అనంతపురం

ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదిగుబ్బ, జూలై 23: కర్ణాటక నుంచి దైవ దర్శనానికై తిరుపతి వెళ్తూ ముదిగుబ్బ, సంకేపల్లి మధ్య జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 5కుటుంబాలకు చెందిన 5గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ముదిగుబ్బ ఎస్సై తెలిపిన మేరకు వివరాలు... కర్ణాటక రాష్ట్ర దొడ్డబళ్ళాపూర్ తాలూకా చిన్న బెలమంగల్ గ్రామానికి చెందిన మూడు కుటుంబాల వారు వారి సన్నిహితులైన మరో రెండు కుటుంబాలకు చెందిన వారిని వెంటపెట్టుకుని తవేరా వాహనంలో దైవ దర్శనానికి కదిరికి వెళ్తుండగా ముదిగుబ్బ మండలంలోని సంకేపల్లి సమీపాన రాగానే కదిరి వైపు నుండి అనంతపురం వైపు వెళ్తున్న టమోటా లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కృతిక (3), శైలజ (33), నందీష్ (18), కావ్య (20), డ్రైవర్ మంజునాథ్ (30) అక్కడికక్కడే మృతి చెందగా రామయ్య, సుమిత్ర, ధనూష్, మునిరాజు, అనితాలక్ష్మి, సాగర్‌లు తీవ్రం గా గాయపడ్డారు. వీరిలో సాగర్, మునిరాజ్‌ల పరిస్థితి విషమంగా వున్నట్లు తెలిసింది. రామయ్య, అతడి భార్య సుమిత్ర, కుమారుడు ధనుష్, కుమార్తె కృతిక ప్రయాణిస్తుండగా ఆ కుటుంబానికి చెందిన కృతిక అక్కడికక్కడే మృతి చెందింది. మరో కుటుంబంలోని తల్లీ కొడుకులైన శైలజ, సాగర్‌లలో శైలజ మృతి చెందింది. ఇంకో కుటుంబానికి చెందిన కావ్య సైతం వాహనంలోనే మృత్యు ఒడి చేరింది. ఇందులో వున్న వాహన యజమాని కుమారుడు నందీష్, డ్రైవర్ మంజునాథ్‌లు మృతి చెందడంతో ఐదు కుటుంబాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యు ఒడి చేరారు. సంఘటన తెల్లవారి 2గంటల సమయంలో జరగగా సమాచారం అందుకున్న ధర్మవరం డీయస్పీ వేణుగోపాల్, నల్లమాడ సిఐ శివరాముడు, ముదిగుబ్బ ఎస్సై జయానాయక్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం తరలించి వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు.
ప్రాణాంతకంగా మారిన అతివేగం, మలుపులు....
నూతనంగా ఏర్పాటుచేస్తున్న అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై అనంతపురం, కదిరి మధ్యలో గతంలో పలు రోడ్డు ప్రమాదాలు సంభవించగా పదుల సంఖ్యలో మృతి చెందడం జరిగింది. రెండు మాసాల క్రితం కర్ణాటక రాష్ట్రం గంగావతికి చెందిన ఐదుగురు తిరుపతి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు సంకేపల్లి సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున ఆ ప్రమాద సంఘటనకు సమీపంలోనే ఘోర రోడ్డు ప్రమాదం సంభవించడంతో కర్ణాటకకు చెందిన మరో 5మంది మృతి చెందగా 6గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇదేవిధంగా మూడు మాసాల క్రితం పట్నం సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 5గురు తీవ్ర గాయాలపాలయ్యారు. గతంలో ముదిగుబ్బ గ్రామ సమీపాన జరిగిన కారు ప్రమాదంలో నలుగురు స్థానికులు మృతి చెందడం జరిగింది. ఇక ద్విచక్ర వాహనాల ప్రమాదాలు సంభవించడం సర్వసాధారణంగా మారింది. ఈ రహదారి ఎక్కువ మలుపులు కలిగివుండటంతోపాటు వేగంగా వాహనాల ప్రయాణాలు చేయడంతో తరచూ ప్రమాదాలు నెలకొంటున్నాయి. జాతీయ రహదారిపై మలుపుల సమీపంలో హెచ్చరిక బోర్డులు, వేగ నిరోధకాలు ఏర్పాటుచేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
కొడికొండలో ఉత్కంఠ
* వైకాపా జెండా దిమ్మె ధ్వంసం
* టిడిపి నేతలే చేశారని ఆరోపణ
* చంద్రదండు ఆధ్వర్యంలో ప్రదర్శన
* పోలీసుల రంగప్రవేశంతో ప్రశాంతం...
హిందూపురం, జూలై 23 : చిలమత్తూరు మండల పరిధిలోని కొడికొండలో శనివారం నిర్వహించిన గడపగడపకూ వైకాపా కార్యక్రమం ఒకింత ఉత్కంఠకు దారి తీసింది. గడపగడపకూ వైకాపా కార్యక్రమంలో భాగంగా శనివారం జెండా ఆవిష్కరించేందుకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం ఓ సిమెంటు దిమ్మెను నిర్మించారు. అయితే రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దిమ్మెను ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని కొందరు కార్యకర్తలు హిందూపురం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలతో కొడికొండకు చేరుకున్న నవీన్‌నిశ్చల్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన అప్పటికప్పుడే పార్టీ జెండా ఆవిష్కరించేందుకు దిమ్మెను ఏర్పాటు చేసి మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డితో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టిడిపి ప్రభుత్వం నిరంకుశ వైఖరి నశించాలి, వైఎస్ జగన్ జిందాబాద్, వైఎస్‌ఆర్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో తమ ఇంటి సమీపంలో ఎంపిపి నౌజియాబాను మరిది చంద్రదండు రాష్ట్ర నాయకులు అన్సార్ అహ్మద్, మండల నాయకులతో కలసి అటుగా వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ఎస్సై జమాల్‌బాషా టిడిపి నాయకులతో చర్చించి నచ్చజెప్పారు. ప్రస్తుతం ఎలాంటి ప్రదర్శనలు వద్దంటూ సూచించారు. అయితే టిడిపి మండల నాయకులు వైకాపా కార్యక్రమం చేస్తున్న సమయంలో ప్రదర్శనలు నిర్వహించి చంద్రబాబు జిందాబాద్, బాలకృష్ణకు జై, ఎన్టీఆర్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే పోలీసులు ఇరువర్గాల పార్టీ నాయకులతో చర్చలు జరుపడంతో వివాదం సద్దుమణిగింది.
పుష్కరాల స్టేషన్లలో
ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదల
గుంతకల్లు, జూలై 23 : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో తిరిగే పలు రైళ్లను కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో నిలపనున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టులో ప్రారంభం కానున్న పుష్కరాల సందర్భంగా ఆగస్టు 12 నుంచి 23 వరకూ కృష్ణానది పరివాహక ప్రాంతంలోని స్టేషన్‌లో 17225/26 హుబ్లీ -విజయవాడ - హుబ్లీ అమరావతి రైలును 12163/64 దాదర్ సెంట్రల్ - చెనె్న- దాదర్, 16381/82 కన్యాకుమారి - ముంబయి- కన్యాకుమారి రైలును కృష్ణా, మంగళగిరిలో నిలిపి భక్తులకు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గుత్తి మీదుగా వెళ్లే యశ్వంత్‌పూర్- పర్భానీ- యశ్వంత్‌పూర్, 12647/48 కొయంబతూరు- నిజాముద్దీన్- కొయంబత్తూరు, 15023/24 గోరక్‌పూర్- యశ్వంత్‌పూర్- గోరక్‌పూర్, 16733/34 రామేశ్వరం- ఒకా- రామేశ్వరం, 17211/12 యశ్వంతపూర్- మచిలీపట్నం - యశ్వంత్‌పూర్ రైలును మంగళగిరిలో నిలిపి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు.
నాల్గవ టౌన్ సిఐ, ఎస్సై సస్పెన్షన్
* జంటహత్యల నేపథ్యం...
అనంతపురం సిటీ, జూలై 23: జిల్లా కేంద్రంలోని నాల్గవ పోలీస్ స్టేషన్ సిఐ సి.సాయిప్రతాప్, ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌లను జంట హత్య కేసుల్లో బాధ్యులను చేస్తూ ఎస్పీ ఎస్‌వి.రాజశేఖర్‌బాబు సస్పెండ్ చేశారు. ఈమేరకు శనివారం సిఐ, ఎస్‌ఐలకు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని రుద్రంపేట బైపాస్ సమీపంలో చంద్రబాబునాయుడు కొట్టాలకు చెందిన గోపినాయక్, వెంకటేసునాయక్ జంట హత్య కేసుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ప్రకటించారు. నగరంలోని చంద్రబాబునాయుడు కొట్టాలకు చెందిన ఇరు వర్గాల వారు గతంలో భూ వివాదంలో వాగ్వివాదం జరుపుకుని స్టేషన్‌కు వచ్చారని, వారిని సిఐ, ఎస్‌ఐ ఇరువురు మందలించి పంపించారని తెలిసిన విషయమే. సిఐ ఇరు వర్గాలను తీవ్రంగా స్టేషన్‌లో కౌనె్సలింగ్ చేసి ఉంటే జంట హత్యలు జరగకుండా వుండేవని ప్రజల ఫిర్యాదుతో ఎస్పీ స్పందించారు. దీనిపై పూర్తిగా బాధ్యులను చేస్తూ నాల్గవ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సి.సాయిప్రతాప్, ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి
* సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి
* నేతలు అరెస్టు, విడుదల
అనంతపురం సిటీ, జూలై 23: రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని సిపిఐ, అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. శనివారం స్థానిక లలితా కళాపరిషత్ నుండి సిపిఐ, ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్, ఎఐటియూసి, మహిళా సమాఖ్య నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకుని ముట్టడించారు. అప్పటికే కలెక్టరేట్ వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు. పోలీసుల వలయాన్ని చేధించుకుని ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్ళేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం సొంత పూచీకతుపై విడుదల చేశారు. అంతకుముందు సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ నూతన రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు గడిచినా రాజధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించడాన్ని సిఎం పట్టించుకోవడం లేదన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించడం లేదన్నారు. ఫ్రీజోన్‌గా ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగ నియామకాల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ విద్యార్థులు తీవ్ర నష్టపోతారని తెలిపారు. సిఆర్‌డిఏ పరిధిలో చేపట్టే ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రంలోనే ఇతర ప్రాంతాల వారికి అవకాశం కల్పించడం లేదన్నారు. కేవలం ప చ్చ చొక్కాల వారితో సిఎం ఉద్యోగాల భర్తీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా రాజ్యసభలో ఫ్రవేశపెట్టిన ప్రయివేట్ బిల్లు చర్చకు రాకుండా బిజె పి అడ్డుకుందని, దీనికి టిడిపి మద్దతినిచ్చిందన్నారు. దీంతో ఈ రెండు పార్టీల నిజస్వరూపం వెల్లడైందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబునాయుడు అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జాఫర్, నారాయణస్వామి, రాజారెడ్డి, శకుంతలమ్మ, అమీనమ్మ, జాన్స్‌నబాబు, సందీప్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
అవినీతిలో కూరుకుపోయిన సర్కారు
* గడపగడపకూ వైకాపాలో మాజీ ఎంపి అనంత
చిలమత్తూరు, జూలై 23 : ‘దోచుకో...దాచుకో’ అన్న రీతిలో తెలుగుదేశం ప్రభుత్వ పాలన అవినీతి, అక్రమాల మయం అయిందని మాజీ ఎంపీ, వైకాపా నేత అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శనివారం మండల పరిధిలోని కొడికొండలో వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో చేపట్టిన గడపగడపకూ వైకాపా కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా ప్రభుత్వం పనితీరును అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా గ్రూపులకు సంబంధించి రుణాలు, రైతు రుణమాఫీ ఎంత జరిగింది, కొత్త రుణాలు ఇచ్చారా, విద్యుత్ బిల్లుల పెరుగుదల, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అనంతరం విలేఖరులతో అనంత మాట్లాడుతూ టిడిపి ప్రజాప్రతినిధులు దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారన్నారు. మండల స్థాయి ప్రజా ప్రతినిధులు మొదలుకుని ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు ప్రతి అభివృద్ధి పనిలో నియంతల్లా అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ దందాల్లో కూడా పెత్తనం సాగిస్తున్నారన్నారు. ఇక అధికార యంత్రాంగం టిడిపి ప్రజా ప్రతినిధుల చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎమ్మెల్యే పదవికి బాలకృష్ణ కళంకం తెస్తున్నారని విమర్శించారు. మరో మూడేళ్లు దాకా ఎలాంటి ఎన్నికలు లేకపోయినా తమ పార్టీ అధినేత వైస్ జగన్ నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తున్నారన్నారు. ఆయన ఆదేశాల మేరకు తాము గడపగడపకూ వైకాపాను తీసుకెళ్తున్నామన్నారు. ఇందుకు ప్రజలు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు అన్నా సుందర్‌రాజు, ప్రశాంత్‌గౌడ్, సదాశివరెడ్డి, రామకృష్ణారెడ్డి, ఫజులూర్ రహిమాన్, జగన్, నరసింహారెడ్డి, నాగమణి, రజని, శివ పాల్గొన్నారు.
