అనంతపురం

అగ్నిగుండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఏప్రిల్ 16: జిల్లా శనివారం అగ్నిగుండంలా మారింది. జిల్లాలో అత్యధికంగా గుత్తి మండలంలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఎండ దెబ్బకు జిల్లాలో ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోసగటు ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా జిల్లా కేంద్రమైన అనంతపురంలో 43 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అలాగే గుత్తి మండలంలో 44.9, కళ్యాణదుర్గం 43.3, శింగనమల 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని 118 ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌లలో 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ధర్మవరంలో నలుగురు మృతి
ధర్మవరం: భానుడి ప్రతాపం రోజు రోజుకు పెరుగుతుండడంతో ప్రజలు వడదెబ్బకు గురై మృతి చెందుతున్నారు. పట్టణంలో శుక్రవారం రాత్రి, శనివారంలలో మొత్తం నలుగురు వడదెబ్బతో అశువులు బాసారు. పోతుకుంట బిసి కాలనీకి చెందిన కిష్టమ్మ(43) బట్టీల్లో పనిచేస్తూ భర్త పోతులయ్య, కూతరుతో కలిసి జీవనం సాగిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం దాకా బట్టీలో కూలిపనికెళ్ళి సుస్తీగా వుందని స్థానికంగా గల ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకుని వైద్యుల సూచనపై అనంతపురం వెళ్ళి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అలాగే కురాకుల వీధికి చెందిన రావులచెరువు షెక్షావలి(65) కోర్టు పనిమీద విజయవాడ వెళ్లి గురువారం ధర్మవరం చేరుకున్నాడు. ఎండ తీవ్రతతో అనారోగ్యానికి గురైన ఆయన శుక్రవారం పుట్టపర్తి ఆస్పత్రికి వెళ్ళగా అక్కడ వైద్యులు పరీక్షించి ఎండ తీవ్రత వల్ల డీలా అయ్యావని, శనివారం తిరిగి రమ్మని చెప్పడంతో ఇంటికొచ్చాడు. అయితే శుక్రవారం వేకువజామున తాగేందుకు నీరడిగి నీరు తాగి సొమ్మసిల్లిపడిపోయి మృతి చెందాడు. కాగా మృతునికి భార్య రమీజాబితోపాటు ఇద్దరు కుమారులు, ఆరుగురు కుమార్తెలు వున్నారు. షెక్షావలి మృతివార్త తెలిసిన వెంటనే సిఐటియు జిల్లా అధ్యక్షుడు హైదర్‌వలి, పలువురు కార్పెంటర్లు, బేల్దారులు మృతదేహం వద్ద నివాళులు అర్పించి మృతుని కుటుంబీకులను పరామర్శించారు. కాగా మృతుడు షెక్షావలి పట్టణ కార్పెంటర్ల సంఘం అధ్యక్షులుగా వున్నారు. వీరితోపాటు మార్కెట్ వీధికి చెందిన రొట్టెల సత్యనారాయణ(55) శుక్రవారం తొండపాడుకు వెళ్లి రాత్రికి తిరిగి వచ్చి వడదెబ్బతో మృతి చెందాడు. కాగా మృతునికి భార్య ఉషారాణి, పిల్లలు వున్నారు. వీరితోపాటు కేతిరెడ్డి కాలనీకి చెందిన యల్లయ్య(70) కూలిమగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయన సైతం వడదెబ్బకు గురై శుక్రవారం రాత్రి పొద్దుపోయాక మృతి చెందాడు.
యాడికిలో ఇద్దరు...
యాడికి : మండల కేంద్రంలో శనివారం వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. స్థానిక ఆసుపత్రి కాలనీకి చెందిన నారాయణ రెడ్డి(75) మంగళవారం నుంచి అనారోగ్యానికి గురయ్యాడు. ఈనేపథ్యంలో శనివారం తీవ్ర అస్వస్థకు గురి కావడంతో వైద్య చికిత్స నిమిత్తం కర్నూలు తరలించేందుకు కుటుంబ సభ్యులు బస్టాండ్‌కు తీసుకురాగా పరిస్థితి విషమించింది. వెంటనే 108కు సమాచారం అందించారు. అయితే అప్పటికే నారాయణరెడ్డి మృతి చెందినట్లు తెలిపారు. అలాగే వేముల పాడు రోడ్డులో నివాసం ఉంటున్న శ్రీనివాసులు(53) వడదెబ్బకు గురై మృతి చెందాడు. వ్యక్తి గత పని నిమిత్తం మార్కెట్ వచ్చి తిరిగి వెళ్లిన ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాసులు విచారిస్తున్నారు.
తలుపులలో ఒకరు...
తలుపుల : మండల పరిధిలోని గజ్జలప్పగారిపల్లికి చెందిన ఇ లక్ష్మినారాయణ(50) వడదెబ్బతో శుక్రవారం రాత్రి బత్తలపల్లి ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. వారి కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి. శుక్రవారం లక్ష్మినారాయణ పొలం వద్దకు వెళ్లి పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలింది. సాయంత్రం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో బత్తలపల్లి ఆర్డీటి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ముదిగుబ్బలో...
ముదిగుబ్బ : మండల కేంద్రంలోని గేటుకొట్టాలకు చెందిన కుళ్లాయప్ప(63) శనివారం వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గేటుకొట్టాల వద్ద గల ఇంట్లోనే వున్న కుళ్లాయప్ప వడదెబ్బకు గురికావడంతో చికిత్స నిమిత్తం తరలించే లోపు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.