అనంతపురం

ఉరవకొండ నియోజకవర్గానికి పిఎబిఆర్ నీరు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, మే 13: ఉరవకొండ నియోజక వర్గంలోని 90 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చే మంచినీటి పథకం పూర్తి అయినా ప్రజలకు తాగునీటిని అందించకపోవటంపై ఉరవకొండ ఎమెల్యే విశే్వశ్వర్‌రెడ్డి శనివారం పిఎబిఆర్ ప్రాజెక్టు దగ్గర కార్యకర్తలతో ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే విశే్వశ్వర్‌రెడ్డితోపాటు మరో 12 మందిపై కూడేరు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వ మాట్లాడుతూ పది రోజుల క్రితం జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఉరవకొండ ప్రజల దాహార్తిని తీర్చాలని తాను కోరటం జరిగిందన్నారు. దీనికి స్పందించిన మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ నెల 13న ఉరవకొండ నియోకవర్గ ప్రజలకు తాగునీటిని అందిస్తామని హామీ ఇవ్వటం జరిగిందన్నారు. కాని ఇది అమలుచేయకపోవటంతో తాను ధర్నాకు దిగటం జరిగిందన్నారు. రూ.50 కోట్లు ఖర్చు చేసి నియోజకవర్గంలోని 90 గ్రామాలకు నీరందించాల్సి ఉందన్నారు. వేసవికాలం ఆరంభం అయ్యి దాదాపు రెండు నెలలు పూర్తి కావటం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం క్షక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి తక్షణమే తాగునీరు సరఫరా చేయాలని కోరారు. లేదంటే తమ నిరసనను మరింత ఉధ్రుతం చేస్తామని ఆయన తెలిపారు. కూడేరు పోలీసులు సొంత పూచీకతుపై ఎమ్మెల్యేతో 12 మందిని విడుదల చేశారు.

వర్షం కోసం వరుణయాగం
* మంత్రి కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం రూరల్, మే 13 : జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఈనెల 22వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాయదుర్గంలో వరుణ యాగం నిర్వహించనున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. ఈమేరకు శనివారం స్థానిక అథితి గృహంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ రామారావు, తహశీల్దార్ ఖాతిజున్‌ఖుప్రా, టిడిపి నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై యాగం నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. అంతకముందు యాగం నిర్వహణకు అనువైన స్థలం కోసం పట్టణంలోని శ్రీ జంబుకేశ్వరస్వామి ఆలయ ఆవరణాన్ని పరిశీలించారు. దాదాపు వెయ్యి సంత్సరాల చరిత్ర కలిగిన శ్రీ జంబుకేశ్వరస్వామి క్షేత్రంలో యాగం నిర్వహించడం శుభప్రదమని పండితులు అన్నారు. అనంతరం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ ఈనెల 22,23,24వ తేదీల్లో వరుణుడి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 17 సంవత్సరాలపాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని భూగర్భజలాలు అడుగంటిపోయి భవిష్యత్తుపై భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో యాగం నిర్వహిస్తే వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. మానవ ప్రయత్నంగా చేపట్టే ఈ కార్యక్రమంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
లారీ, ఆటో ఢీ.. ఇద్దరి మృతి
అనంతపురం అర్బన్, మే 13: కూడేరు మండలం శివరామ్‌పేట దగ్గర శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు అనంతపురంలోని రుద్రంపేట కాలనీకి చెందిన ఆరుగురు యువకులు ఆటోలో పెన్నోహోబిళం నుంచి అనంతపురం వస్తుండగా, అనంతపురం నుంచి బళ్ళారి వైపు వెళ్తున్న లారీ ఢీకొంది. ఇందులో ప్రయాణిస్తున్న కృష్ణకుమార్ (19) సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, ముఖేష్ (20) సైతం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
‘సీమ’లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
* సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎ గఫూర్
ఉరవకొండ, మే 13 : రాయలసీమలో కరవు నివారణ కోసం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఎ గఫూర్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని బూదగవి గ్రామంలో సిపిఎం బృందం పర్యటించి రైతులు, వ్యవసాయ కూలీలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల నుంచి వర్షాభావ పరిస్థితుల వల్ల కరవు వెంటాడుతోందన్నారు. మరోవైపు ప్రభుత్వం కరవు జిల్లాగా ప్రకటించినా ఇంతవరకూ నివారణ పనులు చేపట్టలేదన్నారు. ఫలితంగా రాయలసీమలోని అనేక గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు పనులు లేక వేలాది కుటుంబాలు వలసబాట పట్టాయన్నారు. మరోవైపు చేసిన ఉపాధి పనులకు సైతం బిల్లులు చెల్లించకపోవడంతో అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటి వరకు రాయలసీమలో రూ.244 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఆధార్ అనుసంధానం కాలేదని కూలీలకు ఖాతాల్లో జమపడడం లేదన్నారు. కొంతమంది కూలీలకు బ్యాంకుల్లో నగదు జమ అయితే, పాత బకాయిలు పట్టుకుంటున్నారని ఆరోపించారు. ఇకపోతే హంద్రీనీవా పెండింగ్ ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం మంచిది కాదన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును ఆరునెలల్లో పూర్తి చేశారని, అయితే రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎందుకు నిధులు కేటాయించడం లేదన్నారు. సంవత్సరానికి రూ.1500 కోట్లు ఖర్చు చేస్తే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం పంపిణీ చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే చంద్రబాబు ఆ నిధులను వేరే పనులకు ఖర్చు చేస్తున్నారన్నారు. ఉపాధి హామీ నిధులు కాంట్రాక్టర్లకు వరంగా మారిందన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించడంతోపాటు సీమ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఈనెల 16,17వ తేదీల్లో జరగనున్న కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర నాయకులు ఓబులు, డివిజన్ కార్యదర్శి రంగారెడ్డి, మధుసూదన్, జ్ఞానమూర్తి, రామన్న, విరుపాక్షి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
‘అనంత’ అన్నదాతను పట్టించుకోని ప్రభుత్వం
వజ్రకరూరు : జిల్లా ప్రజలు, రైతులు అడుక్కు తిని జీవనం సాగిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే గఫూర్ అన్నారు. మండలంలోని గంజికుంట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమలో ప్రాజెక్టులు, పరిశ్రమ ఎర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. హంద్రీనీవా కాలువ పొడిగించి నీరు వదిలితే జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. మరోవైపు సక్రమంగా ఉపాధి హామీ బిల్లులు చెల్లించక కూలీలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వజ్రకరూరులో వజ్ర అనే్వషణ కేంద్రం ఉన్నప్పటికీ నిరుద్యోగులకు పనులు కల్పించలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాయలసీమ అభివృద్ధి కమిటీ సభ్యులు ఓబులు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు కృష్ణమూర్తి, సిపిఎం మండల కన్వీనర్ విరుపాక్షి, బెంజిమేన్, బాబు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రసన్న
వెంకటరమణస్వామి కల్యాణం
రాయదుర్గం రూరల్, మే 13 : పట్టణంలోని కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి కల్యాణోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సం ప్రదాయం ప్రకారం పట్టణంలోని నేసేపేట ప్రాంతంలో నివాసముంటున్న అరవ వంశస్థులు జనార్ధన, స్వప్న కుమార్తె పద్మావతి (అమూల్య)ని వధువుగా అలంకరించారు. అనంతరం పట్టణంలోని మార్కెండేయా స్వామి ఆలయం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయానికి తీసుకొచ్చి శ్రీవారి ఎదట కూర్చొపెట్టారు. వధువు తరుపున పద్మశాతి కులస్థులు, శ్రీవారి తరపున పట్టణ ప్రముఖులు, బ్రాహ్మణులు కలిసి కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో మంత్రి కాలవ శ్రీనివాసులు పాల్గొని పూజలు చేశారు.
