కర్నూల్

అందరి దృష్టి సంగమేశ్వరం పైనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 23:గుర్తింపునకు నోచుకోకుండా ఉన్న సప్తనదీ సంగమేశ్వరంపై అధికారుల దృష్టి పడింది. సంగమేశ్వరంలో జరుగుతున్న కృష్ణా పుష్కర పనులను ఉన్నతాధికారులు పరిశీలిస్తూ పనుల వేగం, నాణ్యతను పెంచేందుకు తీశ్రంగా శ్రమిస్తున్నారు. కలెక్టర్ విజయమోహన్ ఇంతవరకూ సంగమేశ్వరంలో పర్యటిస్తూ పనులు జరుగుతున్న తీరును పరిశీలించగా పుష్కరాల ప్రత్యేకాధికారి అనంతరాము సైతం సంగమేశ్వరాన్ని సందర్శించారు. తాజాగా ఆదివారం డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి సంగమేశ్వరం చేరుకుని పుష్కర పనులను పరిశీలించి అక్కడే అధికారులతో పనులు జరుగుతున్న తీరుపై సమీక్షిస్తారు. ఆ తరువాత సంగమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తరువాత సమీపంలోని సరస్వతీ క్షేత్రమైన కొలనుభారతి చేరుకుని అక్కడ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి పూజలు నిర్వహించనున్నారు. సప్తనదీ సంగమ స్థలి పురాతన ఆలయమైన సంగమేశ్వరం ఆలయం నల్లమల అరణ్యంలో ఉండటంతో గుర్తింపునకు నోచుకోలేదు. అంతేగాక శ్రీశైలం జలాశయంలో ఏడాదిలో 8 నెలలు మునిగి ఉండటంతో భక్తుల ఆదరణకు నోచుకోలేదు. అయితే నీటి నుంచి బయట పడిన అనంతరం భక్తుల తాకిడి ప్రతి ఏటా పెరుగుతోంది. తాజాగా కృష్ణా పుష్కరాల నేపథ్యంలో సప్తనదీ సంగమ స్థలి అయిన సంగమేశ్వరంలో పుష్కరాలను ప్రారంభించి పుష్కర స్నానం చేసి పిండ ప్రదానం చేయాలని సిఎం చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు వార్తలు రావడంతో సంగమేశ్వరం ఆలయానికి జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. చంద్రబాబు పుష్కర స్నానమాచరిస్తారన్న వార్తలు వెలువడిన అనంతరం ఉన్నతాధికారులు ప్రతిరోజూ సంగమేశ్వరం వెళ్లి పనులు జరుగుతున్న తీరును తెలుసుకుంటున్నారు. వారికి తోడు డిప్యూటీ సిఎం కెఇ సైతం పర్యటిస్తుండటంతో సిఎం చంద్రబాబు సంగమేశ్వర యాత్ర అనధికారికంగా ఖరారైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. భద్రతా కారణాల వల్ల చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఇప్పుడే బహిరంగపరచబోరని అధికారులు వెల్లడిస్తున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న సంగమేశ్వరం ఆలయానికి సిఎం చంద్రబాబు వస్తే నందికొట్కూరు, ఆత్మకూరు ప్రాంతాలకు పర్యాటక శోభ వస్తుందని ప్రజలంటున్నారు. పర్యాటకులు వేసవి 4 నెలలు వచ్చినా ఈ ప్రాంతం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. ఆలస్యమైనా సంగమేశ్వరానికి జాతీయ గుర్తింపు వస్తుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఐకమత్యంగా పోరాడితేనే సాగునీరు
* శ్రీశైలం నుంచి దిగువకు నీరు వదిలితే కలెక్టరేట్ ముట్టడి
* రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా
నంద్యాల, జూలై 23: సీమ ప్రాంతంలోని రైతు సంఘాలు, రైతు నాయకులు రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంగా కలసి పోరాడితేనే సీమకు సాగునీరు సాధించుకోగలమని, లేనిపక్షంలో సీమ ఎడారిగా మారే ప్రమా దం ఉందని రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నంద్యాల పట్టణంలోని ప్రథమనందీశ్వర దేవస్థానం కళ్యాణ మండపంలో నిర్వహించిన కెసి కెనాల్ ఆయకట్టు రైతుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవో 69 సీమ ప్రాంతానికి శాశ్వత ఉరితాడుగా మారిందన్నారు. పాలకులు ప్రతి ఏడాది సీమ వైపు సీతకన్ను వేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం 1996లో జీవో నెంబ రు 69 ద్వారా రాయలసీమకు మరణ శాసనం విధించిందని దుయ్యబట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల వరకు నీటిని నిల్వ ఉంచి సీమ ప్రాంతంలోని ప్రాజెక్టులకు కనీసం నికర జలాలు అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంజలాశయానికి జూరాల నుండి ఇప్పుడిప్పుడే నీరు వస్తోందని, దాన్ని 854 అడుగుల వరకు నింపి పోతిరెడ్డిపాడు ద్వారా సీమ ప్రాంత పొలాలకు సాగునీరు అందించాలన్నారు. శ్రీశైలం దిగువకు నీరు విడుదల చేస్తే సీమ రైతాంగం ఉద్యమ బాట పడుతుందన్నారు. శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జాతీయ జలవిధానం ప్రకారం తాగునీరు, సాగునీటి కొరత తీర్చిన అనంతరమే విద్యుత్ ఉత్పత్తికి పూనుకోవాలని స్పష్టం చేసిందన్నారు. ధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తిలో మిగులు రాష్ట్రంగా ఉందని, రాష్ట్ర పాలకులు తెలంగాణ రాష్ట్ర పాలకులను ఒప్పించి సీమ ప్రాంతానికి ఇచ్చే నికర జలాలను రాబట్టుకొనేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. సీమ ప్రాంతంలో ఏ ప్రాజెక్టుకు ఎక్కడ నుండి నీరు ఇవ్వాలో తెలియని అధికారులు పనిచేస్తున్నారని, జిల్లా జల మండలి అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చి సీమ ప్రజల ఉసురు కొట్టుకుంటున్నారని అన్నారు. ఈసమావేశంలో రైతు నాయకులు వై ఎన్ రెడ్డి, బెక్కం రామసుబ్బారెడ్డి, యాళ్లూరు బాలీశ్వర్‌రెడ్డి, తూము శివారెడ్డి, ఏర్వ రామచంద్రారెడ్డి, అడ్వకేట్ శంకరయ్య, ఆళ్లగడ్డ బాలిరెడ్డి, భరధ్వాజశర్మ, భారతీయ కిసాన్‌సంఘ్ నాయకులు సిద్దారెడ్డితోపాటు వివిధ మండలాలకు చెందిన కెసి కెనాల్ ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.
నంద్యాల నియోజకవర్గం
వైకాపా ఇన్‌చార్జిగా రాజగోపాల్‌రెడ్డి
నంద్యాల, జూలై 23 : నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం వైకాపా ఇన్‌చార్జిగా రాజగోపాల్‌రెడ్డిని నియమించినట్లు శనివారం ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు రాజగోపాల్‌రెడ్డి తన అనుచర వర్గం తో కలిసి జగన్‌ను కలిశారు. రాజగోపాల్‌రెడ్డి నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డికి మేనల్లుడు కావడం గమనార్హం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పోటీచేసిన ఎస్పీవై రెడ్డి ఎన్నికల్లో గెలిచి వారం రోజులకే టిడిపి కండువా కప్పుకున్న విషయం విదితమే. అప్పటి నుంచి ఎస్పీవై రెడ్డి టిడిపిలో కొనసాగుతుండగా నంద్యాల ఎమ్మెల్యేగా వైకాపా తరఫున గెలిచిన భూమా నాగిరెడ్డి కూడా టిడిపిలో చేరిపోయారు. దీంతో నంద్యాల నియోజకవర్గంలో వైకాపా పగ్గాలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఎమ్మెల్యే భూమా టిడిపిలో చేరినప్పటి నుంచి నంద్యాల వైకాపా ఇన్‌చార్జిగా నియమించేందుకు పలువురు అభ్యర్థులను పరిశీలించిన అనంతరం శనివారం వైకాపా అధ్యక్షుడు జగన్ నంద్యాల నియోజకవర్గం ఇన్‌చార్జిగా రాజగోపాల్‌రెడ్డిని నియమించడం చర్చనీయాంశంగా మారింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నంద్యాల చైర్‌పర్సన్ అభ్యిర్థిగా వైకాపా నుంచి రాజగోపాల్‌రెడ్డి భార్య కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచినప్పటికీ ఆ పార్టీకి కౌన్సిల్‌లో మెజారిటీ లేకపోవడంతో కొంతకాలం పాటు రాజగోపాల్‌రెడ్డి వైకాపాలో క్రియాశీలకంగా వ్యవహరించలేదు. నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మేనమామ కావడం, ఆయన టిడిపిలో వున్నప్పటికీ రాజగోపాల్‌రెడ్డి వైకాపా పగ్గాలు చేపట్టడం నంద్యాలలో చర్చనీయాంశంగా మారింది. నంద్యాల అసెంబ్లీ ఇన్‌చార్జిగా నియమితులైన రాజగోపాల్‌రెడ్డి వెంట టిడిపి నేత, మాజీ మంత్రి ఫరూక్ అన్న కుమారుడు ఎన్‌ఎండి జహీర్‌బాషా, న్యాయవాది ద్వారం మాధవరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ద్వారం వీరారెడ్డి, రైతునగరం గ్రామ సర్పంచ్ కొండారెడ్డి, టిడిపి మాజీ కౌన్సిలర్ నాగేశ్వరరెడ్డి, సిమెంట్ ప్రసాదరెడ్డి, న్యాయవాదులు సయ్యద్ ఖాదిరి, అల్లాబకష్, వివేకానందరెడ్డి, శ్రీనివాసరెడ్డి, భూపాల్‌రెడ్డి, అమరనాథరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు తన వెంట వచ్చినట్లు రాజగోపాల్‌రెడ్డి ఫోన్ ద్వారా తెలిపారు.
త్వరలో నంద్యాల-కడప డెమో రైలు
* సమయ పట్టిక విడుదల చేసిన రైల్వే అధికారులు
నంద్యాల, జూలై 23: నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వేలైన్‌లో ఈ నెలాఖరు నుంచి డెమో రైలు ప్రవేశపెడుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల - ఎర్రగుంట్ల రైలుమార్గంలో నంద్యాల నుండి కడప నగరానికి రోజుకు రెండుసార్లు డెమో రైలు తిప్పాలని రైల్వే ఉన్నతాధికారులు నిర్ణయించారు. నంద్యాల నుండి కడపకు 163 కిలోమీటర్ల దూరం ఉంది. గంటకు 42 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలు 3.55 గంటల వ్యవధిలో నంద్యాల నుంచి కడపకు చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
పెరిగిన తెల్లగడ్డల ధర..
* కిలో రూ. 200.. సగటుజీవి గుండె దడ
ఆదోని, జూలై 23: తెల్లగడ్డల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్కసారిగా తెల్లగడ్డల ధర కిలో రూ. 200లకు చేరడంతో సామాన్య పేద, సగటుజీవి గుండెదడ పుట్టిస్తుంది. తెల్లగడ్డలు లేని వంట ఉండదు. ప్రతి వంటలో తెల్లగడ్డ ఉండాల్సిందే. అలాంటి తెల్లగడ్డల ధర ఒక్కసారిగా కిలో రూ. 40 నుంచి పెరుగుతూ రూ. 200లకు చేరింది. తెల్లగడ్డల ధర పెరడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే కందిపప్పు, కాయగూరల ధరలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు తెల్లగడ్డల వంతు వచ్చింది. మొన్నటి వరకూ కిలో రూ. 40 ప్రకారం చిన్న వాహనాల్లో వేసుకుని వ్యాపారులు వీధి వీధినా తిరిగి అమ్మారు. ఇప్పుడుచూస్తే ఒక్కసారిగా కిలో తెల్లగడ్డల ధర రూ.200లకు చేరింది. తెల్లగడ్డలు పంట పండించే మహారాష్టల్రోని నాసిక్, తదితర ప్రాంతాల్లో తెల్లగడ్డల సరుకులు కొరత ఉన్నందునే ధరలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. కొత్త సరుకు వచ్చేంత వరకు ధర తగ్గే ప్రసక్తే లేదని వ్యాపారులు స్పష్టం చేశారు. తెల్లగడ్డల ధర కిలో రూ. 200లకు చేరడంతో కిలో అవసరం ఉంటే అర్ధ కిలో తోనే కాలం వెల్లదీస్తున్నారు. ఈ విధంగా ధరలు పెరగడంతో ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ప్రజలు విమర్శిస్తున్నారు.

అధికారులు, తెలుగుతమ్ముళ్లు కుమ్మక్కు..!
* ఉపాధి పనుల్లో రూ. 2 కోట్ల అవినీతి..
* ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ బుగ్గన
డోన్, జూలై 23:అధికారులు అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే, పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించా రు. పట్టణంలోని జెడ్పీ అతిథి గృహం లో శనివారం ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుగ్గన నియోజక వర్గంలోని డోన్, ప్యాపిలి మండలాల్లో చేపట్టిన ఉపాధి పనులపై ఆరా తీశారు. డోన్ మండలం లో రూ. 6 కోట్లు ఖర్చు చేసి ఉపాధి పనులు జరిగితే అందులో రూ. 2 కోట్ల అవినీతి జరగడం దారుణమన్నారు. నామమాత్రంగా పనులు చేపట్టడమే గాక పాత పనులకే బిల్లులు చేసుకుని దిగమింగారని దీనికి సమాధానం చెప్పాలని అధికారులను నిలదీయగా అధికారులు నీళ్లు నమిలారు. రూ. 2 కోట్ల అవినీతికి బాధ్యులెవరని ప్రశ్నించడంతో ఎన్‌ఆర్‌ఇజిఎస్ పిఓగా పనిచేసిన ఇఓఆర్డీ మణి మంజరి సమాధానం చెప్పలేకపోయారు. తనపై వత్తిళ్లు ఎక్కువయ్యాయని తాను ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్తానన్నారు. ఉద్యోగులను బెదిరించడం మా ఆనవాయితీ కాదని అక్రమాలు, అవినీతి జరుగుకుండా నిరోధించాల్సిన బాధ్యత మీదే అని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మరోసారి అక్రమాలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు. విజిలెన్స్ విచారణకు ఫిర్యాదు చేస్తే అసలు విషయాలు తెలుస్తాయని హెచ్చరించారు. ప్యాపిలి ఎంపిడిఓ అమృతరాజ్ తనకు తెలియకుండానే పనులు చేపడుతూ అవమానిస్తున్నారని సర్పంచ్ గౌసియాబేగం ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. డంప్ యార్డ్‌ను పంచాయతీకి అప్పజెప్పకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పనితీరు మార్చుకోవాలని ఎంపిడిఓకు సూచించారు. డోన్ నుంచి బేతంచెర్ల డబుల్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపాలని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు తయారు చేయడం లేదని మండల ఇంజినీర్ నారాయణను ప్రశ్నించారు. వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సమావేశంలో జెడ్పీటిసి శ్రీరాములు, పిఆర్ డిఇ మల్లికార్జునమూర్తి, ఎంపిడిఓలు, ఏపిఓలు పాల్గొన్నారు.
రాష్టస్థ్రాయి హ్యాండ్‌బాల్ పోటీల
విజేత కర్నూలు, కడప జట్లు
కర్నూలు అర్బన్, జూలై 23: నగరంలో గత రెండు రోజుల నుంచి జరుగుతు న్న రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల బాలుర విజేతగా కర్నూలు, బాలికల విజేతగా కడప జిల్లా జట్లు నిలిచాయి. బాలుర విభాగంలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లాల జట్లు, బాలికల విభాగంలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో ప్రకాశం, శ్రీకాకుళం జట్లు నిలిచాయి. పోటీల ముగిం పు కార్యక్రమంలో కొండారెడ్డి, 3వ పట్టణ సిఐ మధుసూదన్‌రావు విజేత జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో హ్యాండ్‌బాల్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ముచ్చుమర్రిలో ముమ్మరంగా
సీమ పుష్కరాల పనులు
* పర్యవేక్షిస్తున్న ఆర్‌పిఎస్ అధ్యక్షుడు బైరెడ్డి
నందికొట్కూరు, జూలై 23:ఎంతో పవిత్రంగా నిర్వహించాల్సిన కృష్ణా పుష్కరాలను ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. ముచ్చుమర్రిలో ప్రభుత్వం పుష్కర ఘాట్ ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ బైరెడ్డి దగ్గరుండి గ్రామ సమీపంలో పుష్కర స్నానాలకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. దీంతో ముచ్చుమర్రిలో సీమ పుష్కరాల ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. శనివారం బైరెడ్డి మాట్లాడుతూ ముచ్చుమర్రిలో నిర్వహించే సీమ పుష్కరాల ప్రారంభం సందర్భంగా ఇచ్చే హారతిని పెద్దఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు పచ్చ చొక్కాల జేబుల్లోకి వెళ్లాయని, ఎక్కడా భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదన్నారు. సీమ ప్రజల కోసం ముచ్చుమర్రిలో ఏ ఒక్క భక్తుడికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కొనసాగుతున్న శకునాల
భూ నిర్వాసితుల ఆందోళన..
