విశాఖపట్నం

ప్రజలు నమ్మారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 23: రాష్ట్రానికి మేలు చేస్తామని ప్రజలు భావించడం వల్లే మనకు అధికారాన్ని కట్టబెట్టారని, వారి నమ్మకాన్ని నిలబెట్టే విధంగా కార్యకర్తలు పనిచేయాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోర్టు కళావాణి ఆడిటోరియంలో శనివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ దివంగత నేత ఎన్‌టిఆర్ పార్టీని స్థాపించి జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. అందుకు ప్రధాన కారణం కార్యకర్తల్లో ఉన్న క్రమశిక్షణ మాత్రమేనన్నారు. పార్టీ కోసం అహర్శిలు కష్టపడి పనిచేసిన కార్యకర్తల వల్లే ఇప్పుడు అధికారంలోకి వచ్చామని, భుజాన జెండా మోసిన కార్యకర్తకు అన్యాయం జరగబోదని భరోసానిచ్చారు. పార్టీని ఏర్పాటై 35 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో కాలానుగుణంగా మనం కూడా మారాలని కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ముందుకు సాగాలన్నారు. దీనికోసమే పార్టీ తరపున క్రమం తప్పకుండా శిక్షణ తరగతులు ఇస్తున్నామన్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కార్యకర్తలు, నాయకులు, చివరకు మంత్రుల పనితీరును కూడా గమనిస్తామని, అందుకోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగం పనిచేస్తుందన్నారు. గత కొన్ని నెలలుగా పార్టీ కార్యకర్తల శిక్షణ తరగతులు, ఇటీవల నిర్వహించిన మహానాడు కార్యక్రమాలకు హాజరుపై మంత్రులు, ఎమ్మెల్యేల ర్యాంకులను ఈ సందర్భంగా ఆయన వేదికపై చదివి వినిపించారు. పనితీరే భవిష్యత్‌కు గీటురాయిగా భావించాలన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నామినేటెడ్ పదవులు ఇవ్వలేదన్న అపవాదును చంద్రబాబు తప్పుపట్టారు. ఏకాభిప్రాయం మేరకు అన్ని పదవులు భర్తీ చేశామని, మిగిలిన వాటిని త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, కొన్ని అంశాల్లో విపక్షాలు సృష్టిస్తోన్న భయాందోళనలు తొలగించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పేదరికం లేని సమాజం కోసం తాను శ్రమిస్తానని, అందుకు మీరు కూడా సహకరించాలన్నారు. ఇక కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకునే విధంగా పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. ప్రతి కార్యకర్తకు ఈ ఫలాలు అందేలా చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. పార్టీ ప్రతినిధులు కష్టబడి తీరాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె కళావెంకటరావు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశంలో పనిచేయడం అదృష్టంగా భావించాలన్నారు. కార్యకర్తలకు గుర్తింపునిచ్చింది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనన్నారు. కార్యక్రమంలో మంత్రులు యనమల రామకృష్ణుడు, సిహెచ్ అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, గణబాబు, వంగలపూడి అనిత, వెలగపూడి రామకృష్ణబాబు, పీలా గోవింద్, కెఎస్‌ఎన్ రాజు, పల్లా శ్రీనివాస్, రామానాయుడు, కిడారి సర్వేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఎంవివిఎస్ మూర్తి, పార్టీ నాయకులు పీలా శ్రీనివాస్, భోగినేని సుబ్బారావు చౌదరి, సనపల పాండురంగారావు, భైరెడ్డి పోతన రెడ్డి, చోడే వెంకట పట్ట్భా, గన్ని వీరన్న చౌదరి, పాశర్ల ప్రసాద్, రెడ్డి నారాయణ రావు, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ నజీర్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు భారీ ఊరేగింపుగా సభ వేదిక వద్దకు తరలివచ్చారు.
