అనంతపురం

పోటాపోటీగా విద్యాకమిటీ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఆగస్టు 1:ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను, సమయానుగుణంగా నడిపించి పాఠశాలల అభివృద్ధిని కాంక్షించి ప్రభత్వుం ప్రతిష్టాత్మకంగా విద్యా కమిటీ ఎన్నికలను నిర్వహిస్తోంది. సోమవారం జరిగిన పాఠశాల విద్యా కమిటీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా పార్టీలు చోక్యంతో పోటాపోటీగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,866 ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో 3,670 పాఠశాలల్లో ఎన్నికలు సజావుగా జరిగాయి. మిగిలిన వాటిల్లో కొంత సందిగ్ధం ఏర్పడటంతో 196 పాఠశాలల్లో వాయిదా వేశారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను విద్యా కమిటీ ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. వారిలో ఒకరిని అధ్యక్షుడిగా, కార్యదర్శిగా, ఉపాధ్యాయులుగాను, సభ్యులుగా ఎన్నికోవడం జరుగుతుంది. విద్యా కమిటీల ద్వారా పాఠశాలల్లో అభివృద్ధి పనులతో పాటు పాఠశాల్లోని ఉపాధ్యాయులు సరైన సమయానికి పాఠశాలలకు వస్తున్నారని లేదా అని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి పర్యవేక్షులుగా ఉంటారు. ఒక పాఠశాలలో మొత్తం 8 నుండి 10 మందిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కమిటీల ఎన్నికల్లో గ్రామ స్థాయి, మండల స్థాయిల్లో టిడిపి, వైకాపా, కాంగ్రెస్ పార్టీల నాయకులు జోక్యం చేసుకుని తమ వారిని గెలిపించుకోవాలంటే, తమ వారిని గెలుపించుకోవాలనే పోటీతో ఎన్నికల హడావుడి జిల్లా వ్యాప్తంగా హోరాహొరిగా సాగాయి. అన్ని పాఠశాలలో రాజకీయ పార్టీల ప్రాబల్యయంతో తమకు అనుకూలంగా ఉండే వారినే పార్టీ నాయకులు బరిలోకి దింపి గెలుపించుకున్నారు. టిడిపి ప్రాబల్యయం ఎక్కువ ఉన్న పాఠశాలలో టిడిపి, వైకాపా ఉన్న పాఠశాలల్లో వైకాపాకు చెందిన వారు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. జిల్లాలోని 196 పాఠశాలల్లో రాజకీయ జోక్యం, కొన్ని పాఠశాలల్లో పార్టీల మధ్య విబేదాలు వచ్చే అవకాశం ఉండడంతో విద్యాశాఖాధికారులు విద్యా కమిటీ ఎన్నికలను వాయిదా వేశారు. విద్యా కమిటీ ఎన్నికల్లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాకాధికారులు ఏ పార్టీల వారికీ సమాధానం చేప్పుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ వౌనంగా ఎన్నికలను నిర్వహించారు.
