అనంతపురం

వామపక్షాల ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 12: జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులకు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని, ముచ్చుకోట, సుబ్బరాయ సాగర్‌కు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో జిల్లా రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. ఇందులో భాగంగా తపోవనం వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. గత నెల 29న రైతులను ఆదుకోవాలంటూ కరువు రైతు కవాతును వామపక్షాలు నిర్వహించాయి. ప్రభుత్వం స్పందించక పోవడంతో జిల్లా వ్యాప్త రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చినట్లు నేతలు తెలిపారు. ఉదయం 10 గం.లకు తపోవనం జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. అప్పటికే పెద్ద ఎత్తున మొహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. నాయకులను అరెస్ట్ చేసి 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ వరుస కరువులతో సతమతమవుతున్న జిల్లా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ ఏడాది జిల్లాలో తీవ్రమైన కరువు నెలకొందని, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంలోను ప్రభుత్వం వివక్షతను ప్రదర్శిస్తోందన్నారు. ముచ్చుకోట, సుబ్బరాయ సాగర్ రిజర్వాయర్‌లు ఎండిపోయాయన్నారు. వీటికి నీరు ఇచ్చినట్లయితే భూగర్భ జలాలు పెరిగి రైతులు పంటలు పండించుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. కరవు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని, 4, 5 విడతల రుణమాఫీ ఒకేసారి రైతుల ఖాతాలకు జమ చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ రైతులకు సహాయం అందించే వరకు పోరాటం ఆగదన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సీపీఎం నాగేంద్రకుమార్, రామిరెడ్డి, ప్రకాష్, చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఐ జాఫర్, శ్రీరాములు, లింగమయ్య, జనసేన నాగేంద్ర తదితరులు ఉన్నారు.

భూ కబ్జాలపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలి
* సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్
అనంతపురం, నవంబర్ 12: రూరల్ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల కబ్జాపై వస్తున్న కథనాల పట్ల ప్రభుత్వం స్పందించాలని, జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి వాటిని స్వాధీనం చేసుకోవాలని సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రభుత్వ భూముల్ని అధికార పార్టీ నాయకులు యధేచ్చగా కబ్జా చేస్తున్నారన్నారు. రూరల్ మండలం కురుకుంటకు చెందిన అధికార పార్టీ నాయకుడు భూ కబ్జాకు పాల్పడుతున్నారని, అదేవిధంగా ఏ నారాయణపురం, ఇతర ప్రాంతాల్లోను భూ కబ్జాలకు పాల్పడుతూ కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఆక్రమించుకుంటున్నారన్నారు. వీటిపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.