అనంతపురం

రాయితీ రుణాలకు భారీ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం టౌన్, జూన్ 19 : హిందూపురం మున్సిపల్ పరిధిలో వివిధ కార్పోరేషన్ ద్వారా రాయితీ రుణాలు పొందేందుకు మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించగా వేలాదిగా దరఖాస్తుదారులు తరలివచ్చారు. వచ్చిన అభ్యర్థులకు సంబంధించిన వివిధ ధ్రువీకరణలను బ్యాంకర్లు పరిశీలించారు. ఇంటర్వ్యూలను మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి, పట్టణ ప్రణాళిక విభాగం అధికారి నాగ సుబ్బరాయుడు పర్యవేక్షించారు. స్థానిక మున్సిపాలిటీకి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 290 యూనిట్లు మంజూరు కాగా 1171 మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ రుణాల కోసం 101 మంది దరఖాస్తు చేసుకోగా 14 యూనిట్లు మంజూరయ్యాయి. మైనార్టీ కార్పొరేషన్ కింద 125 యూనిట్లు మంజూరు కాగా 2163 మంది, క్రిష్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మూడు యూనిట్లు మంజూరు కాగా ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ రుణాల కోసం 1416 మంది దరఖాస్తు చేసుకోగా 25 యూనిట్లు, కాపు కార్పోరేషన్ కింద 120 యూనిట్లకు 343, ఈబీసీ ద్వారా తొమ్మిది యూనిట్లకు తొమ్మిది మంది, వైశ్యా కార్పొరేషన్ ద్వారా రెండు యూనిట్లకు 168 దరఖాస్తులు వచ్చాయి. ఇంటర్వ్యూలు నిర్వహించిన బ్యాంకర్లు త్వరలోనే ఎంపికైన లబ్ధిదారుల జాబితాను తెలియజేస్తామని తెలిపారు. అయితే సిఫార్సులు ఉన్న అభ్యర్థులకే సబ్సిడీ రుణాలు అందుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తుల్లో ఎంత మందికి రుణాలు మంజూరవుతాయో వేచి చూడాల్సిందే.
కదిరిలో రౌడీషీటర్ల బహిష్కరణ
కదిరి, జూన్ 19: గతంలో చేసిన పొరబాట్లను మరోమారు చేయకుండా, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా వుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని రౌడీషీటర్ నారాయణస్వామి హత్య కేసులో వున్న నిందితులకు పట్టణ సీఐ గోరంట్ల మాధవ్ సూచించారు. హత్య కేసులో వున్న నిందితులను ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు పట్టణ బహిష్కరణ చేశారు. వీరిని మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌనె్సలింగ్ ఇచ్చి పట్టణం వదిలి వెళ్లాలని సీఐ ఆదేశించారు. క్షణికావేశంలో తెలిసీతెలియక తప్పులు చేశారని, అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా వుండి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, ఎక్కడైతే నిందితులు జీవనం సాగిస్తారో అక్కడ కూడా నేరాలకు దూరంగా ఉండాలని సీఐ సూచించారు.
విద్యుత్ ద్వారా రూ.1.13 కోట్లు ఆదా..
* డివిజన్ పరిధిలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు - ఎల్‌ఇడీల పూర్తి * డీఆర్‌ఎం విజయప్రతాప్‌సింగ్
గుంతకల్లు, జూన్ 19 : గుంతకల్లు రైల్వే డివిజన్‌లో విద్యుత్ సరఫరా ఆదా చేయడం ద్వారా రూ.1.13 కోట్ల ఆదాయం లభించిందని గుంతకల్లు రైల్వే డివిజినల్ మేనేజర్ విజయ్‌ప్రతాప్‌సింగ్ అన్నారు. మంగళవారం స్థానిక డీఆర్‌ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంతకల్లు రైల్వే డివిజన్‌లో మూడు దశల్లో ఎల్‌ఈడీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా 157 రైల్వేస్టేషన్లు, 222 సర్వీస్ కార్యాలయాలు, 3833 రెసిడెన్షియళ్లు, ఎల్‌ఈడీల ఏర్పాటు నిర్దేశించిన సమయం కన్నా ముందుగానే పూర్తి చేశామన్నారు. స్టేషన్ల రూఫ్‌లపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. డివిజన్ పరిధిలోని తిరుపతి, రేణిగుంట రైల్వేస్టేషన్‌తోపాటు వెయిటింగ్ హాళ్లలకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే డివిజన్‌లో సోలార్‌పార్క్ ఏర్పాటు చేసేందుకు ఆరు ప్రాంతాల్లో 170 ఎకరాల భూసేకరణ చేసినట్లు తెలిపారు. గుంతకల్లు, పాకాల, ధర్మవరం, నందలూరు, లింగిరి, ఓబుళవారిపల్లి స్టేషన్‌లలో ఏర్పాటు చేయనున్న సోలార్ పార్క్ ద్వారా భవిష్యత్‌లో విద్యుత్ లోకోలకు అవసరమైన విద్యుత్ సరఫరా అందుతుందన్నారు. పీపీపీ విధానంతో ఏర్పాటు చేయనున్న సోలార్ పార్క్ ద్వారా 34 మెగావాట్ల విద్యుత్ సరఫరా లభిస్తుందన్నారు. దీనివల్ల భవిష్యత్‌లో మరింత భారీ మొత్తంలో ఆదాయం చేకూరుతుందన్నారు.