సిఎం పర్యటన విజయవంతం చేయండి

ధర్మవరం రూరల్, ఆగస్టు1:రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 6న ధర్మవరం పర్యటనకు వస్తున్నారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఎన్‌జిఓ హోంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ, అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పల్లె మాట్లాడుతు ముఖ్యమంత్రి 6న ఉదయం 10:30గంటలకు పుట్టపర్తి విమానాశ్రయంలో దిగుతారని, ఇక్కడి నుండి హెలీక్యాప్టర్ ద్వారా ధర్మవరం వస్తున్నట్లు తెలిపారు. పోతుకుంట సమీపంలో హెలీక్యాప్టర్ దిగిన అనంతరం ఫారంపాండ్లను పరిశీలిస్తారని, అనంతరం రూ.33కోట్లతో నిర్మించిన రైల్వేఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారన్నారు. అనంతరం మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. ఈ సమావేశంలోనే ఎన్నికల హామీల్లో భాగంగా చేనేతలకు ఇచ్చిన హామీ మేరకు రూ.115కోట్ల చేనేత రుణమాఫీ చెక్కును చేనేతలకు అందజేస్తారన్నారు. అలాగే రూ.200కోట్లతో ధర్మవరంలో జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ముఖ్యమంత్రి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నా ధర్మవరం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ రూ.200కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయిస్తున్నాడని, ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధిపై ఆయన ఎంత దృష్టి సారించారో ఈ పనులు సాధనతోనే తెలుస్తోందన్నారు. కార్యక్రమాల్లో డ్వామా పిడి నాగభూషణం, ఆర్‌డిఓ బాలానాయక్, డిఎస్‌పి వేణుగోపాల్, మున్సిపల్ కౌన్సిలర్ నాగమోహన్, ఇన్‌చార్జి తహశీల్దార్ నారాయణమూర్తి, ఎంపిడిఓ సుధాకర్‌రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ బీరే గోపాలకృష్ణ, వైస్‌చైర్మన్ శ్రీనివాసులు, ఎంపిపి వేణుగోపాల్‌రెడ్డి, జడ్పీటిసి రామాంజనేయులు, మార్కెట్‌యార్డు కమిటీ చైర్మన్ కమతం కాటమయ్యతో పాటు పలువురు టిడిపి నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా ఈ నెల 6న ధర్మవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగించే బాలుర ఉన్నత పాఠశాల మైదానంలోని సభాస్థలిని మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే గోనుగుంట్ల, పరిశీలించారు.
పకడ్బందీగా స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు
అనంతపురం సిటీ, ఆగస్టు 1 : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ట్రైనింగ్ విభాగం ఐజి అతుల్‌సింగ్ తెలిపారు. సోమవారం స్థానిక నీలం సంజీవరెడ్డి స్టేడియంలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లును ట్రైనింగ్ ఐజి, అనంతపురం రేంజ్ డిఐజి ప్రభాకర్‌రావు, జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైదానంలో వేగవంతమైన పనులను, ఏర్పాట్లును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నిర్ధేశిత గడువు సమయంలోనే పనులను పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేడుకల్లో పాల్గొనే ముఖ్యమంత్రితో పాటు వివిఐపిలు, స్వాతంత్య్ర సమరయోధులు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నందున ఏర్పాటు కూడ అదే స్థాయిలో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రణాళిబద్ధంగా, పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. వేడుకలు నిర్వహించే సభా ప్రాంగణం, పరేడ్ నిర్వహించే మైదానమంత, వీక్షకుల గ్యాలరీ, వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనే రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర వివిఐపిలు పర్యటించే దారులు, పార్కింగ్ స్థలం, తదితర అంశాలపై చర్చించారు. పోలీసుశాఖతో పాటు ఇతర శాఖల సమన్వయంతో వేడుకలు విజయవంతమయ్యేందుకు చేపట్టిన ప్రణాళికలు, ఇతర చర్యలను ఎస్పీ ఆయనకు వివరించారు. అనంతరం పోలీసులు స్వాతంత్య్ర వేడుకల రిహార్సీల్స్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ల డిఐజి ప్రసాద్‌బాబు, పిటిసి ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి బెటాలియన్ కమాండెంట్ జగదీష్‌కుమార్, కర్నూల్ బెటాలియన్ కమాండెంట్ విజయకుమార్, డియస్పీలు మల్లికార్జునవర్మ, గంగయ్య, చిన్నికృష్ణ, శ్రీనాథ్‌రెడ్డి, రామచంద్రమూర్తి, సత్యం, అరీవుల్లా, కేశవరెడ్డి, ఇతర పోలీసులు పాల్గొన్నారు.
