అనంతపురం

అమృత్ నిధులతో ‘అనంత’ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, జూన్ 25: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన అమృత్ నిధులతో నగరాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, మేయర్ మదమంచి స్వరూప పేర్కొన్నారు. ఈమేరకు నగరంలోని 32వ డివిజన్‌లో అమృత్ పథకం కింద మంజూరైన నిధులతో అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నగరంలోని 100 నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు ఉద్దేశించిన అమృత్ పథకాన్ని గత ఏడాది ప్రారంభించారు. అందులో భాగంగా మొదటి విడతగా రూ. 50లక్షలు నిధులు మంజూరు చేశారు. ఈ నిధులను 32వ డివిజన్‌లో గల పార్కును అభివృద్ధి చేసేందుకు ఖర్చు చేస్తున్నందున పార్కు నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే, మేయర్‌లు భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్ పథకాన్ని అభివృద్ధికి వరంగా పేర్కొన్నారు. అమృత్ నిధులతో అనంతను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతామన్నారు. అమృత్ నిధులు ఖర్చు చేస్తున్న బుద్ధ విహార్ పార్కును అన్ని రకాల సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాబోయే 3 సం.లలో నగరంలోని అన్ని డివిజన్‌లను ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్రమోది, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి మంత్రంతో పనిచేస్తున్నారన్నారు. అదే స్ఫూర్తితో నగరాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేస్తామన్నారు. మేయర్ స్వరూప మాట్లాడుతూ నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు ప్రధాని మోదీ అమృత్ పథకాన్ని ప్రారంభించారన్నారు. 32వ డివిజన్‌ను తాను దత్తత డివిజన్‌గా స్వీకరించానని, అందులో భాగంగా ఆదర్శనగర్ అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. అమృత్ పథకం ద్వారా మొత్తం రూ. 50 కోట్లు విడుదలకానున్నట్లు తెలిపారు. ఇందులో నీటి సరఫరా, డ్రైనేజి కాలువల నిర్మాణం, రోడ్లు, పార్కుల అభివృద్ధి మొదలైన వాటికి ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో పార్కుల అభివృద్ధికి రూ.2 కోట్లు ఖర్చు చేయనున్నామని, మొదటి విడతగా రూ.50 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. నగరంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తామన్నారు. కార్పొరేటర్ బంగి సుదర్శన్ మాట్లాడుతూ తన డివిజన్‌లో పార్కు అభివృద్ధి చేస్తున్నందులకు ఎమ్మెల్యే, మేయర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోది అమృత్ నగరాల గురించి చేసిన ప్రసంగాన్ని స్థానిక ప్రజలతో కలసి ఎమ్మెల్యే, మేయర్ వీక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గంపన్న, మార్కెట్ యార్డు చైర్మన్ ఆదినారాయణ, నగర కమిషనర్ చల్లా ఓబిలేసు, కార్పొరేటర్లు రాజారావ్, పల్లవి, ప్రొ. బాలసుబ్రమణ్యం, జనే్న ఆంజనేయులు, స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

గ్రౌండ్ బుకింగ్ సర్వీసులతో ఆర్టీసీకి గండి!
