అనంతపురం

ఫైబర్ నెట్ కనెక్షన్స్ ఏర్పాటు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 12 : ఇంటింటికీ ఆన్‌లైన్ సేవలు అందించేందుకు జిల్లాలో ఫైబర్ నెట్ కనెక్షన్లను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్ మేనేజర్‌ను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జేసీ తన ఛాంబర్‌లో ఎంఎస్‌ఓలు, ఆర్‌డీఓలతో ఫైబర్ నెట్ పురోగతిపై సమీక్షించారు. ఫైబర్ నెట్ కనెక్షన్ పొందేందుకు సెటప్ బాక్స్‌కు రూ.4వేలు ఖర్చవుతుందన్నారు. అందులో రూ.149 కనెక్షన్ పొందేందుకు రూ.36 పన్నులు రూపంలోనూ, నెలవారీ కంతుగా లబ్ధిదారులు రూ.50 చొప్పున 8 సంవత్సరాలపాటు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్ మేనేజర్ రామచంద్ర వివరణ ఇస్తూ జిల్లాలో ఇప్పటి వరకు 25 వేల కనెక్షన్లు ఏర్పాటు చేశామన్నారు. ఏసీడీసీఎల్, ఎస్ డిజిటల్ ఇండియా ఎంఎస్‌ఓల పరిధిలో 1.80 లక్షల కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు గూగూడు, చిన్న ఎక్కలూరు, ఎల్లుట్ల, కోమటికుంట్ల, కల్లుమడి, నిడిగళ్లు, గొడ్డుమర్రి, కల్లూరు, వెన్నపూసపల్లిలో వంద శాతం ఫైబర్ నెట్ కనెక్షన్లు ఏర్పాటు చేశామని వివరించారు. డీపీఓ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ 17 పంచాయతీల్లో మూడు మాత్రమే పనిచేశాయని, మిగిలిన చోట్ల మోడెం పనిచేయకపోవడం, ఇతర సాంకేతిక కారణాల వల్ల పని చేయడం లేదని జేసీ దృష్టికి తెచ్చారు. జేసీ స్పందిస్తూ.. పనిచేయని చోట్ల నాలుగు రోజుల్లో మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఎంఎస్‌ఓలు, ఎల్‌సీఓలతో ఆర్‌డీఓలు సమావేశాలు నిర్వహించాలన్నారు. రాయదుర్గం, మడకశిర, హిందూపురం కర్ణాటక సరిహద్దులో ఉన్నందున కన్నడ ఛానళ్లు కావాలని వారు కోరుతున్నారని ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్ మేనేజర్, డీపీఓలు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఆపరేటర్లకు రుణ సహాయాన్ని అందజేస్తే ఫైబర్ నెట్‌ను ముందుకు తీసుకెళతామన్నారు. జిల్లా అంతటా 1.80 లక్షల కనెక్షన్లు ఏర్పాటుచేయాల్సి ఉందన్నారు. జేసీ స్పందిస్తూ ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ మేనేజర్ డీపీఓ, ఆర్‌డీఓలతో సమన్వయం చేసుకుని ఫైబర్ నెట్ సర్వీసుల్ని జిల్లా అంతటా ఏర్పాటుచేయాలని సూచించారు. సమావేశంలో ఆర్‌డీఓలు ఆనంద్, తిప్పేనాయక్, ఓబిలేసు, అనంతపురం తహశీల్దార్ హరిప్రసాద్, ఐఅండ్‌పీఆర్ డీఈ నాగభూషణం, కదిరి, హిందూపురం ఎంఎస్‌ఓలు శివ, శ్రీకాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
హంద్రీ నీవాలో కృష్ణా పరవళ్లు
* 20న హిందూపురం, మారాలకు
* డిసెంబర్ 15లోగా కుప్పానికి తరలింపు

అనంతపురం, నవంబర్ 2 : హంద్రీ నీవా ద్వారా కృష్ణా జలాలను అనంతపురం, చిత్తూరు జిల్లాలోని హిందూపురం, మడకశిర, మారాల రిజర్వాయర్, కుప్పానికి తరలించే ప్రక్రియ వేగవంతమవుతోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీ నీవా అధికారులతో సమీక్షించినట్లు సమాచారం. ఈ మేరకు ఈ నెల 20న హిందూపురం మారాలకు, డిసెంబర్ 15న మడకశిర, చిత్తూరు జిల్లా కుప్పంకు అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను తరలించనున్నారు. ఈ నెల 20 నాటికే చిత్తూరు జిల్లా సరిహద్దుకు నీటిని చేర్చాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. కాగా నీటి తరలింపు విషయంలో ప్రస్తుత తేదీలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉందని హంద్రీ నీవా అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు హంద్రీ నీవా ద్వారా 14 టీఎంసీల కృష్ణా జలాలు కర్నూలు జిల్లా మల్యాల నుంచి ఎత్తిపోతల ద్వారా జిల్లాకు చేరాయి. మరో 6 టీఎంసీల నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హంద్రీ నీవా కాలువ మీద మొత్తం 10 పంపింగ్ స్టేషన్లుండగా, ఒక్కో పంపింగ్ స్టేషన్లో 12 పంపులున్నాయి. వీటిలో ఒక్కోచోట 6 చొప్పున పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. కాగా జీడిపల్లి నుంచి కాలువ ద్వారా తొలుత 250 క్యూసెక్కుల చొప్పున నీటిని తరలించేందుకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ట్రయల్ రన్ కింద మారాల రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తున్నారు. అలాగే హిందూపురం, మడకశిరకు కూడా నీటిని సరఫరా చేయనున్నారు. జీడిపల్లి నుంచి సుమారు 400 కి.మీ. దూరంలో ఉన్న కుప్పానికి 0.5 టీఎంసీ నుంచి 1 టీఎంసీ వరకు నీటిని తరలించే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే అనంతపురం జిల్లాలో రాప్తాడు, ఉరవకొండ, ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల్లోని 52 చెరువులకు నీటిని సరఫరా చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోని చెరువులకు కూడా హంద్రీ నీవా కాలువ ద్వారా అనుకూలతనుబట్టి నింపుకుంటూ వెళ్లే కార్యాచరణకు అధికారులు శ్రీకారం చుట్టారు.