఉండగా, గత నవంబర్(2016)లో 89.99 శాతం నగదు చెల్లించి సరుకులు కొన్నారు. డిసెంబరులో 2962 ఈ-పోస్ మిషన్ల ద్వారా కేవలం 140 కార్డులు (0.001 శాతం), ఈ ఏడాది జనవరిలో 28,379 కార్డులకు(2.77 శాతం), ఫిబ్రవరిలో 2963 ఈ-పోస్ మిషన్ల ద్వారా 42,404 కార్డులకు (4.02), మార్చిలో 2692 ఈ-పోస్ మిషన్ల ద్వారా 83,935 కార్డులకు (7.96 శాతం) మేరకు లబ్ధిదారులు సరుకులు కొన్నారు. గడచిన నాలుగు నెలల్లో క్యాస్‌లెస్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నా, లబ్ధిదారులు సంపూర్ణ ఆసక్తిని చూపడం లేదు. అయితే నగదు రహితం తప్పనిసరి కాదని చెప్పడంతో లబ్ధిదారులు ఊరట చెందారనడంలో సందేహం లేదు. రానున్న నెలల్లో బలవంతంగా అమలు చేయాలని చూస్తే తమ పరిస్థితి ఏమిటి అన్న సందేహాలు లబ్ధిదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
‘పురం’ అధికారులపై
కాంట్రాక్టర్ల గరం..గరం!
* వెనక్కు మళ్లిన 13వ ఆర్థిక సంఘం నిధులు
హిందూపురం టౌన్, ఏప్రిల్ 15 : హిందూపురం మున్సిపాలిటీ నుంచి మార్చి నెలాఖరు వరకు రూ.50 లక్షల 13వ ఆర్థిక సంఘం నిధులు వెనక్కు వెళ్లిపోయాయి. నిధులను ఉపయోగి ంచుకోవడానికి ప్రభుత్వం మార్చి 31 వ తేదీ వరకు గడువు ఇచ్చింది. స్థానిక మున్సిపాలిటీకి 13వ ఆర్థిక సంఘం కింద దాదాపు రూ.2 కోట్ల వరకు విడుదలయ్యాయి. అయితే అధికారులు వి విధ కారణాలతో సద్వినియోగం చేసుకోలేకపోయారు. పనుల్లో పురోగతిని పరిశీలించి పార్టుపేమెంట్ బిల్లులను ఇచ్చి ఉన్నా కొంతవరకు నిధులు దక్కి ఉండేవి. అయితే రూ.15 లక్షల బిల్లు ను మార్చి 30వ తేదీ రాత్రి ఓ గుత్తేదారుకు ఇచ్చారు. ఆయన 31వ తేదీన బ్యాంక్‌కు వెళితే నిధులు లేవంటూ వెనక్కు పంపారు. దీంతో గత కొద్ది రోజులుగా బిల్లు విషయమై అధికారులతో చర్చించారు. అయితే వారి నుంచి ఎలాంటి సానుకూల స్పందన కనిపించకపోవడంతో శనివారం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకోకపోతే కార్యాలయాన్ని కూల్చివేస్తామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు అంటే అధికారులకు ఎందుకు చిన్న చూపని నీలదీశారు. ఈ గుత్తేదారుకు సంబంధించి రూ.20 లక్షల వరకు పని పూర్తి చేశారు. ఫిబ్రవరి నెల నుంచే బిల్లుకు సంబంధించి అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే వారు సకాలంలో బిల్లులు ఇవ్వలేకపోయారు. దీంతో కాంట్రాక్టర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు ట్రెజరీ, బ్యాంక్‌ల్లో ప్రభుత్వ బిల్లులు సకాలంలో నగదుగా మారకపోవడంతో సమస్య మరింత తీవ్రతరంగా మారింది. నిధులన్నీ వెనక్కు వెళ్లిపోవడంతో వాటిని తెప్పించడం కష్టమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో కాంట్రాక్టర్లకు జనరల్ ఫండ్ నుండి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే మున్సిపాలిటీలో నిర్వహణ ఖర్చులకే జనరల్ ఫండ్ సరిపోతోంది. ఒక్కో నెల ఆర్థిక ఇబ్బందుల కారణంగా కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో లక్షలాది రూపాయలను జనరల్ ఫండ్ నుండి చెల్లించాలన్నా కష్టమే. దీంతో 13వ ఆర్థిక సంఘం పనులు వివాదంగా మారుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో పరిస్థితి మరింత విషమించేలా కనిపిస్తోంది. ప్రభుత్వం నుండి 13వ ఆర్థిక సంఘం నిధులు మరో సారి మున్సిపాలిటీకి వస్తాయనేది అనుమానంగానే కనిపిస్తోంది. ఇది కాంట్రాక్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. బిల్లులు రాకపోతే తాము నిండా మునిగిపోయినట్లేనని వాపోతున్నారు. అధికారులు ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.