అనంతపురం

కదిరి మున్సిపల్ చైర్మన్ మార్పు సాకుతో కౌన్సిలర్ల కప్పదాట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, మార్చి 13: కదిరి మున్సిపల్ ఛైర్మన్ సురియాభానును మార్చాలన్న సాకుతో పలువురు కౌన్సిలర్లు కప్పదాట్లు చేస్తుండడంతో మున్సిపాల్టీలో తెలుగుదేశం పార్టీ పట్టు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. కదిరిలో ఆదిపత్య పోరును ఆసరాగా తీసుకున్న కొందరు టీడీపీ కౌన్సిలర్లు టీడీపీలోనే ఇటునుండి అటు మారేందుకు ఆర్థికపరమైన ఒప్పందాలు కుదిరాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. అయితే అభివృద్ధి పేరుతో టీడీపీలోకి చేరిన అత్తార్ వైకాపా కౌన్సిలర్లు, ఆ పార్టీ నాయకులను టీడీపీలోకి చేర్చుకొని అభివృద్ధి చేయాల్సిందిపోయి ఆదిపత్యం పోరుతో సొంత పార్టీలోని కౌన్సిలర్లను ప్రలోభపెట్టడం ఏమిటని టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇన్‌చార్జి కందికుంట హవాతో మున్సిపల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 22 మంది కౌన్సిలర్లు గెలిచి మున్సిపాల్టీలో టీడీపీ జెండాను ఎగురవేశారు. కందికుంట ఆశీస్సులతో 15వ వార్డుకు చెందిన కౌన్సిలర్ షేక్ సురియాభాను మున్సిపల్ ఛైర్మన్‌గా రెండేళ్లపాటు కొనసాగేలా బాధ్యతలు చేపట్టారు. అయితే కొన్ని రాజకీయ సమీకరణల వల్ల దాదాపు నాలుగేళ్లు దాటినా ఆమె ఛైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. అప్పట్లో కౌన్సిల్‌లో టీడీపీకి 22 మంది కౌన్సిలర్లుండగా, వైసీపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వైకాపా నుండి గెలుపొందిన ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా రెండేళ్ల క్రితం టీడీపీలోకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో చేరినప్పుడు ఆయనతోపాటు మరో ఐదుగురు వైకాపా కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కౌన్సిల్‌లో టీడీపీ బలం 27కు చేరింది. అయితే అప్పటి నుండే వైకాపా నుండి టీడీపీలోకి చేరిన 24వ వార్డు కౌన్సిలర్ సర్తాజ్‌ను ఛైర్‌పర్సన్ చేయాలని ఆమె భర్త ఆల్ఫా ముస్త్ఫా ఎమ్మెల్యే అత్తార్‌తో కలిసి ప్రయత్నాలు చేశారు. అయితే ఆరు నెలల క్రితం ఛైర్మన్‌ను మార్చాలని టీడీపీలోని కందికుంట వర్గానికి చెందిన కొంతమంది కౌన్సిలర్లు ప్రయత్నాలు చేయడంతో ఎమ్మెల్యే అత్తార్ వర్గం దీన్ని అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా గత నాలుగు కౌన్సిల్ సమావేశాలకు వైసీపీకి చెందిన 9 మంది కౌన్సిలర్లతో కలిసి గైర్హాజరు కావడంతో కోరం లేక సమావేశాలు వాయిదాపడ్డాయి. ముఖ్యంగా ఛైర్మన్ భర్త బాబ్‌జాన్‌పై వున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని అత్తార్ వర్గం భావించింది. అందులో భాగంగా కందికుంట వర్గంలోని ముగ్గురు కౌన్సిలర్లు చంద్రశేఖర్, తాత శ్రీనివాసులు, కూనక హేమావతిని పిలుచుకొని ఛైర్మన్ మార్పు కోసం ప్రయత్నాలు చేశారు. నెల క్రితం కందికుంట వర్గానికి చెందిన మరో కౌన్సిలర్ నవాబుకోట శంకర్‌ను కూడా అత్తార్ వర్గంలో చేర్చుకున్నారు. దీంతో ఎలాగైనా ఛైర్మన్ స్థానాన్ని తన వర్గానికి దక్కించుకోవాలనే ఉద్దేశంతో అత్తార్ గట్టి ప్రయత్నాలు చేశారు. వారం రోజుల క్రితం 14వ వార్డుకు చెందిన కౌన్సిలర్ మాబుసాబ్, అతని అల్లుడు జిలాన్‌లు కూడా ఎమ్మెల్యే అత్తార్‌ను కలిశారు. అయితే కందికుంట మాత్రం ఛైర్మన్ మార్పు చేసే ప్రసక్తే లేదని, ఒకవేళ ఛైర్మన్ మార్పు జరిగితే సైకిల్ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్‌నే ఛైర్మన్ చేస్తాము కానీ వైకాపా నుండి టీడీపీలోకి చేరిన కౌన్సిలర్లను ఛైర్మన్ చేసే ప్రసక్తేలేదని ఖరాఖండీగా కందికుంట చెబుతున్నారు. అంతేకాకుండా కౌన్సిలర్లు ఎంతమంది ఏ వర్గంలోకి వెళ్లినా ఛైర్మన్‌ను మార్చే ప్రసక్తే లేదని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వారం రోజుల క్రితం అత్తార్ వర్గంలో చేరిన 14వ వార్డు కౌన్సిలర్ మాబుసాబ్, అతని అల్లుడు జిలాన్ తిరిగి కందికుంట చెంతకే చేరిపోయారు. ఇదే సందర్భంలో అత్తార్ వర్గంలో ఛైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్న 24వ వార్డు కౌన్సిలర్ సర్తాజ్ భర్త ఆల్ఫా ముస్త్ఫాకు పోటీగా అదే వర్గానికి చెందిన కిరణ్ షౌఖత్ కూడా 18వ వార్డు కౌన్సిలర్, తన మరదలైన షాహీనాను ఛైర్‌పర్సన్ చేయాలని ప్రయత్నాలు చేస్తుండడంతో అత్తార్ వర్గం ఆశలు అడియాశలయ్యాయని చెప్పుకోవచ్చు. ఇప్పట్లో ఛైర్మన్ మార్పు సాధ్యం కాదని అత్తార్ వర్గీయులే చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన కదిరిలో కౌన్సిలర్లు కప్పదాట్ల వల్ల మున్సిపల్ అభివృద్ధి ఆగిపోవడంతోపాటు పార్టీ కూడా దెబ్బతిందని చెప్పుకోవచ్చు.