అనంతపురం

కొత్త ఎస్పీ అశోక్‌కుమార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూన్ 20 : విజయవాడ డిసిపిగా పని చేస్తున్న జివిజి అశోక్‌కుమార్ జిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్పీ రాజశేఖర్‌బాబు చిత్తూరుకు బదిలీ అయ్యారు. రాష్టవ్య్రాప్తంగా ఐపిఎస్‌లను బదిలీ చేస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా అశోక్‌కుమార్ జిల్లా ఎస్పీగా నియమించారు. కాగా రాజశేఖర్‌బాబు 24-07-2014లో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. మూడు సంవత్సరాల పాటు జిల్లాలో విధులు నిర్వహించారు. ఈసమయంలో శాఖాపరంగా పోలీస్ సిబ్బంది సంక్షేమంతోపాటు శాంతిభద్రతలకు ఎనలేని కృషి చేశారు. అంతేగాకుండా అవినీతి పోలీసులు, సిబ్బందిపై ఎప్పటికప్పుడు ఉక్కుపాదం మోపుతూ వచ్చారు. నేరాలు, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడానికి కఠిన చర్యలు చేపట్టారు. అదే సమయంలో లోపాయికారిగా అతినీతి అక్రమాలకు పాల్పడ్డాన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఇకపోతే కొత్త ఎస్పీగా బాధ్యతలు చేపట్టినున్న అశోక్‌కుమార్ జిల్లాకు సుపరిచితులే. ఈయన 1999 నుంచి 2001 వరకూ అనంతపురం డిఎస్పీగా పని చేశారు. ఈనేపథ్యంలో త్వరలో ఎస్పీగా జిల్లాకు రానున్నారు. ఈయన మంచి పోలీస్ అధికారిగా పేరున్న అశోక్‌కుమార్ ఎస్పీగా జిల్లాకు రావడం పట్ల హర్షణీయమని పోలీసు అధికారులు అంటున్నారు.
ఇంకా కురవాలి
* సాగుకు చాలని వర్షం
* ఇప్పటి వరకు 55.8 మి.మీ నమోదు
* వరుణుడి రాక కోసం రైతుల ఎదురుచూపు

అనంతపురం, జూన్ 20 : నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. ఇప్పటి వరకు ఖరీఫ్ వేరుశెనగ విత్తనం సాగుకు తగినంత వర్షం కురవపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే అరకొర వర్షానికే జొన్న, కంది సా గుకు చాలా మంది మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం సబ్సిడీ విత్తన వేరుశెనగ కాయల్ని కొనుగోలు చేసిన రైతులు వాటిని ఒలిచి సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే వర్షం వస్తుందో, రాదోనన్న సందిగ్ధంలో ఉండటంతో పంట వేసేందుకు వెనుకాడుతున్నారు. తొలుత విత్తన కా యలు కొనుగోలు చేసిన వారు మి నహా ఐదారు రోజుల నుంచి విత్తన కాయలు కొనుగోలుపై రైతులు ఆసక్తి చూపలేదు. జిల్లాలో 4.1882 లక్షల సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలు పంపిణీ చేయాలన్నది లక్ష్యం కాగా, గతనెల 24 నుంచి మంగళవారం వర కు 2,66,155 మంది రైతులకు 3,06, 881.4 క్వింటాళ్లు పంపిణీ చేశారు. మరో వారంరోజుల పాటు విత్తన పంపిణీ కొనసాగనుందని వ్యవసాధికారులు తెలిపారు. అయినా లక్ష్యం మేరకు విత్తన కాయలను రైతులు కొనుగోలు చేసే పరిస్థితి కనిపించలేదు. ఓవైపు విత్తన కాయల నాణ్యత కొరవడటంతోపాటు మరోవైపు వర్షం రాకపోవడంతో విత్తనాల కొనుగోలుకు రైతులు ముందుకు రానట్లు తెలుస్తోంది. మంగళవారం ఒక్క రోజే 3,940 మంది రైతులకు 4,488.9 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాన్ని మాత్రమే పంపిణీ చేశారు. దీన్నిబట్టి రైతులు విత్తన కాయల కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈనెలలో 63.9 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉన్నా, ఇప్పటి వరకు 55.8 మి.మీ నమోదైంది. గణాంకాల మేరకు జూన్ 20న నమోదయ్యే సాధారణ వర్షపాతం కన్నా 10.5 మి.మీ అధికంగా నమోదైంది. ఈనెల 19న 5.7 మి.మీ వర్షం కురిసింది. మంగళవారం కేవలం 2.7 మి.మీ మాత్రమే పడింది. పెద్ద వడుగూరులో అధికంగా 22.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 63 మండలాల్లో 0.0 మి.మీ నుంచి 2.5 మి.మీ వరకు 28 మండలాల్లో వర్షం పడింది. కేవలం 4 మండలాల్లో మాత్రమే 5.0 నుంచి 10.0 మి.మీ సాధారణ వర్షం కురిసింది. గోరంట్ల, పెనుకొండ, డి.హీరేహాళ్, బెళుగుప్ప, కణేకల్లు, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం, శెట్టూరు, తాడిమర్రి, బత్తలపల్లి, రాప్తాడు, కనగానపల్లి, కంబదూరు, నంబులపూలకుంటలో అసలు వర్షం ఊసే లేదు. తాడిపత్రి, పెద్దవడుగూరు, కళ్యాణదుర్గం, యల్లనూరు, తనకల్లు, కదిరిలో 0.1 నుంచి 1.0 మి.మీ. వరకు మాత్రమే తుంపర్లుగా వర్షం పడింది. ఈ పరిస్థితుల్లో రైతులు వేరుశగన సాగుపై తర్జనభర్జన పడుతున్నారు. పెట్టుబడులు నష్టపోయే కంటే ప్రత్నామ్నాయ పంటలు వేసుకోవడం మంచిదని ఆలోచిస్తున్నారు. కొందరైతే మొండి ధైర్యంతో వేరుశనగ పంట సాగుకు పొలాలు సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. పదును వర్షం పడినా నేలలో విత్తనాలు చల్లేందుకు సమాయత్తమవుతున్నారు. మరోవైపు సబ్సిడీపై పంపిణీ చేస్తున్న నవ ధాన్యాలను మంగళవారం 1187 మంది 2,101 కిట్స్‌ను తీసుకెళ్లారు. పంపిణీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 33,801 మంది రైతులకు 54,428 కిట్స్‌ను వ్యవసాయ శాఖ పంపిణీ చేసింది.
కంపోస్ట్ యార్డ్‌కు స్థలం పరిశీలన
అనంతపురంటౌన్, జూన్ 20: నగరంలో టన్నులకొద్ది చెత్త చెదారాలు వెలువడుతుండటంతో వాటిని నిల్వ చేసే కంపోస్ట్ యార్డుకై కార్పొరేషన్ అధికారులు స్థలానే్వషణ జరుపుతున్నారు. జెఎన్‌టియు సమీపంలో వంద ఎకరాల మున్సిపల్ కార్పొరేషన్ స్థలం ఉంది. 2003లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కింద కేంద్ర పొల్యూషన్ బోర్డ్ ఈ స్థలాన్ని ఎంపిక చేసింది. దేశంలోనే పైలెట్ ప్రాజెక్ట్ కింద సాలిడ్‌వేస్ట్ మేనేజ్‌మెంట్‌ను అనంతలో నిర్వహించాలని సంకల్పించినా అటు తర్వాత అటకెక్కింది. ఇదే అదనుగా కార్పొరేషన్ అనుమతి లేకుండానే రాప్తాడు రెవెన్యూ శాఖ అధికారులు ఇందులో పలువురికి పట్టాలు జారీ చేశారు. దీనితో మిగతా స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో కంపోస్ట్ యార్డును పండమేరులో ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. కొన్ని రోజులపాటు చెత్త చెదారాలను తరలించి తర్వాత నిలిపివేశారు. ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో పండమేరులోని మున్సిపల్ స్థలాన్ని కలెక్టరేట్‌తోపాటు వివిధ ప్రభుత్వ శాఖలకై ధారాదత్తం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ చర్యను సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ స్థలాన్ని ప్రభుత్వ శాఖలకు ఇచ్చి వేస్తే కంపోస్ట్‌యార్డు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కోల్పోతామని సభ్యులు హెచ్చరించారు. అంతేకాకుండా తిరుపతి కార్పొరేషన్ తరహాలో కంపోస్ట్ యార్డుకు ఉన్న స్థలాన్ని పోగొట్టుకుని లేని స్థలం కోసం పరుగులు తీయాల్సి ఉంటుందని సూచించారు. ప్రస్తుతం గుత్తి రోడ్డులో 12 ఎకరాల స్థలంలో ఉన్న కంపోస్ట్‌యార్డు నగర అవసరాలను తీర్చలేకుండా పోతోంది. దీనితో అత్యవసరంగా కంపోస్ట్‌యార్డును సువిశాల ప్రాంతంలో ఏర్పాటుచేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇందిరమ్మ గృహాల కింద అప్పట్లో కామారుపల్లిలో ఎంపిక చేసిన స్థలాన్ని కంపోస్ట్‌యార్డు కోసం మంగళవారం కమిషనర్ పివివిఎస్.మూర్తి, ఎసిపి ఇషాక్, ఎన్విరాన్‌మెంట్ డిఇఇ సురేంద్రనాథ్ తదితరులు పరిశీలించారు. అయితే కంపోస్ట్‌యార్డుకు వెళ్ళే రహదారిలో ప్రైవేట్ వ్యక్తుల స్థలాలు ఉండటంతో వాటికి పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనితో ఆలమూరు గ్రామం వద్ద ఎర్రగొండ రహదారి ప్రక్కనే సర్వే నం.502, 503,504, 594 స్థలాలు కంపోస్ట్ యార్డుకు అనుకూలంగా ఉండటం గుర్తించారు. దీనితో కంపోస్ట్ యార్డుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపటానికి నివేదికలు సిద్ధం చేయాలని కమిషనర్ పివివిఎస్.మూర్తి స్థల పరిశీలన తర్వాత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
