అనంతపురం

ఔత్సాహిక దళిత పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, డిసెంబర్ 11: ఔత్సాహిక దళిత పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ జీ.వీరపాండ్యన్ సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోనీ మినీ కానె్ఫరెన్సు హాల్‌నందు పరిశ్రమల శాఖాధికారులతో కలెక్టర్ పరిశ్రమల అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అధిక స్థాయిలో పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని తెలిపారు. నిరుద్యోగ యువత పరిశ్రమల స్థాపనకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు పరిశ్రమల స్థాపనలో ప్రోత్సాహకాలు, ఎంఎస్‌ఎంఈ పార్క్ అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పరిశ్రమలకు కావలసిన అన్ని వౌలిక వసతులు కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని, ఎలాంటి దరఖాస్తును తిరస్కరించరాదని పేర్కొన్నారు. తిరస్కరణ అయిన దరఖాస్తులపై సంబందిత వ్యక్తులతో పరిశ్రమల శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలను చేపట్టి వారిని చైతన్యవంతులుగా చేయాలన్నారు. కేంద్ర ఫ్రభుత్వం ఆధ్వర్యంలో ముద్రణ రుణం, స్టాండప్ రుణాలపై ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఎలా అమలుచేస్తున్నారో సదరు విషయాలను కూడా సమావేశంలో చర్చించడం జరుగుతుందని, ఆయా సమావేశాలలో బ్యాంకు ప్రతినిధులు కూడా హాజరయ్యే విధంగా పరిశ్రమల శాఖ జీఎం చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పరిశ్రమల శాఖ జీఎం సుదర్శన్‌బాబు మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మన జిల్లా మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అందరూ పరిశ్రమ అనుమతులు ఇవ్వాలని తెలిపారు. 21 రోజుల్లో అన్ని పారిశ్రామిక అనుమతులను మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు

రన్నింగ్ స్ట్ఫా సమస్యలు
పరిష్కరించకుంటే సమ్మె
గుంతకల్లు, డిసెంబర్ 11: భారత రైల్వేలో వున్న రన్నింగ్ స్ట్ఫా సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని, అవసరమైతే సమ్మెకు దిగి రైల్వేలను స్తంభింప చేస్తామని దక్షిణమధ్య రైల్వే ఎఐఎల్‌ఆర్‌ఎస్‌ఎ జనరల్ సెక్రటరీ గురుమూర్తి హెచ్చరించారు. స్థానిక ఆరోగ్యమాత చర్చి సమీపంలో గల కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన సమావేశానికి దక్షిణమధ్య రైల్వే ఆల్ ఆండియా లోకో రన్నింగ్ స్ట్ఫా అసోసియేషన్ కార్యదర్శి గురుమూర్తి, జోనల్ కమిటీ అధ్యక్షులు మహాలింగం, ఉపాధ్యక్షులు బలరామయ్య, మజ్దూర్ యూనియన్ డివిజన్ కార్యదర్శి విజయ్‌కుమార్, ఎంప్లాయిస్ సంఘ్ డివిజన్ కార్యదర్శి ప్రభాకర్, సీపీఎం రాష్ట్ర కమిటీ నాయకులు ఓబులు, సీఐటీయు జిల్లా కార్యదర్శి డి శ్రీనివాసులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ రైల్వేలోని రన్నింగ్ స్ట్ఫా కార్మికులకు 7వ పే కమిషన్‌లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రన్నింగ్ అలవెన్స్‌లు, జీతభత్యాలు చెల్లింపులో ఆర్‌ఎసీ 1980 ఫార్ములా ప్రకారం చెల్లించాలన్నారు. అదేవిధంగా రిటైర్డ్ రన్నింగ్ స్ట్ఫాకు ప్యారిటి పెన్షన్‌లు ఇవ్వాలన్నారు. నూతన పెన్షన్‌లు రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. రన్నింగ్‌స్ట్ఫా సమస్యలను పరిష్కరించాలని ఫిబ్రవరిలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో లోకో రన్నింగ్ స్ట్ఫా కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

కొండూరులో గంగమ్మ విగ్రహం ఊరేగింపు
లేపాక్షి, డిసెంబర్ 11: మండల పరిధిలోని కొండూరులో మంగళవారం ఘనంగా గంగమ్మ విగ్రహాన్ని గ్రామ వీధులగుండా ఊరేగించారు. మాజీ ఎంపీపీ మల్లికార్జున దంపతులు గంగమ్మదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపును ప్రారంభించారు. అనంతరం కొండూరులో మహిళలు గంగమ్మదేవి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కుబడులను తీర్చుకొన్నారు.

తెలంగాణ ఫలితాలు బాబు పతనానికి నాంది
తాడిపత్రి, డిసెంబర్ 11: తెలంగాణ ఫలితాలు చంద్రబాబునాయుడు పతనానికి నాందియని, ప్రజా కూటమి ఓటమి బాధ్యత చంద్రబాబుదేనని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య తెలిపారు. స్థానిక వైకాపా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పైలా నరసింహయ్య మాట్లాడుతూ మహాకూటమిని మహాఓటమిపాలు చేసిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల అనైకిత కలయికను, పొత్తును తెలంగాణ ప్రజలు తిరస్కరించి, తిప్పికొట్టారన్నారు. కుట్రలు, కుతంత్రాలు, మోసాలతో చంద్రబాబు ఎంతో కాలం ప్రజలను వంచించలేరనేది తేటతెల్లమైందన్నారు. చంద్రబాబుతో దోస్తి కాంగ్రెస్ పార్టీకి మొదటికే మోసం తెచ్చిపెట్టిందన్నారు. చంద్రబాబుతో పొత్తు లేకుండా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కాంగ్రెస్‌కు మెరుగైన ఫలితాలు దక్కేవన్నారు. దేశంలో విపక్షాలన్నింటినీ మోడీకి వ్యతిరేకంగా ఒకే తాటిపైకి తెస్తానంటు ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబు మొదట ఇంట గెలిచి రచ్చగెలవాలన్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణంలలో వందల కోట్ల అంచనాలను పెంచడంలోను, ప్రైవేటుసంస్థలకు ప్రభుత్వ భూములను చౌకగా కట్టబెట్టినందుకు అగ్రిగోల్డ్ కుంభకోణంలో పీకల్లోతు అవినీతిలో మునిగిపోయిన చంద్రబాబును రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బంగాళాఖాతంలో కలిపేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. చంద్రబాబుతో దోస్తీ చేస్తే మోడీకి వ్యతిరేకంగా జట్టు కట్టాలనుకుంటున్న విపక్షాల పుట్టి మునగడం ఖాయమన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఫలితాలు పునరావృత్తం కానున్నాయని తెలిపారు.
శ్రీరంగాపురం చెరువుకు
నీళ్లు ఇచ్చేందుకు చర్యలు
బెళుగుప్ప, డిసెంబర్ 11: హంద్రీనీవా ద్వారా మండలంలోని శ్రీరంగాపురం చెరువు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు అనంతపురంలోని ఎమ్మెల్సీ కేశవ్ స్వగృహంలో కలసి మాట్లాడారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు పండక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీసం శ్రీరంగాపురం చెరువుకు కృష్ణా జలాలను అందిస్తే చెరువుకు చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బోర్లు వృద్ధి చెంది పంటలు సాగుచేసుకోవచ్చునన్నారు. ఎమ్మెల్సీ కేశవ్ రైతులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆవులెన్న సమీపం వరకు కృష్ణా జలాలు వచ్చాయని, కొన్ని అనివార్య కారణాల వల్ల పనులు ముందుకు సాగలేదన్నారు. అయితే కాలవకు భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడి సంబంధిత అధికారులతో కూడా చర్చిస్తున్నామని, వెంటనే శ్రీరంగాపురం చెరువుకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వెంటనే హంద్రీనీవా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కాలవ పనులు ఎంతవరకు వచ్చాయని దానిపైన ఆరా తీశారు. వీలైనంత త్వరలో శ్రీరంగాపురం చెరువుకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
దేవాలయం వద్ద భిక్షమెత్తుతున్న
టీడీపీ ఎంపీటీసీ!
* కేశాపురం ఎంపీటీసీ నాగులప్ప దీనస్థితి..
కొత్తచెరువు, డిసెంబర్ 11: కొత్తచెరువు మండల ఎంపీపీ స్థానం టీడీపీ కైవసం కావడానికి ప్రధాన పాత్ర పోషించిన ఒక ఎంపీటీసీ పరిస్థితి నేడు అత్యంత దారుణంగా తయారైంది. ఆర్థికంగా చితికిపోయిన ఆ ఎంపీటీసీని పార్టీ నాయకులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో దేవాలయం వద్ద భిక్షాటన చేస్తూ పొట్టనింపుకుంటున్నాడు. కొత్తచెరువు మండల పరిధిలోని కేశాపురం ఎంపీటీసీగా 2014 ఎన్నికల్లో నాగులప్ప గెలుపొందాడు. ఈ ఎంపీటీసీ గెలుపొందడం వల్లే కొత్తచెరువు ఎంపీపీ స్థానం టీడీపీ కైవసమైంది. తన వద్ద ఉన్న డబ్బు అంతా ఎన్నికల్లో ఖర్చు పెట్టి నాగులప్ప ఎన్నికల్లో గెలుపొందాడు. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు ఎంపీటీసీకి ఎటువంటి సాయం చేయకపోవడంతో అతను ఆర్థికంగా ఇబ్బందిపడుతూ వచ్చాడు. ఇటీవల అనారోగ్యానికి సైతం గురికావడంతో ఆసుపత్రిలో చూపించుకోవడానికి సైతం డబ్బు లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో లోచర్ల సమీపంలోని కుంటెమ్మ దేవాలయం వద్ద భార్యతో సైతం కలసి రెండు నెలలుగా ఉంటున్నాడు. భక్తులు ఇచ్చే బియ్యం, కందిపప్పులాంటి వాటితో జీవనం కొనసాగిస్తున్నాడు. తన పరిస్థితిని జిల్లా ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఇక్కడే కాపురముంటున్నాడు. కనీసం మాట్లాడే పరిస్థితి సైతం లేకపోవడంతో భార్య నారాయణమ్మ అతనికి సేవలు చేస్తోంది. ఎంపీటీసీ పరిస్థితిని గమనించిన భక్తులు చేతనైనంత సాయం చేస్తున్నారు. ఎంపీటీసీ నాగులప్ప భార్య నారాయణమ్మ మాట్లాడుతూ ఎన్నికల్లో పొదుపు చేసుకున్న డబ్బంతా ఖర్చు పెట్టామని ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కన్నీరుమున్నీరయ్యారు. పదవుల కోసం వాడుకున్న ప్రజా ప్రతినిధులు ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో ఇలా రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కళ్లు తెరిచి తన భర్తను ఆదుకోవాలని ఆమె కోరారు.

గృహ నిర్మాణాలను వెంటనే చేపట్టాలి
అనంతపురం సిటీ, డిసెంబర్ 11: రాప్తాడు నియోజకవర్గంలో గృహ నిర్మాణాలను ఈ నెల 28వ తేదీలోపు చేపట్టాలని నియోజకవర్గ హౌసింగ్ అధికారులను రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ఆదేశించారు. మంగళవారం స్థానిక అరవింద నగర్‌లోని మంత్రి స్వగృహంలో నియోజకవర్గ హౌసింగ్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన 3,900 ఎన్‌టీఆర్ గృహాలకు 5,850 లక్షల ఖర్చు కాగలదన్నారు. అలాగే అహుడా పరిధిలో 6,815 గృహాలు మంజూరు కాగా, వాటికి 13,630 ఎన్‌టీఆర్ గృహాలకు 5,850 లక్షలు ఖర్చు కాగలదన్నారు. రాప్తాడు నియోజకవర్గం నందు అహుడా, కొత్తగా మంజూరైన ఎన్‌టీఆర్ గృహాలు 12,650లకు 19,480 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని తెలిపారు. మంజూరైన గృహాల నిర్మాణం చేపట్టడానికి వర్క్ ఇన్‌స్పెక్టర్లు కొరత ఉందని, అందుజేత నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ముగ్గురు వర్క్ ఇన్‌స్పెక్టర్లును కేటాయించి పనులను ఈ నెల 28వ తేదీలోపు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయునపుడు ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అత్యంత జాగ్రత్తగా అప్‌లోడ్ చేయాలని మంత్రి ఆదేశించారు. నియోజకవర్గంలో కేటాయించిన గృహాలను గ్రౌండింగ్ చేయడంలో డీఈ, ఏఈలు చొరవ చూపాలని మంత్రి అధికారులకు సూచించారు.
డీలా పడ్డ నందమూరి అభిమానులు !
* మంత్రి సునీత వర్గీయుల్లోనూ విస్మయం
హిందూపురం, డిసెంబర్ 11: హిందూపురం అసెంబ్లీ మాజీ శాసన సభ్యులు, దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని తెలంగాణ కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందడం నందమూరి అభిమానులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. స్వయానా స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వాడవాడలా తిరిగి నందమూరి సుహాసిని గెలుపు కోసం విస్తృత ప్రచారం చేశారు. దీనికితోడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా నందమూరి సుహాసిని విజయాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం చేపట్టిన విషయం విదితమే. అదేవిధంగా నందమూరి తారకరత్న కూడా సుహాసిని విజయం కోసం శ్రమించారు. ఇకపోతే శ్రీరాములయ్య సినిమాలో పరిటాల హరి పాత్ర పోషించిన దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె గెలుపు కోసం జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత కూడా అక్కడ మకాం వేసి విస్తృత ప్రచారం చేశారు. అయితే నందమూరి సుహాసిని ఓటమి చెందడంతో అటు నందమూరి అభిమానులు ఇటు పరిటాల సునీత వర్గీయులను కూడా తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్‌లో బాలకృష్ణ బిజీగా ఉన్నప్పటికీ ఆయన సోదరుడు, హరికృష్ణ కుమార్తె సుహాసిని విజయం కోసం కూకట్‌పల్లిలో వాడవాడలా ప్రచారం నిర్వహించినప్పటికీ ఆమె ఓటమి చెందడం స్థానిక నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఓ ఎత్తయితే నందమూరి సుహాసిని గెలుపే లక్ష్యంగా నందమూరి బాలకృష్ణతోపాటు వారి కుటుంబ సభ్యులు ప్రచారం చేసినప్పటికీ ప్రతికూల ఫలితం లభించడంతో అభిమానులు తీవ్ర నైరాశ్యం చెందుతున్నారు. కాగా సుహాసిని విజయం తథ్యమని స్థానిక నందమూరి అభిమానులు వివిధ వర్గాలతో చాలెంజ్ కూడా చేయడం, ఫలితం రాకపోవడంతో నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు.