అనంతపురం

జడ్పీ పీఠంపై నాగరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 22 : ఎట్టకేలకు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని గుమ్మఘట్ట జడ్పీటీసీ పూల నాగరాజు అధిరోహించారు. శుక్రవారం స్థానిక జడ్పీ సభా భవనంలో జరిగిన ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో 21వ చైర్మన్‌గా నాగరాజు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల నిబంధనల మేరకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారిణి టికె.రమామణి చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. టిడిపికి చెందిన 40, స్వతంత్ర జడ్పీటీసీ యశోదాబాయి, వైకాపాకు చెందిన మరో ఆరుగురు హాజరయ్యారు. మొత్తం 63 మంది జడ్పీటీసీలు ఉండగా చైర్మన్ ఎన్నుకోవడానికి 50 శాతం సభ్యుల మద్దతు అంటే 32 మందితో ఉండాల్సి ఉండగా 47 మంది హాజరయ్యారు. ఎన్నికలో జిల్లా మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఎమ్మెల్యేలు బికె.పార్థసారధి, అత్తార్ చాంద్‌బాషా, ఉన్నం హనుమంతరాయుడు, ఎమ్మెల్సీలు గుండుమల తిప్పేస్వామి, శమంతకమణి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ప్రచార కార్యదర్శి బివి వెంకటరాముడు, పలువురు టిడిపి నేతలు హాజరయ్యారు. స్థానిక సంస్థల సభ్యులకు పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించకపోవడంతో వైకాపాకు చెందిన రాయదుర్గం, కదిరి, ఆత్మకూరు, వజ్రకరూరు, బత్తలపల్లి, తాడిమర్రి జడ్పీటీసీలు నాగరాజుకు మద్దతుగా ఎన్నికలో పాల్గొన్నారు. కాగా మాజీ చైర్మన్ చమన్ హాజరు కాకపోవడం విశేషం. ఈ సందర్భంగా జడ్పీ డిప్యూటీ సిఇఓ సూర్యనారాయణ ఎన్నికల నిబంధనల్ని చదివి వినిపించారు. అనంతరం పూల నాగరాజు నామినేషన్ దాఖలు చేశారు. రెండో నామినేషన్ ఎవరూ వేయకపోవడంతో నాగరాజు నామినేషన్ నిబంధనల మేరకు ఉండటం(వ్యాలీడ్)తో ఏకగ్రీవం చేయవచ్చని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి టికె.రమామణి ప్రకటించారు. దీంతో ఎన్నికల నిబంధనల మేరకు నాగరాజు పేరును అనంతపురం రూరల్ జడ్పీటీసీ వేణుగోపాల్ ప్రతిపాదించగా, హిందూపురం జడ్పీటీసీ కెఎల్ ఆదినారాయణ బలపర్చారు. అనంతరం ధ్రువీకరణ పత్రం అందజేసి, చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు పార్టీ నేతలు నాగరాజుకు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు.
ఇదొక వరం..
* జడ్పీటీసీ పూల నాగరాజు

అనంతపురం, సెప్టెంబర్ 22 : ‘నాకు దక్కి న ఈ పదవి ఒక వరం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవలందిస్తా’ అని నూతనంగా ఎన్నికైన జడ్పీ చైర్మన్ పూల నాగరాజు అన్నారు. చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, సహకరించిన జిల్లా మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, పార్టీ అధ్యక్షుడు బికె.పార్థసారధి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, నాయకులు, ఎన్నికలు సజావుగా సాగడానికి కృషి చేసిన జడ్పీ కార్యాలయం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా మాజీ చైర్మన్ చమన్ చైర్మన్ ఛాంబర్‌లో కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. సాయంత్రం నాగరాజు స్వయానా మంత్రి సునీత ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు.

‘దుర్గం’కు తొలిసారి జడ్పీ పీఠం

అనంతపురం, సెప్టెంబర్ 22 : తొలిసారిగా రాయదుర్గం నియోజకవర్గానికి జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠం దక్కింది. రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మఘట్ట జడ్పీటీసీ పూల నాగరాజు 21వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారి పాలనలోనే జిల్లా బోర్డుగా ఉన్న జిల్లా పరిషత్ స్వాతంత్య్రానంతరం జిల్లా పరిషత్‌గా, జిల్లా ప్రజా పరిషత్‌గా రూపాంతరం చెందింది. నాగరాజు ఎన్నికతో అనంతపురం, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పాత, కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపు అన్ని ప్రాంతాలకూ ప్రాతినిథ్యం లభించినట్లయింది. జిల్లా బోర్డుగా ఏర్పడిన తొలినాళ్లలో మొట్టమొదటి అధ్యక్షుడిగా జి.లక్ష్మీరెడ్డి ఎన్నికయ్యారు. 1929 మార్చి 12 నుంచి 1934 సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈయనే అధ్యక్షుడిగా వ్యవహరించారు. అనంతరం పాముదుర్తి బయపరెడ్డి, ఎ.రాయప్ప, కెవి వేమారెడ్డి, పైడి లక్ష్మయ్య, ఎ.చితంబరరెడ్డి అధ్యక్షులుగా 1941 ఏప్రిల్ 1 నుంచి 1962 ఏప్రిల్ 22 వరకు పని చేశారు. జిల్లా పరిషత్‌గా మార్పు జరిగిన తర్వాత 1962 ఏప్రిల్ 23 నుంచి 1964 సెప్టెంబర్ 10 వరకు తొలి అధ్యక్షుడిగా జెసి నాగిరెడ్డి పని చేశారు. అనంతరం 1964 సెప్టెంబర్ 11న టి.రామచంద్రారెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం వైసి తిమ్మారెడ్డి, జి.నరిపిరెడ్డి, డి.రెడ్డప్పరెడ్డి, పి.లింగరాజు, బికె.పార్థసారథి, కెసి నారాయణ (ఇన్‌చార్జి), జొన్నా సూర్యనారాయణ 2004 జూలై 25 వరకు అధ్యక్షులుగా కొనసాగారు. తర్వాత జిల్లా ప్రజా పరిషత్‌గా మారింది. ఈ సమయంలో ఇన్‌చార్జి అధ్యక్షుడిగా సి.ఓబిరెడ్డి వ్యవహరించారు. తర్వాత జిల్లా పరిషత్‌గా మారిన సమయంలో 2005 ఫిబ్రవరి 4న జి.తిప్పేస్వామి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అనంతరం టిడిపి, కాంగ్రెస్ మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తోపుదుర్తి కవిత అధ్యక్షురాలయ్యారు. మళ్లీ జిల్లా ప్రజా పరిషత్‌గా మారిన నేపథ్యంలో 2014 జూలై 5న చమన్ అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేశారు. తిరిగి ప్రస్తుతం పూల నాగరాజు జడ్పీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకూ ప్రాధాన్యత ఇచ్చినట్లయింది.