అనంతపురం

స్వీపింగ్ మిషన్ ‘ప్రైవేట్’ కాంట్రాక్టర్‌కు ధారాదత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురంటౌన్, డిసెంబర్ 14: కార్పొరేషన్‌లో రూ. 33 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్‌ను గంపగుత్తగా కాంట్రాక్టర్‌కు అప్పగించి చేతులు దులుపుకున్న ఎన్విరాన్‌మెంట్ డీఈఈ సురేంద్రనాథ్ మరో నిర్వాకం కమిషనర్ మూర్తి తనిఖీలో వెలుగు చూసింది. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా, ముందస్తు అనుమతి తీసుకోకుండా ఏకంగా ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు స్వీపింగ్ మిషన్‌ను అప్పగించటంపై కమిషనర్ మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కమిషనర్ మరోవైపు ఎమ్మెల్యే నగరంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని పదే పదే ఎన్విరాన్‌మెంట్ డీఈఈ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు సూచిస్తున్నా వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు చందంగా సాగుతోంది. కార్పొరేషన్ రోడ్లను శుభ్రం చేసేందుకు రూ.33 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్‌ను పారిశుద్ధ్య పనులకు కాకుండా ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు అప్పగించిన ఎన్విరాన్‌మెంట్ డీఈఈ వైఖరి ఉన్నతాధికారులను విస్తుపోయేలా చేస్తోంది. ఇదిలా ఉండగా స్వీపింగ్ మిషన్ ప్రైవేట్ కాంట్రాక్టర్ చేతుల్లో ఉన్నా కార్పొరేషన్ ఖాతాలో డీజిల్ వేయిస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివలన రెండు విధాలుగా కార్పొరేషన్ నిధులకు గండిపడినట్లవుతోందని వారు పేర్కొంటున్నారు. ఇందులో నిజం నిగ్గు తేల్చాలంటే డీజిల్ బిల్లులను పరిశీలిస్తే చాలు ఇట్టే మరో అవినీతి వ్యవహారం బహిర్గతమవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. 33 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్ ఇంకా తొమ్మిది లక్షల రూపాయల పెండింగ్ బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే స్వీపింగ్ మిషన్ కొనుగోలు చేసినప్పటి నుంచి నాణ్యతా ప్రమాణాలు లేకపోవటం, నిర్దేశిత కంపెనీకి చెందినది కాదన్న వివాదాలు చుట్టుముట్టాయి. దీనితో చాలాకాలంగా స్వీపింగ్ మిషన్ సరఫరా బిల్లులు చెల్లింపుకు నోచుకోక పెండింగ్‌లో ఉండిపోయాయి. అప్పటి కార్పొరేషన్ సూపరింటెండెంట్ సత్యనారాయణ సాంకేతికపరంగాను, టెండర్ నిబంధనల ప్రకారం స్వీపింగ్ మిషన్ నిర్దేశిత ప్రమాణాలు లేకపోవటంతో ఫైలుపై సంతకం చేయటానికి నిరాకరించారు. ఆయన బదిలీ తర్వాత ఇన్‌చార్జి ఎస్.ఈగా బాధ్యతలు చేపట్టిన నాగమోహన్ ఫైలుకు చకచకా ఆమోద ముద్ర వేశారు. దీనితో ప్రస్తుత కమిషనర్ మూర్తి ఎస్.ఈ నాగమోహన్ సిఫారసు మేరకు బిల్లులో 24 లక్షలు మంజూరు చేశారు. బకాయి బిల్లు విషయమై కాంట్రాక్టర్‌కు, ఎన్విరాన్‌మెంట్ డీఈఈ నడుమ కార్పొరేషన్ కార్యాలయంలో వాదులాట జరిగింది. వీరి వివాదంలో సర్దిచెప్పబోయిన డీఈఈ కిష్టప్పపై దాడి జరిగింది. దీనితో మిగతా తొమ్మిది లక్షల రూపాయలు బిల్లు చెల్లింపునకు నోచుకోక పెండింగ్‌లో ఉండిపోయింది. తాజాగా కాంట్రాక్టర్ బకాయి బిల్లు తొమ్మిది లక్షల రూపాయలు చెల్లించాలని ఇటీవల కమిషనర్ మూర్తిని ఛాంబర్‌లో కలిసి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆచూకీ కానరాని స్వీపింగ్ మిషన్‌పై కమిషనర్ ఆరా తీశారు. స్వీపింగ్ మిషన్ నిర్వహణ, పర్యవేక్షణను ఎన్విరాన్‌మెంట్ డీఈఈ సురేంద్రనాథ్ గాలికి వదలివేసిన వైనం వెలుగుచూసింది. స్వీపింగ్ మిషన్ కొన్ని నెలలుగా కార్పొరేషన్ కార్యాలయంలో పార్కింగ్‌కు నోచుకోకపోవటం గుర్తించారు. అలాగే రోడ్లు శుభ్రం చేయటానికి సదరు స్వీపింగ్ మిషన్‌ను అధికారులు వినియోగించటం లేదన్న విషయం వెలుగుచూసింది. ఈ అంశంపై కమిషనర్ ఆదేశాల మేరకు ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు వాకబు చేయగా స్వీపింగ్ మిషన్ ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్వహణలో ఉన్నట్లు వెల్లడైంది. ఇదే అంశాన్ని ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు నివేదిక రూపంలో కమిషనర్ మూర్తికి నివేదించారు. ఈ నివేదిక ఆధారంగా ఎన్విరాన్‌మెంట్ డీఈఈ సురేంద్రనాథ్‌కు గురువారం రాత్రి కమిషనర్ మూర్తి మెమో జారీ చేశారు. ఎన్విరాన్‌మెంట్ డీఈఈ సురేంద్రనాథ్ విధి నిర్వహణలో అలసత్వం చూపుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైనాన్ని పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్, పబ్లిక్ హెల్త్ సూపరింటెండెంట్ ఇంజినీర్‌కు సమాచారం పంపారు. అలాగే ఆచూకీ కానరాని స్వీపింగ్ మిషన్‌ను 24 గంటల సమయంలోగా కార్పొరేషన్ కార్యాలయంలో పార్కింగ్ చేయించాలని, స్వీపింగ్ మిషన్‌ను డిపార్ట్‌మెంట్ పరంగా నిర్వహించకపోవటం, పర్యవేక్షణ జరుపనందుకు 24 గంటలలోగా సంజాయిషీ రాసి ఇవ్వాలని, అలాగే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకపోవటం, ముందస్తు అనుమతి లేకుండా ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు నిబంధనలకు విరుద్ధంగా అప్పగించటంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. 24 గంటలలోగా వివరణ ఇవ్వనట్లైతే శాఖాపరంగా క్రమశిక్షణా చర్యలు తప్పవని లేఖలో కమిషనర్ మూర్తి హెచ్చరించారు. కార్పొరేషన్ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎన్విరాన్‌మెంట్ డీఈఈ వ్యవహరించిన తీరు చూస్తుంటే ఆయన ఎంత బరి తెగించారో ఇట్టే అర్థమవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇక వైకాపాలో ఘనీయే బాస్
* సంకేతాలిచ్చిన అధిష్టానం
* నవీన్ వర్గీయుల్లో విస్మయం
* పోటా పోటీగా పట్టుకు ఎత్తులు
హిందూపురం, డిసెంబర్ 14: గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుండి వైకాపా హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరించిన నవీన్‌నిశ్చల్‌కు వారం రోజుల క్రితం అధిష్టానం షాక్‌కు గురిచేసింది. స్థానిక తాజా మాజీ ఎమ్మెల్యే, సీనియర్ తెలుగుదేశం నేత అబ్ధుల్ ఘనీని వైకాపాలోకి చేర్చుకోవడం విదితమే. దీనికితోడు అబ్ధుల్ ఘనీని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంతో నవీన్‌నిశ్చల్ వర్గీయులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయినప్పటికీ నవీన్ మాత్రం వివిధ వర్గాలకు చెందిన యువకులను, పలు పార్టీల నాయకులను వైకాపాలోకి ఆహ్వానిస్తూ వైఎస్ జగన్ నాయకత్వాన్ని బలపరచాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా అధిష్టానం తాజాగా తీసుకొన్న నిర్ణయం నవీన్ వర్గీయులను కుంగదీస్తోంది. నవీన్‌ను సమన్వయకర్తగా తొలగిస్తూ స్పష్టంగా నిర్ణయం తీసుకోకపోగా అబ్ధుల్ ఘనీ ఆధ్వర్యంలోనే ఎవరైనా పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని మార్గదర్శకాలు జారీ చేయడంతో వైకాపాలో గందరగోళానికి తెర తీసినట్లయింది. దీనినిబట్టి అబ్ధుల్ ఘనీ మాత్రమే సమన్వయకర్త అన్నట్లు అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో నవీన్ వర్గీయులు విస్మయానికి గురవుతున్నారు. ఇకపోతే అబ్ధుల్ ఘనీ వైకాపాలో తనవంతు పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు. వైకాపా మాజీ నియోజకవర్గ సమన్యయకర్త కొండూరు వేణుగోపాల్‌రెడ్డితోపాటు నవీన్‌నిశ్చల్‌ను ముందు నుండి విభేదిస్తున్న నాయకులు ఘనీకి చేదోడు, వాదోడుగా ఉంటూ ముస్లిం మైనార్టీల్లో పట్టు సాధించేందుకు మసీదులు, ముతవల్లీలు, ఆ వర్గం ముఖ్య నాయకుల ఇళ్లకు వెళ్లి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా నవీన్‌నిశ్చల్ అప్రమత్తమై ఆయా వర్గాల్లో తనకున్న పట్టును చేజారి పోకుండా ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం పట్టణంలోని మర్కస్ మసీదుకు వెళ్లి గతంలో తరహాలోనే మీ సహకారం ఇవ్వాలని విన్నవించుకొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా వైకాపా కోసం తాను శ్రమిస్తున్న విషయాన్ని చెప్పుకొంటూ ఈ ఒక్కసారి తనకు సహకరించాలని కోరుతున్నారు. దీనికితోడు శనివారం నియోజకవర్గ స్థాయి ముస్లిం మైనార్టీ సమావేశాన్ని స్థానిక ఆర్‌ఎంఎస్ ఫంక్షన్ హాలులో పెద్ద ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా వైకాపాలో అటు ఘనీ, ఇటు నవీన్‌లు పట్టు కోసం వేస్తున్న ఎత్తులు పార్టీకి లాభం కలిగిస్తాయా... నష్టం కలుగుతుందా అన్నది వేచి చూడాల్సిందే.
