అనంతపురం

తోటలకు తడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, మే 12:వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్న తరుణంలో జిల్లాలోని ఎండుతున్న తోటల రైతన్నలకు చేయూతనివ్వడానికి పండ్ల తోటలకు నీటి సరఫరాకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గతేడాది ఖరీఫ్‌లో చివర్లో ఖరీఫ్ పంటలకు ఆలస్యంగా స్పందించి రక్షకతడులిచ్చారు. అప్పట్లో వేరుశనగ రైతన్నలకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. అదేవిధంగా పండ్ల తోటలకు కూడా వేసవి ముగిసేంతవకు రక్షక తడులద్వారా నీళ్ళివ్వరేమో అని రైతన్నలు అనుమానం వ్యక్తం చేశారు. అయితే సంబంధిత శాఖ అధికారులు ఏప్రిల్ మొదటి వారం నుంచే పండ్లతోటల్లోని బోర్లు ఎండిపోయి నీటి సరఫరా లేని రైతన్నల నుంచి దరఖాస్తులు సేకరించారు. అనంతపురం జిల్లాలో ఎండుతున్న పండ్లతోటల వివరాలను ఉద్యానవనశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిధులు మంజూరయ్యేలా కృషి చేశారు. దాంతో జిల్లాలోని పండ్ల తోటల్లో నీటి సరఫరా కోసం రూ.32.2కోట్లు మంజూరైనట్లు సమాచారం. గతేడాది జిల్లాలో 706హెక్టార్లలో జిల్లావ్యాప్తంగా చీని, నిమ్మ, మామిడి తోటలు ఎండిపోయినట్లు గుర్తించారు. దాంతోపాటు ఈ ఏడాదికూడా అధికంగా ఎండుముఖం పడుతున్న చీని, నిమ్మ, మామిడి తోటలకు మాత్రం నీటి సరఫాకు అనుమతులు లభించాయి. జిల్లాలోని కళ్యాణదుర్గం, గుత్తి, గార్లదినె్న, తాడిపత్రి, యల్లనూరు, నార్పల, పుట్లూరు, బత్తలపల్లి, కదిరి, నల్లమాడ, పెనుకొండ, ముదిగుబ్బ, బుక్కపట్నం, ఓబుళదేవరచెరువు తదితర మండలాల్లో అధికంగా మామిడి, చీనీ తోటలు సాగులోవున్నాయి. బోర్లలో నీళ్ళు తగ్గుముఖం పట్టి ఇప్పటికే కొన్ని మండలాల్లో ఎండుముఖం పట్టిన తోటలను కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఇంకా ఆలస్యం చేస్తే మరిన్ని తోటలు ఎండిపోయే ప్రమాదం వుందని మే 1వ తేదీ నుంచే నీటి సరఫరా చేసుకున్న రైతన్నల ఖాతాల్లోకి అందుకు సంబంధించిన మొత్తాన్ని జమచేయనున్నట్లు సంబంధిత అధికారులు చెప్తున్నారు. చీని, నిమ్మ తోటలకు వారానికి 4ట్యాంకులు చెప్పున నెలకు 16ట్యాంకుల నీటి సరఫరాకు, మామిడికి పదిరోజులకు 3ట్యాంకులు చెప్పున నెలకు 9ట్యాంకుల నీళ్ళు సరఫరా చేసుకునేవిధంగా మార్గదర్శకాలు సిద్ధంచేశారు. అందుకు సంబంధించి ఒక్కోట్యాంకు నీళ్ళకు రూ.500లుగా నిర్దేశించి 80శాతం సబ్సిడీతో రూ.400లు ప్రభుత్వం భరిస్తే రూ.100రైతు భరించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు నీటినిసరఫరా చేసుకునే బాధ్యత రైతన్నలదే కావడంతో ఇది కొంతవరకు రైతులకు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. కొన్ని మండలాల్లో రూ.400లకే ట్యాంకర్లును ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉండటంతో రైతన్నలకు కొంతవరకు భారం తగ్గనుందని చెప్పుకోవచ్చు. అయితే కేవలం ఒక కుటుంబానికి 5 ఎకరాల విస్తీర్ణంలో వున్న తోటలకు మాత్రమే నీటి సరఫరా చేయడం జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. దీంతో 5 ఎకరాలకు పైబడి విస్తీర్ణంలో సాగులో వున్న మామిడి, చీని, నిమ్మరైతులు ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాలకంటే అధికంగా సాగులోవున్న తోటలకూ నీటి సరఫరా చేస్తే ప్రభుత్వం ఇచ్చే ట్యాంకుల నీరు చాలకపోయినా అదనంగా ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేసుకుంటామని వేడినీళ్ళకు చల్లనీళ్ళు తోడైనట్లుగా తమకూ కొంత ఊరట కలుగుతుందని అధిక విస్తీర్ణంలో పండ్లతోటలున్న రైతులు అర్థిస్తున్నారు. నీళ్ళు లేని పండ్ల తోటలను ఎంపిక చేయడం, తర్వాత నీటి సరఫరా చేసుకుంటున్నారా లేదా అనే విషయాలపై మండల స్థాయిలో ఎంపీ ఈవోలు, నియోజకవర్గంలో ఓ అధికారి పర్యవేక్షణ జరపాల్సి వుంది. ప్రజాప్రతినిధుల అండదండలతో మండల స్థాయిలోని కొందరు నాయకులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకోసం వచ్చే బిల్లులను స్వాహా చేయడానికీ ప్రయత్నించే అవకాశం వుంది. మండల, నియోజకవర్గ స్థాయిలో నీటి సరఫరా పర్యవేక్షణ జరిపే అధికారులు ఏమాత్రం పొరపాటు చేసినా పండ్ల తోటలకోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న డబ్బులు పక్కదారిపట్టే అవకాశం లేకపోలేదు.
వేరుశెనగ సాగు తగ్గింపునకు కసరత్తు!
* ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతుల్ని మళ్లించే యత్నం
* పది రోజుల్లో విత్తన సేకరణ పూర్తికి చర్యలు
* జూలైలోగా పంట రుణాలు

అనంతపురం, మే 12 : ఏటా వేరుశెనగ పంట సాగుతో పెట్టుబడులు, పంట నష్టాల్ని చవి చూస్తున్న అన్నదాతల్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వేరుశెనగ పంట సాగు సుమారు లక్ష హెక్టార్లు తగ్గించి ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతుల్ని మళ్లించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. సాధారణంగా జిల్లాలో 6 లక్షల హెక్టార్లకు పైబడి ఏటా ఖరీఫ్ వేరుశెనగ పంట సాగవుతోంది. అలాగే ఇతరత్రా పంటలు సైతం 2 లక్షల హెక్టార్లలో రైతులు వేస్తుంటారు. ఈ ఖరీఫ్‌లో సుమారు 8 లక్షల హెక్టార్లలో వేరుశెనగతోపాటు ఇతర పంటలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈనేపథ్యంలో ఈ ఏట ఖరీఫ్ వేరుశెనగ సాగును కనీసం లక్ష హెక్టార్లలో తగ్గించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ప్రత్నామ్నాయంగా కంది, పెసర, జొన్న, రాగి, సజ్జ వంటి పంటల వైపు రైతులు మొగ్గు చూపేలా సమాయత్నం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా వేరుశెనగ పంట నష్టాల బారి నుంచి రైతుల్ని గట్టెక్కించవచ్చని అధికారులు భావిస్తున్నారు. సరైన వర్షాలు లేకపోవడం వల్ల తరచూ నష్టపోతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఖరీఫ్ సాగుకు అవసరమైన విత్తన కాయలు 4 లక్షల క్వింటాళ్ల మేరకు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 3.15 లక్షల క్వింటాళ్లు సిద్ధం చేసినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక ఈఏడాది ఖరీఫ్ పంట రుణాలు రూ.3,298 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. గతేడాది రూ.4,287 కోట్లు పంట రుణాలు ఇచ్చారు. ఈ ఏడాది రుణాలు తగ్గడానికి వేరుశెనగ పంట సాగు తగ్గింపునకు తీసుకోబోతున్న చర్యలే కారణమని తెలుస్తోంది. కాగా ఈఏడాది పంట రుణాలను జూలై నెలాఖరులోగా ఇచ్చేందుకు బ్యాంకర్లను జిల్లాధికారులు సిద్ధం చేశారు. వీటిలో ఈ ఏడాది రెన్యూవల్ ఎక్కువగా ఉంటాయని, కొత్త పంట రుణాల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక పంట నష్ట పరిహారం రూ.1,032 కోట్లు ఈ ఏడాది ఇంకా రావాల్సి ఉంది. ఇందుకోసం ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఈ మొత్తం వస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా పంట రుణాలను కూడా రెన్యూవల్ చేసి ముందుగానే ఇచ్చే అవకాశం ఉన్నందున ఇన్‌పుట్ సబ్సిడీని బ్యాంకర్లు జమ చేసుకునే అవకాశం ఉండదని పేర్కొంటున్నారు. ఇన్‌పుట్ సబ్సిడీని సేవింగ్స్ అకౌంట్స్‌లో జమ చేస్తామని, లోన్ అకౌంట్‌కు చేయడం లేదని, తద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అధికారులు అంటున్నారు. ఇకపోతే ఈనెల 25 నుంచి వేరుశెనగ విత్తన కాయల పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ జెడి శ్రీరామ్మూర్తి తెలిపారు. సబ్సిడీ ధర ఇంకా ఖరారు కాలేదని, ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వెల్లడిస్తామని తెలిపారు.
పేదలకు కార్పొరేట్ వైద్యం
* అన్ని విభాగాల్లో పెద్దాసుపత్రి అభివృద్ధి
* మంత్రలు కామినేని, పరిటాల సునీత
అనంతపురం అర్బన్, మే 12:రాష్ట్రంలోని అన్ని సర్వజన ఆసుపత్రుల్లో ఇక నుంచి పేదలకు కార్పొరేట్ వైద్యన్ని అందించనున్నామని, ఆసుపత్రుల్లో అధునాతన వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటికే పేదలకు వైద్య సేవలు అందించటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రథమస్థానం దక్కిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాసురావు, స్ర్తి శిశు సంక్షేమ, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత సంయుక్తంగా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక సర్వజన ఆసుపత్రిలో రూ.8 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో ప్రారంభోత్సవంతో పాటు, ఆధునిక వైద్య పరికరాలను మంత్రి కామినేని శ్రీనివాస్‌రావు, పరిటాల సునీత, అర్బన్, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు కామినేని శ్రీనివాసరావు, పరిటాలు సునీత సంయుక్తంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు అనంతపురం జిల్లా సర్వజన ఆసుపత్రికి ఎనిమిదిసార్లు రావటం జరిగిందన్నారు. ఇక్కడ వైద్యసిబ్బంది కొరత ఉన్నా వారు సామాన్యులకు అందిస్తున్న వైద్య చాలా గొప్పదన్నారు. సర్వజన ఆసుపత్రిలోని సమస్యలు చాలా వరకు పరిష్కరించటం జరిగిందన్నారు. మూడేళ్ల క్రితం ఆసుపత్రి పరిస్థితికి ఇప్పటికి అన్ని విభాగాల్లోను అభివృద్ధి కనిపిస్తుందన్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం, కాకినాడు ఆసుపత్రుల్లో మాత్రం ఉన్న సిటీ స్కాన్ పరికరం అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. దీని విలువ రూ.2కోట్లతో ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. అదే విధంగా కర్నూలు, గుంటూరు, విజయవాడలో సైతం త్వరలో సిటీస్కాన్ పరికరాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. అనంతపురం సర్వజన ఆసుపత్రికి మరో 45 రోజుల్లో యంఆర్‌ఐ స్కాన్ పరికరాన్ని కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రల్లో ఆధునిక వైద్యన్ని అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ఎంత ఖర్చు అయినా వెనకాడుదన్నారు. రూ.17 లక్షల అంచనాతో నిర్మించిన రోగుల సహాయకుల విశ్రాంతి భవనం, రూ.5.52 కోట్లతో నూతనంగా నిర్మించిన 150 పడకల ఆసుపత్రిని మంత్రులు ప్రారంభించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రికి పిజీ సీట్ల మంజురు చేస్తామన్నారు. జివో 124ను త్వరలో అమలు చేసి వైద్యులను, సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమిస్తామన్నారు. వైద్యవృత్తి అత్యంత ప్రాధాన్యత కలిగినదని, ప్రజలకు కనిపించే దేవుళ్లు వైద్యులు అన్నారు. దేశంలో పేదలకు వైద్య సేవలు అందించటంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. ఆస్పత్రి భవనంలోని నవజాత శిశువుల వార్డు చిన్న పిల్లల వార్డులను ప్రారంభించారు. అనంతరం వైద్యులు మంచి వైద్యం అందిస్తున్నారా , మందులను అందజేస్తున్నారా అని రోగులను మంత్రి కామినేని శ్రీనివాసరావు అడిగి తెలుసుకొన్నారు. నర్సింగ్ దినోత్సవాన్ని సందర్భంగా ఆసుపత్రిలో కేక్ కట్ చేశారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లెరఘనాథరెడ్డి, మేయర్ స్వరూప, కలెక్టర్ వీరపాండ్యన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటరమణ, సర్వజన ఆసుపత్రి సూపరెంటెండ్ జగన్నాథం, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్‌రావ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో బిజెపి బలోపేతం
* జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి
తాడిపత్రి, మే12: రాష్ట్రంలో బిజెపి బూత్ స్థాయిలో బలోపేతం అయిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ప్యారడైజ్ హోటల్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 25న విజయవాడలో బిజేపి జాతీయ అధ్యక్షులు అమిత్‌షా ఆధ్వర్యంలో 70 వేల మంది బూత్‌కమిటీ సభ్యులతో రాష్టస్థ్రాయి బూత్ కమిటీల మహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 40,423బూత్‌లున్నాయని, అనంతపురం జిల్లాలో 3,376బూత్‌లుండగా, 2,117బూత్‌లకు కమిటీలు వేశామని తెలిపారు. మిగిలిన బూతులకు ఈనెల20లోగా గ్రామస్థాయిలో బూత్‌కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కో బూత్ కమిటీ నుంచి ముగ్గురు సభ్యులు విజయవాడకు తరలిరావన్నారు. బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మండలంలోని గ్రామాలలో తాగునీటి సమస్య అధికంగా ఉందని కార్యకర్తలు జిల్లా అధ్యక్షులు అంకాల్‌రెడ్డి దృష్టికితేగా, తాగునీటి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, అధికారులు స్పందించకపోతే మండల ప్రజాపరిషత్, కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపడుతామన్నారు. భారతీయ యువమోర్చ జిల్లాఅధ్యక్షులు హరీష్‌రెడ్డి, రంగనాథరెడ్డి, రాంబాబు, అంజి, ఆంజనేయులు పాల్గొన్నారు.

బదిలీల కోసం తీవ్ర ప్రయత్నాలు!
