అనంతపురం

ఎన్‌టిఆర్ స్ఫూర్తితో సమగ్రాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 15 : నందమూరి తారక రామారావు స్ఫూర్తితో జిల్లాను సమగ్రాభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నట్లు మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో జిల్లాస్థాయి పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టర్ జి.వీరపాండ్యన్, ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను హార్జికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. రైతు రుణమాఫీలో భాగంగా రెండు విడతల్లో ఉపశమనం కింద రూ.2వేల 728 కోట్ల మంజూరు కాగా, రూ.1,479 కోట్లు రూ.5లక్షల39 వేల మంది రైతులకు సంబంధించిన 8 లక్షల 7 వేల ఖాతాల్లో జమ చేశామన్నారు. 2016 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన 6.50 లక్షల మంది రైతులకు రూ.1,032.42 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేసినట్లు తెలిపారు. మరో 5.07 లక్షల మంది రైతులకు రూ.419 కోట్ల వాతావరణ ఆధారిత పంటల బీమా సొమ్మును ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోతున్న వేరుశెనగ పంటకు రక్షక తడులు ఇచ్చేందుకు 5,897 రెయిన్‌గన్లు, 5,496 స్ప్రింక్లర్లు, 4.18 లక్షల నీటి సరఫరా పైపులు, 4,306 ఆయిల్ ఇంజన్లు అందుబాటులో ఉంచామన్నారు. అలాగే 5.47 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు 1.13 లక్షల క్వింటాళ్ల కంది, జొన్న, పెసర, అలసంద తదితర విత్తనాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించిందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.20 కోట్లతో 3,272 వ్యవసాయ పనిముట్లు, 564 ట్రాక్టర్లను కేటాయించామని మంత్రి వెల్లడించారు. దేశంలోనే 2.31 లక్షల హెక్టార్లలో బిందు, తుంపర సేద్యంతో పంటలు సాగు చేసిన జిల్లాగా దేశంలోనే ప్రథమ స్థానం ఉన్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.222 కోట్లతో 31,750 హెక్టార్లలో సూక్ష్మ సేద్యంతో పంటలు సాగుకు రైతులందరికీ సూక్ష్మ సేద్య పరికరాలను మంజూరు చేసి వందశాతం డ్రిప్ వాడే జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. హంద్రీనీవా ద్వారా జిల్లాకు గరిష్టంగా నీటిని అందించే లక్ష్యంతో ముచ్చుమర్రి పంపింగ్ స్టేషన్ నుంచి జీడిపల్లి రిజర్వాయర్ వరకు కాలు వెడల్పునకు రూ.1030 కోట్లతో పనులు కొనసాతున్నాయన్నారు. ఏటా కరవుతో కునారిల్లుతున్న రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల పరిధిలోని భైరవానితిప్ప ప్రాజెక్టుకు జీడిపల్లి జలాశయం నుంచి కృష్ణా జలాలు అందించేందుకు రూ.1,171 కోట్లతో సమగ్ర ప్రదిపాదనలు పంపామన్నారు. రూ.813 కోట్ల అంచనాతో పేరూరు ప్రాజెక్టును రాప్తాడు నియోజకవర్గానికి సాగునీరందించేందుకు ప్రతిపాదించామని చెప్పారు. తుంగభద్ర ఎగువ కాలువ రాష్ట్ర సరిహద్దు వద్ద 4,200 క్యూసెక్కుల