అనంతపురం

భక్తి పారవశ్యంగా పులి పార్వేట ఉత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి, జనవరి 16: శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి పార్వేట ఉత్సవం బుధవారం కన్నుల పండుగగా సాగింది. ప్రతి ఏడాది సంక్రాంతి మరుసటి రోజున శ్రీవారి పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారు పురాణ కాలంలో ఆలయం నుండి సంక్రాంతి మరుసటి రోజున అడవికి వెళ్లి సింహాన్ని వేటాడారని, ఇందుకు గుర్తుగా ప్రతి ఏడాది సింహానికి బదులుగా కుందేలును జనం మధ్యలో వదిలి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఉదయం 9.30 గంటలకు ఆలయం నుండి స్తోతాద్రి (కదిరి కొండ) వద్దకు శ్రీవారిని ప్రత్యేకంగా అలకరించి పల్లకిలో తీసుకెళ్లారు. కదిరి కొండ వద్ద స్వామివారికి ఆస్తాన పూజలనంతరం పాలు పొంగళి ఉట్టి వద్దకు తీసుకొచ్చి కౌలేపల్లి గ్రామస్తులు ఏర్పాటుచేసిన పాలను పొంగిస్తారు. పాలు ఏ దిక్కున ఎక్కువగా పొంగుతాయో ఆ దిక్కున వున్న ప్రాంతంలో పంటలు బాగా పండుతాయన్నది భక్తుల విశ్వాసం. ఆ పాలను సేవిస్తే సకల రోగాలు నయమవుతాయన్నది కూడా భక్తుల నమ్మకం. ఏడాది పొడువునా పశువులు ఆరోగ్యంగా వుంటాయన్నది విశ్వాసం. అనంతరం రైల్వే స్టేషన్ వద్ద శ్రీవారి పార్వేట ఉత్సవాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కుందేలును తీసుకునేందుకు పోటీపడ్డారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి పులి పార్వేట ఉత్సవాన్ని భక్తులు భక్తి పారవశ్యంగా నిర్వహించారు. ఆలయంలో సంక్రాంతి పార్వేట ఉత్సవం సందర్భంగా పూజలు నిర్వహించి ఉత్సవ విగ్రహాలను కదిరి కొండకు పల్లకిపై తీసుకువెళ్లి, కొండలో వున్న లక్ష్మీ నరసింహస్వామి మూల విరాట్‌కు అర్చకులు ఆస్తాన పూజలు, హోమాలు, కలశ పూజలు, నైవేద్యాలు నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పాలు పొంగులు ఉట్టి వద్దకు స్వామి చేరారు. ఉట్టి ముందర పాలు పొంగు కార్యక్రమం ఆలయ పూజార్లు నిర్వహించారు. పార్వేట ఉత్సవం రైల్వే కట్టపై నిర్వహించారు. స్వామి ఆశీర్వాదంతో కుందేలును పార్వేటకు వదిలారు. భక్తులు, యువకులు పార్వేట ఉత్సవాన్ని నిర్వహించుకొని ప్రసాదంగా కుందేలు మాంసాన్ని స్వీకరించారు. అనంతరం శమి పూజా మండపం వద్దకు చేరుకొని భక్తులకు ఖాద్రీశుడు దర్శనమిచ్చారు. కనుమ పండుగ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అశ్వ వాహనంపై నారసింహున్ని మంగళవాయిద్యాలతో ఊరేగించారు. రాత్రికి స్వామివారు ఆలయానికి చేరుకోవడంతో పార్వేట ఉత్సవం ముగిసింది. పార్వేట ఉత్సవాన్ని తిలకించేందుకు కదిరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి, రూరల్ సీఐ మన్సూరుద్దీన్, రూరల్ అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ ఇస్మాయిల్, ఎస్‌ఐలు ఖాజాహుస్సేన్, వెంకటస్వామి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చాంద్‌బాషా, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కందికుంట వెంకటప్రసాద్, ఈ ఓ వెంకటేశ్వరరెడ్డి, అర్చకులు, ప్రజలు పాల్గొన్నారు.