* ‘పురం’ మున్సిపల్ కార్యాలయంలో కీలక పోస్టులు భర్తీ అయ్యేనా
హిందూపురం టౌన్, మే 12 : ఇప్పటికే కీలక పోస్టుల ఖాళీలతో మున్సిపల్ పాలన నత్తనడకన సాగుతోంది. అన్నివిభాగాల్లోనూ కీలకమైన అధికారులు లేకపోవడంతో ఓ అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్టు పాలన కొనసాగుతోంది. మూడేళ్లుగా అధికారులు వచ్చేస్తున్నారంటూ చెప్పడమే కాని కీలక పోస్టులు భర్తీ కావడం లేదు. ఉన్నవారు ఇక్కడి నుండి వెళ్లిపోతున్నారే తప్ప వారి స్థానాల్లో కొత్తవాళ్లు ఇక్కడికి రావడం లేదు. వచ్చినా ఏదో ఒక రకంగా ఉన్నత స్థాయిలోనే చక్రం తిప్పి అటు నుండి అటే వెళ్లిపోతున్నారు. మున్సిపాలిటీలోని అన్నివిభాగాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పాలనా విభాగంలో కీలకమైన మేనేజర్ పోస్టు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉంది. దీంతో పాలనా విభాగంలో గందరగోళం నెలకొంది. ఇదే విభాగంలో జూనియర్ అసిస్టెంట్లు 19 మంది అవసరమయితే ఏడు మందితోనే మూడేళ్లుగా నెట్టుకొస్తున్నారు. రెవెన్యూ విభాగానికి అధిపతి అయిన రెవెన్యూ అధికారి పోస్టుతోపాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఏడాదిగా ఖాళీగా ఉన్నాయి. ఈ విభాగంలో ఆలనాపాలనా కరవయింది. చివరకు చాంబర్ కూడా లేని పరిస్థితి తలెత్తింది. రెవెన్యూ అధికారిగా ఒక అధికారిని నియమించినా ఆయన ఇక్కడికి రాకుండానే దీర్ఘకాలిక సెలవులో వెళ్ళిపోయి మరోచోటికి బదిలీ చేయించుకోవడం గమనార్హం. టౌన్ ప్లానింగ్ విభాగంలో టిపిఓ మినహా మిగతా అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కేవలం ఉన్నతాధికారితోనే నెట్టుకొస్తున్నారు. దీంతో పట్టణంలో పర్యవేక్షణ శూన్యం. కేవలం సమావేశాలు, విభాగ నిర్వహణ తదితర వాటికే పరిమితమయ్యారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు లేకపోవడంతో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రజారోగ్య విభాగం పరిస్థితి మరింత ఘోరం. ఇక్కడ ఒకే ఒక్క శానిటరీ ఇన్‌స్పెక్టర్ మాత్రమే పనిచేస్తున్నారు. ఒక శానిటరీ సూపర్‌వైజర్, నాలుగు శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు, ఇదే విభాగంలో మలేరియా అధికారి తదితర వాటితో కలుపుకొంటే దాదాపు 10 పోస్టులు మూడేళ్లుగా ఖాళీగానే ఉన్నాయి. దీంతో పారిశుద్ధ్య విభాగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధికారులు లేకపోవడంతో పట్టణంలో పారిశుద్ధ్య వ్యవస్థ అధ్వాన్నంగా మారిపోయింది. అభివృద్ధి పనుల్లో కీలకపాత్ర పోషించే ఇంజనీరింగ్ విభాగంలో క్షేత్రస్థాయిలో ఎఇ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న ఒకే ఒక్క ఎఇ ఇక్కడ ఐదేళ్లుగా పనిచేస్తుండటంతో బదిలీపై వెళ్ళిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చేవారు ఎవరూ కనిపించడం లేదు. ఇంజనీరింగ్ విభాగం అధిపతి మున్సిపల్ ఇంజనీర్ రమేష్ ఇక్కడి నుండి బదిలీపై వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేసుకొంటున్నారు. ఇక్కడి పరిస్థితులను తట్టుకోలేక ఆయన మరోచోటికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు. ఆయన ఇక్కడి నుండి వెళితే ఇక్కడి పరిస్థితుల కారణంతో మరొకరు వచ్చే అవకాశం కనిపించడం లేదు. పాలనా విభాగంలో 19 మంది పనిచేయాల్సిన చోట కేవలం నలుగురైదుగురితోనే పని చేయిస్తుండటంతో పనిభారం విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని తట్టుకోలేక ఉన్న సిబ్బంది ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసుకొంటున్నారు. మరో వైపు ఇక్కడి పరిస్థితులను తెలుసుకొని ఇతర మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న సిబ్బంది ఇక్కడికి వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఒత్తిళ్లు తట్టుకోలేక ఉన్న టిపిఓ తులసీరాం కూడా బదిలీ కోసం గతం నుండి ప్రయత్నాలు చేసుకొంటున్నారు. పారిశుద్ధ్య విభాగంలో ఉన్న ఒకే ఒక్క శానిటరీ ఇన్‌స్పెక్టర్ సోమశేఖర్, హెల్త్ అసిస్టెంట్ మహబూబ్‌బాషా కూడా బదిలీ కోసం ప్రయత్నాలు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు లోగా బదిలీలు పూర్తి కానుండటంతో ఇక్కడికి వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం, ప్రస్తుతం ఉండాల్సిన పోస్టుల్లో 43 శాతం మంది మాత్రమే పనిచేస్తున్నారు. బదిలీల తర్వాత ఇది మరింత తగ్గిపోవడం ఖాయమని సిబ్బందే చెబుతున్నారు. బదిలీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మరో 20 రోజుల్లో తేలిపోనుంది.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* రూ.75లక్షలతో మంచినీటి పథకం ప్రారంభం
* మంత్రి పరిటాల సునీత
చెనే్నకొత్తపల్లి, మే 12: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పరిటాలు సునీత అన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుండి చెనే్నకొత్తపల్లి మండల కేంద్రానికి ఏర్పాటు చేసిన మంచినీటి పథకాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజల సంక్షేమం మరిచి అవినీతి కూపంలో కూరుకుపోయిందన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. రూ.75లక్షలు వెచ్చించి మంచినీటిని అందించాలన్న ఉద్దేశ్యంతో ఎప్పటికప్పుడు అధికారులను, ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తు ఈ పథకానికి కృషి చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళ కూడా నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలన్నారు. ముఖ్యమంత్రి గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరివ్వడం వలనే అక్కడి నుండి బోరు వేసి పైపులైను ద్వారా చెనే్నకొత్తపల్లికి నీరు తీసుకురావడం జరిగిందన్నారు. పరిటాల రవీంద్ర ట్రస్టు ద్వారా అర ఎకరం స్థలాన్ని రూ.5లక్షలు వెచ్చించి గొల్లపల్లి రిజర్వాయర్ వద్దనే కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. వీటన్నింటి ముఖ్య ఉద్దేశ్యం గ్రామీణ ప్రాంత ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశ్యంతో చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా తాగునీరు, విద్య, ఉపాధి తదితర వాటికి సంబంధించి నిధుల కొరత లేదన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో వుంచుకుని నిధులను కావాల్సినంత మేరకు మంజూరు చేయడం జరిగిందన్నారు. అధికారులు కూడా సమిష్టిగా బాధ్యతాయుతంగా పని చేయడం వల్ల తక్కువ కాలంలోనే ఈ పైపులైను పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. కాబట్టి ప్రజల సంక్షేమాన్ని మరచిన ప్రభుత్వాలను కాకుండా నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం తపిస్తున్న టిడిపి ప్రభుత్వాన్ని అన్ని రకాల ఆదరించాలన్నారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య రానివ్వకుండా ఎప్పటికప్పుడు ఆ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించి వాటితో పాటు ప్రత్యామ్నాయ చర్యలను కూడా వెతకడం జరిగిందన్నారు. ఏది ఏమైనప్పటికి చెనే్నకొత్తపల్లికి తాగునీటి సమస్య ఇకపై వుండదన్నారు.
