తూర్పుగోదావరి

రౌడీయిజం-రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, మార్చి 25: కోనసీమ కేంద్రం అమలాపురం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వంత నియోజకవర్గం. ఇది రానురానూ నేరమయంగా మారిపోతోంది. గతంలో రౌడీషీటర్లుగా పోలీసుస్టేషన్ గోడలకు ఎక్కిన వారిలో కొందరు గడిచిన స్థానిక ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. వారే కాంట్రాక్టర్లుగా మారటంతో రౌడీయిజం, రాజకీయం మిళితమైపోయింది. దీనితో వారుచేసే అన్యాయాలు, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. వారు పాల్పడే అక్రమాలను ప్రశ్నించేవారిని బెదిరించటం, దారికాచి కొట్టడం నిత్యకృత్యంగా మారింది. అధికారం మాకు అండగా ఉందన్న అహంకారంతో మట్టి, ఇసుక మాఫియాగా ఏర్పడి కోట్లు సంపాదిస్తున్నారు. వివిధ శాఖల అధికారులను బెదిరించి తమ గుప్పెట్లో పెట్టుకుని తాము ఆడింది ఆట పాడింది పాటగా వ్యవహరిస్తున్నారు. మాకెందుకువచ్చిన తంటా అని అధికారులు వౌనముద్ర వహిస్తుండటంతో, వీరి అక్రమాలను వెలికితీస్తున్న మీడియాపై మట్టిమాఫియా కక్ష కట్టింది. వీరి అక్రమాలపై వార్తలు రాస్తున్న విలేఖరులను ఏకంగా మట్టుబెట్టేందుకు సైతం తెగిస్తున్నారు. అల్లవరం మండలంలో అక్రమంగా మట్టి తవ్వుతున్న ప్రాంతంలో ఫోటోలు తీసిన పాపానికి ఒక పత్రికా విలేఖరిని కిడ్నాప్‌చేసి, హత్యాయత్నానికి ఒడిగట్టిన సంగతి విదితమే. దీనిపై జర్నలిస్టుసంఘాలు ఆందోళన బాట పట్టాయి. విలేఖరి నాయుడుపై జరిగిన దాడికి వారం రోజుల ముందునుండే అతనిని హత్యచేసేందుకు పథక రచన చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీని వెనుక కొందరు నేతల హస్తం కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, వివిధ శాఖల అధికారులు ఆఖరికి విలేఖరులు సైతం అమలాపురం మార్కు రౌడీయిజానికి భయపడి, ఉద్యోగాలు చేయాల్సిన దుస్థితి ఇక్కడ రాజ్యమేలుతోంది. అమలాపురంలో రాజ్యమేలుతున్న అధికారపార్టీ రౌడీనేతల అరాచకత్వంపై సాక్షాత్తూ హోంమంత్రి చినరాజప్ప సైతం పలుమార్లు హెచ్చరికలు చేసినా ఫలితం శూన్యం. ఇటీవలే అమలాపురం మున్సిపాలిటీలో జరిగిన టెండర్ల రింగు మాయాజాలాన్ని ధిక్కరించి, టెండర్లువేసిన రాజమండ్రి ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లపై దాడిచేసిన ఘటన అమలాపురం కాంట్రాక్టర్ల వ్యవహారశైలి నియోజకవర్గంలో జరుగుతున్న నేరప్రవృత్తిని తేటతెల్లంచేస్తున్నాయి. కొందరు అధికార పార్టీ నేతల అండదండలతో పట్టణాన్ని నేరమయంగా మార్చేసిన నేతల వైఖరి మూలంగా ఏరోజు ఏ అరాచకం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నతాధికార్లు, అధికారపార్టీ అగ్రనేతలు దీనిపై దృష్టిసారించాలని కోరుతున్నారు.
అయిదు యూనిట్ల లారీలకు
ఇసుక ఎగుమతి చేయవద్దు
-అమలాపురం ఆర్డీవో గణేష్‌కుమార్ ఆదేశం
-ఊబలంక ర్యాంపులో అక్రమాలపై ‘ఆంధ్రభూమి’ కథనానికి స్పందన
రావులపాలెం, మార్చి 25: మండలంలోని ఊబలంక ఇసుక ర్యాంపులో అయిదు యూనిట్ల లారీలకు ఇసుక ఎగుమతులు చేయవద్దని అమలాపురం ఆర్డీవో జి గణేష్‌కుమార్ ఆదేశించారు. ఈ ర్యాంపులో కూలీల ముసుగులో కొందరు లారీ యజమానులు, ప్రైవేటు వ్యక్తులు హవా చెలాయిస్తూ బయట ప్రాంత లారీలకు ఇసుక ఎగుమతులు జరగకుండా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న వైనంపై శుక్రవారం ‘ఉచిత ఇసుకలో వేళ్లూనుకుంటున్న మాఫియా’ శీర్షికన ‘ఆంధ్రభూమి’లో ప్రచురితమైన కథనంపై ఆర్డీవో గణేష్‌కుమార్ స్పందించారు. ఒంట్లో బాగోలేదంటూ కూలీలు బయట ప్రాంత లారీలకు ఎగుమతులు చేయకుండా పథకం ప్రకారం ర్యాంపు నుండి వెళ్లిపోయిన ఉదంతంపై ఆర్డీవో తీవ్రంగా స్పందించారు. శుక్రవారం రాత్రి ఆయన అమలాపురం డిఎస్పీ ఎల్ అంకయ్యతో కలిసి ఊబలంక ర్యాంపును ఆకస్మికంగా సందర్శించారు. ర్యాంపులో జరుగుతున్న పరిణామాలపై ఆరాతీశారు. ప్రైవేటు వ్యక్తుల కనుసన్నల్లో ఎగుమతులు జరుపుతూ స్థానిక లారీలకు ప్రాధాన్యతనిచ్చి ఇతర ప్రాంత లారీలను పక్కన పెట్టడంపై ఆయన మండలాధికారులతో సమీక్షించారు. కూలీల వ్యవహార శైలిని తప్పుబట్టారు. వెంటనే అయిదు యూనిట్ల లారీలకు ఎగుమతులు నిలిపివేసి, గతంలో మాదిరిగా 2 యూనిట్ల లారీలకు, ట్రాక్టర్లకు మాత్రమే ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సిఐ పివి రమణ, తహసీల్దారు సిహెచ్ ఉదయభాస్కర్, ఎస్‌ఐ పివి త్రినాథ్‌ను ఆదేశించారు. అలాగే మండల అధికారులు సమావేశమై ఈ ర్యాంపులో లారీలకు ఇసుక ఎగమతులపై ఒక నిర్ణయం తీసుకోవాలని అయిదు యూనిట్ల లారీలకు ఎగుమతులు నిలిపివేయాలని సూచించారు. కోనసీమలోని ఏ ర్యాంపులోను లారీలకు ఎగుమతులు జరగడం లేదని, రావులపాలెం మండలం మాత్రమే అనుమతులిచ్చామని ఆర్డీవో చెప్పారు. అయితే కూలీలు ఈవిధంగా ప్రవర్తించడంతో లారీలకు ఎగుమతులు నిలిపివేస్తున్నట్టు తెలిపారు.
130 లారీల ఇసుక స్వాధీనౄ
సీతానగరం, మార్చి 25: మండల కేంద్రం సీతానగరం, ముగ్గళ్ళ, రఘుదేవపురం ప్రాంతాల్లో శుక్రవారం సుమారు 130 లారీలకు సరిపడేంత ఇసుక నిల్వలను పోలీసులు సీజ్‌చేశారు. ముగ్గళ్ల గ్రామంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 50 లారీల ఇసుకను రాజమండ్రి నార్త్‌జోన్ డిఎస్పీ ఎవిఎల్ ప్రసన్నకుమార్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాంపులో కాకుండా వేరే చోట అక్రమంగా ఇసుక నిల్వ చేసిన వారిపై, స్థల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాంపు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించాలని, ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే అధికంగా వసూలు చేస్తే చర్యలు తప్పవన్నారు. ఇటీవల రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయ్‌కృష్ణన్ కాటవరం, మునికొడవలి, వంగళపూడి ర్యాంపులను పరిశీలించారని, వాటిని త్వరలో ఉచిత ఇసుక ర్యాంపులుగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. కాగా ఇసుక గుట్టలను రాజమండ్రి అడిషనల్ ఎస్పీ ఆర్ గంగాధరరావు పరిశీలించారు. కార్యక్రమంలో సీతానగరం ఎస్సై ఎం పవన్‌కుమార్, ఎఎస్సై కె మోళయ్య, విఆర్వో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.