అనంతపురం

పన్నుల వసూళ్లపై ‘మార్చి’ ఫాస్ట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, ఫిబ్రవరి 25 : మున్సిపల్ సిబ్బందిని అసలు పని కంటే ప్రభుత్వ సర్వేలు ఎక్కువగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ విధుల్లో ప్రధానమైన పన్నుల వసూళ్లలో వెనుకబడటంతో అధికారు నుంచి ఒత్తిళ్లు ఎక్కువైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల సర్వే, సాధికార సర్వే, జీఏఎస్ సర్వే, పింఛన్ల పంపిణీ ఇలా ఇతరత్రా పనుల్లో నిమగ్నమై ఉండగా మార్చి నెల సమీపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి ఆఖరు నాటికి ఆస్తిపన్ను వసూళ్లు వందశాతం కావాల్సిందేనంటూ ఉన్నతాధికారులు పరుగులు పెట్టిస్తున్నారు. టెలీకాన్ఫరెన్స్‌ల్లో కమిషనర్లపై మండి పడుతున్నారు. కింది స్థాయిలో సిబ్బంది ఇతరత్రా విధుల్లో ఉండటంతో కమిషనర్ల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. హిందూపురం మున్సిపాలిటీలో రూ.10 కోట్లకు పైగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయి. ఇందులో ఇప్పటి దాకా దాదాపు రూ.3.70 కోట్లు మాత్రమే వసూలయింది. ఇంకా రూ.7 కోట్ల దాకా వసూలు చేయాల్సి ఉంది. పన్నుల వసూళ్ళకు పండుగ సెలవులు పోనూ కేవలం 30 రోజులు మాత్రమే గడువు మిగిలింది. 30 రోజుల్లో రూ.7 కోట్ల లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యమేనా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. పన్ను వసూళ్లు చేయకపోతే కమిషనర్‌ను మొదలుకొని బిల్ కలెక్టర్ దాకా అందరికీ చార్జీ మెమోలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో కమిషనర్లు పన్నుల బకాయిల వసూళ్ళకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. చిన్నచిన్న పన్ను బకాయిల వసూళ్ళపై దృష్టి పెట్టడం కన్నా పెద్ద ఎత్తున బకాయి పడ్డ మొండి బకాయిదారులపై కొరడా ఝుళిపించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రస్తుతం ఎన్నికల వేడి రాజుకోవడం, మొండి బకాయిదారుల్లోనూ రాజకీయ పార్టీలకు అండగా నిలిచే పెద్దలే ఎక్కువగా ఉండటంతో జప్తుకు వెళితే తప్పని సరి పరిస్థితుల్లో చెల్లిస్తారని అంచనా వేస్తున్నారు. లక్షలాది రూపాయలు బకాయిలు పడ్డ బకాయిదారుల జాబితాను సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రీవారెంట్ నోటీసుల జారీ జోరుగా సాగుతోంది. మరో వైపు పన్ను బకాయిల్లో వాణిజ్య అవసరాలకు ఉపయోగించే భవనాలు పెద్ద ఎత్తున ఉండటంతో వాటిని సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పండుగ సమయాల్లో సీజ్ చేయడం వల్ల వాటిలో అద్దెకు ఉండే వ్యాపారుస్తులు భవన యజమానులపై ఒత్తిడి తెచ్చి పన్ను బకాయిలు చెల్లిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ఉన్న వాణిజ్య భవనాలు, వాటి నుండి పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలు తదితర వాటికి సంబంధించి ప్రత్యేక జాబితాను సిద్ధం చేశారు. వారి ప్రణాళిక ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్‌లో ఓ పాదరక్షల దుకాణాన్ని మధ్యాహ్నం సీజ్ చేస్తే సాయంత్రానికి ఏకంగా రూ.5 లక్షల ఆస్తిపన్ను వసూలు కావడం ఇందుకు నిదర్శనం. సోమవారం నుండి మరికొన్ని దుకాణాలను సీజ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. పెద్ద ఎత్తున మొండి బకాయిలు వసూలు చేయాలంటే ఇదే మంచి మార్గమని అంచనా వేశారు. అయితే పట్టణంలో రూ.7 కోట్లు వసూలు కావాల్సి ఉండటం, ఇందులో ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, వాటి ఆస్తులు, రైల్వే, టెలికాం, పోస్టల్ వంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు తదితర వాటికి సంబంధించి దాదాపు రూ.2 కోట్ల దాకా వసూలు కావాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల నుండి ఆస్తిపన్ను వసూలయ్యేది అనుమానమే. దీంతో ప్రైవేటు భవనాల ఆస్తిపన్నుపైనే దృష్టి సారించి చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఆయా శాఖల ఉన్నతాధికారులతో మున్సిపల్ కమిషనర్ నేరుగా చర్చలు జరుపుతున్నారు. మున్సిపాలిటీకి ఆస్తిపన్ను చెల్లించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. అధికారుల చర్యలు ఫలించి 80 శాతం ఆస్తిపన్ను వసూలయినా అదే గొప్పనే పరిస్థితి కనిపిస్తోంది.