అనంతపురం

వలసలను ప్రోత్సహిస్తున్న యాత్రలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, అక్టోబర్ 21: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకని అధికార, ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన కార్యక్రమాలు వలసలను ప్రోత్సహిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇరుపార్టీల నేతలు ఆయా గ్రామాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న ఇతర పార్టీల వారికి గాలం వేసి తమ పార్టీ కండువాలు కప్పుతున్నారు. ఇంటింటికీ తెలుగుదేశం అని ఓ వైపు అధికార పార్టీ.. మరోవైపుగడప గడపకూ వైయస్‌ఆర్ అని ప్రతిపక్ష పార్టీ.. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నామని ఇరు పార్టీలు చెప్తున్నాయి. అయితే రెండు పార్టీలు సమస్యల పట్ల స్పందించి ప్రజలకు న్యాయం చేయడంకన్నా తమ ప్రత్యర్థి పార్టీ నుంచి ఎవడొస్తే వాణ్ణి లాగెయ్ అనే ధోరణితో ముందుకెళ్తున్నాయ్ అనే విమర్శల దుమారం రేగుతోంది. జిల్లాలోని 14 నియోజక వర్గాల్లోనూ రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ పూర్తిస్థాయిలో గెలుపొందాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తోంది. అందుకోసం ప్రతిపక్ష వైసీపీలో చురుగ్గా వుండి పార్టీ మనుగడకు ప్రధాన భూమిక పోషిస్తున్న నాయకులను తమ పార్టీలోకి తీసుకోవడానికి అన్ని దారుల్లోనూ ప్రయత్నాలు కొనసాగిస్తుండటం గమనార్హం. ఇందులో భాగంగానే జిల్లా స్థాయిలోనే కాకుండా ప్రతి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లోని చురుకైన నాయకులకు గాలం వేయడం, తమ పార్టీ కండువా కప్పేయడమే పనిగా ముందుకెళ్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రతిపక్ష వైసీపీ జిల్లాలో గత ఎన్నికల్లో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందినప్పటికీ ఆ ఇద్దరి శాసన సభ్యుల్లో ఒకరు టిడిపి తీర్థం పుచ్చుకోవడం వైసీపీకి కోలుకోలేని దెబ్బే పడిందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీ చేబడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లోని తప్పిదాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల పక్షాన పోరాడటంకంటే ఆ పార్టీ కూడా అధికార పార్టీలోని నాయకులను తమ పార్టీలోకి లాక్కోవడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఇంటింటికీ తెలుగుదేశం పార్టీలో ఏ గ్రామంలోనైనా కొంతమంది వైసీపీ నాయకులు టీడీపి తీర్థం పుచ్చుకున్నారని వార్తలొస్తే మరుసటి రోజే అదే గ్రామానికి చెందిన టీడీపి నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారని వార్తలొస్తుండటం గమనార్హం. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన పాలకులు ఇంటింటికీ అంటూ ఏవైనా గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడి సమస్యలు వినిపించడానికి వస్తే ఆ ప్రజాప్రతినిధి చుట్టూ వుంటున్న చోటా నాయకులు సమస్యలు విన్నవించడానికి వచ్చిన వారందరూ వైసీపీకి చెందిన వారేనంటూ తోసేయడం, కొందరిపై దాడులు చేయడం కూడా జరుగుతోంది. అలాంటి వారికి తోడుగా వుండాల్సిన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు ఎలాంటి సహకారం అందజేయకపోవడంతోపాటు కేసుల వరకూ పోతే మన పార్టీ అధికారంలో లేదు కదా మనమే ఇబ్బందిపడాల్సి వస్తుందని సమన్వయకర్తలు సర్దిచెప్పేస్తుండటం కొంతవరకు వైపీపీ శ్రేణుల్లో నిరాశకు గురిచేస్తోంది. అధికార పార్టీ నాయకుల దృష్టిలో తమ వ్యతిరేక నాయకుడిగా గుర్తింపు పొంది ఇబ్బందులకు గురవుతుండటం, ప్రతిపక్ష పార్టీ నాయకుల అండదండలు కరువై ఎటూ కాకుండా సతమతమవుతుండటం గ్రామీణ ప్రాంతాల్లోని నాయకులకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు. ఇక సామాన్యుల పరిస్థితిని పరిశీలిస్తే లోన్లు, క్వార్టర్సు ఇస్తాం అంటూ అధికార పార్టీ నాయకులు చూపుతున్న ఆశకు ఓటు మనకు నచ్చినోడికి వేసుకుందాం.. ప్రస్తుతం ఏ పార్టీ నాయకుడు మనకు లబ్ది చేకూర్చితే వాడికి జై అందాం అనే ధోరణితో ముందుకెళ్తున్న పరిస్థితి కొనసాగుతోందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా అధికార ప్రతిపక్ష పార్టీలు ఇంటింటికీ, గడప గడపకూ కార్యక్రమాల్లో ప్రజల సమస్యలు కొంతవరకైనా తీరే అవకాశం వుందని ఆశిస్తే కేవలం వారి వారి పార్టీల ఉనికిని కాపాడుకునేందుకే ఇరు పార్టీలు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రాజకీయ విశే్లషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పోలీసు అమరవీరుల స్ఫూర్తితో
పునరంకితమవుదాం..
