అనంతపురం

లబ్ధిదారులకు సంతృప్తి కలిగేలా సమస్యల పరిష్కారం ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, డిసెంబర్ 17: మీకోసంలో వచ్చే ప్రజా సమస్యలను లబ్దిదారునికి సంతృప్తి కలిగేలా సకాలంలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా సంయుక్త కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో జేసీ అధ్యక్షతన మీకోసం కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి 405 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చే వినతులలోని పలు సమస్యలను సంతృప్తికరంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. లేనిపక్షంలో లిఖిత పూర్వకంగా సరైన కారణాలతో వినతులను తిరస్కరించాలన్నారు. అలాగే జిల్లాలో రాబోయే ఐదు సంవత్సరాలలో ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది అన్ని శాఖలు ఒక ప్రణాళికలను తయారుచేసి కలెక్టర్‌కు అందించాలని సూచించారు. అనంతరం దివ్యాంగుల టీ-20 నందు రన్నర్‌గా నిలిచిన విద్యార్థులకు జేసీ పథకాలను అందజేసి, కెప్టన్ ఎస్.నాగరాజు, వైస్ కెప్టన్ సుధాకర్‌లను ఘనంగా సన్మానించారు.

ఆర్థిక సహకారం ఇప్పిస్తామని
డబ్బులు వసూలు చేసే వారిని నమ్మవద్దు
అనంతపురం సిటీ, డిసెంబర్ 17: భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహకారం ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్న వారిని నమ్మవద్దని డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మీకోసం కార్యక్రమంలో కదిరి డివిజన్‌లోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 30 మంది మహిళలు భర్తలు చనిపోయిన వారికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తామని ఒక్కొక్క అప్లికేషన్‌కు రూ.300 వసూలు చేసినట్లు తమ దృష్టికి తెచ్చారన్నారు. ఇలాంటి పథకం ఏమీ లేదని, మహిళలు ఇలాంటి వారిని నమ్మవద్దని ఆయన తెలిపారు. ఈ అంశంపై విచారణ చేసి నిరుపేదలను మోసం చేస్తున్న వారిని గుర్తించాలని జేసీ కదిరి డీఎస్పీని ఆదేశించారని ఆయన తెలిపారు.

49 చెరువులకు నీరివ్వాల్సిందే
అనంతపురం సిటీ, డిసెంబర్ 17: పీఏబీఆర్ కుడి కాలువ ద్వారా 49 చెరువులకు నీరు ఇవ్వాల్సిందేనని మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో హెచ్‌ఎల్సీ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు సోమవారం నాల్గవ రోజు కొనసాగాయి. ఈ దీక్ష శిబిరంలో అనంత వెంకటరామిరెడ్డి మద్దతు ఇచ్చి మాట్లాడుతూ తుంగభద్ర ప్రాజెక్టులో కేసీ కెనాల్‌కు రిజర్వ్ చేసిన 10 టీఎంసీల నీటిని హెచ్‌ఎల్సీ ద్వారా పీఏబీఆర్‌కు మళ్లించాలని వైయస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో స్పష్టమైన జీవో జారీ చేశారని తెలిపారు. జీవో ఉన్నప్పటికీ చెరువులకు నీరు అందించకపోవడం అన్యాయమన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నుండి అదనపు నీటిని తీసుకురావడానికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని కోరారు.
వ్యక్తిగత లబ్ధికే పనులు
* సున్నం వేయడం తప్ప చేసింది శూన్యం
అనంతపురం, డిసెంబర్ 17: నగరంలో పాలకపక్ష నాయకులు వ్యక్తిగత లబ్ది కోసమే పనులు చేస్తున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి జరుగలేదని వైసీపీ నాయకులు విమర్శించారు. 10వ డివిజన్‌లో సోమవారం రావాలి జగన్ - కావాలి జగన్ కార్యక్రమంలో అర్బన్ సమన్వయకర్త, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ రాగే పరశురామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే అమలుచేయనున్న పథకాల గురించి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నగరంలో నాలుగున్నరేళ్ల క్రితం నాటి అభివృద్ధి తప్ప కొత్తగా ఈ నాలుగేళ్లలో చేసిందీ ఏమీ లేదన్నారు. గతంలో ఉన్న వాటికే కొత్తగా సున్నం వేసి ఏదో అభివృద్ధి చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని, అంతకు మించి వారు చేసింది శూన్యమన్నారు. రాంనగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వెడల్పును ఎందుకు తగ్గించారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించి, జగన్ నాయకత్వాన్ని బలపరచాలని వారు ప్రజలను కోరారు.