చిరుత దాడిలో మేక మృతి
రొళ్ళ, ఆగస్టు1:మండల పరిధిలోని కొడగార్లగుట్ట సమీపంలో సోమవారం వెంకటప్పకు చెందిన మేక చిరుత దాడిలో మృతి చెందింది. వెంకటప్ప మేకలను మేపేందుకు గ్రామ సమీపంలోని పొలాలకు తీసుకెళ్లాడు. అయితే ఓ చిరుత ఉన్నఫళంగా మేకల మందపై దాడి చేసి ఓ మేకను చంపి తినేందుకు ప్రయత్నించింది. దీంతో వెంకటప్ప చిరుతను గమనించి గట్టిగా కేకలు వేయడంతో పరిసర ప్రాంతాల్లోని వారు అక్కడికి చేరుకోవడంతో చిరుత పరుగులు తీసింది. అయితే అప్పటికే మేక చిరుత దాడిలో మృతి చెందింది. ఈ విషయాన్ని బాధితుడు అటవీ, పశు వైద్య అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతి చెందిన మేకకు వైద్యులు రమ్యశ్రీ, రేచర్ల దివ్య పోస్టుమార్టం నిర్వహించారు. బాధితుడికి పరిహారం అందిస్తామని అటవీ శాఖాధికారి చంద్రవౌళి తెలిపారు.
గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలి
* విహెచ్‌పి రాయలసీమ అధ్యక్షులు రాధాకృష్ణ
తాడిపత్రి, ఆగస్టు 1:ప్రభుత్వాలు వెంటనే గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని విశ్వహిందూ పరిషత్ రాయలసీమ విభాగ్ ధర్మప్రసార్ అధ్యక్షులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక కడప రోడ్‌లోని శ్రీభ్రమరాంబమల్లికార్జునస్వామి ఆలయంలో రెండురోజులుగా నిర్వహించిన విహెచ్‌పి శిక్షణాతరగతులు సోమవారం ముగిశాయి. ఈసమావేశంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల క్షేత్ర సత్సంగ్ ప్రముఖ్ కేశవ్‌హెగ్డే ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాధాకృష్ణ ప్రసంగిస్తూ గోవులను హతమారుస్తున్నా, ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదన్నారు. ప్రతిహిందువు తమబాధ్యతగా గోవధను అడ్డుకుని, గోమాతలను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు గోవధ నిషేధ చట్టాన్ని వెంటనే అమలు జరుపాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కార్యవాహ మాలపాటి శ్రీనివాసరెడ్డి, విభాగ్ అధ్యక్షులు విశ్వనాథ్, విహెచ్‌పి జిల్లాఅధ్యక్షులు అక్కిశెట్టి జయరాం, జిల్లాకార్యదర్శి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పురంలో వామపక్షాల బైక్ ర్యాలీ
హిందూపురం టౌన్, ఆగస్టు 1:ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు, కార్యకర్తలు పట్టణంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్, రహమత్‌పురం సర్కిల్, మెయిన్‌బజార్, అంబేద్కర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, రైల్వేరోడ్డు తదితర ప్రాంతాల గుండా ర్యాలీ నిర్వహిస్తూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో బిజెపి, టిడిపిలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపడుతున్న బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్‌కుమార్, సురేష్‌బాబు, కౌన్సిలర్ దాదాపీర్, శ్రీనివాసులు, రాము, నారాయణస్వామి, కెటి శ్రీనివాసరెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ధర్మవరం ఎమ్మెల్యే పేర హల్‌చల్!