నీటిని ప్రవహింపజేసేందుకు రూ.463.50 కోట్లతో ప్రధాన కాలువ పనులు కొనసాగుతుండగా, ఇప్పటికే 60 శాతం పనులు రూ.274 కోట్లతో పూర్తయ్యాయన్నారు. రూ.293 కోట్లతో గుంతకల్లు బ్రాంచి కాలువ ఆధునికీకరణ పనులు, రూ.509 కోట్లతో మిడ్ పెన్నార్ దక్షిణ కాలువ పనులు త్వరలో చేపడతామని మంత్రి వెల్లడించారు. జిల్లాను పొగ రహిత జిల్లాగా తీర్చిదిద్దామని, ఇందుకు కృషి చేసిన కలెక్టర్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ గృహాలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేగవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. 2019వ సంవత్సరం ద్వితీయార్థంలో కియా మోటార్ల పరిశ్రమ ఉత్పత్తుల్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరవు విపత్తు నిర్వహణ కింద మంజూరైన రూ.15 కోట్లు, నాన్ సిఆర్‌ఎఫ్ కింద రూ.4.5 కోట్లు తాగునీటి సమస్యల పరిష్కారానికి వినియోగిస్తున్నట్లు చెప్పారు. అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు, కళ్యాణదుర్గం పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.1108 కోట్లు, కళ్యాణదుర్గం, గుత్తి, పామిడి, పుట్టపర్తి పట్టణాల్లో సమగ్ర మంచినీటి పథకాల కోసం రూ.321 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వైకుంఠం ప్రభాకరచౌదరి, హనుమంతరాయచౌదరి, గోనుగుంట్ల సూర్యనారాయణ, విప్ యామినీ బాల, ఎమ్మెల్సీలు శమంతకమణి, కత్తినరసింహారెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికార, పుర ప్రముఖులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, నగర ప్రజలు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ఉట్టి ఉత్సవం..
* ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
అనంతపురం కల్చరల్, ఆగస్టు 15: శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నగరంలో ఘనంగా జరుపుకున్నారు. ఇస్కాన్ ఆలయంతోపాటు నగరంలోని సుభాష్ రోడ్‌లో గల వేణుగోపాల స్వామి ఆలయం, తపోవనం సాయి బాబా ఆలయం, జడ్పీ ఎదురుగా గల సాయి గీతా మందిరం, యాదవ సంఘం ఆధ్వర్యంలో రాంనగర్‌లోని యాదవ భవన్, మూడో రోడ్డు ఉడిపి శ్రీకృష్ణమందిరం తదితర ఆలయాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇస్కాన్ ఆలయంలో విశ్వశాంతి యజ్ఞము, విష్ణుసహస్రనామ స్తోత్రం, హరినామ సంకీర్తన, తులసి అర్చన, తదితర పూజలు చేశారు. సాయంత్రం నిర్వహించిన ఉట్టి ఉత్సవంలో ఉట్టి కొట్టేందుకు పోటీపడ్డారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అదేవిధంగా తపోవనం సాయిబాబా ఆలయంలో చిన్నారులకు శ్రీకృష్ణ వేషధారణ గావించి, ఉట్టి ఉత్సవం నిర్వహించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో నగరంలో ఊరేగింపు నిర్వహించారు. సాయి సంస్థ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలోని నవజాత శిశువులకు వారికి అవసరమైన దుస్తులు ఉచితంగా పంపిణీ చేశారు.