* దేశ భద్రత, సమాజ రక్షణలో పోలీసుల పాత్ర కీలకం * ఎస్పీ అశోక్‌కుమార్
అనంతపురం అర్బన్, అక్టోబర్ 21: దేశ భద్రత, సమాజ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల ఆశయాలను స్ఫూర్తిగా చేసుకొని విధుల్లో పునరంకితమవుదామని ఎస్పీ జీవీజీ. అశోక్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీసు దళాల నుంచి ఎస్పీ గౌరవవందనం స్వీకరించి అనంతరం ప్రసంగించారు. 1959 సంవత్సరం అక్టోబర్ 21న లడక్ ప్రాంతంలో మన దేశ మిలటరీ బలగాలకు చెందిన పదిమంది మాతృభూమి కోసం చైనా దళాలతో యుద్ధం చేసి వీరమరణం పొందటం జరిగిందన్నారు. ఆ సందర్భంగా అమరులైన వారి జ్ఞాపకార్థం పోలీసు అమరవీరుల వారోత్సవాలను జరుపుకొంటున్నామన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో పోలీసు శాఖ పనితీరు, విధులు, పోలీసులు వినియోగించే ఆయుధాల ప్రదర్శన, రక్తదాన శిబిరంలాంటి సామాజిక కార్యక్రమాలను నిర్వహించి భావి భారత పౌరులైన విద్యార్థులకు అవగాహన కల్పించటం జరిగిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసు దళాల పాత్ర కీలకమన్నారు. శాంతిభద్రల పరిరక్షణ, తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మతఛాందసవాదులు, అసాంఘిక శక్తుల నుంచి సామాన్య ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారన్నారు. అంతర్గత, బహిర్గత శత్రువుల నుంచి సామాన్యులను కాపాడటమే తమ విధుల్లో ప్రథమ కర్తవ్యం అన్నారు. ఒక దేశంకానీ, రాష్ట్రంకానీ అభివృద్ధి సాధించాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలన్నారు. పండుగల సంర్భంలో కూడా పోలీసులు తమ కుటుంబ సభ్యులకు దూరంగా విధుల్లో పాల్గొనటం జరుగుతోందన్నారు. ప్రజా సంక్షేమం కోసం పోలీసులు ఏ త్యాగానికైనా సదా సిద్ధంగా ఉంటారన్నారు. 2016-17 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా అసాంఘిక శక్తులతో పోరాడి 383 మంది పోలీసులు తమ ప్రాణాలను బలిదానం ఇచ్చారన్నారు. వారందరికీ పేరుపేరునా జోహార్లు అర్పించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ రమామణి మాట్లాడుతూ సమాజంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే పోలీసుల సమర్థ సేవలేనన్నారు. సమాజంలో పోలీసుల పాత్ర కీలకమనే విషయాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్దామన్నారు. జిల్లా జడ్జి శశిధర్ మాట్లాడుతూ పోలీసులు సమాజ మనుగడకు రక్షణ కవచంలాంటి వారన్నారు. నిత్యం ప్రజాసేవ, దేశ రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఖాజామొహిద్దీన్ మాట్లాడుతూ తన తండ్రి ఓ కానిస్టేబుల్ అని తనకు సైతం పోలీసు శాఖలో చేరాలని ఆశతో ఓసారి పోలీసు ఎంపిక ప్రక్రియకు హాజరవ్వటం జరిగిందన్నారు. కాని తన ఛాతి కొలతలు తక్కువగా ఉండటంతో తీసుకోలేదన్నారు. ఒకవేళ అప్పట్లో తాను పోలీసు అయి వుంటే ఈపాటికి అదనపు ఎస్పీ మాల్యాద్రి స్థాయిలో ఉండేవాడినన్నారు. దేశ భద్రత, సమాజ శ్రేయస్సు, ప్రజల మాన ప్రాణాలు కాపాడటంలో పోలీసుల ప్రాణ త్యాగాలు చేస్తుండటం అభినందనీయం అన్నారు. అనంతరం రెండు నిమిషాలపాటు అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత అమరవీరుల స్థూపం వద్ద ఇంచార్జి కలెక్టర్, జిల్లా జడ్జి, ఎస్పీ, అడిషినల్ ఎస్పీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు, డిఎస్పీలు జె. వెంకటరావు, టిఎస్. వెంకటరమణ, కరీముల్లాషరీప్, శ్రీ్ధర్‌రావు, భారతి, మహబూబ్‌బాషా, ఖాసీంసాబ్, నరసింగప్ప, నాగసుబ్బన్న, వెంకటేశ్వర్లు, చిన్నికృష్ణ, జిల్లా పోలీసు కార్యాలయం అధికారి సూర్యనారాయణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు సాకే త్రిలోక్‌నాథ్, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పోలీసులు, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు పంపిణీ
అమరవీరులు వారోత్సవాల్లో భాగంగా జిల్లా పోలీసు సిబ్బందికి విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, కార్టూన్లు పెయింటింగ్ పోటీల్లో ప్రతిభకనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. వీటితోపాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లా ఇంఛార్జి కలెక్టర్ రమామణి, జిల్లా జడ్జి శశిధర్‌రెడ్డి, ఎస్పీ అశోక్‌కుమార్, జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజామొహిద్దీన్ చేతుల మీదుగా ప్రదానం చేశారు.

అధైర్య పడవద్దు.. సాగునీరిస్తాం..
* మంత్రి కాలవ శ్రీనివాసులు
కణేకల్లు, అక్టోబర్ 21 : రైతులు అధైర్య పడవద్దని హెచ్‌ఎల్‌సి సబ్‌డివిజన్ పరిధిలోని పంటలకు తప్పకుండా సాగునీరు అందిస్తామని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక హెచ్‌ఎల్‌సి అతిథి గృహంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి చివరిలోపు నీరు అందించగలిగితే పంటలు పూర్తిస్థాయిలో చేతికి వస్తాయని పలువురు రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే కొంతమంది రైతులు డ్యాంలో నీరు లేకపోవడం, అధికారులు వరిపంటలు సాగుచేయరాదని, ఆరుతడిపంటలు సాగు చేసుకోవాలని సలహా ఇవ్వడంతో జొన్న, మొక్కజొన్న, పంటలు సాగు చేశారన్నారు. అధిక వర్షాలు రావడంతో ఆ పంటలు సైతం కుళ్లిపోయాయన్నారు. అదేవిధంగా వరినాట్లు వేయలేదన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సకాలంలో వర్షాలు రాక, తుంగభద్ర జలాశయంలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అయితే దేవుని దయ వల్ల ఈసారి వర్షాలు పుష్కలంగా కురిశాయన్నారు. ప్రస్తుతం డ్యాంలో 90 టిఎంసీల నీరు వచ్చి చేరిందన్నారు. ఈనేపథ్యంలో సాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అయితే రైతులు పరస్పర సహకారం, ఐకమత్యంతో ఉండడం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. హెచ్‌ఎల్‌ఎంసి కింద మనవాటాకు 18 టిఎంసీలు రావాల్సి ఉండగా, 6 టింఎంసిలు వచ్చిందన్నారు. ఇంకా 13 టిఎంసీల నీరు రావాల్సి ఉందన్నారు. కావున రైతులు అధైర్యపడవద్దన్నారు. కాగా వంద రోజుల్లోపు చేతికి వచ్చే పంటలు ఐఆర్ 64, గంగాకావేరి, ఆర్‌ఎన్‌ఆర్ వంటి వంగడాలని సాగు చేసుకోవాలన్నారు. అవసరమైతే సబ్సిడీ ద్వారా ఆయా విత్తనాలను పంపిణీ చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ వాణిశ్రీ, ఎంపిడిఓ రెహనాబేగం, హెచ్‌ఎల్‌సి డిఇ రామసంజన్న, జెఇ దివాకర్‌రెడ్డి, డిస్ట్రీబ్యూటరీల అధ్యక్షుడు కేశవరెడ్డి, చెరువు సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ గుప్త, ఎంపిటిసి ఫకృద్దీన్‌సాబ్, ఉప సర్పంచు ఆనంద్‌రాజ్, టిడిపి కన్వీనర్ లాలెప్ప, కోఆప్షన్ సభ్యులు నజీర్‌అహ్మద్, సుదర్శన్, మాబుసాబ్, మరియప్ప, రాఘవేంద్రగుప్త, ఆదికేశనాయుడు, శేషప్ప, వంద మంది రైతులు పాల్గొన్నారు.