సూర్యప్రభ వాహనంపై
దర్శనమిచ్చిన శ్రీవారు
ఉరవకొండ, మే 13 : పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున స్వామివారి మూలవిరాట్‌కు అభిషేకం, అలంకరణ, అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, వివిధ ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా తయారు చేసిన పల్లకిలో కొలువుదీర్చారు. ఉత్సవ ఉభయ దాతలు అనంతపురం పట్టణానికి చెందిన నారాయణస్వామి ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులను భాజాభజంత్రీల నడుమ ఊరేగించారు. అదేవిధంగా చంద్రప్రభ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవ ఉభయదాతలు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పూజలు చేశారు. ఉత్సవాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకొన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈకార్యక్రమంలో ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, ఆలయ ఇఓ రమేష్‌బాబు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
* మంత్రి పరిటాల సునీత
అనంతపురం సిటీ, మే 13: పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శనివారం నగరంలోని మంత్రి నివాసంలో రాప్తాడు నియోజకవర్గంలోని ముక్తాపురంలోని ఎన్‌టియర్ గృహ నిర్మాణ పథకం కింద ఆదర్శ కాలనీగా నిర్మిస్తున్న గృహ లబ్ధిదారులకు చెక్కులను అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇల్లు లేని సామాన్య ప్రజలకు ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. 2016-17 సంవత్సరంలో రాప్తాడు నియోజకవర్గానికి 1250 గృహాలను మంజూరు చేసిందన్నారు. ఒక్కొక్క గృహానికి 1.50 లక్షలతో మొత్తం 18.75 కోట్లను కేటాయించిందన్నారు. కనగానపల్లి మండలం ముక్తాపురంలో లే అవుట్ కాలనీలో 36 మోడల్ గృహాలను ఆదర్శ కాలనీగా నిర్మిస్తున్నామన్నారు. ఇందులో 34 గృహాలు శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాయని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సరిపోకపోవడంతో లబ్దిదారులు అప్పులు పాలు కాకూడదని సామాజిక పెట్టుబడి నిధి కింద ఒక్కొక్క లబ్దిదారునికి 25 వేల రూపాయలను తిరిగి చెల్లింపు పద్దతిలో 30 మందికి 7.50 లక్షల విలువైన చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ గృహాలకు పరిటాల పేరు మీద రంగులను తానే స్వయంగా వేయిస్తానని లబ్దిదారులకు హామీ ఇచ్చారు. అలాగే ఈ కాలనీకి రోడ్లు, కాలువలు, విద్యుత్ అన్ని వౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. వచ్చే ఆగస్టు నాటికి లబ్దిదారులందరు గృహప్రవేశాలు చేయాలని కోరారు. గృహాప్రవేశాలకు లబ్దిదారులకు నెట్టెం వెంకటేసు మహిళలకు చీరలను పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నెట్టెం వెంకటేసు, ఆర్‌డిఓ మలోలా, హౌసింగ్, డిఆర్‌డిఏ పిడిలు రాజశేఖర్, వెంకటేశు, లబ్దిదారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గంగాదేవి విగ్రహ ప్రతిష్ఠోత్సవం ప్రారంభం
* పాల్గొన్న మంత్రి పరిటాల సునీత
రామగిరి, మే 13: మండలంలోని గంగంపల్లి గ్రామంలో చీమాంస దేవత గంగాదేవి విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక మహోత్సవం శనివారం జరిగాయి. విగ్రహ ప్రతిష్ఠ ఆదివారం ఉదయం నిర్వహించడం జరుగుతుందని గ్రామస్థులు తెలిపారు. కాగా శనివారం జరిగిన అమ్మవారి గ్రామోత్సవంలో మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌లు పాల్గొన్నారు. మహాగణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమై శనివారం గ్రామంలోని పురవీధులగుండా అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించారు. ఈ సందర్భంగా ఇళ్ల వద్దకు వెళ్ళినపుడు అమ్మవారికి పసుపు, కుంకుమ, వేపాకు కలిపిన నీటిని అమ్మవారిపై పోసి వసంతోత్సవం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆదివారం నిర్వహించే విగ్రహ ప్రతిష్ఠకు భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని గ్రామస్థులు కోరారు.