ఇళ్ల స్థలాల కోసం పోరాటం
* ఎమ్మెల్యే వై విశే్వశ్వరరెడ్డి
ఉరవకొండ, జూలై 23 : నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ఐక్యంగా పోరాటం చేయాలని ఎమ్మెల్యే వై విశే్వశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకే గడపగడపకూ వైకాపా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పట్టణంలో దాదాపు 90 శాతం మంది ఇళ్ల స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంలో టిడిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇళ్ల స్థలాల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 88 ఎకరాల భూమిని కొనుగోలు చేశారన్నారు. అయితే పంపిణీ చేయకపోవడంతో సంబంధిత భూమిలో కంపచెట్లు పెరిగిపోయాయన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా రాష్ట్రంలో కనీసం ఒక సెంటు స్థలం కూడా నిరుపేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవన్నారు. చంద్రబాబు కేవలం మోసపూరిత హామీలు ఇస్తూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. వైఎస్‌ఆర్ హయాంలో రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుపేదలకు పక్కాగృహాలను మంజూరు చేస్తే ప్రస్తుతం కేవలం 250 గృహాలను మంజూరు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఇక పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి, శిథిలావస్థకు చేరుకున్న పైపులైన్లు మార్చడానికి, పలుకాలనీల్లో కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటుతోపాటు పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ఈనెల 28, 29వతేదీల్లో పట్టణంలో ఆందోళనలు చేయడానికి సిద్ధం కావాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు తిప్పయ్య, లలితమ్మ, వైఎస్సార్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, వైఎస్సార్ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు బసవరాజు, మండల కన్వీనర్ నరసింహులు, జిల్లా నాయకులు ఈరన్న, పట్టణ కన్వీనర్ తిమ్మప్ప, గ్రామ ఉపసర్పంచ్ జిలకర మోహన్, వైకాపా నాయకులు చంగల మహేష్, మాజీ ఎంపిపి ఎర్రిస్వామి, సోమశేఖర్, నాగరాజు, ఆంజనేయులు, గోవిందు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
పవర్‌లూమ్స్ చీరలపై
అధికారుల ఆకస్మిక దాడి
* రూ.50 వేలు అపరాధ రుసుం విధింపు
ధర్మవరం రూరల్, జూలై 23: ధర్మవరం పట్టణానికి రహస్యంగా పవర్‌లూమ్స్ చీరలను తరలిస్తున్న వ్యాపారులపై శనివారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. ఇందులో దాదాపు 40 గట్టల పవర్‌లూమ్స్ చీరలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలించి అక్రమంగా తరలిస్తున్న వారిపై రూ.50 వేలు అపరాధ రుసుం విధించారు. వివరాలలోకి వెళితే... కర్ణాటక రాష్ట్రం చిక్ బళాపూర్ నుండి ధర్మవరంకు వెంకటేశ్వర బస్‌తోపాటు మరో కారులో దాదాపు 60 బేల్స్ చీరలను తీసుకొస్తున్నట్లు సమాచారం అందుకున్న వాణిజ్య పన్నుల శాఖ ఏసిటిఓ బేబి సునంద తన సిబ్బందితో యర్రగుంట క్రాస్ వద్ద బస్‌తోపాటు వాహనాన్ని తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో 40 బేల్స్‌లో పవర్‌లూమ్స్ చీరలు వున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పట్టణంలో పవర్‌లూమ్స్ చీరలు ట్యాక్స్ మినహాయింపుతో అమ్ముతున్నందున రూ.50వేలు అపరాధ రుసుముతోపాటు పన్నును విధించారు. ఈ సందర్భంగా బేబి సునంద మాట్లాడుతూ అక్రమంగా పవర్‌లూమ్స్ చీరలను పట్టణానికి తీసుకొచ్చి ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా వ్యాపారాలు కొనసాగించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ దాడుల్లో ఏసిటిఓతోపాటు సిబ్బంది విజయ్‌కుమార్, సూర్యనారాయణలు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధం
అనంతపురంటౌన్, జూలై 23: పార్లమెంటులో ప్రైవేట్ బిల్లును అడ్డుకుని బిజెపి, టిడిపి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలను వంచించారని పేర్కొంటూ శనివారం స్థానిక సప్తగిరి సర్కిల్‌లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్థానిక కాంగ్రెస్ భవన్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకెళ్ళారు. మోడీ డౌన్ డౌన్, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. డిసిసి అధ్యక్షుడు కోటా సత్యం మాట్లాడుతూ ఒక పథకం ప్రకారం బిజెపి ప్రభుత్వం ఎపికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును అడ్డుకుందన్నారు. బిల్లుపై చర్చ జరగకుండా చూడాలన్న ఉద్దేశ్యంతోనే బిజెపి ఎంపిలు సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించాయన్నారు. సభలో అధికారపక్షమే ఆందోళన నిర్వహించటం పార్లమెంటు చరిత్రలో తొలిసారన్నారు. సాధారణంగా ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై సభను అడ్డుకోవటం జరుగుతుందన్నారు. ఐదేండ్లు కాదు పదేండ్లపాటు ఎపికి ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన బిజెపి ముఖ్య నేతలు సభకు గైర్హాజరు కావటం ద్వారా వారి రెండు నాల్కల ధోరణిని బయటపెట్టుకున్నారని అన్నారు. బిజెపికి తెలుగుదేశం వంత పాడుతూ రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. తెలుగుదేశం, బిజెపిల వంచన విధానాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజలే వారికి తగిన గుణపాఠం నేర్పుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు దాదాగాంధి, నాగరాజు, శ్రీనివాసులు, బాబావలి, కొండారెడ్డి, వాసు, కిరణ్, రంగనాథ్, కృష్ణ, ప్రసన్నరామ, రామాంజనేయులు, కృష్ణ, చంద్రశేఖర్, రమణ, లక్ష్మన్న, శివ తదితరులు పాల్గొన్నారు.

హత్య కేసులో నిందితుల అరెస్టు
* భార్యపై వేధింపులే హత్యకు కారణం..
రాప్తాడు, జూలై 23: తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించి తన భార్యను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని తన మిత్రుడు బలవంతం చేయడంతో దాన్ని జీర్ణించుకోలని భార్య, భర్తలు పథకం ప్రకారమే మిత్రున్ని చున్నీతో ఉరి వేసి హత్య చేసిన కేసులో నిందితులు గూడూరు గురుప్రసాద్, సుజన దేవీలను అరెస్టు చేసినట్లు ఇటుకలపల్లి సిఐ రాజేంద్రనాథ్‌యాదవ్ తెలిపారు. శనివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన నార్పల మండలం పులసలనూతల గ్రామానికి చెందిన రవితేజ హత్యకు గురయ్యాడు. ఈ హత్య విషయం మరుసటి రోజు 17న బయటపడిన విషయం పాఠకులకు విదితమే. సిఐ తెలిపిన వివరాల మేరకు ఈ నెల 16న మండలంలోని రామయ్యపల్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వ్యిక్తి మృతదేహం బయటపడింది. ఆ వ్యక్తి మృతదేహం దగ్గర ఒక రైస్ బ్యాగు దొరికింది. అలాగే మృతుని కుడి చేతిపై రవితేజ, చిట్టి అని పచ్చబొట్టు ఆధారాలు లభించాయి. మరుసటి దినం పత్రికల్లో వచ్చిన ఫొటోల ఆధారంగా మృతున్ని బంధువులు గుర్తించడం జరిగింది. హత్యా నేపథ్యం జరిగిన తీరు.. అనంతపురంకు చెందిన సుజనాదేవి 2012సంవత్సరంలో రాజ్‌కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. కొద్ది సంవత్సరాల క్రితం వారు విడిపోయి ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఇదే క్రమంలో ఆమె సెల్‌ఫోన్ రిపేరీ కావడంతో నగరంలోని ఓ సెల్‌షాపులో రిపేరీకి ఇచ్చింది. ఆ షాపులో మెకానిక్‌గా పనిచేస్తున్న ఆకుతోటపల్లికి చెందిన గురుప్రసాద్‌తో పరిచయం జరిగింది. అనంతరం వారి పరిచయం ప్రేమగా మారింది. సుజనాదేవికి గురుప్రసాద్ స్నేహితుల ద్వారా రవితేజ కూడా స్నేహితుడయ్యాడు. రవితేజ కూడా సుజనాదేవిని ప్రేమిస్తున్నానని తెలపడంతో నేను గురుప్రసాద్‌నే పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో రవితేజ తప్పుకున్నాడు. దీంతో గురుప్రసాద్, సుజనాదేవిలు పెళ్లి చేసుకుని అనంతపురంలోనే కాపురం పెట్టారు. కొద్ది రోజుల తర్వాత రవితేజకు గురుప్రసాద్, సుజనాదేవిలు కనిపించి పలుకరించగా అప్పటి నుండి రవితేజ మళ్ళీ సుజనాదేవిని తనతో పెళ్ళి చేసుకోవాలని వేధించసాగాడు. ఈ విషయాన్ని సుజనాదేవి కుటుంబ సభ్యులకు తెలిపి బాధపడుతుండేది. ఇదే తరుణంలో రవితేజను ఎలాగైనా వదిలించుకోవాలని 16వ తేదీన రవితేజను ఇంటికి పిలిపించి అతిగా మద్యం తాగించారు. అర్ధరాత్రి భార్య భర్తలు ఇద్దరూ కలిసి రవితేజ మెడకు చున్నీతో బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో వుంచి కనిపించకుండా తాడుతో కట్టి ద్విచక్ర వాహనంలో వేసుకుని రాప్తాడు మీదుగా వెళుతుండగా రామినేపల్లి సమీపంలోకి రాగానే వాహనంలో పెట్రోలు అయిపోయింది. వెంటనే సంచిని జాతీయ రహదారి పక్కన వున్న గుంతలో పడేసి రామినేపల్లిలో పెట్రోల్ పోయించుకుని అనంతపురంకు వెళ్ళారు.
నిందితులను పట్టించిన రైస్ బ్యాగ్.....
రవితేజ హత్య కేసు నిందితులను మృతదేహం పక్కనే కనిపించిన రైస్ బ్యాగ్ పట్టించింది. వివరాలలోకి వెళితే..మృతుల దగ్గర పోలీసులకు శక్తి ట్రేడర్స్ రైస్ బ్యాగ్ దొరిగింది. ఈ బ్యాగ్ ఆధారంగా ఎస్‌ఐ ధరణిబాబు విచారణ చేపట్టారు. ఈ బ్యాగ్‌పై వున్న బార్‌కోడింగ్ వున్న రిలయన్స్ మార్ట్‌లో కొన్నట్లు తెలుసుకుని అక్కడ సిసి కెమెరాలో పరిశీలించగా గురుప్రసాద్‌ను గుర్తించారు. కుటుంబ సభ్యులు గురుప్రసాద్, రవితేజ స్నేహితులుగా తెలిపారు. దీంతో గురుప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా భార్య భర్తలు హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో నిందితులు ఒప్పుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కేసు దర్యాప్తులో చురుగ్గా పనిచేసిన ఎస్‌ఐ ధరణి బాబు, సిబ్బంది నాగభూషణం, రమణ, షెక్షావలిని సిఐ అభినందించారు.
జంట హత్యల కేసుకు సంబంధించిన బొలేరో వాహనం స్వాధీనం
బుక్కపట్నం, జూలై 23: జిల్లా కేంద్రంలో జంట హత్యల అనంతరం ముద్దాయిలు తప్పించుకోవడానికి ఉపయోగించిన బొలేరో వాహనం శనివారం మండల పరిధిలోని చండ్రాయునిపల్లి సమీపంలో పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా వున్నాయి. ఇటీవల జిల్లా కేంద్రంలో జంట హత్యలు చేసి అక్కడి నుండి తప్పించుకున్న నిందితులు బొలేరో వాహనంలో పారిపోయారు. ఈ బొలేరో వాహనాన్ని చండ్రాయునిపల్లి సమీపంలో వదిలి వెళ్ళగా గ్రామస్థులు అనుమానాస్పదంగా వున్న వాహనాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనపరుచుకుని జిల్లా కేంద్రానికి తరలించారు.