కణేకల్లులో రోడ్డు విస్తరణ పనులు
* మంత్రి కాలవ శ్రీనివాసులు
కణేకల్లు, అక్టోబర్ 21 : పట్టణ ప్రధాన రహదారి శ్రీచిక్కణేశ్వరస్వామి దేవస్థానం నుంచి ఎదురు బసవన్న ఆలయం వరకూ వెంటనే రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతుల సమావేశం అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ రోడ్డు పనులకు భూమి పూజ చేసి 50 రోజులవుతున్నా ఎందుకు ఆక్రమణలను తొలగించలేదని ప్రశ్నించారు. అక్రమ కట్టడాలని తొలగించుకోవడానికి ఇంకా ఎన్నిరోజుల సమయం కావాలని, వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఆలసమ్యమయ్యే కొద్దీ మంజూరైన నిధులు వెనక్కి మళ్లే అవకాశం ఉందన్నారు.
చెక్కుల పంపిణీ
మండల పరిధిలో అనారోగ్యాల కారణంగా శస్తచ్రికిత్స చేయించుకున్న రోగులకు మంత్రి కాలవ శ్రీనివాసులు శనివారం సిఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. హనుమాపురం గ్రామానికి చెందిన వెంకటేశులుకు రూ. 31,555, శంకరయ్యకు రూ. 48వేలు, తిమ్మప్పకు రూ.1,23,947, జయప్పకు రూ. 39వేలు, బ్రహ్మసముద్రానికి చెందిన చిక్కణయ్యకు రూ. 36,600, జక్కలవడికి చెందిన సుల్తాన్‌కు రూ. 60వేలు, సొల్లాపురం గ్రామానికి చెందిన మంగమ్మకు రూ. 72వేలు, కమలాక్షికి రూ.49,200 చెక్కులు పంపిణీ చేశారు.
ఎవరితో అభివృద్ధి జరుగుతుందో ఆలోచించండి..
* మంత్రి పరిటాల సునీత
రామగిరి, అక్టోబర్ 21: ఏ పార్టీ అధికారంలో వుంటే అభివృద్ధి జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుందో గుర్తించాలని స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని పోలేపల్లి, అక్కంపల్లి గ్రామాల్లో శనివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించగా మంత్రి పాల్గొన్నారు. మంత్రి స్వయంగా ఇంటింటికి తిరిగి డోర్లకు స్టిక్కర్లను అతికిస్తూ టిడిపి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సంబంధించిన కరపత్రాలను అందిస్తూ వారి ఇంటిలో సమస్యల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతం ఎంతో పచ్చగా కనిపిస్తోందని, నిత్యం చంద్రబాబునాయుడు హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులకు నీళ్లివ్వడంతో భూగర్భ జలాలు పెరిగి రైతులు పంటలు బాగా సాగు చేసుకుంటున్నారన్నారు. దానికితోడు ఈ ఏడాది వర్షాలు కూడా బాగా కురవడంతో పచ్చదనం నిండుకుందన్నారు. వైకాపా దరిదాపుల్లో కూడా వుండదని, గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో కలిసి టిడిపిలో పనిచేసి గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అందరూ కూడా టిడిపిలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. టిడిపి చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని అందరూ బాధ్యతతో నిర్వహించి విజయవంతం చేయాలన్నారు. సర్వే నిర్వహించేటప్పుడు ఆ కుటుంబం గురించి సమగ్ర సమాచారం పొందుపరచాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియజేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించు బాలామృతం, అన్న అమృత హస్తం పథకాల గురించి లబ్దిదారులకు తెలియజేసి వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. టిడిపి బిసి, ఎస్‌సి, ఎస్‌టిలకు అండగా వుంటోందని, అందుకే చంద్రన్న పెళ్లికానుకలు కూడా ప్రకటించడం జరిగిందన్నారు. అంతేకాకుండా చంద్రన్న బీమా ప్రవేశపెట్టి కుటుంబాలకు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి రామ్మూర్తినాయుడు, ఎంపిపి బడగొర్ల ఆంజనేయులు, మాజీ ఎంపిపి రంగయ్య, మండల కన్వీనర్ సుబ్బరాయుడు, మండల ఉపాధ్యక్షుడు పరంధామయాదవ్, సర్పంచ్ ముత్యాలమ్మ, స్థానిక నేతలు పాల్గొన్నారు.
ధర్మవరం చెరువుకు హంద్రీనీవా నీరు
* ఎంపి నిమ్మల కిష్టప్ప
ధర్మవరం, అక్టోబర్ 21: ప్రతి ఏడాది హంద్రీనీవా ద్వారా ధర్మవరం చెరువుకు నీరందిస్తామని ఎంపి నిమ్మల కిష్టప్ప అన్నారు. ధర్మవరం శాసన సభ్యులు గోనుగుంట్ల సూర్యనారాయణతో చెరువును పరిశీలించడానికి విచ్చిన ఎంపి నిమ్మల విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశీస్సులతో శ్రీశైలం డ్యాం నుండి ఎత్తిపోతల పథకం ద్వారా ధర్మవరం చెరువు నింపడానికి సుముఖత వ్యక్తం చేశారన్నారు. అదేవిధంగా ధర్మవరం చెరువు సమీపంలో ఏర్పాటుచేసే పార్కు కోసం ఎంపి నిధుల నుండి ఆర్థిక సాయం అందించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందించడానికి నావంతు తప్పకుండా కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే గోనుగుంట్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ధర్మవరం చెరువు 15 రోజుల్లో నిండబోతోందని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఎంపి నిమ్మల కిష్టప్ప, నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయకట్టు ప్రెసిడెంట్ శ్యామరావు, కమతం కాటమయ్య, టిడిపి పట్టణ అధ్యక్షులు చిప్పల మల్లికార్జున, ఇనయతుల్లా, నగేష్, శ్రీరాములు, షెక్షావలి, నజీర్ పాల్గొన్నారు.
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం..
చంద్రబాబు పాలనతోనే రాష్ట్రం పురోభివృద్ధి సాధ్యమవుతుందని ఎం పి నిమ్మల కిష్టప్ప అన్నారు. శనివారం 39, 39 వార్డుల్లో ఎమ్మెల్యే గోనుగుంట్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో ఆయన మట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందన్నారు. అలాగే ధర్మవరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్‌లోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే కష్టపడడం జరుగుతోందన్నారు. రెండు సంవత్సరాలుగా ధర్మవరం చెరువుకు నీరు తీసుకురావడానికి ఎనలేని కృషి చేస్తున్నారని, ఆయన కృషి ఫలితమే ధర్మవరం చెరువు నిండబోతోందన్నారు. ప్రభు త్వ పథకాలు ప్రజలకు అందించడం లో ముందంజలో వున్నారన్నారు. తిరిగి 2019లో సూర్యనారాయణకు అవకాశం ఇచ్చి గెలిపించడంతోపాటు రాష్ట్రంలో టిడిపిని అధికారంలోకి తీ సుకొస్తే మరింత అభివృద్ధి చెందడానికి అవకాశముంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణాధ్యక్షులు చి ప్పల మల్లికార్జున, కాటమయ్య, ఓబిరెడ్డి, మారుతిరెడ్డి, ఆది, పామిశెట్టి శివశంకర్, శీలామూర్తి, నజీర్, ఇనయతుల్లా, స్వర్ణ, చౌడమ్మ, మీనాక్షి, రాధమ్మ, సాహెబ్బీ పాల్గొన్నారు.
వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
గోరంట్ల, అక్టోబర్ 21 : మండల కేంద్రంలో శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు కాంప్లెక్స్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై వేద పండితులు నాగేశ్వరశాస్ర్తీ, అర్చక బృందం వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణలతో శ్రీవారి కల్యాణం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి, శ్రద్ధలతో కల్యాణోత్సవాన్ని తిలకించారు. శ్రీదేవి, భూదేవి, వేంకటేశ్వర స్వాములపై అక్షితలు వేసి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా తమిళనాడు కళాకారులు తయారు చేసిన శ్రీదేవి, భూదేవి, శ్రీనివాసుల ప్రతిమలు భక్తులను ఎంతగానో అకర్షించాయి. అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఇటీవల నాగరాజు అనే భక్తుడు వాసవీ దేవాలయానికి ప్రధానం చేసిన శ్రీదేవి, భూదేవి ఉత్సవ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు రెండు రోజులుగా ప్రత్యేక పూజలు నిర్వహించి శనివారం ఘనంగా కల్యాణం నిర్వహించారు. సాయంత్రం విద్యుద్దీపాలతో అలంకరించిన వెండి రథంలో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జయంతి వేంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు గోపా జగదీష్, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, నాయకులు మచ్చా నరసింహులు, ఆంజనేయులు, సూర్యప్రకాష్, జనార్థన్ గుప్త, బలరామ గుప్త, నందగోపాల్, మాధవగుప్త, సుధాకర్, ఆదిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
120 రోజుల్లోపు ఎంపిఆర్‌కు నీరు విడుదల చేయాలి
* మాజీ మంత్రి శైలజనాథ్
అనంతపురం సిటీ, అక్టోబర్ 21: జిల్లాలోని ఎంపిఆర్‌కు 120 రోజుల్లో నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలైనా ఇప్పటి వరకు జిల్లా అభివృద్ధిని పట్టించుకోకపోవడం చాలా దారుణమన్నారు. జిల్లాలో అధికారులు కూడా టిడిపి నాయకులకే ఒత్తాసు పలుకుతూ జిల్లా అధివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. జిల్లాలోని రైతాంగం కరవుతో బాధపడుతుంటే పట్టించుకుండా వ్యవహరించడంలోనే మీ అసమర్థత బయటపడుతోందన్నారు. జిల్లాలోని చెరువులకు నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఏ చెరువుకు పూర్తిగా నీటిని విడుదల చేసిన దాఖలాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2013-14 సంవత్సరంలో 28 టిఎంసిల నీటితోనే తాగు, సాగునీటిని అందించామని తెలిపారు. హంద్రీనీవా జిల్లాకు త్వరితగతిన విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి ప్రభుత్వంలో బలమైన మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే నీటిని తీసుకెళ్తున్నారని, మిగిలిన చెరువులకు నీటిని విడుదల చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. జిల్లాలోని రైతాంగానికి ఇన్‌పుట్ సబ్సిడీగాని, ఇన్సూరెన్సు ఇవ్వడంలో జరుగుతున్న అవకతవకలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని మంత్రిగా ఉన్న కాలవ శ్రీనివాసులు గతంలో ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సులపై గట్టిగా మాట్లాడిన వ్యక్తి మంత్రి పదవిలో వుంటూ రైతాంగ సమస్యలపై మాట్లాడకపోవడం చాలా దారుణమన్నారు. ఒక సమయంలో వర్షాలు రాక కరవు, మరొక సమయంలో అధిక వర్షాలతో పంటలు నష్టపోతున్న రైతన్నలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే జిల్లాలోని అన్ని చెరువులకు, ఎంపిఆర్ డ్యాంకు నీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో ప్రజా సంఘాలు, రైతు సంఘాలను కలుపుకుని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రమణ, నాగరాజురెడ్డి, ఇస్మాయిల్, కొండారెడ్డి, రాజారెడ్డి, పులిరాజు, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నీటి కుంటలో పడి గొర్రెల కాపరి మృతి
కూడేరు, అక్టోబర్ 21 : మండల పరిధిలోని రామచంద్రాపురంలో నీటి కుంటలో పడి గొర్రెల కాపరి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సుబ్బరాయుడు(49) శుక్రవారం గొర్రెలను మేపు కోసం శివారుప్రాంతానికి తీసుకెళ్లాడు. అయితే సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నీటి కుంటలో దిగి ప్రమాదవశాత్తు ఇరుక్కొని మృతి చెందాడు. రాత్రికి గొర్రెలు ఇంటికి చేరినా సుబ్బరాయుడు మాత్రం రాలేదు. అయితే సుబ్బరాయుడి భార్య, కుమారుడు ఇద్దరికీ మతిస్థిమితం లేకపోవడంతో పట్టించుకోలేదు. అయితే బంధువులకు అనుమానం వచ్చి గ్రామ శివారు ప్రాంతాలు, పోలాల్లో గాలించారు. చివరికి నీటికుంటలో శనివారం మృతదేహం తేలడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.