ఆకట్టుకున్న శకటాలు అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
అనంతపురం కల్చరల్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం జెండా పండుగను నగరంలోని పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ మైదానంలో జిల్లా అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర మంత్రి కాలవ శ్రీనివాసులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మువ్వనె్నల జెండాను ఆవిష్కరించారు. మంత్రి పరేడ్ మైదానంలో వాహనంలో తిరుగుతూ ప్రజలందరికీ అభివాదం చేశారు. అనంతరం సాయుధ దళాలు, పోలీసు, ఎన్‌సిసి దళాల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందేశం అనంతరం స్వాతంత్య సమర యోధుడు శ్యామమూర్తిని మంత్రి శాలువాతో సత్కరించారు. మంత్రి అధికారులు శాంతి కపోతాలను ఎగరేశారు. న్యూ ఇండియా నూతన అనంతపురం పుస్తకాన్ని ఆవిష్కరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు తమ అభివృద్ధిని వివరిస్తూ ఏర్పాటు చేసిన శకటాలను ప్రదర్శించాయి. వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ, పౌరసరఫరాలు, డిఆర్‌డిఎ, డ్వామా, అటవీ, ఉద్యాన, గృహనిర్మాణ, వైద్య ఆరోగ్య, ఎస్సీ కార్పొరేషన్, పోలీసు, అగ్నిమాపక శాఖలు శకటాలను ప్రదర్శించాయి. అదేవిధంగా వివిధ శాఖలు తమ పథకాలను వివరిస్తూ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. కాగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు దేశభక్తి గీతాలను అనునయిస్తూ చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. కూడేరు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినులు మా తుజే సలామ్... వందేమాతరం అంటూ నృత్యం చేయగా, విశ్వభారతి ఇంగ్లీషు మీడియం హైస్కూల్ విద్యార్థులు మా చల్లని తల్లికి వందేమాతరం.. అంటూ నృత్యం చేశారు. అదేవిధంగా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ గార్లదినె్న విద్యార్థినులు దేశ్ హమారా దేశ్, అక్షర ఇంగ్లీషు మీడియం హైస్కూల్ విద్యార్థులు స్వర్గం కన్నా మిన్నా నేను జన్మించిన ఈనేల అంటూ నృత్యం ప్రదర్శించారు. ఆర్డీటీ విద్యార్థులు స్వతంత్ర భారత దినోత్సవం అనే గీతానికి, విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు జయహో అంటూ అదరగొట్టారు. ఈకార్యక్రమాల్లో కలెక్టర్ వీరపాండ్యన్, ఎస్పీ అశోక్ కుమార్, జెసి రమామణి, జెసి-2 ఖాజా మొహిద్దీన్, ట్రైనీ కలెక్టర్ వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ శమంతకమణి, కత్తి నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రభాకర చౌదరి, వరదాపురం సూరి, మేయర్ స్వరూప, వడ్డెర ఫెడరేషన్ చైర్మన్ దేవళ్ల మురళి, ఆర్డీడీ డైరెక్టర్ మాంఛోఫెర్రర్, మల్లారెడ్డి, డా.అక్బర్ తదితరులతో పాటు వివిధ శాఖల అధికారులు, అనధికారులు, పాఠశాలల విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
ట్రాక్టర్ బోల్తా..యువకుడి మృతి
గుత్తి, ఆగస్టు 15 : కర్నూలు జిల్లా సరిహద్దు మండలం జొన్నగిరి సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి ఎర్రగుడి గ్రామానికి చెందిన నాగరాజు మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసే నాగరాజు విధి నిర్వహణలో భాగంగా మంగళవారం జొన్నగిరి సమీపంలోని గుట్టల్లో ట్రాక్టర్‌లో గుండ్లను తీసుకురావడానికి వెళ్తుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడిక్కడే మృతి చెందాడు. ఘటనపై జొన్నగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గొంతు కోసుకున్న విద్యార్థి
హిందూపురం టౌన్, ఆగస్టు 15 : స్థానిక సూరప్పకట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న సూరి కుమారుడు ప్రభుకుమార్ (16) మంగళవారం సాయంత్రం బ్లేడ్‌తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు నెల రోజుల క్రితం ప్రభుకుమార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు సుమో వాహనంలో తీసుకెళ్లి గార్లదినె్న సమీపంలో వదిలేసి పోయారన్నారు. అప్పటి నుండి ప్రభుకుమార్ కళాశాలకు వెళ్లకుండా వింతగా ప్రవర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం ఇంటి పైగదిలోకి వెళ్లి బ్లేడ్‌లో గొంతు కోసుకున్నట్లు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుకుమార్ స్థానిక ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.