పీఏబీఆర్ కుడి కాలువకు
3 టీఎంసీల నీరివ్వాలి
అనంతపురం సిటీ, డిసెంబర్ 14: పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా 3 టీఎంసీల నీటిని ఇవ్వాలని , నీటిని విడుదల చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు దీక్షలను ఆపేదీ లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ పేర్కొన్నారు. పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా 49 చెరువులకు నీరివ్వాలని కోరుతూ శుక్రవారం సీపీఐ, రైతు సంఘాల ఆధ్వర్యంలో హెచ్‌ఎల్సీ ఎస్‌ఈ కార్యాలయం ముందు రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా 49 చెరువులకు నీరు ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు ఉద్యమిస్తామన్నారు. ఉద్యమాల ద్వారానే నీటిని సాధించుకుందామని రైతులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం పీఏబీఆర్‌లో నిల్వ ఉన్న నీటిని లేదా రివర్స్ డైవర్షన్ ద్వారా వచ్చే నీటిని కుడి కాలువ ద్వారా చెరువులకు నీరు విడుదల చేయాలన్నారు. చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరగడంతోపాటు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందన్నారు. జిల్లాలో కరువు తాండవిస్తోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కరువు సహాయక చర్యలు కోసం అనేక బృందాలను జిల్లాలో పర్యటనలు మాత్రమే చేయించారని, వాటి వల్ల ఒరిగింది ఏమీ లేదన్నారు. హంద్రీనీవా ద్వారా కొన్ని చెరువులకు నీరు అందించి అన్ని చెరువులకు నీరు అందించామని ప్రచారం చేసుకోవడం చాలా సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు స్పందించి చెరువులను నింపాలని, లేనిపక్షంలో నిరసనలు, ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

మలబార్ గోల్డ్‌లో బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన
అనంతపురం, డిసెంబర్ 14: నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనను శుక్రవారం ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పరిటాల శైలజ, వైవీ.లక్ష్మి, డా.మల్లీశ్వరి, లలిత, ఉషా తదితరులు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అద్వితీయమైన కళా నైపుణ్యంతో రూపొందించిన వివిధ రకాల బంగారు, వజ్రాభరణాలు వినియోగదారులకు అందుబాటులో ఉంచడం శుభపరిణామమన్నారు. ప్రదర్శన ఈ నెల 25వరకు కొనసాగనున్నట్లు, నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డైరెక్టర్ వహాబ్ తెలిపారు.

అహుడా అధికారి ప్రశాంతి బదిలీ ఆపాలి
అనంతపురం సిటీ, డిసెంబర్ 14: జిల్లాలో అహుడాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసి ఉపాధ్యక్షురాలుగా నియమించిన పి.ప్రశాంతి బదిలీని ఆపాలని ఆర్‌పీఎస్ జి నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆర్‌పీఎస్ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ అహుడా ఉపాధ్యక్షురాలిగా అత్యంత నిజాయితీ అధికారిగా నిబద్దతతో పనిచేస్తూ, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పనిచేసిన అధికారిని అధికార పార్టీ నేతలు రియల్ దందా నడుపుకోవడం కోసం బదిలీ చేయడం చాలా బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి ఎప్పుడు మాది నీతివంతమైన ప్రభుత్వం అని, 40 సంవత్సరాల అనుభవంలో ఎంతో నిజాయితీగా ఉంటామని చెబుతున్న చంద్రబాబు నిజాయితీ అధికారిని ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు.

అహుడా వైస్ చైర్మన్ బదిలీని ఆపాలి
* సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్
అనంతపురం, డిసెంబర్ 14: అహుడా వైస్ చైర్మన్ ప్రశాంతి బదిలీని ఆపాలని, లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఆ పార్టీ నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేఖరులతో ఆయన మాట్లాడారు. వీసీ బదిలీని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సామాజిక దృక్పథంతో తమపై ఉన్న బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించే మంచి అధికారులను జిల్లాలో పనిచేయనీయరా అని ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధుల అనుచరులమంటూ కొందరు చేస్తున్న భూ మాఫియాను అహుడా వీసీ ప్రశాంతి అడ్డుకున్నందుకే ఆమెను బదిలీ చేశారన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేస్తున్న అధికారిని సంవత్సరం కాకుండానే బదిలీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజల పక్షాన పనిచేస్తున్న అధికారులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని, ఆ అధికారికి న్యాయం జరిగేంత వరకు సీపీఎం పోరాటం చేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆమె బదిలీని ఆపాలని డిమాండ్ చేశారు.