అనంతపురం

పవన్ పోరాటయాత్రతో ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 20 : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో(175) జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ ప్రకటించడంతో అనంత రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం ప్రారంభించిన 3పోరాట యాత్ర2లో భాగంగా అక్కడి బహిరంగసభలో పవన్ ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తామంటూ స్పష్టం చేయడం రాజకీయ వర్గాల్లో జనసేన పట్ల పునరాలోచనకు దారి తీసింది. 2014 ఎన్నికల్లో పోటీ చేయక పోవడమే తాను చేసిన పెద్ద తప్పిదమంటూ పశ్చాత్తాప పడటమే కాకుండా, కేంద్ర, రాష్ట్రాల్లోని అధికార పార్టీలు బీజేపీ, టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైకాపా పైనా ఆయన ధ్వజమెత్తారు. ఎవరిది ధర్మ పోరాటమే ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రండంటూ టీడీపీకి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కవాతులు నిర్వహిస్తామని, తమ కార్యకర్తలకు ఏది జరిగినా ఎదురు దాడి తప్పదని, సునామీలా ముంచేస్తామంటూ గట్టిగా హెచ్చరికలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో కులాలకు అతీతంగా, అందరినీ కలుపుకుని పోటీకి దిగుతుందని పవన్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో గతంలో జిల్లాలో తొలి పర్యటన సందర్భంగా అనంతపురం బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రకటించిన మేరకు జిల్లా కేంద్రం నుంచి పోటీకి దిగితే ఓట్లు తారుమారయ్యే పరిస్థితులు ఉంటాయన్న సందేహాలు రాజకీయ పార్టీల నేతల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైప పవన్‌కు జన బలం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేసే సత్తా లేదని, పోటీ చేసినపుడు చూద్దాంలే అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల్లో నేతలు ఆయన మాటల్ని తీసిపారేస్తున్నారు. అయితే కులాల ప్రాతిపదికన ఓటు బ్యాంకు రాజకీయం చేస్తున్న పార్టీలకు కాపు, బలిజ సామాజిక వర్గాల ఓట్లు చీలిపోయే పరిస్థితి తప్పక తలెత్తుతుందని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అనంతపురంలో అసెంబ్లీ స్థానానికి పోటీ పడే రాజకీయ నాయకులు అత్యధికంగా ఉన్న ముస్లిం మైనార్టీల ఓట్లతో పాటు ఇతర సామాజిక వర్గాలు, ముఖ్యంగా బలిజ సామాజిక వర్గం ఓట్లపైనా ఆధార పడక తప్పని పరిస్థితి ఉంది. దీంతో బీజేపీ ఒంటరి పోరుకు దిగుతుందా లేదా అన్నది ఇపుడిపుడే తేలే అంశం కాదు. కానీ టీడీపీ, వైకాపా అభ్యర్థులు తప్పకుండా పోటీలు ఉంటారు కనుక, వామ పక్షాల మద్దతును బట్టి ఓటు బ్యాంకును అంచనా వేసుకుంటున్నారు. ఏ సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించినా బలిజ, కాపు సామాజిక వర్గాల ఓట్లు ఈసారి చీలే తప్పని పరిస్థితులు నెలకొనబోతున్నాయి. ఈ పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ అనూహ్యంగా పోరాటయాత్ర ప్రారంభించడంతో జిల్లా రాజకీయాలపై జనసేన ప్రభావం తప్పక ఉంటుందన్న రాజకీయ పార్టీల నేతలు భావిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ నిరసన కవాతు నిర్వహిస్తామని కూడా పవన్ ప్రకటించడంతో ప్రజా మద్దతు కూడగట్టడానికి వ్యూహాత్మకంగా అడుగులు పడుతుండటాన్ని జిల్లా రాజకీయ వర్గాలు పరిశీలించే పనిలో పడ్డాయి. కాగా జిల్లాలో పవన్ పర్యటన, యాత్ర, కవాతు కార్యక్రమాల్ని విజయవంతం చేసేందుకు జనసేన పార్టీ నాయకులు సంసిద్ధులవుతున్నారు.
జగన్ సీఎం కాలేడు
* మంత్రులు పరిటాల, కాలవ
గుంతకల్లు, మే 20: బీజేపీ నమ్మించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించి కుటిల రాజకీయాలకు పాల్పడిందని, తెలుగు వాళ్ల కనె్నర్ర చేయడంతోనే కర్నాటకలో అధికారాన్ని కోల్పోవలసి వచ్చిందని మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు హెచ్చరించారు. స్థానిక మార్కెట్‌యార్డులో ఆదివారం మినీ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ అధ్యక్షత వహించిన కార్యక్రమానికి మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కర్నాటకలోని ఆంధ్రులు బీజేపీకి తగిన విధంగా బుద్ది చెప్పారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటు వైఎస్‌ఆర్‌సీపీ, పవన్ కల్యాణ్ జనసేనలను రెచ్చగొట్టి కుటిల రాజకీయాలు చేస్తున్నారన్నారు. కేంద్రం కుటిల రాజకీయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమర్థివంతంగా ఎదుర్కొనగలరన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పాదయాత్రలు చేసి ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చారన్నారు. ఇక జగన్ చెప్పడానికి తప్ప చేయడానికి ఏమి లేవని ఎద్దెవా చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి కేవలం కలలో తప్ప నిజంగా ముఖ్యమంత్రి కాలేడని విమర్శించారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం మొట్టమొదటి సారిగా పొదుపు సంఘాలను చంద్రబాబు పెట్టారన్నారు. వారికి పాదయాత్రలో రూ, 10 వేల రుణమాఫీ చేశాడన్నారు. అదే విధంగా రైతు రుణమాఫీ చేశారన్నారు. ముఖ్యంగా రాయలసీమను రతనాల సీమ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక ప్రాజెక్టులను చేపట్టారన్నారు. జిల్లాలో బీటీ ప్రాజెక్ట్, పేరూరు ప్రాజెక్ట్‌లకు నీరందించడం ద్వారా కరవు జిల్లా సస్యశ్యామలం అవుతుందన్నారు. జిల్లాలో కియా కార్ల పరిశ్రమ ద్వారా 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఫోర్‌ట్వంటీ పాదయాత్ర చేస్తున్నాడని విమర్శించారు. ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ మాట్లాడుతూ అధికారం కాచుకున్న గుంటనక్కలు పార్టీలోకి చేరేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు లబ్ధిచేకూరాలన్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో రూ. 1500 కోట్ల అభివృద్ధి జరిగిందన్నారు. జిల్లాలో హిందూపురం తర్వాత గుత్తి తాగునీటి ఎద్దడి నెలకొన్న ప్రాంతమన్నారు. గుత్తి, పామిడీ మండలాల తాగునీటి అవసరాల కోసం రూ. 130 నిధులు ముఖ్యమంత్రి మంజూరు చేశారన్నారు. జీఎల్‌పీ పథకం ద్వారా శాశ్వత తాగునీటి పరిష్కారాన్ని ఇవ్వనున్నారన్నారు. కసాపురం రోడ్డులో ఆర్‌యూబీ ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. జడ్పీ చైర్మన్ నాగరాజు, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు బీటీ నాయుడు, మున్సిపల్ ఛైర్మన్ కోడెల అపర్ణ, వైస్ ఛైర్మన్ ఆర్ శ్రీనాథ్‌గౌడ్, ఎంపీపీ రాయల్‌రామయ్య, మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన్ బండారు ఆనంద్, గుత్తి మున్సిపల్ ఛైర్మన్ తులసమ్మ, పామిడి ఛైర్మన్ గౌస్, కౌన్సిలర్‌లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.