* ప్రైవేటు వాహనాలకు పెరుగుతున్న రద్దీ
నల్లమాడ, జూన్ 25 : ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షిత ప్రయాణం. అని చెప్తూ ప్రస్తుతం ప్రైవేటు వాహనాల ఆదాయాన్ని పరోక్షంగా ఆర్టీసీనే పెంచుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం గ్రౌండ్ బుకింగ్ సర్వీసులుగా కొన్ని ఆర్టీసీ బస్సులను నడపడమేనని చెప్పుకోవచ్చు. కొద్దిరోజుల క్రితం నుంచి కండెక్టర్ వ్యవస్థను తగ్గించి ఆర్టీసీని లాభాల బాటలో తీసుకెళ్ళొచ్చని గ్రౌండ్ బుకింగ్ సర్వీసుల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నూతన పద్ధతికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని కదిరి, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు డిపోల ద్వారా 20 బస్సులు గ్రౌండ్ బుకింగ్ సర్వీసులుగా నడుస్తున్నాయి. డిపో పరిధిలోని బస్టాండ్‌లో బస్సులో ఎక్కిన ప్రయాణీకులకు టికెట్లు ఇచ్చి కండెక్టర్ అక్కడే దిగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే నిర్ధారించిన స్టాపింగ్‌ల్లో మాత్రమే కండెక్టర్‌లను ఉంచి బస్సు ఆ పట్టణంలోకి వెళ్ళినప్పుడు తిరిగి అక్కడ ఓ కండెక్టర్ ఎక్కి అక్కడ బస్సులో ఎక్కిన ప్రయాణీకులకు టి కెట్లు ఇవ్వడం జరగుతుంది. ఈ పద్ధతితో నిర్దేశించిన స్టాపింగ్‌ల్లో కనీసం 20నిమిషాల పా టు ఆలస్యం జ రుగుతోంది. కదిరినుంచి అనంతపురం వెళ్ళే బ స్సులు కనీసం 5నుండి ఆరు గ్రామా లు, పట్టణాల్లో నిలిపి ప్రయాణీకులను ఎక్కించుకునేవారు. అయితే గ్రౌండ్ బుకింగ్ సర్వీసులుగా నడుపుతున్న బస్సులు కేవలం ఒకటి, రెండు చోట్లే ఆపుతున్నారు. దీంతో ప్రయాణీకులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. గ్రౌండ్ బుకింగ్ బస్సులు నడుస్తున్న డిపోల పరిధిలో ప్రయాణీకులు ఇదేవిధంగా ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా అవే రూట్లలో కండెక్టర్ సర్వీస్ బస్సులు కూడా నడుపుతున్నామని సంబంధిత అధికారులు చెప్తున్నప్పటికీ వాటికంటే ముందు ప్రైవేటు వాహనాలు తిరుగుతుండటంతో ప్రయాణీకులు వాటినే ఆశ్రయిస్తున్నారు. గ్రౌండ్ బుకింగ్ సర్వీసుల కారణంగా ఆర్టీసీని ఆదాయంలో నడిపంచవచ్చనే ఆలోచనతో సంబంధిత అధికారులు చెప్పుకుంటున్నప్పటికీ కేవలం కండెక్టర్‌ల వ్యవస్థను పూర్తీగా తగ్గించాలనే దురుద్దేశ్యంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆర్టీసీ కార్మికులు ఆరోపిస్తున్నారు. గ్రౌండ్ బుకింగ్ సర్వీసులుగా కేవలం ఇతరులచే అద్దెకు తీసుకున్న హైర్ బస్సులను మాత్రమే నడుపుతున్నారు. రాబోయే కాలంలో పూర్తీ స్థాయిలో ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికే ముందుగా గ్రౌండ్ బుకింగ్ సర్వీసులు ప్రారంభించారని కొందరు ఆర్టీసీలోని కార్మికులే ఆరోపించడం గమనార్హం. కండెక్టర్ వుండి నడుపుతున్న హైర్ బస్సుల్లో రోజుకు రూ. 20వేలకు పైబడి వచ్చే రాబడి గ్రౌండ్ సర్వీసుల బస్సుల్లో సగానికి సగం పడిపోయిందని దీంతో ఆ సర్వీసులు నడపుతున్న డిపోలకు లక్షల్లో నష్టం వాటిల్లుతోందని ఆర్టీసీ కార్మికుల ద్వారా తెలిసింది. తరచూ ఆపే స్టాపింగ్‌లలో బస్సులను ఆపకపోవడం జరుగుతుండటంతో ప్రయాణీకులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తుండటం కారణంగా ఆర్టీసీకి నష్టం వాటిల్లి ప్రైవేటు వాహనాలు లాభాలనర్జిస్తున్నట్లు గ్రౌండ్ బుకింగ్ సర్వీసుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పద్ధని మార్చి గతంలోలాగే అన్ని ఆర్టీసీ బస్సులను కండెక్టర్ సర్వీసులుగానే నడపాలని కోరుతూ ఆర్టీసీలోని కొన్ని కార్మిక సంఘాల నాయకులు ధర్నాలకు పూనుకుంటున్నారు. ఏది ఏమైనా గతంలో ఆర్టీసీ బస్సులు తక్కువగా తిరిగే గ్రామాలు, పట్టణాల్లో మాత్రమే ప్రయాణీకులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించేవారు. ప్రస్తుతం అమలులో వున్న గ్రౌండ్ బుకింగ్ సర్వీసులతో నిరంతరం ఆర్టీసీ బస్సు సౌకర్యం వున్న ప్రధాన పట్టణాలు, అనంతపురం నగరానికి వెళ్ళే ప్రధాన దారిలో వున్న గ్రామాలు, మండల కేంద్రాల వాసులు కూడా ప్రయాణాల కోసం ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందన్న విమర్శలు గ్రౌండ్ బుకింగ్ సర్వీసులు నడుస్తున్న పట్టణాల్లో వ్యక్తమవుతున్నాయి.