* రైతులకు న్యాయం చేస్తాం:తహశీల్దార్
ఓర్వకల్లు, జూలై 23:సోలార్ ప్రాజె క్టు ఏర్పాటులో భాగంగా మండల పరిధిలోని శకునాల గ్రామ పొలాల్లో జరుగుతున్న పవర్ గ్రిడ్ పనులను అడ్డుకునేందుకు చేస్తున్న భూనిర్వాసితుల ఆందోళనలు శనవారం నాటికి 14వ రోజుకు చేరుకున్నాయి. ప్రతి రోజూ పవర్ గ్రిడ్ అధికారులు పనులు ప్రారంభించడం గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు పనులను అడ్డుకోవడం, అధికారులను వెనక్కి పంపడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో తహశీల్దార్ రామాంజనేయనాయక్ గ్రామానికి వెళ్లి ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడుతూ పవర్ గ్రిడ్ నిర్మాణంలో భూములు కోల్పోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం న్యాయం చేసి నష్ట పరిహారం అందిస్తుందని, ఆందోళన విరమించాలని కోరారు. భూములు కోల్పోయిన రైతుల విషయమై తిరిగి సర్వే చేసి నిజమైన రైతులను గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
సోలార్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గ్రామాభివృద్ధికి రూ. కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతామని, అభివృద్ధిని అడ్డుకోవద్దని తెలిపారు. దీనిపై ఆందోళన చేస్తున్న రైతులు మాట్లాడుతూ నష్టపరిహారం అందేవరకూ ఎట్టి పరిస్థితిల్లో పనులు ప్రారంభించకూడదని తహశీల్దార్‌కు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఐ చంద్రబాబునాయుడు, సిపిఎం నాయకులు చంద్రబాబు, నాగన్న, రామకృష్ణ, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
రోడ్ల నాణ్యత లోపిస్తే రికవరీ
చాగలమర్రి, జూలై 23: రోడ్ల నాణ్యత లోపిస్తే రికవరీ తప్పదని క్వాలిటి కంట్రోల్ డిఇ లక్ష్మినారాయణ స్పష్టం చేశారు. చాగలమర్రి, తోడేండ్లపల్లె, చింతలచెరువు గ్రామాల్లో గ్రామ పంచాయతీ, ఉపాధి హామీ నియోజకవర్గ ఇన్‌చార్జి గంగుల ప్రభాకర్‌రెడ్డి నిధులతో నిర్మించిన సిమెంటు రోడ్లను శనివారం ఆయన తనిఖీ చేశారు. క్వార్ కట్టింగ్ మిషన్ ద్వారా రోడ్ల నాణ్యతను పరిశీలించుటకు నమూనాలు సేకరించారు. అలాగే కలుగొట్లపల్లె, మద్దూరు, రాంపల్లె, బ్రాహ్మణపల్లె, గొట్లూరు గ్రామాల్లో కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని, అదే విధంగా రికవరి చేస్తామన్నారు. నాణ్యతను బట్టి రికవరీ ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మండల ఇంజినీరు కొండారెడ్డి, క్వాలిటి కంట్రోల్ ఎఇ సంజీవరాయుడు, వర్క్ ఇన్‌స్పెక్టర్ దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తగ్గించిన ధరలకే
ఎరువులు అమ్మాలి
ఆదోని టౌన్, జూలై 23: కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను తగ్గించిందని వాటిని వెంటనే అమలుచేస్తూ తగ్గించిన ధరలకే ఎరువులను అమ్మాలని సిపిఎం, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్‌లు, ఆదోని డివిజన్ కార్యదర్శి శేఖర్ డిమాండ్ చేశారు. శనివారం సుందర్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించి అనేకరోజులు కావస్తున్న ఇంతవరకు అమలు చేయలేదని ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ ప్రాంతంలో జింకల బేడద తీవ్రంగా ఉందని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జింకల బేడదను నివారించాలని, జింకల పార్కును ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే జింకలను నల్లముల్ల అడవులకు తరలించి రైతులను ఆదుకోవాలని అన్నారు. ముఖ్యంగా యూరియాను ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారని అయినా వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా జింకల బాధిత రైతులతో మార్కెట్‌యార్డులో సమావేశం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 25వ తేదిన జరిగే సదస్సుకు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని పేర్కొన్నారు. ఈసమావేశంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.