ఇదే నా భోజనం
ఇప్పటికీ భార్య సంపాదిస్తోంది
సిఎం చంద్రబాబు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23: కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు తన దినచర్యను వివరిస్తూ, రోజుకు 18 గంటలు పనిచేసే తాను ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటున్నానంటే తాను పాటించే క్రమశిక్షణ, ఆహారపు అలవాట్లేదని అన్నారు. ప్రతి రోజు ఉదయానే్న జొన్న లేదా రాగి లేదా సజ్జలతో చేసిన ద్రవ పదార్ధం, రెండు ఆమ్లెట్ (తెల్లసొన) మాత్రమే తీసుకుంటానన్నారు. మధ్యలో ఒకటి రెండు పళ్లు తీసుకుంటానని, మధ్యాహ్నం భోజనంలో కొద్దిగా అన్నం, పప్పు, కూర, రసం పెరుగు తన మెనూలో ఉంటాయన్నారు. మాసాంహారం పూర్తిగా మానేసినప్పటికీ ఇటీవలే భోజనంతో పాటు చేపను తీసుకుంటున్నట్టు తెలిపారు. రాత్రి ఒక సూప్‌తో తన ఆహారం పూర్తవుతుందన్నారు. కఠినమైన ఆహారపు అలవాట్ల ద్వారా తాను సంపూర్ణ ఆరోగ్య వంతునిగా రోజుకు 18 గంటలు పనిచేయగలుగుతున్నానని అన్నారు. ఇక తనకు సంపాదనపై మోజు లేదని, సొంత వ్యాపారం ద్వారా తన భార్య, పిల్లలు కుటుంబానికి అవసరమైన మొత్తాన్ని సంపాదిస్తున్నారని వివరించారు. తాను రాజకీయాల్లో తనమునకలైనప్పటికీ తన భార్య భువనేశ్వరి హెరిటేజ్ సంస్థను ఈ స్థాయికి తీసుకువచ్చిందన్నారు.
ప్రతి పంచాయతీలో మీ సేవా కేంద్రం ఏర్పాటు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23: రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో మీ-సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నగరంలోని సీతమ్మధారలో వుడా షాపింగ్ కాంప్లెక్స్‌ను శనివారం ప్రారంభించారు. అనంతరం 100 మీ-సేవ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులకు ఉత్తర్వులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ-సేవ కేంద్రాల ఏర్పాటుతో అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం అక్కడే లభిస్తోందన్నారు. మీ-సేవ కేంద్రాలు అన్ని రకాల ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలుగా ఉండాలన్నది తన లక్ష్యమని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్ వల్ల అనేక సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. విశాఖలో మీసేవ కేంద్రాల ద్వారా నెలకు 40 లక్షల రూపాయల మేరకు ఆదాయం లభిస్తున్నదన్నారు. ఇప్పటికే జిల్లాలో 485 కేంద్రాలు ఉన్నాయని, వీటికి అదనంగా 100 కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వివిధ ప్రజా సమస్యల పరిష్కారంలో దాదాపు 80 శాతం మేరకు ఈ కేంద్రాల ద్వారా పరిష్కారం కావడం సంతోషాన్ని కల్గించే అంశమన్నారు. సమస్యల పరిష్కారంలో ప్రధాన భూమిక వహిస్తున్నాయన్నారు. వివిధ పనుల నిమిత్తం భవిష్యత్తులో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవసరం ఉండకూడదన్నారు. మీసేవ కేంద్రాల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభించే యోచన ఉందన్నారు. స్మార్ట్ పల్స్ సర్వేపై అపోహలు వద్దని, ఈ సర్వే విజయవంతంగా ముగిస్తే అనేక మార్పులు త్వరలో వస్తాయని తెలిపారు. వుడా షాపింగ్ కాంప్లెక్సుకు గతంలో 50 వేల రూపాయలు అద్దె వచ్చేదని, ఇప్పుడు రెండు ఫ్లోర్‌లను ఐటి కంపెనీలకు అద్దెకు ఇవ్వడం వలన దాదాపు 14 లక్షల రూపాయలు వస్తున్నదని వివరించారు. విశాఖను రాష్ట్రంలోనే నెంబర్ వన్ జిల్లాగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చి రహదారుల విస్తరణ, వౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై దృష్టి సారించాయన్నారు. నగరాభివృద్ధి కావాల్సిన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వుడాకు సంబంధించిన భూములను అభివృద్ధి చేసి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు.
కలెక్టర్, వుడా విసిలకు సిఎం ప్రశంసలు
జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ యువరాజ్ ఉత్తమ సేవలు అందించారని, వారి హయాంలో అభివృద్ధి చురుగ్గా జరిగిందని సిఎం కితాబిచ్చారు. ఆయన్ని, ఆయన భార్యను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వద్ద సెక్రటరీలుగా పంపుతున్నామని తెలిపారు. వారు రాష్ట్రంలో పని చేసిన తరహాలోనే డిల్లీలో పని చేసి దేశ, రాష్ట్భ్రావృద్ధికి పని చేయాలని కోరారు. జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను జిల్లా కలెక్టర్‌గా నియమించామని, ఆయన జెసిగా కూడా పని చేశారన్నారు. ఆయన కలెక్టర్‌గా కూడా ఉత్తమ సేవలు అందించాలన్నారు. వుడా పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న వీసీ బాబూరావునాయుడును కూడా అంతకుముందు అభినందించారు. ఈకార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, ఎంపిలు హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, విష్ణుకుమార్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
డ్రైవ్ ఇన్ థియేటర్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి
గాజువాక/అక్కిరెడ్డిపాలెం, జూలై 23: డ్రైవ్ ఇన్ థియేటర్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కబాలి తెలుగు చిత్రాన్ని వీక్షించారు. రాష్ట్రంలోనే తొలి డ్రైవ్ ఇన్ థియేటర్ విశాఖపట్నం విమానాశ్రయానికి సమీపంలో గల షీలానగర్ వద్ద నిర్మించారు. ఎస్‌టిబిఎల్ సంస్థ ఈ థియేటర్‌ను నిర్మించింది. ఈ థియేటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభించారు. డ్రైవ్ ఇన్ థియేటర్‌కు ఆనుకుని ఏర్పాటు చేసిన కంటైనర్ థియేటర్‌ను కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం డ్రైవ్ ఇన్ థియేటర్‌లో ప్రదర్శించిన కబాలీ చిత్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 10 నిమిషాలు పాటు వీక్షించారు. చంద్రబాబు విశాఖపట్నం పర్యటన బిజీగా ఉండడంతో వచ్చిన వెంటనే షీలానగర్ నుండి వెళ్లి పోయారు. డ్రైవ్ ఇన్ థియేటర్‌లో గల ప్రత్యేకతలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు యాజమాని గుత్తుకొండ వీరభద్రరావు (బాలాజీ) వివరించారు. ఈ డ్రైవ్ ఇన్ థియేటర్‌లో సుమారు 300 మంది వరకు చలన చిత్రాన్ని వీక్షించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. డ్రైవ్ ఇన్ థియేటర్‌కు ఆనుకుని ఓపెన్ థియేటర్ ఒక్కటి ఉంది. ఈ ఓపెన్ థియేటర్‌లో కార్లలోనే ఉండి చిత్రాన్ని వీక్షించే విధంగా భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. ఓపెన్ థియేటర్‌లో సుమారు 120 వరకు కార్లను పార్కింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కార్లలో గల మ్యూజిక్ సిస్టమ్‌కు ఓపెన్ థియేటర్‌లో ప్రదర్శించే ఆడియోను ఎఫ్‌ఎం ద్వారా కనెక్ట్ చేస్తారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో ప్రస్తుతం సినిమా థియేటర్లకు మూత వేస్తున్నారని, దీనికారణంగా అనేక గ్రామాలకు చెందిన ప్రజలు సినిమాలకు దూరం అవుతున్నారని దీనిని దృష్టిలో పెట్టుకుని కంటైనర్ థియేటర్లను ఎస్‌టిబిఎల్ ఆధ్వర్యంలో ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సుమారు 200 మంది ప్రేక్షకులు పట్టే ఈ థియేటర్ పూర్తి సోలార్ విద్యుత్‌తోనే నడుస్తుంది. ఈ కంటైనర్ థియేటర్ నిర్మాణానికి 35 లక్షల రూపాయలు ఉంటే సరిపోతుందన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధినేత బాలాజీ వివరించారు. ఎస్‌టిబిఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రైవ్ ఇన్ థియేటర్, కంటైనర్ థియేటర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ ద్వారా తనకు పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా, కామినేని శ్రీనివాసరావు, ఎంపిలు హరిబాబు, ముత్తంశెట్టి, జిల్లా కలెక్టర్ యువరాజ్, జివిఎంసి కమీషనర్ ప్రవీణ్‌కుమార్, నగర పోలీస్ కమీషనర్ యోగానంద, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్‌బాబు, పీలా గోవింద సత్యనారాయణ, కిడారి సర్వేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ లాలం భవానీ, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.
పేదల కోసమే : నిరుపేదలకు తక్కువ ధరతోనే తెలుగు చిత్రాలను చూపించేందుకు కంటైనర్ థియేటర్లు దోహద పడుతాయని ఎస్‌టిబిఎల్ అధినేత గుత్తుకొండ బాలాజీ అన్నారు. షీలానగర్‌లో నిర్మించిన డ్రైవ్ ఇన్ థియేటర్, కంటైనర్ థియేటర్లను ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించి వెళ్లిన తరువాత బాలాజీ స్థానిక విలేఖరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తొలిసారిగా డ్రైవ్ ఇన్ థియేటర్‌తో పాటు కంటైనర్ థియేటర్లను షీలానగర్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి అభినందించారని, ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. చంద్రబాబు అభినందనతో తన కల నెరవేరిందని అన్నారు.

బ్రాండిక్స్ కార్మికుల జీతాల సమస్యపై
ప్రత్యేక కమిటీ

వెయ్యి రూపాయలు పెంచేందుకు యాజమాన్యం అంగీకారం
యలమంచిలి రూరల్, జూలై 23: మీ జీతాల సమస్యపై ప్రత్యేకమైన కమిటీ వేసి తగు న్యాయం చేస్తానని బ్రాండిక్స్ కంపెనీలో సంబంధిత మహిళా కార్మికులతో శనివారం సాయంత్రం సమావేశమైన సందర్భంలో సిఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఎస్‌ఇజెడ్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శంకుస్థాపనా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన చంద్రబాబు తిరుగు ప్రయాణంలో బ్రాండిక్స్ కంపెనీలో సంబంధిత కార్మికులతో సమావేశమయ్యారు. బ్రాండిక్స్ మహిళా కార్మికుల తరపున జిసిసి వైస్ ప్రెసిడెంట్ మాదవి, డి. భవానీ తదితరులు మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతాలు పెరగడం లేదని, నెలకు ఐదువేలకు మించి అందని జీతాలతో తమ బతుకులెలా నెట్టుకువచ్చేదని ఏకరవుపెట్టారు. బ్రాండిక్స్ యాజమాన్యం ఇక్కడ పనిచేస్తున్న మహిళా కార్మికులకు వివిధ సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ గిట్టుబాటైన జీతం మాత్రం దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సిఎం చంద్రబాబు స్పందిస్తూ మీ జీతాల సమస్యలపై ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి న్యాయం చేస్తాననీ భరోసా ఇచ్చారు. కొంతమంది ప్రతిపక్ష నేతల మాటలు నమ్మి పరిశ్రమల్లో ఆందోళన చేపడితే సంబంధిత పరిశ్రమల ఉనికికే ముప్పు వాటిల్లే ప్రమాదముందని అటువంటి పరిస్థితులకు తావీయవద్దని సిఎం చంద్రబాబు వారికి సలహా ఇచ్చారు. దీనిపై బ్రాండిక్స్ యాజమాన్యం తరపున ప్రతినిధి స్పందిస్తూ వచ్చే నెల నుండి వెయ్యిరూపాయల జీతాన్ని పెంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబులు పాల్గొన్నారు. యాజమాన్యం ముందుచూపుగా తమకు సానుకూలంగా వ్యవహరించే ఒకరిద్దరు మహిళలచే వ్యూహాత్మకంగా మాట్లాడించే చర్యలు చేపట్టగా ఆ విధానాలు సహించలేని మరికొంతమంది మహిళలు తమ సమస్యలపై చంద్రబాబుకు నేరుగా వినతిపత్రాలు అందజేశారు.

పరిశ్రమలతోనే ఉపాధి!
మరిన్ని వస్తేనే భావితరాలకు ఉజ్వల భవిష్యత్
ఆటంకాలు కలిగిస్తే ఉన్న పరిశ్రమలు పోతాయ్
సిఎం చంద్రబాబు
అనకాపల్లి, జూలై 23: పరిశ్రమలతో ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడ్డాయి. ప్రతిపక్షాల మాటలు నమ్మి అశాంతిని కలిగిస్తే ఉన్న పరిశ్రమలు పోయే ప్రమాదముందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఇజెడ్ పరిధిలోని పూడి వద్ద రూ. 102కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ సెంటర్ శంకుస్థాపనా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామికంగా, సాంకేతికంగా ఎస్‌ఇజెడ్ ప్రాంతం రానున్న కాలంలో మరింత పురోగతి చెందనుందన్నారు. ఈ ప్రాంతంలో మరో థర్మల్ విద్యుత్ ప్లాంట్‌తోపాటు మరిన్ని కొత్త పరిశ్రమలు రానున్నాయన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి సక్రమంగా నడుస్తున్న పరిశ్రమల్లో అశాంతి వాతావరణం సృష్టిస్తే ఉన్న పరిశ్రమలు మూతపడి అసలుకే మోసం కలిగే ప్రమాదముందని సిఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుత వాతావరంతో ఉన్న పరిశ్రమలను కాపాడుకుని ఈ ప్రాంతంలో మరిన్ని పరిశ్రమలు వచ్చేందుకు స్థానిక నాయకత్వం కృషిచేయాలన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తాయన్నారు. రాష్ట్రానికి మెరుగైన ఆదాయం పరిశ్రమల ఏర్పాటుతోనే సాధ్యపడుతుందన్నారు. ప్రతీ ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలని, పదిమందికి ఉద్యోగాలిచ్చే సామర్ధ్యం యువతలో పెరగాలన్నారు. అటువంటి నైపుణ్యాన్ని ఈ ప్రాంతీయులకు అందించే ఉద్దేశ్యంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు పారిశ్రామీకీకరణపై అవగాహన పెంపొందేందుకు ఈ శిక్షణా కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విశాఖజిల్లాలోని అన్ని ప్రాంతాలు సమాన ప్రాతిపదికలో వ్యవసాయికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయక్తంగా పనిచేస్తున్నాయన్నారు. స్థానికులకు ఉద్యోగావకాశాల్లో ప్రాముఖ్యత కల్పించేందుకు జిల్లా కలెక్టర్‌లు చొరవ తీసుకోవాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం తగు చేయూతనిస్తుందన్నారు. 1979లో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన పునాదిరాయి సమాదిరాయిగా మారిందన్నారు. అప్పుడు వారు సాధించలేనిది రెండేళ్లకాలంలోనే మేం చేసింది చూడాలన్నారు. అభివృద్ధి అంచెలంచెలుగానే జరుగుతుంది తప్ప రాత్రికి రాత్రే జరగలేదని గుర్తించాలన్నారు. ఇక్కడ ఏర్పాటయ్యే పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో రానున్న కాలంలో మరింత పెద్దమొత్తంలో నిధులు కేటాయించి పరిశ్రమలపై అవగాహన పెంపొందిస్తామని మరో కేంద్రమంత్రి కలరాజ్ మిశ్రా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంత్రి గంటా శ్రీనివాసరావు ఇతర శాసనసభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

హుదూద్ బాధితులకు పక్కా ఇళ్లు
* గృహసముదాయం ప్రారంభించిన సిఎం
యలమంచిలి రూరల్, జూలై 23: ఇన్ఫోసిస్ సంస్థ హుదూద్ తుపాను మత్స్యకార బాధితులకు రూ.13కోట్ల వ్యయంతో నిర్మించిన 200 పక్కాగృహ సముదాయాన్ని సిఎం చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం జరిగిన గృహ సముదాయంలోకి వెళ్లి నిర్మాణం జరిగిన తీరును, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. ఇన్ఫోసిస్ సంస్థ యాజమాన్యం సిఎం చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికింది. అలాగే పూడి గ్రామానికి చెందిన మరో 400 మందికి పక్కాగృహ సముదాయాల నిర్మాణానికి సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖామంత్రి కిమిడి మృణాళిని, మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, జెడ్పీ చైర్మన్ లాలం గంగాభవానీ, గృహనిర్మాణ శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రసాదరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అచ్యుతాపురంనకు వరాల జల్లు!
* కొండకర్ల ఆవ, పూడిమడక
సముద్రతీరాల పర్యాటక అభివృద్ధి
* అచ్యుతాపురం జంక్షన్‌లో ఫ్లైఓవర్ నిర్మాణం
* దుప్పితూరు నిర్వాసితులకు ఆర్‌ఆర్ ప్యాకేజీ
* రూ. 23 కోట్లతో రాంబిల్లి తాగునీటి ఎద్దడి నివారణ
* పాలిటెక్నిక్ కళాశాల మంజూరు
అనకాపల్లి, జూలై 23: ఎస్‌ఇజెడ్ పరిధిలోని వివిధ అభివృద్ధి, ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న సిఎం చంద్రబాబు ఈ ప్రాంత అభివృద్ధిపై సానుకూలంగా స్పందించి పలు వరాలు జల్లు కురిపించారు. ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ సెంటర్‌కు శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అభ్యర్ధన మేరకు ఈ ప్రాంత సమస్యలపై సిఎం సానుకూలంగా స్పందించి పలు వరాలు కురిపించారు. అచ్యుతాపురంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేస్తానని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురం జంక్షన్‌లో 20కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కొండకర్ల ఆవను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతోపాటు ఒక టిఎంసి నీరు నిల్వ ఉండేందుకు సాగునీటి పరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. పూడిమడక సముద్ర తీరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానన్నారు. రాంబిల్లి మండలంలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు 23కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. దూప్పితూరు భూ నిర్వాసితులకు 40కోట్ల వ్యయంతో ఆర్‌ఆర్ ప్యాకేజీని సిఎం ప్రకటించారు. పూడిమడక పైపులైన్ నిర్వాసితులకు లక్షా 25వేల వంతున 61కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని ఫార్మాసిటీ పరిశ్రమల వలన కాలుష్యం తలెత్తకుండా ఫార్మాసిటీ కాంప్లెక్స్ కోసం భూమిని కేటాయిస్తామన్నారు. తాడి విలేజ్‌లో కాలుష్యం తలెత్తకుండా క్యాబినెట్ సబ్‌కమిటీ సిఫార్సు మేరకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు భరోసా ఇచ్చారు. ఇండస్ట్రీయల్ కారిడార్‌గా, టూరిజం హబ్‌గా అచ్యుతాపురం ప్రాంతాభివృద్ధికి చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. స్థానిక ఎంపీ అవంతి శ్రీనివాసరావు విజ్ఞప్తి మేరకు అనకాపల్లి లోక్‌సభ పరిధిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లాలం గంగాభవానీ, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు, శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, పి. గణబాబు, వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ యువరాజ్, ఎపిఐఐసి చైర్మన్ కృష్ణయ్య, అనకాపల్లి ఆర్డీవో పద్మావతి, యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పిళ్లా రమాకుమారి పాల్గొన్నారు.

ప్రతి పంచాయతీలో మీ-సేవ కేంద్రం: చంద్రబాబు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 23:రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో మీ-సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. నగరంలోని సీతమ్మధారలో వుడా షాపింగ్ కాంప్లెక్స్‌ను శనివారం ప్రారంభించారు. అనంతరం 100 మీ-సేవ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి నిర్వాహకులకు ఉత్తర్వులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ-సేవ కేంద్రాల ఏర్పాటుతో అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం అక్కడే లభిస్తోందన్నారు. మీ-సేవ కేంద్రాలు అన్ని రకాల ప్రజా సమస్యల పరిష్కార కేంద్రాలుగా ఉండాలన్నది తన లక్ష్యమ ని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన సాఫ్ట్‌వేర్ వల్ల అనేక సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. విశాఖలో మీ సేవ కేంద్రాల ద్వారా నెలకు రూ.40 లక్షల మేరకు ఆదాయం లభిస్తున్నదన్నారు.ఇప్పటికే జిల్లాలో 485 కేంద్రాలు ఉన్నాయని, వీటికి అదనంగా 100 కేంద్రాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వివిధ ప్రజా సమస్యల పరిష్కారంలో దాదాపు 80 శాతం మేరకు ఈ కేంద్రాల ద్వారా పరిష్కారం కావడం సంతోషాన్ని కల్గించే అంశమన్నారు. సమస్యల పరిష్కారంలోప్రధాన భూమిక వహిస్తున్నాయన్నారు. వివిధ పనుల నిమిత్తం భవిష్యత్తులో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే అవసరం ఉండకూడదన్నారు. మీసేవ కేంద్రాల్లో బ్యాం కింగ్ కార్యకలాపాలు ప్రారంభించే యోచన ఉందన్నారు. వుడా షాపింగ్ కాంప్లెక్సుకు గతంలో 50 వేల రూపాయలు అద్దె వచ్చేదని, ఇప్పుడు రెండు ఫ్లోర్‌లను ఐటి కంపెనీలకు అద్దెకు ఇవ్వడం వలన దాదాపు 14 లక్షల రూపాయలు వస్తున్నదని వివరించారు. విశాఖను రాష్ట్రంలోనే నెంబర్ వన్ జిల్లాగా అభివృద్ధి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.