అనంతపురం

రైతులకు తోడుగా ఉంటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* లక్ష ఎకరాలు సాగులోకి తెస్తాం..
* పిల్ల కాలువలూ తవ్వించలేని మంత్రి : రాప్తాడు సభలో జగన్

అనంతపురం, డిసెంబర్ 13 : స్వయానా మంత్రి పరిటాల సునీత నియోజకవర్గం మీదుగా వెళ్తున్న హంద్రీనీవా, పీఏబీఆర్ ప్రాజెక్టులకు కనీసం పిల్ల కాలువలు కూడా తవ్వించలేకపోయారని వైకాపా అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా బుధవారం సాయంత్రం రాప్తాడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో 1.20 లక్షల ఎకరాలకు నీరివ్వచ్చన్న విషయం మర్చిపోయారన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకుని కృష్ణాజలాలను జీడిపల్లి వరకూ తెచ్చామన్నారు. తద్వారా 3.50లక్షల ఎకరాలకు సాగునీరిచ్చి జిల్లాను సస్యశ్యామలం చేయాలని వైఎస్‌ఆర్ తపన పడ్డారన్నారు. ఆయన చేసిన పనులు సగంలోనే ఆగిపోయాయన్నారు. ఆయన ఒకడుగు ముందకేశారు.. నేను రెండడుగులు ముందుకేస్తా.. అధికారంలోకి రాగానే హంద్రీనీవా, హెచ్చెల్సీలకు పిల్ల కాలువలు తీయించి రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. రైతుల పట్టాదారు పాసు పుస్తకాల్లో సర్వే నంబర్లు మారుస్తున్నారని, విశాఖపట్నంలో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకోవడంతో తాను ధర్నా చేశానని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే వీటన్నింటినీ సవరిస్తామన్నారు. భూముల్ని రీ సర్వే చేయించి టైటిల్ డీడ్స్‌ను తిరిగి ఎవరూ మార్చడానికి వీల్లేని రీతిలో తయారు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. రైతులకు అన్నివిధాలా తోడు ఉంటామన్నారు. రెండు రోజులుగా తాను నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, అన్నివర్గాల ప్రజలను కలిసి సమస్యలు విన్నవించుకుంటున్నారన్నారు. ‘ఈ ప్రభుత్వం మా సమస్యలు తీర్చదు అన్నా.. మా గోడు మీకైనా చెప్పుకోనివ్వండి.. మీరు ప్రతిపక్షంలో ఉన్న విషయం తెలిసినా.. ఇపుడు మా ఇబ్బందులు మీ చెవిన వేస్తే.. గుర్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తారని ఆశ పడుతున్నాం’ అంటూ వేడుకుంటున్నారన్నారు. ప్రజల సమస్యలు వినేందుకే తాను పాదయాత్ర చేస్తున్నానన్నారు. అందుకోసమే నవరత్నాలు ప్రకటించామన్నారు. మీ సూచనలు, సలహాలు ఇవ్వండి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వం మనకేం చేసిందో ఆలోచించాలని కోరారు. నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ పీఏబీఆర్ కుడి కాలువ కింద ఆయకట్టు ఉన్న మేం నీరు లేక అన్యాయమై పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పేరూరు డ్యాంకు నీరిస్తామని 2009 ఏప్రిల్ 20న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ మాట ఇచ్చారు. ఆ మాటతో నీరొస్తుందని ఎన్నో కలలు కన్నాం. కానీ మహానేత అకాల మరణంతో రైతులందరం దిక్కులేని వారయ్యామన్నారు. ఆయకట్టుకు నీరు తెచ్చుకునే హక్కు మాకుంది. నీటికి ఇవ్వకుండా చేసేందుకు ముఖ్యమంత్రి, మంత్రి పరిటాల సునీత ఎవరని ప్రజలు అడుగుతున్నారన్నారు. 50వేల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ కింద నీరివ్వలేదని, 20 ఏళ్లుగా ద్రోహం కొనసాగుతోందన్నారు. అలాగే హంద్రీనీవా కింద 70వేల ఎకరాలకు నీరివ్వలేదన్నారు. దీంతో సీకే.పల్లి, కనగానపల్లి, రామగిరి, ఆత్మకూరు మండలాల్లో సాగు భూమి కుదేలైందని వాపోయారు. చెరువులకు నీరిచ్చామంటున్నారు.. అవి ఏడెనిమిది వేల ఎకరాలకే సరిపోతున్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రూ.1300 కోట్ల దోపిడీకి మంత్రి పరిటాల సునీత శ్రీకారం చుట్టారన్నారు. అలాగే రామగిరి బంగారు గనులు మూయించిన ఘనత మీది కాదా? అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఆమె దోపిడీలు, అరాచకాలు అన్నీ, ఇన్నీ కావు, అడిగేవాడు లేడనుకుంటున్నారు.. కార్యకర్తలతో కలిసి ప్రాణాలు ఫణంగా పెట్టి నియోజకవర్గంతోపాటు కార్యకర్తల్ని కాపాడుకుంటామన్నారు. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే చివరి శ్వాస వదులుతా అని జగన్‌కు చెప్పారు. తాను రెండుసార్లు ఓడిపోయాను.. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తదితరులు మాట్లాడారు.