వేసవిని దృష్టిలో వుంచుకుని నీరు వృథాగా పోనివ్వకుండా వాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఎస్ ఈ హరేరామ్‌నాయక్, ఎంపిపి అంకె అమరేంద్ర, మార్కెట్‌యార్డు వైస్‌చైర్మన్ దండు ఓబులేసు, తహశీల్దార్ నాగరాజు, ఎంపిడిఓ రామాంజనేయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు విడుదల

అనంతపురం, మే 12 : పోలీసు శాఖ, జైళ్ల శాఖలో ఎఆర్, సివిల్ కానిస్టేబుల్, వార్డర్ల పోస్టుల భర్తీకి గతేడాది జూలైలో నిర్వహించిన పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈమేరకు రాష్ట్ర హోంమంత్రి రాజమండ్రి లో జిల్లాల వారీగా విడుదల చేశారు. ఆయా ఫలితాల జా బితా జిల్లా పోలీసు కార్యాలయానికి అందాయి. అలాగే ఆ న్‌లైన్‌లో కూడా ఉంచారు. జిల్లాలో 267 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కటాఫ్ మార్కుల మేరకు ఫలితాలు వెల్లడించారు. కాగా కోర్టుల్లో కేసులున్న అభ్యర్థుల ఫలితాలు మినహా ఇతరులకు సంబంధించి మా ర్కులు విడుదలయ్యాయి. రాష్టవ్య్రాప్తంగా 72,324 మం దికి హాల్ టికెట్లు జారీ చేయగా, 72,044 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 63,407 మంది అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో కటాఫ్ మార్కుల ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక జరిగింది. మార్కుల విషయంలో ఏదైనా అనుమానాలున్నట్లయితే నివృత్తి చేసేందుకు స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
* వైకాపా జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు సాంబశివారెడ్డి
గార్లదినె్న, మే 12 : కరవు కోరల్లో చిక్కుకున్న జిల్లా రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైకాపా జిల్లా యువజన వి భాగం అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి విమర్శించారు. శుక్రవారం మం డల పరిధిలోని బూదేడులో ఎండిన చీనీ, బొప్పాయి తదితర తోటలను ప రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం గొప్పలు చెబుతోందే తప్ప ఆచరణలో చూపడం లేదన్నా రు. తీవ్ర వర్షాభావం పరిస్థితుల నేపథ్యంలో పండ్ల తోటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. మరోవైపు ప్ర భుత్వం రక్షక తడులు అందిస్తామని చెప్పినా నేటికీ ఒక్క ఎకరా చీనీ పం టకు కూడా నీరు అందించలేదన్నారు. వారం రోజుల్లో ప్రభుత్వం చీనీ తోటలకు నీరు అందించకపోతే ఉన్న చెట్లన్నీ ఎండిపోయి దుర్బర పరిస్థితి నెలకొనే ప్రమాదం ఉందన్నారు. మ రోవైపు అరకొగా పండిన పంటకు గి ట్టుబాటు ధర లేక దిక్కుతోచని స్థితి లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. నియోజవర్గంలోని రైతుల సమస్యలపై అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా పండ్ల తోటల రైతులకు వైకాపా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా నాయకులు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వై.నారాయణరెడ్డి, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కనుంపల్లి నరేంద్రరెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నాయకుడు గట్టు రామకృష్ణారెడ్డి, త్రినాథ్‌రెడ్డి, కేశవరెడ్డి, మాజీ సర్పంచులు రాజశేఖర్, ఓబులేసు, తాతయ్య, గంగయ్య, శివాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
హనుమంత వాహనంపై
దర్శనమిచ్చిన పెన్నహోబిళేసుడు