కసాపురం ఆలయ ఆదాయానికి
గండికొట్టే చర్యలు మానుకోవాలి
* భజరంగ్‌దళ్ రాయలసీమ కన్వీనర్ మంజుల వెంకటేష్
గుంతకల్లు, జూన్ 20 : శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ ఆదాయానికి గండికొట్టే చర్యలను అధికారులు మానుకోవాలని భజరంగ్‌దళ్ రాయలసీమ కన్వీనర్ మంజుల వెంకటేష్ సూచించారు. మంగళవారం స్థానిక గోపాలకృష్ణ్భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయంలో తలనీలాలకు నిర్వహించిన టెండర్లలో అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. గతంలో తలనీలాల టెండర్లు నిర్వహించినప్పుడు 1.40 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది నిర్వహించిన టెండర్లలో కేవలం 90.50 లక్షలకే టెండర్లను ఓకే చేయడం ద్వారా సుమారు రూ.50 లక్షల మేర గండి పడిందన్నారు. ఈఏడాది మార్చి 30న టెండర్లను నిర్వహించిన ఏప్రిల్ మొదటి వారంలో అధికారులకు అనుకూలమైన వ్యక్తికి కట్టబెట్టారన్నారు. ఇంత పెద్దఎత్తున ఆలయంలో చోటు చేసుకుంటున్న అవకతవకలపై పాలక మండలి సభ్యులు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. ఏకపక్షంగా టెండర్లను కట్టబెట్టడంపై ట్రస్టు బోర్టు సభ్యులు ఆలయ ఆదాయానికి గండికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరోసారి టెండర్లు పిలిచి ఆలయ ఆదాయం పెంపునకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా గతేడాది తలనీలాల టెండర్లను కైవసం చేసుకున్న ఓ మహిళా కాంట్రాక్టర్ దాదాపు రూ. 45 లక్షల మేర బకాయి ఉందన్నారు. అయితే వీటిపై అధికారులు కానీ, పాలక మండలి సభ్యులు కానీ నోరు మెదపకుండా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారన్నారు. ఆలయ ఆదాయానికి గండి కొట్టే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కసాపురం నాయకులు సి.రవి, హనుమాన్ చాలిసా నాయకులు రవీంద్ర, నాయకులు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
వేతన సవరణ చేయాలి
* బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల ధర్నా
అనంతపురం కల్చరల్, జూన్ 20: బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు తమకు వేతన సవరణ వెంటనే చేయాలంటూ ప్రధాన కార్యాలయం ధర్నా చేపట్టారు. ప్రభుత్వరంగ సంస్థల ఎగ్జిక్యూటివ్స్‌కు జనవరి 1, 2017 నుండి వేతన సవరణపై నియమింపబడిన మూడవ వేతన కమిటీ లాభాలు వచ్చే ప్రభుత్వరంగ సంస్థల్లో వాటి లాభాన్ని బట్టి 15, 10, 5 శాతం ఫిట్‌మెంట్ బెనిఫిట్‌తో వేతన సవరణకు సిఫార్సు చేసిందని, నష్టాలు వచ్చే ప్రభుత్వరంగ సంస్థల్లో వేతన సవరణకు సిఫార్సు చేయలేదని నాయకులు పేర్కొన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ యూనియన్ల అసోసియేషన్ల పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టినట్లు తెలిపారు. జనవరి 1 నుండి వేతన సవరణ చేయాలని, అదేవిధంగా రిటైరైన వారికి పెన్షన్ సవరణ అమలుచేయాలని, పెన్షన్ కంట్రిబ్యూషన్‌ను బేసిక్ పే పై లెక్కించాలన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌లో డైరెక్ట్‌గా రిక్రూట్ అయిన వారికి 30 శాతం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలుచేయాలని, బిఎస్‌ఎన్‌ఎల్‌లో ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు నిషేధించే 8.5.2017 ఆర్డరు రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎన్‌ఇ సర్కిల్ అధ్యక్షులు విశ్వనాథ్, జిల్లా కార్యదర్శి లింగమయ్య, జిల్లా అధ్యక్షులు రాజశేఖరరెడ్డి, బిఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లారుూస్ యూనియన్ కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ ఖాదర్, జిఎం వెంకటనారాయణ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పథకాలపై బిజెపి నేతల ప్రచారం
హిందూపురం టౌన్, జూన్ 20 : కేంద్రంలోని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై మంగళవారం మున్సిపల్ పరిధిలోని 116, 117వ బూత్‌లలో బిజెపి నాయకులు, బూత్ కమిటీ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు రమేష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎన్‌సి ఆదర్శ్‌కుమార్, సీనియర్ నాయకులు కట్టా వెంకట్రాం మాట్లాడుతూ బిజెపిని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్‌ధన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల్ వికాస్ యోజన, స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా తదితర పథకాలపై వివరించారు. అనంతరం కార్య విస్తారక్ యోజన కరపత్రాలు, స్టిక్కర్లను ఇంటింటా అతికించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమలేష్, నారాయణప్ప, యువ కిషోర్, దేవరాజు, సాయి, కిశోర్, రమేష్, నాగరాజు పాల్గొన్నారు.

కనీస వేతనాలు అమలు చేయాలని
సత్యసాయి నీటి పథకం కార్మికుల భిక్షాటన
గార్లదినె్న, జూన్ 30 : 20 సంవత్సరాలుగా సత్యసాయి నీటి పథకంలో పనిచేస్తున్నా కనీస వేతనాలు అమలు చేయలేదని వెంటనే వేతనాలు పెంచాలని కోరుతూ మండల పరిధిలోని కల్లూరులో కార్మికులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని గ్రామాలకు నీటిని సరఫరా చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. అయినా తమకు కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. వారంరోజులుగా కార్మికులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా తమను పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఇప్పటికైనా స్పందించి కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మహబూబ్‌బాషా, నాగభూషణం, రాముడు, విజయ్, నాగవర్థన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తనిఖీ
గుంతకల్లు, జూన్ 20 : పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ మీనాకుమారి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వసతులు, రోగులకు వైద్య చికిత్సలు, వైద్యుల కొరత, సిబ్బంది కొరత తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించారు. ముఖ్యంగా 108 సిబ్బంది వాహనంలోని వైద్యసదుపాయాల నిర్వహణపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవసరమైన వసతులపై ప్రభుత్వానికి నివేదికలను అందజేస్తామని తెలిపారు. అనంతరం మండలంలోని నాగసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నల్లదాసర పల్లిలో చంద్రన్న సంచార చికిత్స వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న పరికరాల పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. ఈకార్యక్రమంలో పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కమలమ్మ, డాక్టర్ గంగన్న, రవికుమార్, మల్లికార్జునరెడ్డి, జోతిర్మయి, మండల వైద్యాధికారి అనీల్‌కుమార్, పిహెచ్‌సి వైద్యాధికారి రోహినాథ్, సూపర్‌వైజర్ సూర్యనారాయణ, సిబ్బంది చంద్రశేఖర్‌రెడ్డి, అరుణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కూరగాయలు సాగు చేయండి
* హార్టికల్చర్ డిడి సుబ్బరాయుడు

అనంతపురం, జూన్ 20 : జిల్లాలోని రైతులు అధిక విస్తీర్ణంలో దశలవారీగా కూరగాయల పంటలు సాగు చేసుకోవాలని ఉద్యానశాఖ డిడి సుబ్బరాయుడు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా రైతులందరూ పంటల పరిరక్షణ పనుల్లో ఉన్నారన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ‘ప్లాంటిక్స్’ యాప్‌ను ప్రతి రైతూ వినియోగించుకుని పంటలను కాపాడుకునేందుకు ముందుకు రావాలని కోరారు. చాలా మంది రైతులు కూరగాయలు, ఆకుకూరల సాగును ఒకేసారి వేస్తుండటం వల్ల మార్కెట్లో ధర తగ్గిపోతుందన్నారు. కనుక రైతులు ఒకరిని చూసి మరొకరు ఏకకాలంలో అధిక విస్తీర్ణంలో సాగు చేయవద్దని కోరారు. ఎక్కువ విస్తీర్ణంలో సాగు భూములున్న రైతులు ఏడాదిలో కనీసం మూడు దఫాలుగా సాగు చేయడం వల్ల గిట్టుబాటు ధరలు లభించడంతో పాటు పంట నష్టాలు తగ్గించుకోవచ్చన్నారు. ఉద్యాన పంటలను రైతులు అధిక మొత్తంలో సాగు చేయాలని కోరారు. ఈ ఏడాది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు కొత్త పంటల సాగు, ఇదివరకే వేసిన పంటల రక్షణకు చర్యలు చేపట్టడం, సాగు నీటి అవసరాలు తీర్చడం, పండ్ల తోటల రైతులకు శిక్షణలు వంటివి కొనసాగిస్తామని చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
* ఐదుగురికి తీవ్రగాయాలు
గుత్తి, జూన్ 20 : మండలంలోని కొత్తపేట గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దవడుగూరు మండలం మిడ్తూరు గ్రామానికి చెందిన ప్రశాంతకుమార్ (13) మృతి చెందాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు పెద్దవడుగూరు మండలంలో మిడ్తూరుకు చెందిన మనోహర్, నాగలక్ష్మి సమీప బంధువులతో కలసి ప్యాపిలి మండలంలో మేడిచర్ల గ్రామంలో జరుగుతున్న శుభకార్యంలో పాల్గొనడానికి డీజిల్ ఆటోలో బయలుదేరారు. ఆటో కొత్తపేట వద్దకు రాగానే డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రశాంతకుమార్ అదుపుతప్పి ఆటో కింద పడిపోవడంతోపాటు ఆటో బోల్తా పడింది. దీంతో ప్రశాంత్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ రామంజినేయులు, శ్యామలమ్మ, స్నేహా, వనజ, హరిత తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుణిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుత్తి పోలీసులు తెలిపారు.
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
శెట్టూరు, జూన్ 20 : మండల కేంద్రంలో బోయ గౌతమి (25) మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గౌతమికి మూడునెలల క్రితం కర్నాటకలోని యాదిగుంట గ్రామానికి చెందిన తిప్పేస్వామితో వివాహం అయింది. అయితే మూడు సంవత్సరాలుగా కడుపునోప్పితో తీవ్రంగా బాధపడుతుండేదని, పలుమార్లు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ తగ్గకపోయే సరికి జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
అనంతపురం అర్బన్, జూన్ 20 : నగర సమీపంలోని నేషనల్ పార్కు సమీపంలో కొండపల్లి శివకృష్ణ (26) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పెద్దవడుగూరుకు చెందిన శివకృష్ణ గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతుండేవాడు. ఎక్కడ చూపించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం పార్కు సమీపంలోకి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు త్రిటౌన్ పోలీసులు తెలిపారు.

చంద్రన్న బీమా పంపిణీ చేసిన మేయర్
అనంతపురంటౌన్, జూన్ 20: చంద్రన్న బీమా కింద లబ్ధిదారులకు మంగళవారం ఛాంబర్‌లో మేయర్ స్వరూప చెక్కులు అందచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కృష్ణమూర్తి, టిపిఆర్‌ఓ మనోరమ, సి.ఓలు పాల్గొన్నారు.
బిజెపిలోనే అన్ని వర్గాలకు గుర్తింపు
అనంతపురం సిటీ, జూన్ 20: భారతీయ జనతా పార్టీలో అన్ని వర్గాలకు గుర్తింపు లభిస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగంరెడ్డి అంకాల్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక బిజెపి జిల్లా కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంకాల్‌రెడ్డి మాట్లాడుతూ బిజెపి రాష్టప్రతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటించడం ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అట్టడుగు వర్గాల వారిని రాష్టప్రతిగా చేయడంతో దేశంలోని అన్ని వర్గాల వారిని బిజెపి గుర్తించిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, రూప, పగడాల శ్రీనివాసులు, జూటూరు సోమయ్య, అశోక్‌రెడ్డి, గోవిందు, సత్యనారాయణరావు పాల్గొన్నారు.
బదిలీల వెరిఫికేషన్‌లో తప్పులు లేకుండా చేయాలి
అనంతపురం సిటీ, జూన్ 20: ఉపాధ్యాయ బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయుల దరఖాస్తులను తప్పులు లేకుండా వెరిఫికేషన్ చేయాలని డిఇఓ పి.లక్ష్మినారాయణ ఎంఇఓలకు సూచించారు. మంగళవారం స్థానిక సైన్సు సెంటర్ నందు బదిలీలపై ఎంఇఓలతో డివిజన్ల వారీగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ ఉపాధ్యాయ బదిలీలకు దరఖాస్తులను ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాలని తెలిపారు. ఉపాధ్యాయులకు అందాల్సిన పాయింట్లును సరిచూడాలని తెలిపారు. అందులో ఎలాంటి పొరపాట్లు రాకుండా చూడాలని ఆదేశించారు.
మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
పామిడి, జూన్ 20: మైనార్టీల అభ్యున్నతికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తోందని ఈక్రమంలో ముస్లింలు రంజాన్ పండుగను ఆనందంగా గడుపుకోవాలన్న ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంజాన్ తోఫాను అందిస్తున్నారని నరగ పంచాయతీ చైర్మెన్ గౌస్‌పీర, తహశీల్దార్ రమణారెడ్డి పేర్కొన్నారు. స్థానిక మడికట్ల ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని ప్రభుత్వ చౌకధాన్యం డిపోలో మంగళవారం రంజాన్ తోఫా సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మెన్ ఎం.హెచ్.లక్ష్మినారాయణరెడ్డి, కౌన్సిలర్ మహాబూబ్‌బాషా, బిసి సెల్ కార్యదర్శి బాబావలి, మైనార్టీ నాయకులు హుసేన్ పీర, జాఫర్, విఆర్‌ఓ ఆంజనేయులు, డీలర్లు పాల్గొన్నారు.

ప్రత్యేక ప్యాకేజి నిధులు
రాయలసీమ అభివృద్ధికి కేటాయించాలి

అనంతపురం కల్చరల్, జూన్ 20: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన సందర్భంగా కేటాయించిన ప్రత్యేక ప్యాకేజి నిధులను రాయలసీమ అభివృద్ధికి కేటాయించాలని రాయలసీమ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఎగ్గడి మల్లయ్య పేర్కొన్నారు. ఈమేరకు నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు రాయలసీమ కరవుపై మల్లయ్య పోరు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం అత్యంత వెనుకబడిందని, అభివృద్ధిలో రాయలసీమ పట్ల పాలకులు నిర్లక్ష్యం వహించారన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరందించాలన్నారు. పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. గుంకల్లును రైల్వే జోన్‌గా ఏర్పాటుచేయాలని, రాయలసీమ జిల్లాల్లో హైకోర్టును ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో రైతుల నుండి సేకరించే భూములకు ఎకరానికి రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. పోరు దీక్షకు పలు సంఘాల నాయకులు హాజరై మద్దతు ప్రకటించారు. వీరిలో కాంగ్రెస్ శంకర్, ఎపి ఎమ్మార్పీఎస్ నాయకులు ఎంఎస్.రాజు, ఎస్సీ సంక్షేమ సంఘం చామలూరు రాజగోపాల్, బికెఎస్.ఆనంద్, ప్రకాష్, మధుప్రసాద్, నిసార్ అహ్మద్, గిరిజన నాయకులు కేశవనాయక్, మల్లికార్జున నాయక్ తదితరులు ఉన్నారు. పోరు దీక్షకు మద్దతుగా మహిళలు పాల్గొన్నారు.