రుణమాఫీపై ప్రచారం చేయండి..
* మంత్రి పరిటాల సునీత
రామగిరి, జూన్ 25: రైతులకు జరిగిన రుణమాఫీపై స్థానిక టిడిపి నేతలు, అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మంత్రి పరిటాల సునీత అన్నారు. శనివారం మండలంలోని శ్రీహరిపురం గ్రామంలో జరిగిన రైతు ఉపశమన అర్హత పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత పాల్గొని రుణమాఫీ అర్హత పత్రాలను పంపిణీ చేసారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాటకు రాష్ట్రం ఎన్ని కష్టాల్లో వున్నా రూ.3500 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. మాఫీ అయిన మొత్తంపై వడ్డీ పడకుండా దానిని కూడా ప్రభుత్వమే భరిస్తోందన్నారు. రైతు ఉపశమన పత్రాలు అందించేటప్పుడు ఆ రైతుకు రుణమాఫీ గురించి జన్మభూమి కమిటీ సభ్యులు తప్పక తెలియజేయాలన్నారు. అంతేకాకుండా మహిళలకు రుణమాఫీ గురించి తెలియజేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వారి దృష్టికి తీసుకెళ్ళాలన్నారు. ఈ ఏడాది విత్తన వేరుశనగ పంపిణీ సజావుగా సాగిందని, వచ్చే ఏడాది నుంచి ఒక్కో రైతుకు 5 ప్యాకెట్లు అందిస్తూ వారి గ్రామాల్లోనే విత్తనకాయలు కూడా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 2.32 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఉపశమన అర్హత పత్రాలు అందించడం జరుగుతుందని, ఇప్పటివరకు 70వేలకు పైగా రుణ ఉపశమన అర్హత పత్రాలు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. ఈ నెల 30వ తేదీలోపు రైతులందరికి ఈ అర్హత పత్రాలు అందించడం జరుగుతుందన్నారు. మండలంలో 12,660మంది రైతులకు రుణమాఫీ కాగా 50వేల లోపు పూర్తిగా 2134మంది రైతులకు మాఫీ చేయడం జరిగిందన్నారు. మొదటి విడతలో రూ.16.51 కోట్లు, 2వ విడతలో 10,526మంది రైతులకు రూ.9.78 కోట్లు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు మండలంలో దాదాపు 2వేల వరకు రుణమాఫీ ఉపశమన పత్రాలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి రామ్మూర్తినాయుడు, మాజీ ఎంపిపి రంగయ్య, మండల కన్వీనర్ పరంధామయాదవ్, సీనియర్ నాయకులు సంజీవరాయుడు, సర్పంచ్ ఇటిక నల్లప్ప, తహశీల్దార్ ఆదినారాయణ, ఎంపిడిఓ పూలనరసింహులు, ఏఓ యల్లప్ప, ఏఈఓ మురళి తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు
నాసిరకం గుడ్లు సరఫరా!
ఆత్మకూరు, జూన్ 25: మండల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్ఠికాహారం పేరుతో సరఫరా చేయబడుతున్న కోడి గుడ్లు అత్యంత నాసిరకంగా ఉంటున్నాయి. ఒక్కొక్క గుడ్డు 50 గ్రాముల బరువు ఉండాలి. ఐతే ఇక్కడికి సరఫరా చేయబడుతున్న గుడ్లు మాత్రం 20నుంచి 25 గ్రాముల బరువు తూగుతున్నాయి. పసిపిల్లలకు పౌష్ఠికాహారం అందించే పేరుతో ఇళ్ల నుంచి బలవంతంగా అంగన్‌వాడీ కేంద్రాలకు తెచ్చి అర్దాకలి తీరుస్తుండడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పిల్లవాడికి నెలలో 16రోజులు గుడ్డు అందివ్వాలి. అవి కూడా సక్రమంగా సరఫరా చేయలేదని అంగన్‌వాడీ కేంద్ర నిర్వాహకులు చెబుతున్నారు. బాలింతలకు, గర్భిణులకు ఇచ్చే పౌష్ఠికాహారంలో కూడా ఇదే నాణ్యతా ప్రమాణాలు కొనసాగిస్తుండడంతో వారికి అందే పౌష్ఠికాహారం ఎంత అన్నది లెక్క తేలాల్సి ఉంటుంది. ఆత్మకూరు మండల పరిధిలో 364 మంది బాలింతలు, 387 మంది గర్భిణీలు, 47 అంగన్‌వాడీ కేంద్రాల్లో 2380 మంది పిల్లలున్నారని పర్యవేక్షకురాలు నాగమణి చెబుతున్నారు. గుడ్డు నాణ్యత ఎందుకు లోపించిందని పర్యవేక్షకురాలిని వివరణ కోరగా ఇది కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారని సమాధానం ఇచ్చారు. పేద ప్రజల పిల్లలకు మంచి పౌష్ఠికాహారం అందించి వారి ఎదుగుదలకు చేయూతనివ్వాలని ప్రభుత్వం భావిస్తే చివరకు నోరు లేని పిల్లల కడుపులు మాడ్చడం ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.
వౌలిక సదుపాయాల కల్పనే అమృత్ లక్ష్యం
రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి
హిందూపురం టౌన్, జూన్ 25 : పట్టణాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రధాని నరేంద్రమోదీ అమృత్ పథకాన్ని తీసుకొచ్చినట్లు రాష్ట్ర బిసి కార్పొరేషన్ చైర్మన్ పామిశెట్టి రంగనాయకులు, మున్సిపల్ చైర్‌పర్సన్ రావిళ్ల లక్ష్మి అన్నారు. అమృత్ పథకం తీసుకొచ్చి ఏడాది పూర్తి కావడంతో శనివారం సాయంత్రం మున్సిపల్ కౌన్సిల్ హాలులో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ప్రధాని మోదీ అమృత్ పథకంపై మాట్లాడిన వివరాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభ్యులకు తెలియచేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ సహకారంతో పట్టణాన్ని అమృత్ పథకంలో చేర్చారని వివరించారు. అమృత్ నిధుల విడుదలకు నిర్దేశించిన సంస్కరణలను అమలు చేయడంలో పట్టణం ముందంజలో ఉందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే మున్సిపల్ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశామని, మున్సిపల్ ఆదాయ, వ్యయాలను డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ పద్ధతిలో నిర్వహిస్తూ ఆడిట్ చేయించామని తెలిపారు. పన్నుల వసూళ్ళలో పట్టణంలో 99 శాతం నివాస, వ్యాపార సదుపాయాలను పన్ను పరిధిలోకి తెచ్చామని, 94 శాతం వసూలు చేశామని తెలియచేశారు. పట్టణంలో అన్ని కొళాయిలకు పన్ను విధించి 90 శాతం పన్ను వసూలుకు చర్యలు తీసుకున్నట్లు, కరెంటు చార్జీలను తగ్గించేందుకు ఎల్‌ఇడిలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్కుల అభివృద్ధిలో భాగంగా ఇందిరాపార్కును మున్సిపల్ నిధులతో అభివృద్ధి చేశామని, ఈ ఏడాదికి అమృత్ నిధులు రూ.50 లక్షలతో హౌసింగ్ బోర్డు పార్క్‌ను అభివృద్ధి చేయనున్నామని, వచ్చే ఏడాది ఎన్‌జిఓ కాలనీలో నూతన పార్కు నిర్మిస్తామన్నారు. నిధుల కోసం పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపినట్లు వివరించారు. నీటి సరఫరా, పారిశుద్ధ్యం మెరుగుకు ప్రతిపాదనలు పంపామని, రూ.100 కోట్లు మంజూరయ్యే అవకాశం ఉందని చెప్పారు. అమృత్‌లో నిర్దేశించిన విధంగా అన్ని పథకాలు చేపట్టామని, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. ఇంటింటా చెత్తసేకరణ, ప్లాస్టిక్ నిషేధం, బహిరంగ మలవిసర్జన నిషేధం అమలు చేస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాడటం, వర్షం నీటిని ఒడిసి పట్టడానికి ఇంకుడు గుంతల తవ్వకం చేపట్టామని తెలిపారు. అందరికీ ఇళ్లు పథకం కింద ఇప్పటికే 500 ఇళ్లు మంజూరయ్యాయని, మరో 11 వేల మంజూరు కోసం ప్రభుత్వానికి పంపామని వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జెపికె రాము, కమిషనర్ ఎవివి భద్రరావు, మున్సిపల్ ఇంజనీర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ సుందరీకరణకు సహకరించండి..
* ఎమ్మెల్యే జితేంద్రగౌడ్
గుంతకల్లు, జూన్ 25 : పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో శనివారం అమృత్ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో రోడ్లు, మురికి నీటి కాలువల ఏర్పాటు, ప్రతి ఇంటికీ తాగునీటి కొళాయి, పైపులైన్‌ల ఏర్పాటు, ఇంటింటికీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమృత్ యోజన పథకం కింద గుంతకల్లును ఎంపిక చేసినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా పట్టణ సుందరీకరణకు రూ.16.95 కోట్ల మంజూరైనట్లు తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 50, రాష్ట్ర ప్రభుత్వం 30, మున్సిపాలిటీ 20 శాతం నిధులతో పట్టణంలో వౌలిక సదుపాయలు కల్పించనున్నట్లు తెలిపారు. మూడేళ్ల కాలంలో దాదాపు రూ.45 కోట్ల నిధులు విడుదలవుతాయన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి అమృత్ యోజన పథకం ప్రారంభోత్సవంతో పాటు ఆయన ప్రసంగాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అపర్ణ, వైస్ చైర్మన్ శ్రీనాథ్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయం, ఎంఇ సత్యనారాయణ రాజ్, కౌన్సిలర్‌లు, టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజధాని నిర్మాణం పనులపై
శే్వతపత్రం విడుదల చేయాలి
* పిసిసి ఉపాధ్యక్షుడు శైలజానాథ్
అనంతపురంటౌన్, జూన్ 25: రాజధాని నిర్మాణం పనులపై శే్వతపత్రం ప్రకటించాలని పిసిసి ఉపాధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఆర్‌డిఎ చంద్రబాబు రెవెన్యూ డెవలప్‌మెంట్ ఏజెన్సీగా పేరు పెట్టుకుంటే బాగుంటుందన్నారు. రాజధాని నిర్మాణంలో జపాన్, మలేషియా, చైనా దేశాలు పాలుపంచుకుంటాయని ప్రకటించిన చంద్రబాబునాయుడు ప్రైవేట్ కంపెనీలకు బాధ్యతలు అప్పగించటం దారుణమన్నారు. సింగపూర్ ప్రైవేట్ కంపెనీకి 1600 ఎకరాల భూమిని 58 శాతం వాటాతో అప్పగించటం వెనుక బాబు ప్రయోజనాలున్నాయని ఆయన ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణ పనులను గుత్తగా ప్రైవేట్ కంపెనీకి అప్పగించారనటానికి తమ వద్ద ఆధారాలున్నాయన్నారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తే ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించటానికి వివిధ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ప్రకటించిన చంద్రబాబు ఆఖరు దశలో ప్రైవేట్ కంపెనీకి అప్పగించటంలో ఆంతర్యమేమిటని అన్నారు. స్విస్ ఛాలెంజింగ్ పద్ధతుల్లో రాజధాని నిర్మాణ పనులను అప్పగించటం వలన ప్రయోజనాలకన్నా నష్టాలే ఎక్కువ అని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నా చంద్రబాబునాయుడు అటువైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. దీనివలన నల్ల ధనాన్ని పెట్టుబడుల రూపంలో తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలకు బలం చేకూరినట్లైందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే శే్వతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పిసిసి అధికార ప్రతినిధి నాగరాజు, నగర అధ్యక్షుడు దాదాగాంధీ, వాసు, రంగనాథ్, ప్రతాపరెడ్డి, హరి పాల్గొన్నారు.
చదువుకు పేదరికం అడ్డుకారాదు
* విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ అనిల్‌బాబు
అనంతపురం సిటీ, జూన్ 25: చదువుకు పేదరికం అడ్డుకారాదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్‌పి పి.అనిల్‌బాబు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఛత్రపతి శివాజీ మున్సిపల్ స్కూల్, ఆశా మున్సిపల్ స్కూల్, తపోవనం ఎంపిపి స్కూల్స్ నందు నీలయ్యగారి కళ్యాణచక్రవర్తి సేవా సమితి, టిమ్యాడ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ కిట్స్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజిలెన్సు ఎస్పీ అనిల్‌బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అరకొర సౌకర్యాలతో చదువును కొనసాగిస్తున్నారని, వీరికి తగిన ప్రోత్సాహం అందిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎందరో ఉన్నతస్థాయికి ఎదిగారని తెలిపారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్, రబ్బర్, స్కేల్ వస్తువులను అందజేసారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ఛైర్మన్ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కమల్‌నాథ్, ఎజి ప్రమీలమ్మ, మానవత తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి, తోట నాగరాజు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రఘునాథ్, ప్రణయ్, అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామికి
ప్రత్యేక పూజలు
ఉరవకొండ, జూన్ 25 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చనలు చేశారు. చివరి శనివారం కావడంతో స్వామి దర్శనం కోసం జిల్లా నలమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ రమేష్‌బాబు, ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యలు, అర్చకులు వాసు, గుండురావు తదితరులు పాల్గొన్నారు.

