అనంతపురం

ఎస్‌ఎస్‌ఏ పిఓపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూన్ 20: జిల్లా సర్వశిక్ష అభియాన్‌లోని ప్రత్యేక అవసరాల పిల్లల, కస్తూరిబా బాలికల పిల్లలకు కేటాయించిన నిధులను మళ్లించి సివిల్ పనులకు ఖర్చు చేశారన్న ఆరోపణలతో ఎస్‌ఎస్‌ఏ పిఓతో కలిపి 7 మందిని విధుల నుండి తొలగిస్తున్నట్లు ఎస్‌ఎస్‌ఏ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం స్థానిక ఎస్‌ఎస్‌ఏ కార్యాలయాన్ని ఎస్‌ఎస్‌ఎ రాష్ట్ర డైరెక్టర్ జి.శ్రీనివాసులు, డిప్యూటీ రాష్ట్ర డైరెక్టర్ మస్తానయ్యలు ఆకస్మిక తనిఖీ చేశారు. రాష్ట్ర ఎస్పీడితోపాటు డిప్యూటి ఎస్పీడి, ఇతర అధికారులతో కలసి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఫైళ్లను పరిశీలించారు. అనంతరం ఎస్పీడి శ్రీనివాసులు విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో సర్వశిక్షాభియాన్ ద్వారా 2016-17 సంవత్సరానికి సివిల్ పనుల కోసం రాష్ట్ర ఎస్‌ఎస్‌ఏ రూ.9.81 లక్షల బడ్జెట్ ఆమోదం తెలిపితే, జిల్లా పిఓ, అధికారులు కలసి ఇప్పటికే 13.30 లక్షల రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించారని తెలిపారు. ఇందులో దాదాపు 4 కోట్లు రూపాయలు ఇతర విభాగాల నుండి మళ్లించి, సంబందిత విభాగాల్లో పిల్లలకు అందాల్సినవి అందకుండా చేయడం చాలా దురదృష్టకరమని ఎస్పీడి తెలిపారు. జిల్లా కేంద్రం నుండి పది కిలోమీటర్లు దూరం వెళ్లి టిఏ, డిఏలు తీసుకోవడం చాలా దారుణమన్నారు. ఎస్‌ఎస్‌ఏలో నెలకు లక్ష రూపాయలు టిఏ, డిఏలకే ఖర్చు చేస్తున్నారని ఆయన తెలిపారు. పాఠశాలలు, కస్తూరిబా స్కూల్స్ పరిశీలన చేశామని చెప్పుకుని టిఏ, డిఏల బిల్లును చేసుకుని రోజువారి పుస్తకంలో రిజిస్టర్ చేయలేదని ఎస్పీడి తెలిపారు. అలాగే ప్రత్యేక అవసరాల పిల్లలకు 2016-17కు ఖర్చు చేయాల్సిన కోటి 48 లక్షల్లో 38 లక్షలు ఖర్చు చేసి మిగిలిన కోటి రూపాయలను సివిల్ పనులకు మళ్ళించారని తెలిపారు. కస్తూరిబా బాలికల విద్యాలయాలకు నెలసరి బిల్లులు చెల్లింపులోను, ప్రత్యేక అవసరాల పిల్లలకు అందాల్సిన బిల్లులను, ఎస్‌ఎస్‌ఏలో పనిచేస్తున్న ఐఈఆర్‌టిలకు, సిఆర్‌టిలకు, ఇతర విభాగాలు మూడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా నిధులు మళ్లించడం చాలా దారుణమన్నారు. ఎస్‌ఎస్‌ఏ కింద కెజిబివిల్లో 2016-17 సంవత్సరానికి రాష్ట్ర ఎస్‌ఎస్‌ఏ కార్యాలయం 7.20 లక్షలకు ఆమోదం తెలిపితే, జిల్లా ఎస్‌ఎస్‌ఏ వారు 77.68 లక్షలు ఖర్చు చేశారని, అది కూడా రాష్ట్ర కార్యాలయం నుండి ఎలాంటి అనుమతి లేకుండా ఖర్చు చేశారని ఎస్పీడి తెలిపారు. కస్తూరిబా బాలికల విద్యాలయాలపై పిఓకానీ, జిసిడిఓకానీ మానటరింగ్ చేయడం నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన తెలిపారు. జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ దశరథరామయ్య మానటరింగ్, ఆర్థిక లావాదేవీలపైన, జిసిడిఓ వాణిదేవి చేసిన పనులను, అసిస్టెంట్ అలెస్కొ శ్రీదేవి చేసిన పనులను, అసిస్టెంట్ సియంఓ క్రిష్టప్ప చేసిన పనులను వారు అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఏ ఒక్కరు కూడా వారి విభాగానికి అప్పజెప్పిన పనులను సరిగా చేయలేదని నిర్థారించుకున్నామని, పిఓకు సర్వశిక్షాభియాన్ కార్యాలయంపై మానటరింగ్‌లోను, నిధులను ఖర్చు చేయడంలో పూర్తిగా అవగాహన లోపం ఉందన్నారు. పిఓ దశరథరామయ్యను విధులను నుండి తొలగిస్తూ సొంత శాఖకు వెళ్లాలని సూచించామని తెలిపారు. కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో వేసవి సెలవుల్లో నిర్వహించాల్సిన ప్రత్యేక తరగతులను, భవిత సెంటర్లు నిర్వహణలో నిర్లక్ష్యంగా జిసిడిఓ వాణిదేవి వ్యవహరించిందని, ప్రత్యేక అవసరాల పిల్లలకు చేయాల్సిన ఫిజియోథెరఫిలను నిర్వహించడంలోను, నిధులను ఖర్చు చేయడంలో ఐఈడి కోఆర్టినేటర్ పాండురంగడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అసిస్టెంట్ అలెస్కొ శ్రీదేవి పనిచేయకుండా పనిచేసినట్లు రాసుకుంటూ, బడి బయట పిల్లలకు నిర్వహించాల్సిన సీజనల్ హాస్టల్స్‌ను, మదర్సలను మానటరింగ్ చేయడంలోను, ఎన్‌ఆర్‌జిఎస్‌లను నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అసిస్టెంట్ సిపిఎం క్రిష్టప్ప చేసిన పనికి సంబందించిన రోజు డైరీ లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. అందుకు వాణిదేవి, పాండురంగడు, శ్రీదేవి, క్రిష్టప్పలను విధుల నుండి తొలగిస్తూ, వారిని సస్పెండ్ చేయాలని డిఇఓ, ఆర్‌జెడికి సిపార్సు చేశామని తెలిపారు. జిల్లా కేంద్రంలో పనిచేయాల్సిన గుంతకల్లు, కళ్యాణదుర్గం డిఇ రంగస్వామి, మురళీధర్‌లు గుంతకల్లు, కళ్యాణదుర్గంలో కార్యాలయాన్ని తెరచుకుని, జిల్లా కేంద్రానికి వచ్చినపుడు టిఏ, డిఏలను తీసుకున్నారని తెలిపారు. వీరిద్దరిని విధుల నుండి తొలగిస్తూ సొంత శాఖకు పంపుతున్నామని తెలిపారు. విధులకు రాకుండా ఉన్న ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు రఘునాథ్, రాఘవేంద్రలను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయశంకర్‌కు చార్జిమెమోను జారీ చేశారు. అనంతపురం ఎస్‌ఎస్‌ఏలోని ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారి పనితీరును మార్చుకుని పిల్లలకు న్యాయం చేయాలని ఆదేశించారు.