ప్రణాళికతో జేఎన్‌టీయూ అభివృద్ధి
* వీసీ ఆచార్య శ్రీనివాసకుమార్
అనంతపురం సిటీ, డిసెంబర్ 13: జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయాన్ని పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జేఎన్‌టీయూ ఉప కులపతి ఆచార్య శ్రీనివాసకుమార్ తెలిపారు. బుధవారం జెఎన్‌టియూ అనంతపురం ఉప కులపతిగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య శ్రీనివాసకుమార్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జెఎన్‌టియూ అనంతపురం ఇంజనీరింగ్ కాలేజిలో 1987 నుండి 1988 సంవత్సరం వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశానని, అనంతరం బదిలీపై జెఎన్‌టియూ కాకినాడకు వెళ్లి, ఇప్పటి వరకు అక్కడే పనిచేస్తున్నానని తెలిపారు. జెఎన్‌టియూ అనంతపురంలో నా ఉద్యోగంను ప్రారంభించానని, ఆ యూనివర్సిటీకి ఉప కులపతిగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. యూనివర్సిటీలోని ఉన్న వనరులను, సీనియర్ ఆచార్యులు, టీచింగ్ స్ట్ఫా, నాన్ టీచింగ్ స్ట్ఫాలతో కలసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికలను రెండు నెలల్లో తయారుచేసుకుని యూనివర్సిటీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని 179 కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు, అందులో ఎలాంటి రాజీ పడకుండా వారితో సంప్రదించి అవసరమైన సౌకర్యాలను కల్పన చేసుకునే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. యూనివర్సిటీ పరిధిలోని అనుబంధం కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యత, కమ్యూనికేషన్ స్కిల్‌ను పెంపొందించేందుకు ప్రణాళికలు తయారుచేస్తామన్నారు. అలాగే కళాశాలలో మంచి సబ్జెక్టు నిపుణులను ఉండేలా ఇప్పటి నుండి ర్యాటిఫికేషన్ చేస్తామని తెలిపారు. జెఎన్‌టియూ అనంతపురం పరధిలోని అనుబంధ ఎంటెక్ కళాశాలలకు బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేస్తామని తెలిపారు. వచ్చే రెండు, మూడు మాసాల తరువాత జెఎన్‌టియూలోని ఆచార్యులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటుచేసి ప్రణాళికలను రూపొందిస్తామని తెలిపారు. అనంతరం నూతన ఉప కులపతిగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య శ్రీనివాసకుమార్‌కు జెఎన్‌టియూ డైరెక్టర్లు, అనుబంధం కళాశాలల ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, టీచీంగ్, నాన్ టీచింగ్ స్ట్ఫా, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు.