గుంతకల్లు, ఆగస్టు1:్ధర్మవరం పరిసర ప్రాంతాలలో కాంట్రాక్ట్ పనులను ఎలా నిర్వహిస్తావని, మా పరిధిలో పనులను రద్దు చేసుకోవాలని, లేకపోతే చంపుతామంటూ కాంట్రాక్టర్‌కు తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు ధర్మవరం ఎమ్మెల్యే పేరున బెదిరింపులకు పాల్పడిన సంఘటన సోమవారం డిఆర్‌ఎం కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని ధర్మవరం రైల్వే రన్నింగ్ రూం నిర్వహణ పనులను వదిలివేయాలని, మొదటి షెడ్యూల్ రద్దు చేసుకుంటే మిగిలిన రెండవ షెడ్యూల్ తమకు వస్తుందని హెచ్చరించారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు కాంట్రాక్టర్‌తో పాటు బెదిరింపులకు పాల్పడిన వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. గత నెల 27వ తేదీ గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని ధర్మవరం రైల్వే రన్నింగ్ గదుల నిర్వహణ కోసం రూ.1.24 కోట్ల అంచనా వ్యయాలతో టెండర్లను నిర్వహించారు. అయితే హైదరాబాద్‌కు చెందిన ఎస్కే ఎంటర్‌ప్రైజెస్ 8 శాతం తక్కువకు టెండర్ షెడ్యూల్‌ని దాఖలు చేశారు. అదే విధంగా గుత్తికి చెందిన నరేంద్రచౌదరి అనే వ్యక్తికి సంబందించిన కాంట్రాక్టర్ 35 శాతం అధికానికి షెడ్యూల్ దాఖలు చేశారు. అయితే మైనస్ 8 శాతం దాఖలు చేసి ఎస్కే ఎంటర్ ప్రైజెస్ ఎస్కే అహ్మద్‌కు రైల్వే కాంట్రాక్టర్‌కు దక్కింది. దీంతో పనులను ప్రారంభించేందుకు సోమవారం గుంతకల్లు డిఆర్‌ఎం కార్యాలయంలో అధికారులతో కలిసేందుకు కాంట్రాక్టర్ అయూబ్ వచ్చారు. అదే సమయానికి వచ్చిన నరేంద్రచౌదరి డిఆర్‌ఎం కార్యాలయం వద్ద కాంట్రాక్టర్‌పై కేకలు వేస్తూ హల్‌చల్ సృష్టించారు. చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు వాపోయాడు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సిఎం పర్యటనకు ముమ్ముర ఏర్పాట్లు
బుక్కరాయసముద్రం, ఆగస్టు 1:ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలో భాగంగా ఈ నెల 6న బుక్కరాయసముద్రం మండలంలో బహిరంగసభ నిర్వహిస్తుండటంతో గాంధీనగర్ సమీపంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల పరిసర ప్రాంతంలో బహిరంగసభ స్థలం వద్ద, అనంతపురం-తాడిపత్రి రహదారి సమీపంలో ఉన్న కెవికె ఎంటర్‌ప్రైజస్ వెనుక భాగంలో హెలీప్యాడ్ స్థలం వద్ద జిల్లా అధికారులు సోమవారం ఏర్పాట్లను ముమ్మురం చేశారు.
హోదా వచ్చేంత వరకు పోరాటం
* డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం
కదిరి టౌన్, ఆగస్టు 1:రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం పేర్కొన్నారు. సోమవారం స్థానిక రోడ్లు, భవనాలశాఖ అతిథిగృహంలో కదిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్‌గా శ్రీహరి ప్రసాద్‌కు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా 15 ఏళ్లు ఇస్తామని చెప్పిన వెంకయ్యనాయుడు నేడు హోదాపై ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు మాట మార్చడం సరికాదన్నారు. దీంతో మోదీ అసలు రూపం బయట పడిందని పేర్కొన్నారు. చెప్పిందే చేసేది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కేవీపీ రామచంద్రరావు ప్రత్యేక హోదా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారని, సోనియాగాంధీ కూడా తాము అధికారంలో వున్నప్పుడు ప్రకటించిన ప్రత్యేకహోదా ఇచ్చి తీరాల్సిందేనంటూ అన్ని పార్టీలను ఏకంచేశారన్నారు. రెండేళ్లుగా హోదా ఇస్తామని మట్టి, నీరు తప్పా ఏదీ ఇవ్వలేదని చంద్రబాబు కూడా తెలుసుకున్నారన్నారు. ప్రత్యేకహోదాపై బీజేపీ తప్పా అన్ని పార్టీలు ఏకమయ్యాయని, ప్రస్తుతం టీడీపీ కూడా బీజేపీ చేసిన మోసాన్ని గుర్తించిందన్నారు. వారు కూడా కలిసివస్తారని ఆశీస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు రమణ, కదిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి శ్రీహరిప్రసాద్, నాయకులు రామస్వామినాయుడు, ఇందాదుల్లాఖాన్, నిరంజన్‌రెడ్డి, బండారు మురళీ, ఖాదర్‌వలీ, అల్త్ఫా తదితరులు పాల్గొన్నారు.