ఒకని ఆత్మహత్య
ఓబుళదేవరచెరువు, ఆగస్టు 15 : మండల పరిధిలోని వడ్డివారిపల్లికి చెందిన శివశంకర్(35) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. వివరాల మేరకు శివశంకర్ డిగ్రీ వరకు చదువుకుని మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో శివశంకర్ తహశీల్దార్ కార్యాలయం ముందు అర్జీలు రాసుకుని జీవనం సాగించేవాడు. మంగళవారం జీవితం పై విరక్తి చెంది బాబాసాహెబ్‌పల్లి రహదారి వద్ద సోలార్ టవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వ్యక్తి దారుణహత్య
కొత్తచెరువు, ఆగస్టు 15 : కొత్తచెరువులో మంగళవారం రాత్రి పచ్చికారం సాయి(35) దారుణ హత్యకు గురయ్యాడు. కొత్తచెరువులోని విజయనగర కాలనీ సమీపంలో సాయిని గుర్తు తెలియని వ్యక్తులు బండ రాళ్లతో మోది హత్య చేసారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివరాలు తెలియాల్సి వుంది.
నెట్టికంటికి బంగారు వితరణ
గుంతకల్లు, ఆగస్టు 15 : కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామికి చెన్నైకి చెందిన సంజీవ వరప్రసాద్ మంగళవారం 370 గ్రాముల బంగారు నేత్రాన్ని వితరణ చేశాడు. గతంలో గుంతకల్లు రైల్వే డివిజనల్ అదనపు మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించిన సంజీవ ప్రసాద్ పదవీ విరమణ చేశారు. అయితే మంగళవారం సతీసమేతంగా వచ్చి బంగారం అందజేశారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం రూ. 2 లక్షల విలువైన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ ఇఓ ముత్యాలరావు, ట్రస్టు బోర్డు అధ్యక్షురాలు సుగుణమ్మ, సభ్యులు పాల్గొన్నారు.

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
హిందూపురం టౌన్, ఆగస్టు 15 : హిందూపురం పట్టణ, పరిసర ప్రాంతాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో మువ్వనె్నల పతాకాన్ని ఎగురవేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం, ఎంజిఎం ఉన్నత పాఠశాలలో మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, కోర్టు ఆవరణలో అదనపు జిల్లా జడ్జి రామచంద్రమూర్తి, వన్‌టౌన్, టూటౌన్ పోలీసుస్టేషన్‌లో సిఐలు ఇదుర్‌బాషా, మధుభూషణ్, ప్రభుత్వాసుపత్రిలో అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జెఇ వెంకటస్వామి, సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, ఐసిడిఎస్ కార్యాలయంలో సిడిపిఓ నాగమల్లేశ్వరి, ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ ప్రతాప్‌రెడ్డి, రెవెన్యూ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ మైనుద్దీన్ జాతీయ జెండా ఎగురవేశారు. వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో వెయ్యి అడుగుల జాతీయ జెండా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముస్లింలు స్థానిక అల్‌హిలాల్ పాఠశాల నుండి జాతీయ జెండాను చేతబట్టి జామీయా మసీదు వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎంఎఫ్ రోడ్డులోని సరస్వతీ విద్యామందిరంలో గోవిందరాజులు, వంశీకృష్ణ జాతీయ జెండా ఎగురవేశారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు హెచ్‌ఎంలు నారాయణరెడ్డి, కమలాకాంత్ బహుమతులు అందచేశారు. స్థానిక పాంచజన్య బ్రిలియంట్స్ పాఠశాలలో అధ్యక్షులు పిఎస్ శ్రీనివాసులు జాతీయ జెండా ఎగురవేసి విద్యార్థినిల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అల్‌హిలాల్ పాఠశాలలో మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్‌ఘనీ, డాక్టర్ బివి ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేసారు. పాఠశాల అధ్యక్షులు అతావుల్లా, కమిటీ సభ్యులు రషీద్, హెచ్‌ఎం అక్బర్‌షరీఫ్, ఆరీఫ్ పాల్గొన్నారు. స్థానిక రైల్వే పాఠశాలలో ఎడిఎన్ భరత్‌తివారి జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో శేఖర్, సతీష్‌రెడ్డి, కిరణ్‌కుమార్, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎస్‌డిజిఎస్ కళాశాలలో కళాశాల కమిటీ అధ్యక్షులు పివిఆర్ కుమార్, కార్యదర్శి అనిల్‌కుమార్ జాతీయ జెండాను ఎగురవేసి ఎన్‌సిసి క్యాడేట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రిలో 68 మంది రక్తదానం చేసినట్లు సంఘం ప్రతినిధులు రమేష్‌గౌడ్, శ్రీకాంత్‌గౌడ్, వడ్డె నవీన్ తెలిపారు.
పరిగిలో...
పరిగి : మండలంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర కళాశాలల్లో, కార్యాలయాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ సుబ్బారెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ బాలమునెయ్య, పోలీసుస్టేషన్‌లో ఎస్సై శరత్‌చంద్ర, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జడ్పీటీసీ సూర్యనారాయణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు ఆదిశేషు, కొడిగెనహళ్లి పంచాయతీ కార్యాలయంలో సర్పంచు క్రిష్టప్పలు మువ్వనె్నల జెండాను అవిష్కరించారు.
రొళ్లలో...
రొళ్ల : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ లక్ష్మానాయక్, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి జిఎస్ పాండురంగప్ప, పిహెచ్‌సిలో డాక్టర్ దివాకర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మురళీ జూనియర్ కళాశాలలో జడ్పీటీసీ విఎం పాండురంగప్ప, బాలాజీ ఉన్నత పాఠశాలలో విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కల్లప్ప జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిడిఓ సరస్వతీ, ఎంఇఓ శ్రీ్ధర్, ఎపీటీసీలు పాల్గొన్నారు.
హిందూపురం రూరల్‌లో...
హిందూపురం రూరల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి సుభద్రమ్మ, పంచాయతీల పరిధిలోని పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాల్లో హెచ్‌ఎంలు, సర్పంచ్‌లు జెండా ఎగురవేశారు. ఎపిహెచ్‌బి కాలనీ పాఠశాలలో విద్యార్థులకు హిందూపురం లక్కీ రెస్టారెంట్ నిర్వాహకులు రఘు, జ్యోతిల ఆధ్వర్యంలో పలకలు పంపిణీ చేసినట్లు హెచ్‌ఎం ఓబుళేసు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీలక్ష్మి, జడ్పీటీసీ ఆదినారాయణ, ఎపీటీసీలు, సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అమరాపురంలో...
అమరాపురం: మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకం రెపరెపలాడింది. స్థానిక పోలీసుస్టేషన్‌లో ఎస్సై వెంకటస్వామి, రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ రాంశేఖర్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ రాంనాథ్, గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ రాజేశ్వరి జాతీయ జెండా ఎగురవేశారు. వి.అగ్రహారం పాఠశాలలో మూడు అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన విద్యార్థులకు ఈరన్న, హనుమంతరాయప్ప ఆధ్వర్యంలో యూనిఫారం, గ్లాసులు పంపిణీ చేశారు. వీరాపురం పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు.
గుడిబండలో...
గుడిబండ: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి సన్నీరప్ప, ఉన్నత పాఠశాలలో జడ్పీటీసీ శ్రీనివాసమూర్తి, రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ మోహన్‌దాస్, పోలీసుస్టేషన్‌లో ఎస్సై ఖాజాహుసేన్, గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ పద్మజ, వ్యవసాయ కార్యాలయంలో ఎఓ బాలానాయక్, పశు వైద్యశాలలో చంద్రశేఖర్‌రెడ్డి, పిహెచ్‌సిలో కమిటీ చైర్మన్ శివకుమార్ జెండా ఆవిష్కరించారు.
అగళిలో...
అగళి: మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ నరసింహమూర్తి, పోలీసుస్టేషన్‌లో ఎస్సై రాంబాబు, రెవెన్యూ కార్యాలయంలో హనుమంతరాయప్ప, జడ్పీహెచ్‌ఎస్‌లో సర్పంచ్ శివలింగప్ప, మోడల్ పాఠశాలలో ఎంఇఓ గోపాల్, విజ్ఞాన భారతి పాఠశాలలో హెచ్‌ఎం చిరంజీవి జాతీయ జెండా ఎగురవేశారు.
చిలమత్తూరులో...
చిలమత్తూరు: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ ఇబ్రహీంసాబ్, పోలీసుస్టేషన్‌లో ఎస్సై జమాల్‌బాషా, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ శివానందనాయక్, వ్యవసాయ కార్యాలయంలో ఏఓ శ్రీలత, వెలుగు కార్యాలయంలో ఎపిఎం నారాయణ, పిహెచ్‌సిలో వైద్య సిబ్బంది, కోడూరు సింగిల్‌విండో కార్యాలయంలో అధ్యక్షులు నరసింహారెడ్డి, కొడికొండ ఉన్నత పాఠశాలలో ఎంపిపి నౌజియాభాను తదితరులు జాతీయ జెండా ఆవిష్కరించారు.
సోమందేపల్లిలో...
సోమందేపల్లి: స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిపి వరలక్ష్మి, రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ జయరాములు, పోలీసుస్టేషన్‌లో ఎస్సై ప్రసాద్, సింగిల్‌విండో కార్యాలయంలో అధ్యక్షులు డివి ఆంజనేయులు, పిహెచ్‌సిలో డాక్టర్ ఆదిమూర్తి, ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం శేషగిరిరావు, ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం రజనీకాంత్‌రెడ్డి, విజ్ఞాన ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం మల్లికార్జున, క్రీస్తు జ్యోతి ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం ప్రసాద్ జెండా ఎగురవేశారు.
గోరంట్లలో...
గోరంట్ల: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఎంపి నిమ్మల కిష్టప్ప జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎంపిపి విద్యాధరణి, తహశీల్దార్ మసూద్‌వలీ జాతీయ జెండాను ఎగురవేశారు. విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో పలువురు పదవీ విరమణ ఉద్యోగులను సన్మానించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ ఇందిరమ్మ, ఎంపిడిఓ ఆజాద్, డాక్టర్ బండిరాజా పాల్గొన్నారు.
లేపాక్షిలో...
లేపాక్షి: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ ఆనంద్‌కుమార్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి హనోక్, పోలీసుస్టేషన్‌లో ఎస్సైశ్రీ్ధర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ బాలప్ప, ఓరియంటల్ పాఠశాలలో జడ్పీటీసీ ఆదినారాయణరెడ్డి, లేపాక్షి పంచాయతీ కార్యాలయం, పశు వైద్యశాలలో సర్పంచ్ జయప్ప, కస్తూరిబా పాఠశాలలో ఎంఇఓ నాగరాజు, జవహర్ నవోదయ విద్యాలయలో ప్రిన్సిపాల్ భాస్కర్‌కుమార్, గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ కదిరప్ప జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎపీటీసీలు చిన్నఓబన్న, చలపతి, నాగభూషణ, ఎన్‌ఎస్‌ఎస్ పిఓ నాగరాజు పాల్గొన్నారు.
మడకశిరలో...
మడకశిర : స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గుండుమల ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ తిప్పేస్వామి, ఎమ్మెల్యే ఈరన్న జాతీయ జెండా ఆవిష్కరించారు. సర్కిల్ కార్యాలయంలో సిఐ శుభకుమార్, కోర్టులో మెజిస్ట్రేట్ రమేష్‌నాయుడు, ఆర్‌అండ్‌బి, మండల పరిషత్, సిడిపిఓ, మండల విద్యాశాఖ, గృహ నిర్మాణ, నగర పంచాయతీ కార్యాలయాల్లో డిఇ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపిపి భొజ్జప్ప, ఇందిరాదేవి, ఎంఇఓ నరసింహరాజు, డిఇ రంగనాయకులు, చైర్మన్ శరణ్య, డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ సుబ్బయ్య, జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు సత్యవరప్రసాద్, రాధాకృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ, ఆర్‌డబ్ల్యుఎస్, అగ్నిమాపక శాఖ కార్యాలయాల్లో ఎడి మల్లికార్జున, డిఇ మోహన్, ఫైర్ ఆఫీసర్ విజయకుమార్, వైబి హళ్లి ఉన్నత పాఠశాలలో జడ్పీటీసీ సులోచనమ్మ, ప్రభుత్వాసుపత్రిలో కమిటీ చైర్మన్ నరసింహారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.