తపోవనంలో వ్యక్తి దారుణహత్య
* జనం చూస్తుండగానే వేటకొడవళ్లతో నరికి చంపిన ప్రత్యర్థులు
అనంతపురం అర్బన్, డిసెంబర్ 13: నగరంలోని తపోవనం సర్కిల్‌లో బుధవారం రాత్రి 8 గంటల సమయంలో రామ్మోహన్‌రెడ్డి (38)ని ప్రత్యర్థులు అత్యంత పాశవికంగా వేటాడి వేటాడి వేటకొడవళ్లతో నరికి చంపారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు జనశక్తి నగర్‌కు చెందిన సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ అనుబంధ సంఘం అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకుడు రామకృష్ణారెడ్డిని 2011లో అదే కాలనీకి చెందిన దూదేకుల సత్తార్ వ్యతిరేక వర్గం హత్య చేసింది. ఈ హత్య కేసుకు సంబంధించి సరైన సాక్ష్యాలు లేవన్న కారణంతో కేసును సైతం కోర్టు కొట్టివేయటం జరిగింది. రామకృష్ణారెడ్డి కుమారుడే రామ్మోహన్‌రెడ్డి. తమ తండ్రి హత్య కేసులోని నిందితులతో కాలనీలో ఆదిపత్యం కోసం ఇరువురు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదే సందర్భంలో బుధవారం రామ్మోహన్‌రెడ్డి తపోవనం సర్కిల్‌లో ఒంటరిగా వచ్చి టీ తాగి వెళ్తుండగా అప్పటికే హత్య చేయడానికి పథకం వేసుకొన్న నిందితులు ముగ్గురు ఒకే ద్విచక్ర వాహనంపై మాస్క్‌లు ధరించి నేరుగా రామ్మోహన్‌రెడ్డిని సమీపించి కళ్లల్లోకి కారం పొడి చల్లి వేటకొడవళ్లతో అత్యంత పాశవికంగా నరికారు. దాదాపు 25 మీటర్ల మేర వెంటాడి నరికారు. మృతుడు తప్పించుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. తలపైనే కాకుండా మెడ, చేతులపై ఇష్టారాజ్యంగా నరకడంతో కొన ఊపిరితో ఉన్న రామ్మోహన్‌రెడ్డిని స్థానికులు తక్షణమే స్పందించి సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటనా స్థలాన్ని డిఎస్పీ వెంకట్రావ్, త్రీటౌన్, ఫోర్త్ టౌన్ సిఐలు మురళీకృష్ణ, శ్యామ్‌రావ్ చేరుకొని జరిగిన సంఘటనపై వివరాలు సేకరించారు.

ప్రసాద్‌రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం
* ప్రసన్నాయపల్లి పాదయాత్రలో జగన్
రాప్తాడు, డిసెంబర్ 13: రాప్తాడు మాజీ వైసిపి మండల కన్వీనర్, దివంగత ప్రసాద్‌రెడ్డి కుటుంబానికి అండగా వుంటామని వైసీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బుధవారం వైకాపా అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్పయాత్ర 34వ రోజు మండల పరిధిలోని ప్రసన్నాయపల్లి గ్రామానికి ఉదయం 11గంటలకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రసన్నాయపల్లి సర్పంచ్ సావిత్రి, ఎమ్మెల్సీ వెన్నపూసల గోపాల్‌రెడ్డి, జెడ్‌పిటిసి వెన్నపూస రవీంద్రరెడ్డి, మహానందరెడ్డిలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు జగన్‌కు హారతులు ఇచ్చి బొట్టు పెట్టారు. గత రెండు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల చేతిలో దారుణ హత్యకు గురైన భూమిరెడ్డి ప్రసాదరెడ్డి కుటుంబాన్ని జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించి అండగా వుంటామని హామీ ఇచ్చారు. గ్రామస్థుల సమస్యలు తెలుసుకుంటు అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీలిస్తూ పాదయాత్ర సాగించారు. 1గంటకు వినయ్‌కుమార్ పాఠశాల ఆవరణలో విడిది చేశారు. అనంతరం 3:30 గంటలకు పాదయాత్రలో పాల్గొన్నారు. చిన్మయ నగర్‌లోకి పాదయాత్ర చేరుకోగానే వైకాపా కార్యకర్తలు, నాయకులు గజమాలతో ఘనంగా స్వాగతం పలికి బాణసంచాలు పేల్చారు. పాదయాత్ర సాగిస్తుండగా ట్రాన్స్‌కో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగస్థులు జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు ఎన్నికల ముందు కాంట్రాక్టు ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తామని, వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని, ఇప్పటికి హామీలు నెరవేర్చలేదని జగన్‌కు సమస్యలను వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, వేతనాలు పెంచుతామని వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా జెఎన్‌టియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కూడా 2008నుండి జెఎన్‌టియులో విధులు నిర్వహిస్తున్నామని, చాలీచాలని జీతాలతో సమస్యలు ఎదుర్కొంటున్నామని, చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని జగన్ దగ్గర విన్నవించారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని వారికి హామీ ఇచ్చారు. అక్కడి నుండి ఇందిరమ్మ కాలనీలోకి పాదయాత్ర చేరుకోగానే కాలనీవాసులు కొంతమంది చంద్రన్న బీమా కట్టినా కూడా మా కుటుంబానికి బీమా పరిహారం మంజూరు చేయలేదని విన్నవించారు. వారిని అడిగితే మీరు వైకాపా వారని, మీకు రాదని చెప్పారని జగన్‌కు వివరించారు. పేద ప్రజలపై కుటిల రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు కాలం దగ్గర పడిందని జగన్ ప్రజలకు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతాయని భరోసా ఇచ్చారు. అక్కడి నుండి పాదయాత్ర రాప్తాడుకు చేరుకోగానే మండల నాయకులు సత్యనారాయణరెడ్డి, రామాంజనేయులు, వైకాపా కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాప్తాడు బస్టాండు కూడలిలో బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో ఆయన వెంట చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి రాజారెడ్డి, మహానందరెడ్డి, సాంబశివారెడ్డి, ఎంపీటీసీ రాధ, వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.
పన్ను వసూళ్ల శాతం పెరగాలి
* మున్సిపల్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆశాజ్యోతి
అనంతపురంటౌన్, డిసెంబర్ 13: నెలాఖరులోగా నిర్దేశించిన పన్ను వ సూళ్ల లక్ష్యం అధిగమించకుంటే చర్య లు తప్పవని మున్సిపల్ శాఖ అసిస్టెం ట్ డైరెక్టర్, ప్రాపర్టీ ట్యాక్స్ విభాగం సెక్రటరీ ఆశా జ్యోతి హెచ్చరించారు. బుధవారం రెవెన్యూ భవన్‌లో నిర్వహి ంచిన పన్ను వసూళ్లపై సమీక్షలో ము న్సిపల్ ఆర్‌డి రవీంద్రబాబు, కార్పొరేషన్ కమిషనర్ పివివిఎస్‌ఎన్ మూర్తి, జిల్లాలోని 12 మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌ఓలు, ఆర్‌ఐలు, బిల్ కలెక్టర్లు, మేనేజర్లు, అకౌంటెంట్లు పాల్గొన్నారు. ఏడీ ఆశాజ్యోతి ఒక్కొక్క మున్సిపాలిటీలో రెవెన్యూ వార్డుల వారీగా బిల్ కలెక్టర్ల పన్ను వసూళ్ల శాతాన్ని పరిశీలిస్తూ సమీక్షించారు. మున్సిపాలిటీల్లో ఆర్థిక సంవత్సరం ముగియటానికి నెలల గడువే ఉన్నా ఇప్పటి వరకు 25 శాతం పన్ను వసూళ్లు కూడా జరగకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసె ంబర్ నెలాఖరి నాటికి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధిస్తామన్న వారి మాటలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ నెల ముగియటానికి పట్టుమని 15 రోజులు కూడా లేవన్నారు. ఇన్ని నెలలుగా వసూలు చేయని పన్ను బకాయిలను 15 రోజుల్లో ఎలా వసూలు చేస్తారని అన్నారు. కథలు చెబుతూ కాలం గడిపేయటంలాంటి అలవాట్లను మానుకోవాలని అన్నారు. బాధ్యత గుర్తెరిగి పనిచేయాలన్నారు. అంతేకాకుండా సిబ్బంది పనిచేసే చోటే నివాసం ఉండాలన్నారు. కొంతమంది బిల్ కలెక్టర్లు వేరే ప్రాంతాలలో నివాసం ఉంటూ రోజూ అప్ అండ్ డౌన్ చేస్తున్నామని చెప్పటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపర్తి బిల్ కలెక్టర్ జకీర్ రోజూ హిందూపురం నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నట్లు చెప్పటంతో వెంటనే అతనికి చార్జిమెమో ఇవ్వాలని ఆదేశించారు. పుట్టపర్తి పన్ను బకాయిలు రూ. 175 లక్షలు ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పుట్టపర్తి కమిషనర్ మాట్లాడుతూ గడచిన మూడేండ్లుగా లాడ్జీలు మూతపడ్డాయని అన్నారు. వాటి యజమానులకు తాఖీదులు పంపుతున్నా స్పందించటం లేదన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన వారు తాళాలు వేసి వెళ్లిపోయారన్నారు. దీనిపై ఆశాజ్యోతి మాట్లాడుతూ లాడ్జీలలో పారిశుద్ధ్య పరిస్థితులను తనిఖీ చేశారాయని అడగగా లేదని ఆయన బదులిచ్చారు. వెంటనే తనిఖీలు నిర్వహించి నోటీసులు ఇచ్చి పన్ను బకాయిలు చెల్లించకుంటే లాడ్జీలు సీజ్ చేయాలని సూచించారు. తర్వాత కదిరి మున్సిపాలిటీలో 3.50 కోట్ల రూపాయల పన్ను బకాయిలు పేరుకుపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలకమైన రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ స్థానంలో కారుణ్య నియామకం కింద నియమితులైన జూనియర్ అసిస్టెంట్‌ను నియమించటం తగదన్నారు. పని తెలియని వారిని కీలక పోస్టులో ఉంచవద్దని అన్నారు. అలాగే కమర్షియల్ ప్రాంతాలలో కూడా పన్నులు వసూలు చేయని బిల్ కలెక్టర్ ముస్త్ఫాను అక్కడే కొనసాగించటం సరికాదన్నారు. పనితీరు మెరుగుపడకపోతే వెంటనే డివిజన్ మార్చి వేయాలని సూచించారు. తర్వాత ప్రతి మున్సిపాలిటీలోను ఇదే పరిస్థితి నెలకొని ఉందని అభిప్రాయపడ్డారు. ఆస్తి, నీటి పన్ను బకాయి వసూళ్లకై బకాయిదారుల ఇళ్ల వద్ద డప్పుకొట్టటం, సీజ్ చేయటంలాంటి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో తుంగభద్ర నీరు
* హెచ్చెల్సీ ఎస్‌ఈ సురేంద్రరెడ్డి
బొమ్మనహాల్, డిసెంబర్ 13 : తుంగభద్ర జలాశయం సెంట్రల్ ట్రిబ్యునల్ బోర్డు గతంలో తీర్మానించిన మేరకు ఆంధ్రాకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీరు విడుదల చేస్తున్నట్లు హెచెల్సీ ఎస్‌ఇ సురేంద్రరెడ్డి తెలిపారు. ఈమేరకు మండలంలోని తుంగభద్ర ప్రధాన కాలువను ఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పద్ధతి ప్రకారం డిసెంబర్ 20వతేదీ నుంచి సాగునీరు నిలుపుదల చేస్తామన్నారు. తిరిగి జనవరి 2వ తేదీ నుంచి విడుదల చేస్తామన్నారు. ఇందుకు ఆయకట్టు రైతులు సహకరించాలని కోరారు. అనంతరం 105వ కిలోమీటర్ నుంచి 120వ కిలోమీటర్ వరకూ ప్రధాన కాలువను పరిశీలించారు. ప్రస్తుతం సరిహద్దులో వెయ్యి క్యూసెక్కుల నీరు ప్రధాన కాలువ ద్వారా ఆంధ్రాకు చేరుతోందన్నారు. జలాశయంలో 75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రా రైతులకు సక్రమంగా నీరు అందించేందుకు శక్తివంచన లేకుండా సిబ్బంది కృషి చేస్తున్నారన్నారు. రైతులు సహకరిస్తే ఫిబ్రవరి 10వ తేదీ వరకూ సాగు నీరు తీసుకోవచ్చన్నారు. తర్వాత మంత్రి కాలవ శ్రీనివాసులు ఆదేశాల మేరకు ఉంతకల్లు గ్రామం వద్ద రిజర్వాయర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు తయారు చేయడానికి స్థల పరిశీలన చేశారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు 2వేల కోట్లు అవసరం అవుతుందన్నారు. నిర్మిస్తే మండల పరిధిలోని 30 గ్రామాలకు తాగునీరు అందివచ్చవన్నారు. ఈకార్యక్రమంలో కణేకల్లు సెక్షన్ ప్రెసిడెంట్ కేశవరెడ్డి, పార్టీ కన్వీనర్ బలరామరెడ్డి, బొమ్మనహాల్ సాగునీటి సంఘం అధ్యక్షుడు రుద్రప్ప గౌడ్, ఉద్దేహాల్ మాజీ ప్రెసిడెంట్ శీనప్ప, కణేకల్లు సెక్షన్ డీఇ రామసంజప్ప, ఆంధ్రా సరిహద్దు జేఇ రంజిత్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
కార్యకర్తలు అధైర్య పడవద్దు..
* పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి
అమరాపురం, డిసెంబర్ 13 : కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్య పడకుండా ప్రజోపయోగ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని బస్టాండ్‌లో ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం కార్యక్రమంలో నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఊరేగింపుగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. అయితే ప్రస్తుత టీడీపీ పాలనలో కేవలం కార్యకర్తలకు మాత్రమే పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, లేకపోతే ఏదో ఒకరోజు ప్రజలే తిరగబడతారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో అర్హులకు పింఛన్లు ఇవ్వలేదని, పంట నష్ట పరిహారం చెల్లించలేదని, ఉపాధి పనులు చేసిన వారికి నెలలు గడుస్తున్నా బిల్లులు రాలేదని, గృహాలు నిర్మించుకున్న వారికి బిల్లులు చెల్లించడం లేదన్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటుందన్నారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నాయకులు హనుమంతరాయప్ప, మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గురుమూర్తి, భూతరాజు, నాగరాజు, సోమశేఖర్, మోహన్‌బాబు, శ్రీనివాసులు, దొడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.

రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న
మాజీ సైనికుడు రామారావు మృతి
లేపాక్షి, డిసెంబర్ 13: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుడు ప్రకాష్ రామారావు(94) బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. లేపాక్షికి చెందిన ప్రకాష్ రామారావు సైన్యంలో చేరి రెండో ప్రపంచ యుద్ధం సమయంలో భారత్ తరఫున పాల్గొన్నారు. సైన్యం నుండి పదవీ విరమణ పొందిన తరువాత రైల్వే స్టేషన్‌మాస్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. లేపాక్షిలో ఉంటూ విశ్రాంత జీవితం గడుపుతున్నారు. గత కొంతకాలంగా అస్వస్థతకు గురైన ప్రకాష్ రామారావు మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతికి లేపాక్షి సర్పంచ్ జయప్ప, మాజీ ఎంపీపీ ఆనంద్‌కుమార్ సంతాపం తెలిపారు.

నిరుపేదలకు పక్కా గృహాలు నిర్మించాలి
అనంతపురం సిటీ, డిసెంబర్ 13: నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పక్కా గృహాలు నిర్మించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.నారాయణస్వామిలు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిటీ ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు ఇళ్ల స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అర్హులైన నిజమైన లబ్దిదారులకు అందడం లేదన్నారు. కేవలం అధికార పార్టీకి చెందిన వారికే మాత్రమే కట్టబెడతున్నారని ఆరోపించారు. కావున ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 18వ తేదీన తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు నాగరాజు, రామకృష్ణ పాల్గొన్నారు.
అక్టోబర్ మధ్యాహ్న భోజన బిల్లు జమ
అనంతపురం సిటీ, డిసెంబర్ 13: జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు సంబందించిన మధ్యాహ్న భోజన బిల్లును అక్టోబర్ నెలకు సంబందించి ఏజెన్సీల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా విద్యా శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబందించి ఏజెన్సీ జమ అయిన మొత్తాన్ని తీసుకొని కుక్కింగ్ కాస్టు తీసుకొని, అలాగే వంట సహాయకులకు వేతనాలను చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని తెలియజేసారు.
రేపు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై జాతీయ సదస్సు
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 13: ఈ నెల 15, 16వ తేదీల్లో నగరంలోని ఎస్‌ఎస్‌బిఎన్ కళాశాలలో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు సమన్వయకర్త శివరామకృష్ణ తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన జరిగే సదస్సుకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ రమామణి ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. వివిధ విశ్వ విద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు సదస్సుకు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.
నారుూ బ్రాహ్మణులను ఎస్సీ జాబితాలో చేర్చాలి
* జిల్లా అధ్యక్షులు వెంకటరంగయ్య
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 13: సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలతోపాటు విద్యా, ఉద్యోగ రంగాలలో వెనుకబడిన నారుూ బ్రాహ్మణులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ జాబితాలో చేర్చాలని జిల్లా అధ్యక్షులు వెంకటరంగయ్య డిమాండ్ చేశారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాలలో వెనుకబడిన నారుూ బ్రాహ్మణులు అన్ని అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఎస్సీ జాబితాలో చేర్చాలన్నారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు తమ డిమాండ్‌ను పట్టించుకోలేదన్నారు. ఇతర రాష్ట్రాలలో ఎస్సీ జాబితాలో కొనసాగుతుండగా తెలుగు రాష్ట్రాల్లో బిసి జాబితాలో కొనసాగుతున్నారన్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 19న కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో నారుూ బ్రాహ్మణ సంఘం నాయకులు శివప్రసాద్, యల్లనూరు ప్రసాద్, బిజెపి నగర అధ్యక్షులు శ్రీనివాసులు, వైకాపా నాయకులు నరసింహులు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీనివాసులు, శివశంకర్, మల్లికార్జున, గోవిందరాజులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటి ముందు పరిశుభ్రంగా ఉంచాలి
పెద్దపప్పూరు, డిసెంబర్ 13 : గ్రామంలోని వీధులు తమ ఇళ్ల వద్ద మురికినీరు, చెత్త చెదారం వేయకుండా ఎవరికి వారు తమ ఇళ్ల ముందు పరిశుభ్రంగా వుంచుకోవాలని తహశీల్దార్ రమాదేవి పేర్కొన్నారు. బుధవారం రాత్రి మండలంలోని గార్లదినె్నలో ఆమె ఇంటింటికి తిరిగి ప్రతి ఇంటి ముందు శుభ్రంగా వుంచుకోవాలని, ప్రభుత్వం మంజూరు చేసిన వ్యక్తిగత మరుగుదొడ్లను త్వరితగతిన పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత తమపై వుందన్నారు.

కొత్త పరిశ్రమల స్థాపనకు వౌలిక వసతులు కల్పించాలి
అనంతపురం సిటీ, డిసెంబర్ 13: జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులు, వౌలిక వసతులు కల్పించాలని ఇన్‌చార్జి కలెక్టర్ టీకే రమామణి అధికారులకు సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు ఇన్‌చార్జి కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమల అభివృద్ధి కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలు స్థాపనకు సంబందించిన శాఖలు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ధేశించిన సమయం 7, 14, 25 రోజుల్లోపే పరిష్కరించి సింగిల్ డేస్ పోర్ట్‌లలో నమోదు చేయాలన్నారు. పరిశ్రమలకు కావలసిన అదనపు సమాచారం అవసరమైతే దరఖాస్తుదారునకు తెలియజేసి సదరు సమాచారాన్ని పోర్ట్‌లలో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు మంజూరైన యూనిట్లను సబ్సిడీ రూపంలో వారికి కేటాయించాలని, అర్హులైన ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలను మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. జిల్లాలో 103 పరిశ్రమలకు సబ్సిడీ రూ.3,27,11,836 మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఆన్‌లైన్ పద్ధతి ద్వారా పెట్టుబడి రాయితీతో ఒక యూనిట్ పవర్ సబ్సిడీతో 32 యూనిట్లు, ఇనె్వస్టుమెంట్ సబ్సిడీ 01 యూనిట్, పవర్‌కాస్టు 17 యూనిట్లు, పావలా వడ్డీతో 14 యూనిట్లకు రూ.41,16,564 మంజూరు చేయడం జరిగిందన్నారు. పరిశ్రమల స్థాపనకు ఆమోదం ఇవ్వని అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 2,127 దరకాస్తులు స్వీకరించడం జరిగిందని, అందులో 2049 ప్రతిపాదనలు ఆమోదించడం జరిగిందని, వాటిలో వివిధ కారణాల వల్ల 58 దరఖాస్తులు తిరస్కరించడం జరిగిందని, 20 ప్రతిపాదనలు వివిధ దశలలో వున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఏ ప్రతినిధి సుధీర్, ఎఫ్‌ఏ పీసీసీఐ ప్రతినిధి రంగారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మిస్సమ్మ స్థలాన్ని ప్రభుత్వం
స్వాధీనం చేసుకోవాలి
అనంతపురం కల్చరల్, డిసెంబర్ 13: నగర నడిబొడ్డున గల కోట్ల రూపాయల విలువ చేసే మిస్సమ్మ స్థలాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని అఖిలపక్ష కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. సుధాకర్ రాజు అధ్యక్షతన జరిగిన ధర్నాలో సీపీఐ నాయకులు నారాయణస్వామి, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు దాదాగాంధీ తదితరులు హాజరై ప్రసంగించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారిన భూ కబ్జాదారులు మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, అతని సోదరులకు కట్టబెట్టాలని ప్రయత్నించడం అన్యాయమన్నారు. గత పదేళ్లుగా వివాదాస్పద స్థలంపై అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు, ఆందోళనలు నిర్వహించామన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే మిస్సమ్మ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని జివో విడుదల చేసిందన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి రాగానే మిస్సమ్మ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి రాగానే స్వాధీనం చేసుకోకుండా కాలయాపన చేస్తూ ప్రస్తుతం వారికే కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని మిస్సమ్మ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరాములు, లింగమయ్య, అల్లీపీరా, రమణ, నాగరాజు పాల్గొన్నారు.
జగన్‌కు అడుగడుగునా నీరాజనం
అనంతపురం అర్బన్, డిసెంబర్ 13: ప్రతిపక్ష నేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం రుద్రంపేట నుంచి భారీ జనసందోహం మధ్య సాగింది. ఉదయం 8.30కు ప్రారంభం కావాల్సిన పాదయాత్ర గంట ఆలస్యంగా ఆరంభమైంది. జగన్ పాదయాత్రకు రాప్తాడు నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దాదాపు నగరంలో కలిసిపోయిన రూరల్ మండలం జాతీయ రహదారిపై జగన్ పాదయాత్రకు విశేష స్పందన లభించింది.
రుద్రంపేట, కక్కలపల్లి క్రాస్, అనంతపురం రూరల్ మండలం, డాల్ఫిన్ హోటల్ మీదుగా ప్రసన్ననాయనపల్లి మీదుగా సాగింది. జగన్‌మోహన్‌రెడ్డితో చేయి కలపడానికి పోటీపడ్డారు. అందరితో సెల్ఫీలు, ఆశీర్వాదాలు అందించారు. అనంతరం ప్రసన్నాయనపల్లిలో మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సాయంత్రం 3-30 గంటలకు మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడుకు సాయంత్రం 5-30కు చేరుకొంది. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జగన్‌మోన్‌రెడ్డి ప్రసంగించారు.

జిల్లా తెలుగు యువత అధ్యక్షునికి సన్మానం
ఆత్మకూరు, డిసెంబర్ 13: జిల్లా తెలుగు యువత అధ్యక్షునిగా ఎన్నికైన ఒడ్డుపల్లి నారాయణస్వామికి బుధవారం మండల అధికారులు ఎంపీడీఓ కార్యాలయంలో సత్కారం చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ స్టేట్ కౌన్సిల్ సభ్యుడుగా ఎన్నికైనందున అధికారులు ఆయనకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ ఆయేషా, ఎంపీడీఓ ఆదినారాయణ, ఈసి సంగీత, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.