రొద్దం అనంతశక్తి సొసైటీలో చోరీ
* లాకర్‌లోని నగదు దోచుకెళ్లిన దుండగులు
రొద్దం, మే 13 : మండల కేంద్రంలోని అనంతశక్తి సొసైటీలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్య క్తులు ప్రవేశించి లాకర్‌ను పగులగొట్టి అందులోని నగదును దోచుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు అనంతశక్తి సొ సైటీలో పని చేస్తున్న సిబ్బంది శుక్రవారం విధులు ముగించుకుని యథావిధిగా కార్యాలయానికి తా ళాలు వేసుకుని వెళ్లారు. అయితే శనివారం ఉదయ ం సిబ్బంది కార్యాలయం వద్దకు చేరుకోగా తాళాలు పగులగొట్టి, కార్యాలయంలోని ఫర్నీచర్, ఇతర వ స్తువులు ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించారు. వెంటనే సిఇఓ తిరుమలాదేవికి సమాచారం అందించారు. వెంటనే ఆమె హుటాహుటిన అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంట నే ఎస్సై మునీర్‌అహ్మద్ వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో పెనుకొండ డిఎస్పీ సుబ్బారావు, సిఐ రాజగోపాల్‌నాయుడు ఆధ్వర్యంలో డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి చోరీకి గురైన లాకర్ కార్యాలయ సమీపంలోని పెన్నానదిలో వేసినట్లు గుర్తించారు. లాకర్‌లో రూ.9,75,012 ఉన్నట్లుగా సిఇఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
బెళుగుప్ప, మే 13 : మండల పరిధిలోని నరసాపురం గ్రామానికి చెందిన హనుమంతరాయుడు (46) శనివారం ఇంటికి నీటిని పెడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నరసాపురానికి చెందిన హనుమంతరాయుడు కొత్త ఇళ్లు నిర్మిస్తున్నాడు. దీంతో ఇంటికి మోటార్‌తో నీటిని క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే చుట్టు పక్కల వారు కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎఎస్‌ఐ విజయ్‌నాయక్ తెలిపారు.
బెట్టింగ్‌రాయుళ్ల అరెస్టు
* రూ.46వేలు స్వాధీనం
యాడికి, మే 13 : మండల పరిధిలోని రాయలచెరువులో శనివారం ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌కు సం బంధించి బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు రాయలచెరువు గ్రామానికి చెందిన శ్రీనాథ్, రాజశేఖర్‌రెడ్డి, శివకుమార్‌ని అదుపులోకి తీసుకుని, రూ.46,900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో హెచ్‌కానిస్టేబుల్ రామంజినేయులు, పోలీసులు రామయ్య, కులశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

బైకు ర్యాలీని విజయవంతం చేయండి
అనంతపురం సిటీ, మే 13: ఈ నెల 21వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నగరంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే బైకు ర్యాలీని విజయవంతం చేయాలని హిందూ చైతన్య వేదిక నగర కన్వీనర్ అశోక్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక హిందూ చైతన్య వేదిక కార్యాలయంలో బైకు ర్యాలీ పోస్టర్లును విడుదల చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హిందువులకు హనుమాన్ జయంతిని తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ బైకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ర్యాలీ నగరంలోని ఎస్‌ఎస్‌బియన్ కాలేజి నుండి సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్, 5వ రోడ్డు, ఆర్‌టిసి బస్టాండు, శ్రీకంఠం సర్కిల్, గాంధీ బజార్, విద్యుత్‌నగర్ సర్కిల్ మీదుగా హౌసింగ్ బోర్డు నందు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు జరుగుతుందని తెలిపారు. కావున నగరంలోని హిందువులు, హనుమాన్ భక్తులు బైకు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక నాయకులు భవాని రవికుమార్, గల్లా హర్ష, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
15 నుండి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
అనంతపురం సిటీ, మే 13: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలో తప్పిన విద్యార్థులకు మే 15న అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు మే 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి 12:30 గంటల వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2 గంటల నుండి 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 70 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 35,641 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. అందులో ప్రథమ సంవత్సరంలో 25,699 మంది, ద్వితీయ సంవత్సరంలో 9,942 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వౌళిక సదుపాయాలు కల్పించాలని ఇదివరకే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్ సరఫరాలాంటి అంశాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ కూడా కాపీయింగ్ జరగకూడదని హెచ్చరించారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించాలని, జిరాక్స్ సెంటర్స్‌ను మూసివేయించేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం గ్రామీణ ప్రాంతంలోని అభ్యర్థులకు బస్సు రవాణా చర్యలు చేపట్టారు. పరీక్షలకు సంబందించిన ప్రశ్నాపత్రాలను ఇప్పటికే అన్ని స్టాకు పాయింట్లకు పంపించి భద్రపరిచారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్‌ఐఓ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు.
