అనంతపురం

అమ్మో..ఆంత్రాక్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, అక్టోబర్ 20 : ఆంత్రాక్స్ వ్యాధితో ప్రజలు భయందోళన చెందుతున్నారు. ఆంత్రాక్స్ వ్యాధి ప్రబలుతున్నట్లు వదంతులు వ్యాపించడంతో గోరంట్ల, చిలమత్తూరు, పాలసముద్రం తదితర ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గోరంట్ల మండలం చెట్లమొరంపల్లిలో ఆంత్రాక్స్ వ్యాధి సోకి 58 గొర్రెలు, మేకలు మృతి చెందాయి. మృతి చెందిన గొర్రెల మాంసం తిని ఐదుగురికి వ్యాధి లక్షణాలు కనిపించాయి. తాజాగా శుక్రవారం చిలమత్తూరు మండలంలో మరో ఇద్దరికి ఆ వ్యాధి లక్షణాలు కనిపించాయి. చిలమత్తూరు మండల పరిధిలోని వడ్డిచెన్నంపల్లి, కొడికొండకు చెందిన ఇద్దరి శరీర భాగాలపై బొబ్బలు రావడంతో స్థానికులు ఆంత్రాక్స్‌గా భావించారు. వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స నిర్వహించగా అనుమానించిన వైద్యులు అనంతపురం తరలించారు. అయితే అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆంత్రాక్స్ కాదని, చర్మవ్యాధి సోకినట్లు పేర్కొన్నట్లు తెలుస్తోంది. చెట్లమొరంపల్లిలో వైద్య శిబిరం కొనసాగుతోంది. కాగా దీపావళీ పండుగ తర్వాత గ్రామాల్లో సాధారణంగా పెద్దఎత్తున పాడ్యమి జరుపుకోవడం ఆనవాయితీగా. అయితే ఆంత్రాక్స్ వ్యాధి భయంతో చెట్లమొరంపల్లితోపాటు పరిసర గ్రామాల్లో ప్రజలు శుక్రవారం పాడ్యమికి ప్రజలు దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం గోరంట్లలో మాంసం విక్రయ దుకాణాలను అధికారులు పూర్తిగా మూయించారు. అదేవిధంగా పశువుల సంతను సైతం రద్దు చేశారు. కేవలం చికెన్ దుకాణాలు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇకపోతే లేపాక్షి మండలం మానేపల్లికి చెందిన ఓ విద్యార్థికి రెండేళ్ల క్రితం ఆంత్రాక్స్ వ్యాధి సోకి ప్రాణాపాయ స్థితికి చేరుకోగా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంగా డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. అప్పట్లో సమీపంలోని కర్నాటక చింతలపల్లిలో చెట్ల మొరంపల్లి తరహాలో ఆంత్రాక్స్ వ్యాధి సోకిన గొర్రెల మాంసం తినడంతో ఆ విద్యార్థికి కూడా వ్యాధి సోకినట్లు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మళ్లీ ఈ ప్రాంతంలో ఆంత్రాక్స్ వ్యాధి ప్రబలుతున్నట్లు వదంతులు వ్యాపిస్తుండటంతో ప్రజలు తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు.
60 ఏళ్ల వరకు ‘ఆంత్రాక్స్’ క్రిమి
* కర్ణాటక నుంచి గొర్రెల తరలింపు నిషేధం
* గొర్రెలకు వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వండి : జెడి ఎహెచ్

అనంతపురం, అక్టోబర్ 20 : నాలుగేళ్ల క్రి తం జిల్లాలోని లేపాక్షి మండలంలో ఆంత్రా క్స్ బయట పడింది. అనంతరం ఈఏడాది గోరంట్ల, చిలమత్తూరు మండలాల్లో వెలుగు చూస్తోంది. ఇందులో భాగంగా పశు సంవర్ధక శాఖ అధికారులు వ్యాధి లక్షణాలను వివరించారు. ఆంత్రాక్స్ ఓసారి బయట పడితే ఈ వ్యాధికి సంబంధించి క్రిమి సుమారు 50 నుంచి 60 ఏళ్ల పాటు భూమిలో జీవించి ఉంటుందని అంటున్నారు. ఈ వ్యాధి లక్షణాలున్న గొర్రెలు తీవ్రమైన కడుపు నొప్పితో హఠాత్తుగా మృత్యువాత పడతాయి. వాటి ముక్కు, ముడ్డి వెంట రక్తం కారుతుంటుంది. మృత్యు చెందిన తర్వాత కూడా బొట్లుబొట్లుగా రక్తం పడుతుంటుంది. ఈ లక్షణాలతో మృత్యువాత పడిన గొర్రెలను లోతైన గోతిలో ఖననం చేయాలని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చనిపోయిన గొర్రెల చర్మం ఒలవడంగానీ, మాంసాన్ని తినడం గానీ చేయరాదని హెచ్చరిస్తున్నారు. చర్మం కోసం దానిని ఒలిచినపుడు చేతులకు వ్యాధి క్రిములు అంటుకుని శరీరంలోకి చేరుతాయన్నారు.
