అనంతపురం

సబ్సిడీ విత్తన వేరుశనగ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 27 : జిల్లాలో ఈ ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతున్న తరుణంలో విత్తన వేరుశెనగ కాయల కొరత రానీకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. గతేడాది నాణ్యతలేని విత్తన కాయలను సరఫరా సంస్థలు కొన్ని పంపించడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ ఆదేశాల మేరకు ఈసారి నాణ్యమైన విత్తనాన్ని అందించాలన్న లక్ష్యంతో జిల్లా వ్యవసాయ శాఖ అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కాగా ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 6.40 లక్షల హెక్టార్లలో మెట్ట ప్రాంతంలో వేరుశెనగ పంట సాగు చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. గతేడాది వేరుశెనగ సాగును తగ్గించాలని రైతుల్లో అవగాహన కల్పిస్తూ, 6.05 లక్ష్ల హెక్టార్లకు మించి సాగు కానీకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు 3.34 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేశారు. ఈ ఏడాది హంద్రీ నీవా, హెచ్చెల్సీ నుంచి నీటిని తరలించి చెరువులు నింపారు. దీంతో ఈసారి గత ఏడాది కన్నా 6వేల హెక్టార్లు అదనంగా సాగయ్యే అవకాశం ఉందని భావించి, 5 లక్షల క్వింటాళ్ల మేరకు విత్తన వేరుశనగ అవసరమవుతుందని ప్రభుత్వానికి జిల్లా వ్యవసాయ శాఖ నివేదిక పంపింది. ప్రస్తుతం 3.40 లక్షల క్వింటాళ్లకు గానూ 1.83 లక్షల క్వింటాళ్ల విత్తన కాయలు ప్రాసెసింగ్ పూర్తయింది. దశలవారీగా 51 మండల కేంద్రాలకు విత్తన కాయల్ని అక్కడి గోడౌన్లకు చేర్చారు. రాయదుర్గం మండలానికి 5,816 క్వింటాళ్లు, గోరంట్ల-3,172, పామిడి-2,772, ఆత్మకూరు-2,595, గుంతకల్లు-2,267 క్వింటాళ్ల చొప్పున సరఫరా చేశారు. సేకరణ ధర కిలో రూ.61, క్వింటా 6,100 కాగా, ఇందులో 40శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఈ మేరకు రూ. 2,440 సబ్సిడీ పోనూ, రైతులు రూ.3,660 చెల్లించాల్సి ఉంది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 30 కేజీల విత్తన కాయల బ్యాగులు 4 వరకు ఇస్తారు. జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ సీడ్స్ 23 మండలాల్లో 33,398 క్వింటాళ్లు పంపిణీ చేయనుంది. ఇంకా 6,682 క్వింటాళ్ల బఫర్ స్టాక్ ఉంది. ఆయిల్‌ఫెడ్ 25 మండలాల్లో 25,545 క్వింటాళ్ల పంపిణీ చేయనుంది. వాసన్ కంపెనీ 3 మండలాల్లో పూర్తిగా 11,556 క్వింటాళ్లు పంపిణీ బాధ్యతలు తీసుకోగా, సుమారు 28 మండలాల్లో పాక్షికంగా విత్తన పంపిణీలో భాగస్వామ్యం వహించనుంది. ఈ కంపెనీ పంపిణీ చేసే విత్తన కాయల ధర క్వింటా రూ.5,920 కాగా, రూ.3,552 నాన్ సబ్సిడీగా చెల్లించాల్సి ఉంటుంది. ఓవైపు విత్తన పంపిణీ ప్రారంభం కాగానే, మరోవైపు ఇంకా 1.56 లక్షల క్వింటాళ్ల వేరుశెనగ విత్తన కాయలు ప్రాసిసెంగ్ కొనసాగుతూ ఉంటుందని జిల్లా వ్యవసాయాధికారి ప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా కడప, కర్నూలులో మరో లక్ష క్వింటాళ్ల విత్తన కాయల సేకరణ పూర్తి చేసి సిద్ధంగా ఉంచామన్నారు. కాగా 58 మండలాల్లో వ్యవసాయ శాఖకు చెందిన గోడన్లలో విత్తన కాయలు పంపిణీకి సిద్ధం చేశారు. మిగతా చోట్ల కాలేజీలు, ప్రభుత్వ స్కూళ్లలో కేంద్రాల ఏర్పాటుకు డీఈఓ, కళాశాలల యాజమాన్యాల అనుమతికి లేఖలు పంపింది. జిల్లావ్యాప్తంగా అన్ని పంపిణీ కేంద్రాలను రెండు, మూడు రోజుల్లో నోటిఫై చేయనున్నారు. అలాగే విత్తన పంపిణీ తేదీలను కలెక్టర్ ఆదేశాల మేరకు నేడో, రేపో ఖరారు చేయడానికి వ్యవసాయశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. విత్తన కాయలతో పాటు పంపిణీ చేసేందుకు విత్తనశుద్ధి మందు ట్రైకో డెర్మావిరిడీ 2,450 క్వింటాళ్లు తెప్పించనున్నారు. ఇప్పటికే 2,232 క్వింటాళ్లు సిద్ధంగా ఉంది. నవధాన్యాలు 2 లక్షల కిట్స్,వీటితో పాటు అదనంగా 5వేల క్వింటాళ్ల కంది విత్తనాలు పంపిణీ చేయనున్నారు. పంపిణీ ప్రారంభం నాటికి 2 లక్షల క్వింటాళ్లు సిద్ధంగా ఉంచనున్నారు.
బయోమెట్రిక్ ద్వారానే పంపిణీ
గతంలో లాగా ఈసారీ బయోమెట్రిక్ ద్వారానే విత్తన కాయలు పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి యాప్ సిద్ధంగా ఉంది. రైతులు ఆధార్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం తెచ్చుకోవాల్సి ఉంటుంది. 430 బయోమెట్రిక్ మిషన్స్‌ను వినియోగించనున్నారు. గత ఏడాది 430 వినియోగించగా, వాటిలో 130 మాత్రమే బాగా పని చేస్తున్నాయి. మిగతా 300 మిషన్లు మరమ్మతులకు గురయ్యాయి. వాటి స్థానంలో కొత్తవాటిని తెప్పిస్తున్నారు. వీటికి నెట్ కనెక్షన్ నిమిత్తం బీఎస్‌ఎన్‌ఎల్‌కు వ్యవసాయ శాఖ డబ్బు చెల్లించింది. కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నందున వారికి ట్యాబ్స్ ఇస్తున్నారు.

మండుతున్న పెట్రో ధర
* రోజుకు 30-40 పైసలు పెరుగుదల..* ఆందోళనలో వాహనదారులు

అనంతపురం, మే 27 : పెట్రోలు ధరలు రోజురోజుకూ భగ్గుమంటోంది. రోజురోజుకూ ధర పెరుగుతుండటంతో వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. రెండు వారాలుగా ఇంధన ధరల్లో మార్పుల చోటుచేసుకుంటున్నాయి. దీంతో రోజూ కనీసం 30-40 పైసలు పెరుగుతోంది. డీజిల్ ధర పెరుగుదల కూడా ఇదే విధంగా ఉండటంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. ఆదివారం పెట్రోల్ ధర రూ.84.35 పైసలు, డీజిల్ 76.36 పైసలుగా ఉంది. కాగా గత కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న ధర మేరకు ఆదివారానికి కనీసం రూ.2.50 పైసలు నుంచి రూ.3 వరకు అదనపు భారం పడింది. పెట్రోలు ధరల తగ్గింపుపై దృష్టి సారిస్తామని, ఎక్సైజ్ సుంకంలో కోత సహా పలు చర్యలు చేపడతామని ఇదివరకే కేంద్రం ప్రకటించినా, ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడం గమనార్హం. దీంతో వినియోగదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో కొన్ని నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేవారు. అయితే మారిన ఇంధన నిబంధనల మేరకు రోజువారీ ధరలు నిర్ణయం అవుతున్నందున గడచిన రెండు, మూడు నెలల్లో పెట్రోలు రూ.76 నుంచి ప్రస్తుతం రూ.84కు పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో మరో రూ. 10 పైబడి ధర పెరిగినా ఆశ్చర్చపోవాల్సిన అవసరం లేదని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలతో రూ.లక్షల్లో జేబులకు చిల్లు పడుతోంది. ధర పెరగడంతో కొంత మేరకు పెట్రోల్ వినియోగం తగ్గిందని పలు ఆయిల్ కంపెనీలకు చెందిన పెట్రోలు బంకుల నిర్వాహకులు చెబుతున్నట్లు సమాచారం.