భాషా పండితుల ఉన్నతీకరణపై హర్షం
అనంతపురం సిటీ, డిసెంబర్ 17: రాష్ట్రంలోని భాషా పండితుల ఉన్నతీకరణకు జీవోను ప్రభుత్వం విడుదల చేయడంపై ఎస్‌ఎల్‌టీఏ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆదిశేషయ్య, వేణుగోపాల్‌లు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా 10244 భాషా పండితులు, 2603 పీఈటీల పోస్టులను ఉన్నతీకరిస్తూ నవంబర్ 6వ తేదీన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించడానికి అనేక అడ్డంకులు అధిగమించి ఈరోజు ఆర్థిక శాఖ జివో ఎంఎస్ నంబర్ 91ను విడుదల చేసిందన్నారు. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎస్‌ఎల్‌టీఏ గౌరవాధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసరెడ్డి, అమరావతి జేఏసి ఛైర్మెన్ బొప్పరాజు వెంకటేశ్వరర్లు, విద్యా శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసారు.
ముస్తాబైన ఆలయాలు
నేడు వైకుంఠ ఏకాదశి
అనంతపురం అర్బన్, డిసెంబర్ 17: విష్ణుమూర్తి ఆరాధకులు పరమ పవిత్రమైన దినంగా భావించే పండుగ ముక్కోటి ఏకాదశి. స్వర్గద్వారం, ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు సర్వాలంకార భూషితుడై ఉత్తర ద్వారం వద్దకు విచ్చేయగా ఉత్తర ద్వారం వద్ద సకల దేవతలు ఆయనను సేవించి రోజు కనుక దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చింది. అందువల్ల ఈ దినం అన్ని దేవాలయాలలో ఉత్తర ద్వారం తెరుస్తారు. ఈ మార్గం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం పుణ్యప్రదంగా భావిస్తారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని నగరంలోని అన్ని ఆలయాలు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలకరించారు. పాతవూరులోని శ్రీ లక్ష్మీచెన్నకేశ్వర స్వామి వద్ద భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసారు. శ్రీకంఠం సర్కిల్ వద్ద వున్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం, మారుతీనగర్‌లోని ఆలయం అదేవిధంగా బాబా మందిరాలలో, శివాలయాలలో ఉత్తర ద్వారం ఏర్పాటుచేసారు. వేకువజామున 2గం.నుండి రాత్రి 12 గం.ల వరకు దర్శనం వుంటుందని నిర్వాహకులు తెలిపారు.
నేడు ఎస్‌ఈ ఆఫీస్ ముందు నిరవధిక నిరసన
* సీపీఎం జిల్లా కార్యదర్శి వీ.రాంభూపాల్
అనంతపురం, డిసెంబర్ 17: హెచ్చెల్సీ దక్షిణ కాలువ కింద ఆయకట్టుకు వెంటనే నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వీ.రాంభూపాల్ డిమాండ్ చేశారు. అర్ధాంతరంగా నీరు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నారని, పాలకులు ఇప్పటికైనా వౌనం వీడాలన్నారు. హెచ్చెల్సీ ఆయకట్టుకు నీరివ్వాలన్న డిమాండ్‌తో ఇరిగేషన్ ఎస్‌ఈ కార్యాలయం ముందు నేటి నుండి నిరవధిక నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు సోమవారం ప్రకటన ద్వారా తెలిపారు. నీరు విడుదలపై స్పష్టమైన హామీ ఇచ్చే దాకా అక్కడే వంటావార్పుతో నిరసన చేపడతామన్నారు. నీరు వదలకపోతే శింగనమల నియోజకవర్గం పరిధిలోనే రూ.250 కోట్ల పెట్టుబడిని రైతులు నష్టపోతారన్నారు. 120 రోజులు నీరు విడుదల చేస్తామని, కేవలం 60 రోజులకే నీరు నిలిపి వేసి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. నేడు జరిగే నిరవధిక నిరసన కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.
కందుకూరి ఆశయ సాధనలో నడుద్దాం
* విశ్రాంత రీడర్ డా.కనుపర్తి విజయ్‌భ
అనంతపురం, డిసెంబర్ 17: కందుకూరి వీరేశలింగం పంతులు వారసులుగా ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధనలో నడవాలని విశ్రాంత రీడర్ డా. కనుపర్తి విజయభ పేర్కొన్నారు. ఆయన వేసిన అడుగులు నేటి సమాజానికి ఆదర్శంగా ఉన్నాయన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు శత వర్థంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జడ్పీ హాలులో కందుకూరి సాహితీ సమాలోచన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో విజయ భతోపాటు ఎస్కేయూ ఇన్‌చార్జి వీసీ శుభ, కేంద్ర సాహిత్య అకాడమీ జనర్ కౌన్సిల్ సభ్యులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు వివిధ అంశాలపై ప్రసంగించారు. కనుపర్తి విజయభ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా జిల్లాలో కందుకూరి శత వర్ధంతి సదస్సును ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఐద్వా ఇతర ప్రజా సంఘాలు సంయుక్తంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలోని రుగ్మతలను రూపు మాపేందుకు వందేళ్లకు పూర్వమే కందుకూరి పోరాటం సాగించారన్నారు. ఆయన ప్రతి అక్షరం సామాజిక చైతన్యం తెచ్చిందన్నారు. నేటి తరం ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు. ఎస్కేయూ వీసీ శుభ మాట్లాడుతూ కందుకూరి ఆశయాలు ఎంతో గొప్పవని, బాల్య వివాహాలు అరికట్టి, వితంతు వివాహాలను ప్రోత్సహించడం ద్వారా సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచారన్నారు. బాలికా విద్య కోసం ప్రత్యేక పాఠశాలలు నడిపారన్నారు. రాచపాళెం మాట్లాడుతూ సమాజంలోని దురాచారాలను వీరేశలింగం పంతులు ఆనాడే మట్టుపెట్టారన్నారు. ఆయన పోరాటాల ఫలితంగానే సమాజంలో నేడు మహిళలకు తగిన ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తోందన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ సాంఘిక దురాచారాలను ఎదిరించడంలో నేటి ప్రభుత్వాలు శ్రద్ధ చూపడం లేదన్నారు.