ఉరవకొండ, మే 12 : పెన్నోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం హనుమంత వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రభాత సేవలో భాగంగా ఉదయం స్వామివారికి అభిషేకం, అలంకరణ, అర్చనలు, మంగళహారతులు, పూజలు చేశారు. అనంతరం నిత్యహోమం, దీక్షహోమం, ఉత్సవ నిత్యహోమం, శాంతి హోమం, పూజలు నిర్వహించారు. భూదేవి, శ్రీదేవి సమేతుడైన నరసింహస్వామి ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను హనుమంత వాహనంపై కొలువుదీర్చి మేళతాళాల మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని ఊరేగించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసిన భక్తులు గోవింద నామస్మరణలతో ప్రాంతమంతా మార్మోగిపోయింది. ఉత్సవ ఉభయ దాతలుగా మాజీ జడ్పీటీసీ గుర్రం సుధాకర్, రవీంద్రనాథ్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, ఆలయ ఇఓ రమేష్‌బాబు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి ఆత్మహత్య
పుట్లూరు, మే 12:మద్యానికి బానిసై కుటుంబ సభ్యులు అసహ్యించుకోవడంతో మనస్తాపానికి గురై త్యాగంటి వెంకటరెడ్డి(38) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పుట్లూరు మండలంలోని ఓబుళాపురం గ్రామంలో శుక్రవారం తెల్లవారుఝామున చోటు చేసుకుంది. ఓబుళాపురం గ్రామానికి చెందిన వెంకటరెడ్డిని వ్యసనాల కారణంగా భార్య వదిలి వెళ్ళిపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సురేష్‌బాబు పరిశీలించి కేసు నమోదు చేశారు.
ప్రమాదవశాత్తు విద్యార్థిని మృతి
ముదిగుబ్బ, మే 12:మండలంలోని కొడవాండ్లపల్లికి చెందిన రూపా (14) అనే విద్యార్థిని శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందింది. స్థానిక జడ్పీ ఉన్నతపాఠశాలలో 8వతరగతి పూర్తి చేసిన రూపా వేసవి సెలవుల కారణంగా తోటలో ఉన్న తాత నరసింహులుకు శుక్రవారం ఉదయం అన్నం ఇచ్చిరావడానికి వెళ్ళింది. విద్యుత్ వేళలు కావడంతో మోటారు అన్‌చేయడానికి వెళ్ళింది. అయితే మోటారువద్ద విద్యుత్ తీగలు దెబ్బతిని స్టార్టర్‌కు విద్యుత్ సరఫరా కావడంతో విద్యుదాఘాతంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. కొడవాండ్లపల్లికి చెందిన పొతులయ్య, బుజ్జక్కల కుమార్తె అయిన రూపా చదువులో మంచి ప్రావీణ్యత కలిగి ఉందని అమె తోటి విద్యార్థులు తెలిపారు. బిడ్డ ప్రమాదవశాత్తు మృతి చెందడంతో అమె తల్లిదండ్రులు శోకసముద్రం మునిగిపోయారు. కాగా విద్యార్థిని ప్రమాద వశాత్తు మృతి చెందిన విషయాన్ని ముదిగుబ్బ పొలీసులకు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు.
గుండెపోటుతో రైతు మృతి
రాప్తాడు, మే 12:మండలంలోని గాండ్లపర్తి గ్రామానికి చెందిన రైతు ముసలప్ప(50) గుండెపోటుతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన మేరకు మృతుడు ముసలప్పకు మూడున్నర ఎకరా పొలం ఉందని, వేరుశనగ పంటను సాగు చేసుకుంటు జీవనం సాగించేవాడన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వరుస కరవుతో పెట్టుబడి కూడా రాక పంట నష్టపోయాడని, పంట పెట్టుబడులకు, కూతుళ్ళ పెళ్ళిళ్ళకు దాదాపు రూ.4.50లక్షలు అప్పు చేశాడన్నారు. ఈ అప్పులు ఎలా తీర్చాలో స్థానికులతో చెబుతు బాధపడుతుండేవాడని, ఇదే క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతిచెందాడని తెలిపారు. ముసలప్ప కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించాలని గ్రామస్థులు కోరారు.