ఆంత్రాక్స్ లక్షణాలుంటే సమాచారమివ్వండి..
- జిల్లా పశు సంవర్ధకశాఖ జెడి బి.సన్యాసిరావు
జిల్లాలో ఎక్కడైనా గొర్రెలకు ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి. గోరంట్ల మండలంలో బయట పడిన ఈ వ్యాధి ప్రస్తుతం అదుపులో ఉంది. వ్యాధి సోకిన వ్యక్తులు మరణాలు నమోదు కాలేదు. వ్యాధిబారిన పడిన గొర్రెల మాంసాన్ని ఎవరూ భుజించరాదు. వ్యాపారులు, గొర్రెల కాపరులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజారోగ్య రక్షణకు సహకరించాలి. ప్రస్తుతం కర్ణాటక నుంచి గొర్రెల వలసలను నివారించాం. కర్ణాటకలోని సరిహద్దు మండలాలు, ప్రాంతాల వైద్యులు, పశు వైద్యులతో మాట్లాడాం. పరస్పరం సమాచారాన్ని చేరవేసుకుని ఆంత్రాక్స్‌పై నిఘా ఉంచాం.

ఎక్కడ చూసినా చెత్త దిబ్బలే!
* అనంతలో లోపించిన పారిశుద్ధ్యం * కంపు కొడుతున్న కాలువలు, వంకలు
* రోగాలబారిన పడుతున్న జనం.. * పట్టించుకోని అధికారులు
అనంతపురంటౌన్, అక్టోబర్ 20: నగరంలో ఎటు చూసినా చెత్తచెదారం. తగినంత మేర సిబ్బంది ఉన్నారు. అవసరమైన చెత్త తరలించే ట్రాక్టర్లు, డివిజన్లలో అవసరమైనన్ని ట్రాలీలు, ట్రిప్పర్లు, డంపర్ బిన్ తరలించే క్రేన్, స్వీపింగ్ యంత్రం. పర్యవేక్షక అధికారులుగా ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్, హెల్త్ఫాసర్, డిప్యూటీ కమిషనర్, కార్పొరేషన్ కార్యదర్శి, శానిటరీ సూపర్‌వైజర్, శానిటరీ ఇనస్పెక్టర్లు, మేస్ర్తిలు పనిచేస్తున్నారు. అయినా ఎటు చూసినా చెత్తాచెదారమే. ఈ నగరానికేమైందన్న ప్రశ్న అటు అధికారులు, ఇటు ప్రజల మెదళ్ళను చెదపురుగులా తొలచివేస్తోంది. అసలు ఏం జరుగుతోందని అధికారులను ఇటీవల జరిగిన సమావేశంలో నిలదీయటం జరిగింది. సమావేశంలో మాత్రం సలహాలు బాగా చెబుతారు. ఆచరణలో మాత్రం చేతలు కనిపించటం లేదు. సిబ్బంది తీరు మాటలు ఘనం చేతలు శూన్యంగా ఉంటున్నాయని కమిషనర్ పివివిఎస్‌ఎన్ మూర్తి వ్యాఖ్యానించారు. ట్రాక్టర్లు, ట్రిప్పర్లు, ఆటోలు, డంపర్‌ట్రాలీకి డీజిల్ బిల్లులు బాగా వస్తున్నాయి. కాని డీజిల్ బిల్లులు చెల్లించిన నిష్పత్తిలో చెత్త తరలించగలిగితే ఫలితం ఉంటుందని అన్నారు. చెత్తతరలింపు సరిగా జరగకున్నా డీజిల్ బిల్లులలో మాత్రం పెరుగుదల కనిపిస్తోంది. చెత్తట్రాక్టర్లకు, ట్రిప్పర్లకు జిపిఎస్ పరికరాలు అమర్చటం జరిగింది. కార్పొరేషన్ ట్రాక్టర్లు, 14 అద్దె ట్రాక్టర్లు, ఆటోలు, ట్రిప్పర్లు కలిపితే దాదాపుముఫైకిపైగా చెత్త తరలింపువాహనాలు పనిచేస్తున్నాయి. రోజుకు ప్రతి వాహనం మూడు ట్రిప్పుల చెత్త తరలిస్తే నగరం పరిశుభ్రంగా కనిపిస్తుంది. ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించటం లేదు. కాని నగరంలో చెత్త మాత్రం తరగటం లేదు. ఉదయం డివిజన్లలో పర్యటించినపుడు చూస్తే ఏ సందు చూసినా, ఏ కూడలి చూసినా ‘అనంత’ నగరం చెత్తచెదారాలతోనే నిండిపోయి కనిపిస్తోంది. వంకలు, కాలువలు నిరంతరాయంగా శుభ్రం చేస్తున్నా చెత్తచెదారాలతో దర్శనమిస్తున్నాయి. దీనిపై ప్రజారోగ్య సిబ్బంది జవాబు మరోలా ఉంది. గతంలో ప్రస్తుతం ఉన్న సిబ్బందే పనిచేస్తున్నారు. అప్పుడు ఉదయం డివిజన్లలో పనిచేసినవారిని మధ్యాహ్నం గ్యాంగ్‌వర్క్ చేయించటం జరిగేదంటున్నారు. దీనివలన చెత్తచెదారం తొలగించటం, వాటిని తరలించటం సాధ్యపడేదని పేర్కొంటున్నారు. ప్రస్తుత పాలకవర్గం వచ్చిన తర్వాత కార్మికులను డివిజన్లకు ఆరుగురు లేదా ఎనిమిది మంది వంతున కేటాయించటం జరిగిందన్నారు. అలాగే వాహనాలను కూడా డివిజన్లవారీగా కేటాయించారు. ఆయా డివిజన్ల ప్రజాప్రతినిధులు వారికి కేటాయించిన వర్కర్లను మధ్యాహ్నం గ్యాంగ్‌వర్క్ తీసుకెళ్ళటానికి అనుమతించటం లేదు. అలాగే ఆయా డివిజన్‌కు కేటాయించిన చెత్త ట్రాక్టర్ లేదా ట్రిప్పరును ఎట్టి పరిస్థితిలో తీసుకెళ్ళకుండా అడ్డుతగులుతుండటంతో తాము నిస్సహాయులుగా మారిపోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్ ప్రతినిధులు సహకరించనిదే తామేమి చేయలేమని అన్నారు. ప్రతి డివిజన్ ఒక్కో దేశం అన్నట్లుగా వ్యవహరించటం మూలాన ఈ నగరం చెత్తమయంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం. నగరంలోని చెత్తను రౌండ్ ది క్లాక్ తరలించేలా చర్యలు చేపడితేకాని అనంతను చెత్తరహితంగా మార్చలేమని సిబ్బంది ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. అలాగే ట్రాక్టర్లు, ట్రిప్పర్లు, వర్కర్లను ప్రస్తుతం ఉన్న డివిజన్ ప్రతినిధులకు ఉన్న కేటాయింపు విధానాన్ని రద్దు చేస్తేనే చెత్తనగరంగా మారిన అనంతను చెత్తరహితంగా మార్చటానికి వీలవుతుందని వారు సూచించారు. అయితే పాలకవర్గం, డివిజన్ ప్రతినిధులను కాదని వ్యవహరిస్తే కోరి కొరివి పెట్టుకున్నట్లు అవుతుందన్న భావనతో ఉన్నతాధికారులు ఈ చర్చను సమావేశంలో చర్చకు మాత్రమే పరిమితం చేస్తూ ముందుకు సాగిపోతుండటంతో ఎవరూ ఏమి చేయలేక మిన్నకుండిపోతున్నారు.