వైభవంగా శ్రీకృష్ణ తులాభారం
హిందూపురం టౌన్, ఆగస్టు 15 : స్థానిక చిన్న మార్కెట్ సర్కిల్‌లో వెలసిన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీకృష్ణ తులాభారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా మూలవిరాట్‌ను రుక్మిణి, సత్యభామ వేణుగోపాలస్వామి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. మూల విరాట్‌కు ఎదురుగా త్రాసును ఉంచి ఓవైపు ఉత్సవ విగ్రహాలు మరో వైపు భక్తులు కానుకలు సమర్పించేలా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 10 ఏళ్ళ లోపు చిన్నారులకు శ్రీకృష్ణ వేషధారణ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. మహా మంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతోపాటు దేవాదాయ శాఖ అధికారి కె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా చాముండేశ్వరి దేవి వార్షికోత్సవ పూజలు
హిందూపురం టౌన్, ఆగస్టు 15: పట్టణంలోని శాంతినగర్‌లో వెలసిన చాముండేశ్వరి దేవాలయంలో మంగళవారం వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్ దేవరాజు ఆధ్వర్యంలో తెల్లవారుఝాము నుంచే వినాయకుడు, కాశీవిశే్వశ్వరుడు, కుక్కే సుబ్రమణ్యస్వామి మూల విరాట్‌లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ఆవరణలో చాముండేశ్వరి హోమం నిర్వహించారు. మహా మంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలు పంపిణీ చేశారు.
సృజనాత్మకతను వెలికితీసేందుకే పోటీలు
హిందూపురం టౌన్, ఆగస్టు 15 : యువతలో దాగి ఉన్న సృజనాత్మకత, దేశభక్తిని వెలికితీసేందుకు అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం అభినందనీయని వక్తలు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు మంగళవారం రాత్రి బహుమతులు ప్రదానం చేశారు. ఫౌండేషన్ ఛైర్మన్ అంబికా లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర బిసి కార్పోరేషన్ ఛైర్మన్ పామిశెట్టి రంగనాయకులు, మున్సిపల్ ఛైర్‌పర్సన్ రావిళ్ళ లక్ష్మి, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జెఇ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే అబ్ధుల్‌ఘనీ పాల్గొన్నారు. అనంతరం సంగీతం, నృత్యం, వ్యాసరచన, వక్తృత్వ తదితర పోటీల్లో గెలుపొందిన విజేతలకు మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందచేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు బలరామిరెడ్డి, ఈశ్వర్‌రెడ్డిలతోపాటు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
ఆడిటోరియం ప్రారంభం
గోరంట్ల, ఆగస్టు 15 : మండల పరిధిలోని పాలసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గూడూరు సత్యనారాయణ ఎడ్యుకేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో రూ.2 లక్షలతో నిర్మించిన ఆడిటోరియంను ట్రస్టు ప్రతినిధులు వెంకటేష్, భ్రమరాంబ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గూడూరు వెంకటేష్ కుటుంబం సొంత ఊరిని మరవకుండా పలు విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దిలీప్‌కుమార్, బాలరాజు, జయచంద్రారెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుండి తపాలా ఉద్యోగుల సమ్మె
హిందూపురం టౌన్, ఆగస్టు 15 : గ్రామీణ తపాలా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుండి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు నాయకులు శ్రీరాములు నాయక్, నరసింహులు, ప్రభాకర్ తెలిపారు.