అనంతపురం

కొత్త కార్డులకు ‘ప్రాధికార’ గండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 24 : కొత్త రేషన్ కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అర్హులు ఎదురు చూస్తున్నారు. అయితే సర్వర్‌లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో సకాలంలో కొత్త కార్డులు సిద్ధమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం జూన్ నుంచి కొత్త కార్డులు పంపిణీ చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తోంది. అదే సమయంలో పంపిణీకి సిద్ధం చేయాల్సిన కార్డులకు సర్వర్‌లో సాంకేతిక సమస్య ఆటంకంగా మారింది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులు చాలా మంది ప్రాధికార సర్వేలో నమోదు కాకపోవడం వల్లే సివిల్ సప్లైయ్స్‌కు సంబంధించిన సర్వర్‌లో కార్డుదారుల సమాచారం నమోదు కావడం లేదని అధికారులు పేర్కొన్నారు. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ వేలాది కొత్త కార్డులను అప్‌లోడ్ చేస్తుండటంతో సర్వర్ డౌన్ అవుతోంది. దీంతో ప్రాధికార సర్వేలో నమోదైన వారి కార్డులు కూడా ఆమోదం పొందడం లేదు. తద్వారా కార్డుల జారీలో జాప్యం జరిగే పరిస్థితి నెలకొంది. ఈ సమస్య కొన్ని నెలలుగా ఉన్నప్పటికీ సర్వర్ సామర్థ్యాన్ని పెంచి వేగవంతం చేసే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రాధికార సర్వేలో దరఖాస్తుదారులు తప్పనిసరిగా తమ కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే కొత్త కార్డులు ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. కాగా జిల్లాలో గత జన్మభూమి-మా ఊరు కార్యక్రమాల్లో వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటి వరకు 7000కు పైబడి కార్దుదారుల వివరాలు అప్‌లోడ్ చేశారు. వీటిలో 3200 కార్డులు అన్ని వివరాలు కచ్చితంగా ఉన్నట్లు నిర్ధారణైంది. అయితే కేవలం 2,400 రేషన్ కార్డులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా కార్డులు సిద్ధం కావడానికి ఎంత సమయం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సర్వర్ డౌన్ అయినా ప్రధానంగా ప్రాధికార సర్వేలో లేని వారు వెంటనే తమ వివరాల్ని నమోదు చేసుకుంటే తప్ప కొత్తరేషన్ కార్డుల దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని సివిల్ సప్లైయ్స్ అధికారులు చెబుతున్నారు. వెంటనే దరఖాస్తుదారులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు.
జూన్ నుంచి కంది పప్పు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి కిలో రూ.40 చొప్పున కందిపప్పును రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు జిల్లా సివిల్ సప్లైయ్స్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 12 లక్షల 50వేల వరకు రేషన్ కార్డులున్నాయి. వీటితో పాటు కొత్తగా వచ్చే కార్డులు ఐదారువేలు దాకా ఉండొచ్చని అంచనా. వీటిలో 70 శాతం కార్డులకు కందిపప్పు అందే అవకాశం ఉంది. ఇందుకోసం జిల్లాకు 300 మెట్రిక్ టన్నులు కందిపప్పు రానుంది. ప్రయోగాత్మకంగా ఏప్రిల్‌లో 780 టన్నులు, మే నెలలో 200 టన్నులు కార్డుదారులకు సరఫరా చేశారు. కందిపప్పును మార్కెట్ ఫెడ్ ద్వారా సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్థ కందులను అధికంగా సేకరించింది. దీంతో జూన్ నెల పంపిణీకి 300 టన్నులు కందిపప్పు పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే రంజాన్ తోఫా సరుకులు సుమారు 1.27 లక్షల కార్డులకు పంపిణీ చేయడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు.