అనంతపురం

నూతనోత్సాహంలో టిడిపి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం మే 2: తెలుగుదేశం పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నగరంలోని కమ్మభవన్‌లో నేడు నిర్వహించనున్నారు. ఉదయం 10.30గం.లకు ప్రారంభకానున్న సమావేశంలో జిల్లాకు చెందిన మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, ఇతర ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతలు, అనుబంధ సంఘాల నాయకులు హాజరు కానున్నారు. ఈనేపథ్యంలో పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతుండటం, అదేక్రమంలో జిల్లాలోని కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అత్తార్‌చాంద్‌బాషా కూడా ఇటీవల టిడిపి తీర్థం పుచ్చుకోవడం తెలిసిందే. ఈనేపథ్యంలో పార్టీని మరింత పటిష్టపరిచే దిశగా జిల్లా నేతలు పార్టీశ్రేణుల్ని సమాయత్తం చేయనున్నట్లు తెలిసింది. అసలు ప్రతిపక్షం అన్నదే లేకుండా చేస్తానంటూ సిఎం చంద్రబాబు నాయుడు పలుసందర్భాల్లో ప్రస్తావించారు. రాష్ట్రంలోనే అత్యధిక స్థానాలిచ్చిన రెండు జిల్లాల్లో అనంత ఒకటి. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 స్థానాల్ని, 2 ఎంపి స్థానాల్ని టిడిపి గత ఎన్నికల్లో కైవసం చేసుకుంది. కదిరి, ఉరవకొండ స్థానాల్ని వైకాపా దక్కించుకుంది. వీటిలో కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా టిడిపిలోకి జంప్ కావడంతో ఇక వైకాపాకి మిగిలింది ఉరవకొండ ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి మాత్రమే. జిల్లాలో తమ పార్టీ శ్రేణుల్ని కాపాడుకునే ప్రయత్నంలో విశే్వశ్వరరెడ్డి ఉన్నారు. ఇక జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పార్టీకి చెందిన ఇతర నేతలు నిరుత్సాహ పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగానే అధికార తెలుగుదేశం పార్టీపైన, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపైనా ధ్వజమెత్తుతున్నారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా కరవు పరిస్థితులు, తాగునీటి సమస్యలపై సోమవారం మండల కేంద్రాల్లో ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ తరుణంలో నేడు నిర్వహిస్తున్న టిడిపి విస్తృతస్థాయి సమావేశంలో ఆపార్టీ నేతలు వైకాపాపై ధ్వజమెత్తాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈసమావేశంలో ఆపార్టీ అనుసరించే వైఖరిని బట్టి వైకాపా సైతం ఆరోపణలు గుప్పించేందుకు సిద్ధంగా ఉంది.
కందికుంట హాజరయ్యేనా...
కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ నేడు జరుగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరవుతారా అన్న సందేహం ఆపార్టీలోని కొన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. వైకాపాకు చెందిన కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా ఇటీవల సిఎం సమక్షంలో మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో టిడిపిలో చేరిన సందర్భంగా కందికుంట అలకబూనిన విషయం విదితమే. రానున్న ఎన్నికల్లో తనకు అవకాశం దక్కదేమోనన్న అనుమానంతోపాటు అప్పటి వరకు ఒకే ఒరలో రెండుకత్తుల్లా తాము ఇమడలేమని కందికుంటను పార్టీలోకి తేవడంలో పరోక్షంగా కందికుంట హస్తం ఉందన్న భిన్నాభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే అలకబూనాల్సిన అవసరం కందికుంటకు ఏముందన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈపరిస్థితుల్లో అసలు కందికుంట సమావేశానికి హాజరవుతారా లేదా అనే సందేహం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
టిడిపి వర్గపోరు తెరపైకి వస్తుందా
టిడిపిలో అంతర్గత పోరునెలకొన్న నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశంలో ఆప్రభావం కనిపించవచ్చని ఓవైపు ఆపార్టీ వర్గాల్లో గుబులురేపుతోంది. ముఖ్యంగా నగరమేయర్ స్వరూప, స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర చౌదరితో తాడిపత్రి ఎమ్మెల్యే జెసి.ప్రభాకరరెడ్డి మధ్య తలెత్తిన విభేదాలు తెరపైకి వస్తాయేమోనన్న అనుమానాలున్నాయి. మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం నగర పాలకవర్గం ఏర్పడిన సమయంలో జెసి.ప్రభాకర్‌రెడ్డి ఆమె ఛాంబరుకు వచ్చి ఆమెకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు. తదుపరి రాజకీయ పరిణామాల నేపథ్యంలో జెసి సోదరులకు మేయర్ దూరమయ్యారు. పాతవూరులో తిలక్‌రోడ్, గాంధీబజార్ రహదారుల విస్తరణల విషయంలోను విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. నేటి సమావేశంలో ఇవి తెరపైకి వస్తే ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని పార్టీ వర్గాల్లో అనుమానాలు నెలకొన్నాయి.

ఈదురుగాలుల బీభత్సం

బెళుగుప్ప, మే 2: బలమైన ఈదులుగాలులు బీభత్సానికి మండలంలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, మామిడి పంటలు, కోళ్లఫారం షెడ్‌లు నేలమట్టమై సుమారు రూ. 10 లక్షలు పైగా నష్టం వాటిల్లింది. వివరాల్లోకి వెళ్లితె... మండలంలో బెళుగుప్ప, ఎలగలవంక తండా, ఆవులెన్న ప్రాంతాల్లో ఆదివారం రాత్రి వీచిన బలమైన ఈదురుగాలులకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. బెళుగుప్ప నుండి కళ్యాణదుర్గం వెళ్లె రోడ్డు మార్గాన ఎలకలవంకకు విద్యుత్ సరఫరాను అందించే విద్యుత్ స్తంభాలు 40కి పైగా పడిపోయి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అలాగే ఎలగలవంక తండాకు చెందిన కృష్ణానాయక్, పూరే నాయక్ కు చెందిన మామిడి తోటలో చేతికి వచ్చిన మామిడిపంట నేల రాలిపోయింది. వేలాదిరూపాయలు పెట్టుబడి పెట్టి ఈదురుగాలులతో పంట చేతికి అందక లక్షల్లో నష్టం వాటిళ్లిందని బాదిత రైతులు ఆవేదన చెందారు. ఆవులెన్న సమీపంలో ఇస్మాయిల్‌కు చెందిన కోళ్లఫారం షెడ్ గాలుల బీభత్సానికి కూలిపోవడంతో సుమారు 400 వరకు కోళ్లు చనిపోయి, రూ, 4 లక్షల దాకా నష్టం జరిగిందని బాధితుడు ఇస్మాయిల్ పెర్కోన్నారు. ఎలకలవంకకు చెందిన చిత్తమ్మ మల్బరీ తోటలో రెషం షెడ్‌కు వేసిన రేకులు కిలోమీటర్ల వరకు ఎగిరిపడిపోయాయి. షెడ్ మొత్తం కూలిపోయి రూ. 3 లక్షల దాకా నష్టం వాటిల్లిందని ఆమె తెలిపారు. అలాగే వివిధ గ్రామాల్లో రైతులు సాగుచేసిన అరటి తోటలు దెబ్బతిన్నాయి. సోమవారం విద్యుత్‌శాఖ అధికారులు ఈదురుగాలులకు దెబ్బతిన్న విద్యుత్ లైన్‌లను మరమ్మతులు వేగవంతంగా చేపట్టారు. ఈదురుగాలుల బీభత్సానికి నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

తరుముకొస్తున్న
నీటి ఎద్దడి

నల్లమాడ, మే 2: జిల్లాలో 47 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మండుతున్న ఎండలతో కొన్ని మండలాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి నీటి ఎద్దడి తరుముతోంది. నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ద్వారా జిల్లాకు రూ. 10 కోట్లు మంజూరైనట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. నీటి ఎద్దడి అధికంగా వున్న మండలాల్లో ఇప్పటికే ట్యాంకుల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారం వరకు కేవలం 38 గ్రామాల్లో మాత్రమే ట్యాంకుల ద్వారా నీటి సరఫరా జరిగేది. కాగా ప్రస్తుతం జిల్లాలోని 25 మండలాల్లోని 99 గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయిస్తున్నారు. ఈ నెలలో వర్షాలు కురవకపోతే మరిన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని అధికారులు చెప్తున్నారు. కాగా ప్రస్తుతం బుక్కరాయసముద్రం మండలంలో 4 గ్రామాల్లో 13 ట్యాంకులు, శింగనమల మండలంలో 5 గ్రామాలకు 24, నార్పల మండలంలో 3 గ్రామాలకు 15, పుట్లూరు మండలంలో 16 గ్రామాలకు 89, యల్లనూరు మండలంలో 10 గ్రామాలకు 71, అనంతపురం రూరల్ మండలంలోని 3 గ్రామాలకు 38 ట్యాంకులు, కనగానపల్లి మండలంలో 2 గ్రామాలకు 14, చెనే్నకొత్తపల్లి మండలంలో 6 గ్రామాలకు 30, పెద్దవడగూరు మండలంలో 1 గ్రామానికి 5, పెద్దపప్పూరు మండలంలో 2 గ్రామాలకు 6, యాడికిలో ఒకచోట 4 ట్యాంకులు, వజ్రకరూరు మండలంలో 2 గ్రామాలకు 19, కూడేరు మండలంలో 1 గ్రామానికి 5, విడపనకల్లు మండలంలో 1 గ్రామానికి 4, గుత్తి మండలంలో 1 గ్రామానికి 3, గుంతకల్లు మండలంలో 11 గ్రామాలకు 55, ధర్మవరం మండలంలో 2 గ్రామాలకు 7, బత్తలపల్లి మండలంలో 6 గ్రామాలకు 25, ముదిగుబ్బ మండలంలో 10 గ్రామాలకు 75, తాడిమర్రి మండలంలో 5 గ్రామాలకు 32, గుమ్మగట్ట మండలంలో 1 గ్రామానికి 3, డి.హీరేహళ్ మండలంలో 2 గ్రామాలకు 22, రొళ్ళ మండలంలో 2 గ్రామాలకు 2, లేపాక్షి మండలంలో 3 గ్రామాలకు 9, అగళి మండలంలో 1 గ్రామానికి 2 ట్యాంకుల ద్వారా మొత్తం 99 గ్రామాల్లో 571 ట్యాంకుల నీటిని ప్రతిరోజూ నీటి ఎద్దడి తీవ్రతను బట్టి సరఫరా జరుగుతున్నట్లు సంబంధిత శాఖ గణాంకాలు చెప్తున్నాయి. అంతేకాకుండా నీటి ఎద్దడి అవసరాన్నిబట్టి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని మండలాల్లో అతి తక్కువ ట్యాంకుల ద్వారా పంచాయతీ నిధులతో కూడా సరఫరా జరిగిన గ్రామాలున్నాయని తెలిసింది. కాగా నీటి సరఫరా జరుగుతున్నట్లు అధికారులు నమోదు చేసుకుని ఒక్కో ట్యాంకుకు నిర్దేశించిన ధర రూ. 430లతో నీటి సరఫరా చేసినవాళ్ళకు చెల్లించడం జరుగుతోంది. అయితే ఆయా గ్రామాల్లో ఒక్కో ట్యాంకుకు నిర్దేశించినన్ని ట్యాంకుల నీటిని సరఫరా చేస్తున్నారా, నిర్దేశించిన దానికంటే తక్కువ నీళ్లు సరఫరా చేసి నిర్దేశించినన్ని ట్యాంకుల ద్వారా సరఫరా చేసినట్లు లెక్కలు రాసుకుంటున్నారా అనే అనుమానాలు కూడా పలు గ్రామాల్లో వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లాలోని నీటి ఎద్దడి అధికంగా వున్న గ్రామాల్లోని ప్రజల దాహార్తి తీర్చడం కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో కొంత మొత్తం పక్కదారి పడుతోందన్న విమర్శలున్నాయి. నీటి ట్యాంకుల ద్వారా నీటి సరఫరాలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయడం కోసం జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

కరవు నివారణ చర్యలు చేపట్టాలని
వైకాపా ధర్నా

కదిరిటౌన్, మే 2 : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరవు నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైకాపా ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌డిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఖాళీ బిందెలతో బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైకాపా నాయకుడు మహమ్మద్ షాకీర్, డా.పివి సిద్ధారెడ్డి, జక్కల ఆదిశేషు, వజ్ర భాస్కర్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ కరవు నివారణ చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు విమర్శించారు. ఎండ తీవ్రతకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా, పశు గ్రాసం లేక పశువులు కబేళాలకు తరలివెళ్తున్నా కనీసం పశుగ్రాసం కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం వుందన్నారు. ఎండలు ఎక్కువై తాగునీటి సమస్య తలెత్తి ప్రజలకు గుక్కెడు మంచినీరు కూడా దొరక్క అల్లాడుతున్నా ప్రజా ప్రతినిధులు కాని, అధికారులు కాని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వెంటనే ప్రభుత్వం కరవు సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ వారు కదిరి ఆర్‌డిఓ వెంకటేసుకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బహవుద్దీన్, లింగాల లోకేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు కెఎం ఖాదర్‌బాషా, కినె్నర కళ్యాణ్, అజ్జుకుంటు రాజశేఖర్‌రెడ్డి, జగన్, నాయకులు కుర్లి శివారెడ్డి, చెన్నూరు గంగాధర్, జంపాల నాగేంద్ర, వేమల ఫయాజ్‌తోపాటు మహిళలు పాల్గొన్నారు.

పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి

గుత్తి, మే 2: మండల పరిధిలోని ధర్మాపురం గ్రామంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షంలో పిడుగుపడి గొర్రెల కాపరి సుధాకర్(21) మృతి చెందాడు. గొర్రెల పెంపకం సాగించే సుధాకర్ గ్రామ శివారుల్లోని పొలాల్లో గొర్రెల మందను ఆపి వాటికి కాపలా గా అక్కడే పడుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షాలలో పిడుగు పడటంతో సుధాకర్ అక్కడిక్కడే మృ తి చెందాడు. సంఘటనపై గుత్తి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పిడుగుపాటుకు కాడెద్దులు మృతి
లేపాక్షి/చిలమత్తూరు: మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో రైతు కదిరప్పకు చెందిన రెండు ఎద్దులు సోమవారం మధ్యాహ్నం పిడుగుపడి మృతి చెందాయి. కదిరప్ప ఏడాది క్రితం రూ. 70వేలతో ఎద్దులను కొనుగోలు చేశాడు. మధ్యాహ్నం ఎద్దులకు గడ్డి వేసి ఇంట్లోకి వెళ్లిన కొద్ది క్షణాలకే పిడుగుపడి ఎద్దులు ప్రాణాలు కోల్పోయాయని కన్నీరు మున్నీరుగా విలపించాడు. తనకు ఆరు మంది సంతానమని, ఎద్దులే జీవనాధారమని వాపోయాడు. కాగా చిలమత్తూరు మండల పరిధిలోని కాపు చెన్నంపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీరామరెడ్డి ఎద్దు కూడా పిడుగుపాటుకు మరణించింది. రెండేళ్ళ క్రితం తాను ఎద్దులు కొనుగోలు చేశానని, చనిపోయిన ఎద్దు విలువ దాదాపు రూ. 45వేలు ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆర్థికంగా తమను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.
విడపనకల్లులో...
విడపనకల్లు: మండల పరిధిలోని పొలికి గ్రామంలో సోమవారం ఉరుములు, మెరుపుల దాటికి పిడుగుపాటుకు ఒక ఎద్దు మృతి చెందింది. వివరాలలోకి వెళితే... పొలికి గ్రామానికి చెందిన షెక్షావలి అనే రైతుకు చెందిన తమ ఎద్దులను రోజుమాదిరి తమ కలంలో కట్టివేసినాడు. సోమవారం సాయంత్రం 3 గంటల సమయంలో ఉరుములు, మెరుపులు ఎక్కువ కావడం తో పిడుగుపాటుకు గురై ఒక ఎద్దు మృతి చెందినది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతం కొద్దిపాటి వర్షం పడింది.
సమస్యల పరిష్కారమయ్యే వరకు
పోరాటాలు

పెనుకొండ, మే 2: ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే వరకు నిరంతరం పోరాటాలు చేస్తామని జిల్లా వైకాపా అధ్యక్షులు శంకరనారాయణ పేర్కొన్నారు. వైకాపా ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తలు మండల కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వంత లాభాలపై ఉన్న ఆకాంక్ష ప్రజా సమస్యలపై లేదన్నారు. ఆయనకు డబ్బులు వచ్చే ప్రాజెక్టులు, పథకాలను చేపడుతున్నారని ఆరోపించారు. జిల్లాలో కరవు తాండవిస్తోందని, 45 మండలాల్లో తాగునీటి ఎద్దడి నెలకొందన్నారు. కరవు, తాగునీరు, రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైనట్లు చెప్పారు. రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ అందచేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు శంకర్‌రెడ్డి, గౌస్‌లాజం, నరసింహులు, నాగలూరు బాబు పాల్గొన్నారు.

జిల్లాలో తేలికపాటి వర్షం నమోదు
అనంతపురం సిటీ, మే 2: జిల్లాలో ఆదివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు చిరుజల్లులతో తేలికపాటి వర్షం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా డి.హీరేహళ్ మండలంలో 16.8 మి.మీ.,, బ్రహ్మసముద్రం మండలంలో 15.0 మి.మీ., రాయదుర్గం 10.3 మి.మీ., గుత్తి 9.5 మి.మీ., వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా గుంతకల్లు, ఉరవకొండ, హిందూపురం, మడకశిర ఇతర మండలాల్లో స్వల్పంగా వర్షపాతం నమోదైంది.

జిల్లాలో భానుడి భగభగలు

అనంతపురం సిటీ, మే 2: జిల్లా వ్యాప్తంగా భానుడి భగభగలు, వేడి గాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వడగాల్పులకు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో సోమవారం జిల్లాలో సగటు ఉష్ణోగ్రత 41.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా జిల్లా కేంద్రంలో 43.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. జిల్లాలోని శింగనమల మండలంలో అత్యధికంగా 47.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా అత్యల్పంగా కుందుర్పి 37.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జిల్లాలోని సుమారుగా వందకు పైబడి ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌లలో40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వివిధ మండలాల్లో 40 డిగ్రీల సెల్సియస్ నుండి 36 డిగ్రీల సెల్సియస్ వరకు మండల కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

పిడుగు పడి విద్యార్థి మృతి

ఓబుళదేవరచెరువు, మే 2 : మండలంలోని తంగేడుకుంటకు చెందిన షేక్ హుసేన్ వలి (11) అనే విద్యార్థిపై సోమవారం పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లిదండ్రులు అందించిన వివరాల మేరకు హుసేన్ వలి సైకిల్‌పై వారి తోట దగ్గరకు వెళ్తుండగా మార్గమధ్యలో పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై పిడుగుపడి విద్యార్థి మృతి చెందడంపై గ్రామంలో మొత్తం విషాదచాయలు అలుముకున్నాయి. జెడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి, ఎంపీపీ ఇస్మాయిల్ ఆజాద్, గ్రామ సర్పంచ్ అరుణమ్మలు అక్కడికి చేరుకొని తల్లిదండ్రులను ఓదార్చారు.
మృతదేహాన్ని కదిరి ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు టిడిపిదే...

ధర్మవరం, మే 2: రాష్ట్రంలో 2019లో జరిగే ఎన్నికల్లో సైతం టిడిపినే అధికారంలోకి వస్తుందని, అంతకుమునుపే వైకాపా అధ్యక్షుడు జగన్ జైలుకు వెళ్లక తప్పదని ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ జోస్యం చెప్పారు. సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి ఎక్కడా లేదని, నీటి ఎద్దడి గల కొన్ని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం జరుగుతోందని, అయితే వైకాపా వారు నీటి సమస్య అంటూ రోడ్డెక్కారని ఎమ్మెల్యే గోనుగుంట్ల అన్నారు. భారీ ఎత్తున ఖాళీ బిందెల ధర్నా చేపట్టిన వైకాపాకు పట్టణంలో 1.70 లక్షల జనాభా వున్నా కనీసం 170మంది కూడా రాని దుస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్‌ను ఐదు రెట్లు పెంచడం, డ్వాక్రా రుణమాఫీని తొలి విడతగా రూ.3వేలు అందించారని, రూ.1700 కోట్లు వడ్డీని మాఫీ చేసిందని, ప్రతి వ్యక్తికి కిలో రూ.1కే బియ్యం కిలో పెంచిందన్నారు. జిల్లాకు హంద్రీనీవా ద్వారా అన్ని చెరువులకు నీరివ్వాలన్నది లక్ష్యమని, ఆ తరువాతే చిత్తూరు జిల్లాకు తాగునీటికి మాత్రమే నీరందించడం జరుగుతుందన్నారు. 3.50 లక్షల ఎకరాలకు నీరిస్తే కేవలం 3 నియోజకవర్గాలు మాత్రం లబ్ది పొందుతాయని, అలాగాక జిల్లాలోని 14 చెరువులకు నీరందించాలన్నది లక్ష్యమన్నారు. 2017 జూన్‌కు జిల్లాలోని అన్ని చెరువులకు నీరందిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అంతలోగా లిఫ్ట్ ఇరిగేషన్ తదితర కాలువ మరమ్మతుల పనులు జరుగుతాయన్నారు. ఎన్‌హెచ్‌డి ఎస్‌లో అంగన్‌వాడీ లబ్దిదారుల జాబితా సిద్ధంగా వుంటుందని, అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ-పాస్ ద్వారా సరుకులు అందించడం జరుగుతోందన్నారు. ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళుతోందని, 2019లో జగన్ జైలుకెళ్ళక తప్పదని, కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి లేదని, అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.

వడదెబ్బ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించండి

అనంతపురం సిటీ, మే 2: జిల్లాలో మే నెలలో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అందువల్ల వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించాలని డిఎం అండ్ హెచ్‌ఓను కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. సోమవారం మీకోసంలో వడదెబ్బ, ఎండలు, తాగునీటి సమస్యలపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించడంతోపాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో వడదెబ్బ నివారణకు, చికిత్సకు అవసరమైన అన్ని రకాల అత్యవసర మందులు, విరివిగా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లును అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది తప్పనిసరిగా వారివారి పని కేంద్రాల్లో ఉండేలా చర్యలు చేపట్టాలని డిఎంహెచ్‌ఓ డా.వెంకటరమణను కలెక్టర్ ఆదేశించారు. అలాగే వడదెబ్బ మృతుల వివరాలను పక్కాగా నమోదు చేసి ఎప్పటికప్పుడు తనకు నివేదికను ఇవ్వాలని కూడా డిఎంఅండ్‌హెచ్‌ఓను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడిని నివారించడానికి, అవసరమైన ట్యాంకర్ల ద్వారా తాగునీటిని వెంటనే సరఫరా చేయాలని గ్రామీణ నీటి సరఫరా ఎస్‌ఇ హరిరామనాయక్‌ను కలెక్టర్ ఆదేశించారు.
అలాగే మూగ జీవాలు, పశువులకు కూడా గడ్డి, తాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని పశు సంవర్థక శాఖ జెడి జయకుమార్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి-2 సయ్యద్ ఖాజామొహీద్దీన్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.