చట్టం ప్రకారమే బాధితులకు న్యాయం
* హైకోర్టు జడ్జి రమేష్ రంగనాథన్
అనంతపురం సిటీ, జూన్ 25: మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపులకు గురైన వారికి చట్టం మేరకు తగిన న్యాయాన్ని అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టు జడ్జి జస్టిస్ రమేష్ రంగనాథ్‌న్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫింగ్, సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనే అంశంపై వర్కుషాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్డు జడ్జి జస్టిస్ రమేష్ రంగనాథన్, జిల్లా జడ్జి హరిహరినాథశర్మ, డిఐజి ప్రభాకర్‌రావు, రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ జెడి రాజ్యలక్ష్మి, డిఎల్‌ఎస్‌ఎ సెక్రటరీ కమలాకర్‌రెడ్డి, ఎస్పీ రాజశేఖర్‌బాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, అనేక రకాలైన లైగింక వేధింపులు నేరమన్నారు. అక్రమ రవాణాకు గురైన బాధితులకు అవగాహన కల్పించడంతోపాటు ప్రభుత్వం నుండి ఫలాలను అందేవిధంగా చూడాలన్నారు. పోలీసు శాఖ ఒక్కటే కాకుండా ఇతర శాఖల న్యాయ, మహిళా, శిశు సంక్షేమ శాఖల సహకారం, అలాగే స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేసి ఎలాంటి నేరాన్ని అయినా అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఆర్థిక, సామాజిక కారణాల వల్ల బాధపడుతున్న వారిని ప్రభుత్వం అదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెసి-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోసెదార్, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పలువురు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

పామిడి పెద్ద కాలువలో మృతదేహం లభ్యం..
* ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐ, ఎస్‌ఐ
పామిడి, జూన్ 25: పట్టణంలోని మడికట్ల ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని విజ్ఞాన్ స్కూల్ వెనుకనున్న పెద్ద కాలువలో శనివారం మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరేంద్రరెడ్డి, ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి, ట్రైనీ ఎస్‌ఐ సత్యనారాయణలు సంఘటనా స్థలానికి చేరుకుని కాలువలో మృతదేహం పడి వున్న తీరును పరిశీలించారు. మెహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉండటంతో అసలు మృతదేహం ఎవరిది.. అది కాలువలోకి ఎలా వచ్చింది.. హత్య చేసి ఎవరైనా ఇక్కడ పడవేశారా.. లేక ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయాడా.. అంటూ సమీపంలో నివాసముంటున్న ప్రజల వద్ద ఆరా తీశారు. ఇంతలో అక్కడున్న ఓ యువకుడు మృతదేహంపై ఉన్నటువంటి చొక్కాను గుర్తించి చనిపోయింది మా నాన్న బాలప్ప అంటూ విలపించాడు. బాలప్ప బొడ్రాయి సమీపంలో నివాసముంటున్నాడని మద్యం సేవించి ప్రమాదవశాత్తు పెద్ద కాలువలో పడి వుంటాడన్నారు. పామిడి విఆర్‌ఓలు ఆంజనేయులు, రవికాంత్‌లు అక్కడకు చేరుకుని మృతదేహం బాలప్పదేనని గుర్తించారు. జరిగిన సంఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.
వ్యక్తి ఆత్మహత్య
రాప్తాడు, జూన్ 25: మండల పరిధిలోని రామినేపల్లి గ్రామం దగ్గర జాతీయ రహదారి పక్కన వేప చెట్టుకు ఉరి వేసుకుని శివకుమార్(27) శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శనివారం ఉదయం తెల్లవారుజామున ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి పరిశీలించామని, ఉరి వేసుకున్న వ్యక్తి లారీ క్లీనర్‌గా అనుమానిస్తున్నామని, అతని దగ్గర లభించిన ఆధార్ కార్డు ఆధారం ప్రకారం, అతని పేరు శివకుమార్, కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన వ్యక్తిగా గుర్తించామని ఎస్‌ఐ ధరణిబాబు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుని వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదన్నారు.