మహిళా సంఘాల అభివృద్ధికి
ప్రభుత్వం కృషి చేస్తోంది
అనంతపురం సిటీ, మే 13: మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని అనంత అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి పేర్కొన్నారు. శనివారం నగరంలోని లక్ష్మినగర్‌లో భారత్‌మాత నగరపాలక ప్రాథమిక పాఠశాలనందు మహిళా సంఘాల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంఘాలకు అనువుగా వుండేలా రూ.10 లక్షలతో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని తెలియజేసారు. లక్ష్మినగర్‌లో మహిళా సంఘాల గ్రూపులను ఏర్పాటుచేసుకునేందుకు వీలుగా ఈ కమ్యూనిటీ హాల్‌ను నిర్మాణం చేపడతామని తెలిపారు. అనంతరం లక్ష్మినరగ్‌లోని మహిళల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకురాళ్లు రుక్ష్మిణమ్మ, సులోచన, సువర్ణ, భారతమ్మ, వెంకటలక్ష్మి, ఫాతీమా, లక్ష్మిదేవి పాల్గొన్నారు.
వరకట్నం వేధింపులకు వివాహిత మృతి
అనంతపురం అర్బన్, మే 13: కూడేరు మండలం అరవకూరు గ్రామంలో భర్త అదనపు కట్నం వేధింపులకు చంద్రకళ (25) బావిలో పడి శనివారం ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు ఎస్‌ఐ రాజు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే బెళుగుప్ప మండలం సిర్పుకొట్టాల గ్రామానికి చెందిన చంద్రకళ, కూడేరు మండలం అరకూరు గ్రామానికి చెందిన ఓబుళమూర్తితో 2011లో వివాహం జరిగిందన్నారు. దురలవాట్లకు బానిస అయిన ఓబుళమూర్తి అదనపు కట్నం కావాలంటూ భార్యను వేధిస్తున్నట్లు తెలిపారు. దీనిని భరించ లేక బావిలో పడి ఆత్మహత్య చేసుకొన్నట్లు ఎస్.ఐ తెలిపారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అబద్ధాలతో
ఎంతో కాలం గడపలేరు
అనంతపురం సిటీ, మే 13: జిల్లాలోని కరవును తీరుస్తామని అబద్ధాలతో ఎంతోకాలం గడపలేరని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. శనివారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. తాగునీరు కూడా దొరక్క ప్రజలు అవస్థలుపడుతున్నారని తెలిపారు. కరవు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ పనుల్లేక గ్రామాల నుండి అనేకమంది వలసలు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తిచేసిన ప్రభుత్వం రాయలసీమ ప్రాంతంలోని హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులపై మాత్రం దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం నీటి ప్రాజక్టులను పూర్తి చేసి రాయలసీమకు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో కరవు నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరవుపై చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం వత్తిడి తీసుకువచ్చేందుకు ఈ నెల 16, 17వ తేదీల్లో కలెక్టరేట్ వద్ద సీమ బైఠాయింపు పేరుతో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, నిరసనలో ప్రజలందరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆదివారం పెట్రోల్‌బంక్‌లు
పనిచేస్తాయి
అనంతపురం అర్బన్, మే 13: ఆయిల్ కంపెనీలు డీలర్ల మార్జిన్‌మనీ పెంపునకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలను తుంగలో తొక్కడమే కాకుండా, ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీలర్ మార్జిన్‌ను సవరించాలనేది ముఖ్య అంశంగా ఆయిల్ కంపెనీలు అంగీకరించబడినప్పటికి అమలుచేయకపోవటంతో ఈ నెల 14నుంచి ఆదివారం పెట్రోల్‌బంకులు మూసివేయటం, కేవలం ఆరు గంటల పని దినాలు అన్న అంశంతో నిరసనకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. శనివారం ఇందుకు సంబంధించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధ్యక్షుడు చందులాల్ మాట్లాడుతూ తమ నిరసనను వాయిదా వేసుకోవటం జరిగిందన్నారు. ఆదివారం పెట్రోల్ బంకులు యథావిధిగా పనిచేస్తాయన్నారు. ఈ నెల 17 డీలర్ల యూనియన్లతో ఆయిల్ కంపెనీలు చర్చలకు పిలవటం జరిగిందన్నారు. ఈ నెల 10న ఆయిల్ కంపెనీల నుంచి ఆయిల్ కొనుగోలు నిలిపివేయటం జరిగిందన్నారు. ఈ నెల 17న చర్చల ఫలప్రదం అయితే యథావిదిగా పెట్రోల్ బంకులు పనిచేయటం జరుగుతాయని లేదంటే డీలర్లు మళ్లీ నిరసనబాట పట్టాల్సి వస్తుందన్నారు.
వేసవి డ్యాన్స్ ఉచిత శిక్షణ
అనంతపురం సిటీ, మే 13: నగరంలోని కళాసాగర్ డ్యాన్స్, ఆర్ట్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులకు వివిధ కళలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కళాసాగర్ డ్యాన్స్, ఆర్ట్స్ అకాడమి డైరెక్టర్ విజయకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణలో డ్రాయింగ్, పెయింటింగ్, మాస్క్‌లు, కార్టూన్ కటింగ్, క్రాప్ట్‌వర్క్స్, పేపర్ మోల్డ్‌తోపాటు డ్యాన్స్, జానపదం, బాంగ్రా, సెమిక్లాసిక్‌లలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణను నగరంలోని క్రిష్ణ కళామందిర్‌లో నేటి నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినీ, విద్యార్థులు క్రిష్ణ కళా మందిర్‌లో సంప్రదించగలరని తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
పరిగి, మే 13 : మండల పరిధిలోని ఎస్.బీరేపల్లికి చెందిన కంసలి ప్రభావతి (30) శనివారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు మందలించారని మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఎవరూలేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీ
(01) ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న శ్రీవాణి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గార్లదినె్న, మే 13 : మండల పరిధిలోని కల్లూరు అగ్రహారం సమీపంలో 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వన్నప్ప (62) మృతి చెందినట్లు ఎస్సై ప్రదీప్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు కల్లూరు గ్రామానికి చెందిన వన్నప్ప సమీపంలోని ఆయిల్ మిల్లు నుంచి ద్విచక్ర వాహనంలో వస్తుండగా గుత్తి నుంచి అనంతపురం వైపు వెళ్లే కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన వన్నప్పను అదే కారులో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

‘ఐపిఎల్’ కాసులు!
* భారీగా బెట్టింగులు
* రోడ్డున పడుతున్న కుటుంబాలు..
హిందూపురం, మే 13 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సామాన్యులను సైతం జూదానికి బానిసలను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతో కష్టపడి సంపాదించిన మొత్తాన్ని క్రికెట్ బెట్టింగ్‌లో పోగొట్టుకుంటూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. గతంలో సంపన్నులకే పరిమితమైన ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ ప్రస్తుతం చిరు ఉద్యోగులు, కార్మికులకు పాకింది. టాస్ నుంచి మ్యాచ్ ముగిసే దాకా రూ.కోట్లలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. బెట్టింగ్‌పై పోలీసు యంత్రాంగం గట్టి నిఘా ఉంచినా అంతంత మాత్రంగానే బెట్టింగ్‌రాయుళ్లు దొరుకుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బాల్‌కు పరుగులు లభిస్తాయా లేదా, ఓవర్‌లో ఎన్ని పరుగులు వస్తాయి, వికెట్ పడుతుందా లేదా వంటి అంశాలపై కూడా జోరుగా బెట్టింగ్ కాస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపిఎల్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకోవడంతో బెట్టింగ్ కూడా మరింత జోరందుకొందుకున్నట్లు సమాచారం. ఇకపోతే చేనేత, మరమగ్గాల కార్మికులు కూడా ఐపిఎల్ జూదంలో చిద్రమవుతున్నట్లు తెలుస్తోంది. వారం రోజులపాటు ఎంతో కష్టపడి చీరలు తయారు చేసి శని, ఆదివారాల్లో బట్వాడా తీసుకుని ఐపిఎల్ బెట్టింగ్‌లకు బానిసలై తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం మాస్టర్ వీవర్లపై కూడా పడుతోంది. బెట్టింగ్‌ల వ్యవహారంలో అటు నష్టపోయినా ఇటు లబ్ధి పొందినా కొందరు కార్మికులు విధులకు హాజరు కాకపోతుండటంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. ఇదిలా ఉండగా చిరు ఉద్యోగులు కూడా ఐపిఎల్ బెట్టింగ్‌లతో మరింత నష్టపోతున్నట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది బెట్టింగ్ రాయుళ్లు పలుప్రాంతాల్లో గదులను అద్దెకు తీసుకుని టివిలను ఏర్పాటు చేసుకుని బాల్ టూ బాల్, ఓవర్ టూ ఓవర్ అంటూ పందేలు కాస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా నేరుగా కాకుండా సెల్‌ఫోన్లు, ఇంటర్‌నెట్‌ల ద్వారానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ధర్మవరం, కదిరి, పులివెందుల వంటి ప్రాంతాలకు చెందిన వ్యక్తులు దళారులను ఏర్పాటు చేసుకుని క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడేవారు. కాగా మట్కా, పేకాట వంటి జూదలకు ఏమాత్రం తీసిపోకుండా ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం తారాస్థాయికి చేరుకుంటోందన్న ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది.
డిఆర్‌డిఎ అక్రమార్కుల గుండెల్లో గుబులు!
* జెసి రమామణి రాకతో కదులుతున్న డొంక..!
అనంతపురం అర్బన్, మే 13: జిల్లా జాయింట్ కలెక్టర్‌గా రమామణి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డిఆర్‌డిఏ) ఆక్రమార్కుల్లో భయం పుట్టుకొంది. ఇందుకు కారణాలిలా ఉన్నాయి. 2009లోప్రస్తుత జెసి రమామణి డిఆర్‌డిఎ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఆరు నెలలపాటు బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో అక్రమాలకు ఆలవాలమైన కిందిస్థాయి సిబ్బందికి ఆమె కొరకరాని కొయ్యగా మారారు. ఆ శాఖలో వేళ్లూనుకొనిపోయిన అవినీతిని బహిర్గతం చేసి విచారణకు నడుం బిగించారు. ఫైళ్లను తెరచి చూసేకొద్ది అక్రమాలు కుప్పలుకుప్పలుగా బహిర్గతం కావడంతో నేరుగా పిడి క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు. జిల్లాలోని మడకశిర, హిందూపురం, సోమందేపల్లి, పామిడి క్లస్టర్లలో కిందిస్థాయి సిబ్బంది సంక్షేమ ఫలాల ముసుగులో లక్షలాది రూపాయలు చేతులు మారినట్టు గుర్తించారు. స్పష్టమైన ఆధారాలతో అక్రమార్కులపై చర్యలకు పిడి నడుం బిగించారు. ఆమె సంచలన, కఠిన నిర్ణయాలతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. డిఆర్‌డిఏ ఉద్యోగులంతా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉండి డిప్యూటేషన్‌పై డిఆర్‌డిఏకి వచ్చిన వారే. ఇలా వెళ్లి లక్షలాది రూపాయలు దోచుకొని, దాచుకొని వారికి సహకరించడంలోను అందెవేసిన చెయ్యిలాగా ఇద్దరు ఉద్యోగులు ఉండేవారు. పిడి చర్యలతో హడలెత్తిన వీరు తోక ముడిచి అక్కడి నుంచి శెలవుపై వెళ్లిపోయారు. తాము ఇరుకున పడతామని భావించిన వారు శక్తివంచన లేకండా పైరవీలు నిర్వహించారు. అప్పటి మంత్రి రఘవీరారెడ్డికి వారు ప్రధాన అనుచరులుగా ఉండటంతో బదిలీ చేయించటంలో సఫలీకృతులు అయ్యారనే చెప్పుకోవాలి. అయితే జెసిగా మరిన్ని అధికారాలతో జిల్లాకు వచ్చిన రమామణి మరోసారి డిఆర్‌డిఏ ఫైళ్ల బూజు దులుపుతారనే భయం అక్రమార్కుల్లో నెలకొంది. గతంలోకంటే అవినీతి పెరిగిన నేపథ్యంలో డిఆర్‌డిఏ ప్రక్షాళన జరుగుతుందనే ఆశాభావంతో ప్రజలు ఉన్నారు.