అనంతపురం

పడకేసిన ప్రజారోగ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమాడ, జూన్ 23: గ్రామాల్లో పరిశుభ్రత, ప్రజారోగ్యంపై చర్యలు కేవలం మాటల్లో మాత్రమే వున్నాయనీ, పంచాయతీలు, మున్సిపాల్టీల పరిధిలో చేబట్టాల్సిన పరిశుభ్రతా చర్యలు చేతల్లో చూపడం లేదన్న విమర్శలు జిల్లా వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. పట్టణాలు, గ్రామ పంచాయతీల గ్రామాల్లో విచ్చలవిడిగా పందుల సంచారం జరుగుతూనే వుంది. ఎక్కడికక్కడ అపరిశుభ్రత పేరుకుపోతుండటం కారణంగా దోమలు అధికమై ప్రజల్ని చంపుకు తింటున్నాయి. అధికారులుగానీ, పాలకులుగానీ ప్రజలు రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరిగి చివరికి ప్రాణాలు కోల్పోతే తప్పా జిల్లాలో అపరిశుభ్రతపై చర్యలు చేబట్టడం లేదని చెప్పుకోవచ్చు. మున్సిపాలిటీల పరిధిలో అయితే ఏ 15 రోజులకో, నెలకో ఒకసారి డ్రైనేజి కాలువలు శుభ్రపరచడం, ఆ చెత్తా చెదారాలు ఆ కాలువల వద్దే వేశాక వాటిలో పందులు స్వైరవిహారం చేశాక రెండు, మూడు రోజుల తర్వాత వాటిని తొలగించడం చేస్తున్నారు. ఇక పంచాయతీల పరిధిలో అయితే కేవలం వీధిలైట్లు, నీటి సరఫరా తప్పా తమకేమీ సంబంధం లేనట్లుగా పాలకులు, పంచాయతీల అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వున్న 1003 పంచాయతీల్లో సుమారు 70శాతం పంచాయతీ గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాలను తొలగించే దాఖలాలు కనిపించని పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని పంచాయతీల్లో అయితే చుట్టం చూపుగా చేబట్టిన పరిశుభ్రతా కార్యక్రమాల్లో అధికారులు, పాలకులు కేవలం ఫొటోలకు ఫోజులిచ్చేసి ఏదో సాధించేసామన్నట్లుగా ఆ వివరాలు కలెక్టర్‌కు పంపిస్తూ పబ్బం గడుపుకుంటున్న పరిస్థితులు చాలా మండలాల్లో కొనసాగుతోంది. పంచాయతీ నుంచి వచ్చే నిధులు కేవలం వీధిలైట్ల ఏర్పాటు, పంచాయతీ బోర్లలో మోటార్ల మరమ్మతులకు వినియోగిస్తూ పరిశుభ్రతా చర్యలు తమకు సంబంధం లేని విషయంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మున్సిపాల్టీల్లో అయితే అనునిత్యం పందుల సంచారం జరుగుతున్నా పట్టించుకునేవారుండరు. అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా పందుల సంచారం జోరుగా కొనసాగుతూ వాటిని గ్రామానికి వెలుపల వుండే విధంగా చర్యలు చేబట్టాలని ఆయా మండలాల్లో పలుమార్లు మండల పరిషత్, రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోని అధికారులు జిల్లా వ్యాప్తంగా వున్నారనే చెప్పుకోవచ్చు. పాలకులు కూడా ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులను ఏ విధంగా ఏ నాయకుడికి ఎంతెంత అన్న చందంగా పంచుకుంటూ ఏవో వారికి లబ్ది చేకూరే పనుకే ప్రాధాన్యతనిచ్చుకుంటూ లాభం పొందుతున్నారుగానీ ప్రజారోగ్యం పై ఏ మాత్రం పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారని విమర్శలు లేకపోలేదు. వాతావరణంలోని మార్పులు, గ్రామాల్లో అపరిశుభ్రత కారణంగా ప్రబలుతున్న దోమల వల్ల వస్తున్న పలు రోగాలతో జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా దోమల నిర్మూలనా చర్యలు తీసుకోవాల్సిన జిల్లా మలేరియా విభాగం పనితీరు అంతంతమాత్రంగానే వుందనీ, దోమల నిర్మూలనతో కేవలం ర్యాలీలు నిర్వహింస్తూ వార్తలొచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు తప్పా దోమల నిర్మూలనా చర్యలు పూర్తి స్థాయిలో జరగడం లేదన్న విమర్శలున్నాయి. గ్రామాల్లో అభివృద్ధి చెందిన దోమల నిర్మూలనకు అత్యవసరమైన ప్రక్రియ ఫాగింగ్ చేయడమేనని వైద్య ఆరోగ్య శాఖ అధికారులే చెప్తుంటారు. అయితే జిల్లా మలేరియా విభాగం పరిధిలో కనీసం 10 ఫాగింగ్ యంత్రాలు కూడా లేకపోవడం విచారకరం. దీంతో గ్రామాల్లో పర్యటిస్తున్న ఆరోగ్య సిబ్బంది మురికి నీళ్లలో అభివృద్ధి చెందుతున్న లార్వానైతే నాశనం చేస్తున్నారుగానీ అభివృద్ధి చెందుతున్న దోమల నిర్మూలన చర్యలు తక్కువనే చెప్పుకోవచ్చు. పంచాయతీల వారు చేయాల్సిన పరిశుభ్రతా చర్యలు కూడా ఆరోగ్య సిబ్బందే పలు గ్రామాల్లో చేబడుతూ దోమల నిర్మూలనకు తమవంతు ప్రయత్నాలు అనునిత్యం కొనసాగిస్తూనే వున్నారు. వారికేమాత్రం పంచాయతీల నుంచి సహకారం అందడం లేదనే చెప్పాలి. కాగా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మలేరియా నిర్మూలనా మాసోత్సవాలులాంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ గ్రామాల్లో పరిశుభ్రతా చర్యలు తీసుకోవాల్సిన పంచాయతీల అధికారులు పట్టించుకోకుండా వుండటంతో గ్రామాల్లో యథావిధిగా పలు రోగాలు ప్రజలను పట్టిపీడిస్తూనే వున్నాయని చెప్పుకోవచ్చు. వర్షాకాలం కావడంతో మురికి నీరు గుంతలు అధికం కావడం, వాటిలో దోమలు అభివృద్ధి చెంది మలేరియా, ఇతర ప్రాణాంతక జ్వరాలు ప్రజలకు సోకి ఎవరైనా ప్రాణాలో కోల్పోకముందే ప్రజారోగ్యంపై పాలకులు, అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.