అనంతపురం

వ్యాపారుల గుండెల్లో రైళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 20 : నకిలీ ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను అరికట్టడంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖకు చెందిన ప్రత్యేక బృందం జిల్లాలో ఆకస్మిక దాడులు చేపట్టింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా నకిలీ పత్తి విత్తనాల విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్, డైరెక్టర్ల ఆదేశాల మేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గుంటూరుకు చెందిన వ్యవసాయ ఉప సంచాలకులు లక్ష్మణకుమార్, సహాయ సంచాలకులు రమణరావుతో కూడిన ప్రత్యేక బృందం, జిల్లా సస్యరక్షణ విభాగం ఎడిఎ జి.విద్యావతితో కలిసి మంగళవారం జిల్లాలోని ఎరువులు, పురుగు మందులు, విత్తనాల డీలర్ షాపుల్లో ఆకస్మిక దాడులు నిర్వహించింది. తాడిపత్రితోపాటు గుత్తి డివిజన్‌లోని పెద్దవడుగూరు, గుత్తి ప్రాంతాల్లోని దుకాణాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా షాపులు నిర్వహిస్తున్న వైనం వెలుగు చూసింది. కాగా ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. ఆకస్మిక తనిఖీలతో సంబంధిత వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు జిల్లాలో ఈ ఆకస్మిక తనిఖీలు కొనసాగనున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తొలిరోజు తాడిపత్రి రెండు, పెద్దవడుగూరులో రెండు దుకాణాల్లోని రూ.80 లక్షల విలువైన పత్తి, మొక్కజొన్న విత్తనాలను సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమించి విత్తనాలు విక్రయిస్తున్నట్లు తేలడంతో అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఇదిలా ఉండగా తాడిపత్రిలో ఓవైపు అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తుండగానే మరోవైపు వ్యాపారులు 20 దుకాణాలు బంద్ చేసి వెళ్లిపోవడం గమనార్హం. దీంతో వారందరికీ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా దుకాణాల్లో ఎక్కడైనా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారా? అనే అంశాన్ని పరిశీలించారు. అలాగే లైసెన్సులు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల స్టాక్ రికార్డులు సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా?, రైతులకు బిల్లులు ఇస్తున్నారా? బస్తాల్లో తూకం తక్కువగా ఉందా? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధరల సూచికలను చాలా మంది ఏర్పాటు చేయకపోవడాన్ని తనిఖీ బృందం గుర్తించింది. కొందరైతే లైసెన్సుల రెన్యూవల్ అయినప్పటికీ సకాలంలో వాటిని తీసుకుని వెళ్లకుండానే అనధికారికంగా దుకాణాలు నిర్వహిస్తూ విక్రయాలు చేస్తుండటం వెలుగుచూసింది. అంతేకాకుండా దుకాణాల డోర్ నంబర్లు కూడా పెద్దక్షరాలతో కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయలేదని తేలింది. దీంతో సదరుదుకాణాలపై చర్యలు తీసుకోవడంతో పాటు తప్పుల్ని సరిదిద్దుకోవాలని హెచ్చరించారు. కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అధిక ధరలకు అమ్ముతుండటంతోపాటు బిల్లులు ఇవ్వాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా జెడి శ్రీరామమూర్తి మాట్లాడుతూ అధికారులు ఆకస్మిక తనిఖీలకు వచ్చిన సమయంలో ఎవరైనా తమ దుకాణాలను మూసి వేసి వెళ్తే శాఖా పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా ప్రతి కొనుగోలుపై కచ్చితంగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాల్లోనూ ఈ-పోస్ విషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించామన్నారు. అన్ని దుకాణాల్లోనూ ఈ-పోస్ మిషన్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపామని, ఇప్పటి వరకు మొత్తం 190 వరకు ఈ-పోస్ మిషన్లు వచ్చాయని తెలిపారు. వీటిని అనంతపురం, తాడిపత్రి, గుత్తి డివిజన్ పరిధిలోని దుకాణాలకు అందజేశామన్నారు. ఈ మిషన్లు ముంబై నుంచి రావాల్సి ఉందని, తాము పంపిన ఇండెంట్ మేరకు దశల వారీగా రానున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఈ-పోస్ మిషన్లు ఏర్పాటు చేసిన దుకాణదారులు తప్పని సరిగా వాటి ద్వారానే రైతులకు బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. ఫిర్యాదులొస్తే నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఇప్పటి వరకు 12,000 మెట్రిక్ టన్నుల బోరాన్, జిప్సం, జింక్ సల్ఫేట్ సరఫరా అయిందని, వీటిని రైతులకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. పంపిణీ పూర్తయ్యే కొద్దీ దశల వారీగా జిల్లాకు సరఫరా అవుతుందని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.