అనంతపురం

నకిలీ పాసుపుస్తకాలపై సిఐడి ఆరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిమర్రి, ఆగస్టు 8: గత ఏడాది క్రితం జిల్లా వ్యాప్తంగా నకిలీ పాసు పుస్తకాల గుట్టు రట్టై విచ్చలవిడిగా బోగస్ పాసు పుస్తకాలు తయారుచేసి వివిధ బ్యాంకుల నుండి రుణం పొందినట్లు సంచలనం రేపిన నకిలీ పాసు పుస్తకాల వ్యవహారంపై సిఐడి అధికారులు రంగంలోకి దిగి ఆరా తీస్తున్నారు. సోమవారం తాడిమర్రి తహశీల్దార్ కార్యాలయంలో సిఐడి ఇన్‌స్పెక్టర్ ఎస్. చిన్నగౌస్, క్రైం సబ్ ఇన్‌స్పెక్టర్ ఇబ్రహీంలు నకిలీల భాగోతంపై సంబంధిత అధికారులతో సమాచారం ఆరా తీశారు. తహశీల్దార్ సుబ్బలక్ష్మమ్మ, డిప్యూటీ తహశీల్దార్ ఖలీల్‌లను వివరాలు అడుగుతూ తాడిమర్రి ఎస్‌బిఐ నుండి 39, పిఎసిఎస్ నుండి 15 నకిలీ పాసు పుస్తకాలు గుర్తించినట్లు అప్పట్లో తహశీల్దార్ ఫిర్యాదు మేరకే కేసు నమోదై దర్యాప్తు జరుపుతున్నామన్నారు. 54 నకిలీ పుస్తకాలతో బ్యాంకుల నుండి పొంది న రుణ మొత్తంతోపాటు సంబంధిత దస్తావేజుల రికార్డులను సిఐడి అధికారులు వెంట తెచ్చి తహశీల్దార్ కార్యాలయంలో రికార్డులతో పోల్చి చూశారు. ఈ సందర్భంగా నకిలీగా గుర్తించిన 54 పాసు పుస్తకాల్లో బ్యాంకు నుండి తెచ్చిన డాక్యుమెంట్లతో సైతం సిఐడి అధికారులు పాసు పుస్తకాలు రెవెన్యూ రికార్డుల్లో 1బి ప్రకారం వున్నాయంటు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో భాగం గా రెవెన్యూ రికార్డుల్లో 54 పుస్తకాలపై నకిలీలుగా గుర్తించిన వాటిని తహశీల్దార్ హయాంలో ఏయే విఆర్‌ఓలు, సంబంధిత అధికారుల ప్రమేయంతో పుస్తకాలు తయారుచేసినట్లు ఆరా తీశారు. 1బిలు, రికార్డులు సరిచూసిన అనంతరం నకిలీగా గుర్తించిన పుస్తకాల్లో సంబంధిత అధికారుల సంతకాలు, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు సైతం పంపనున్నట్లు సిఐడి అధికారులు తెలిపారు. అనంతరం తహశీల్దార్‌కు, ఎస్‌బిఐకి, పిఎసిఎస్‌కు సంబంధిత కేసుపై సమాచారం అందించిన సిఐడి అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు సంతకాలు పంపి తదుపరి చర్యలు త్వరలోనే తెలుస్తాయని, బోగస్ పుస్తకాలో, ఫోర్జరీ సంతకాలో ముందుముందు నిగ్గు తేలుతాయంటు సిఐడి అధికారులు తనిఖీని క్షుణ్ణంగా చేసి వెళ్ళారు.
టమోటా రైతుల ఆగ్రహం
* కిలో రూ.2 * రోడ్డుపై పారబోసి నిరసన
అనంతపురం సిటీ, ఆగస్టు 8: టమోటాకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు ఏపి రైతు సంఘం, రైతు సంఘం, వైఎస్‌ఆర్, టిడిపిలు, రైతుల ఆధ్వర్యంలో సోమవారం కక్కలపల్లి సమీపంలోని టమోటా మార్కెట్‌ల వద్ద జాతీయ రహదారిపై టమోటాలను రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై టమోటాలను పోసి దాదాపు రెండు గంటల సేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులు పండించిన పంటలలో టమోటాకు గతంలో 30 కేజీల బాక్స్ ఒకొక్కటికి 300 రూపాయలు ధర పలికేదని తెలిపారు. కాని గత వారం నుండి దళారులు తమ కమీషన్ కోసం 300 రూపాయల నుండి 30 కేజీల బాక్స్‌ను 30 రూపాయలకు దిగజార్చడం చాలా దారుణమన్నారు. దీంతో టమోటాను పండించిన రైతులు జిల్లాలో తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని కక్కలపల్లి సమీపంలో 15 మండీల వ్యాపారస్తులు జిల్లాలోని రైతులు తీసుకువచ్చిన టమోటాకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా దోచుకుంటున్నారని ఆరోపించారు. రైతులు టమోటాకు పెట్టిన కూలీలు, మందుల ఖర్చులు, పంట పండించేందుకు పెట్టిన ఖర్చు కూడా రాకపోవడంతో రైతులు డీలాపడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను దోచుకుంటున్న దళారులను, మండీ వ్యాపారులను అరికట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతర జాతీయ రహదారి వద్దకు మొదట ఆర్‌డిఓ మలొలా చేరుకుని నిరసనకారులతో మాట్లాడారు. అనంతరం జెసి బి.లక్ష్మీకాంతం కూడా ధర్నా వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడుతూ టమోటాకు కనీసం కేజీకి 15 రూపాయలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇవ్వడంతో నిరసనను విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరెడ్డి, చంద్రశేఖర్, రామాంజినేయులు, సిపిఐ రైతు సంఘం జిల్లా నాయకులు కాటమయ్య, నాగరాజు, వైఎస్‌ఆర్ రైతు సంఘం సుబ్బారెడ్డి, మధుసూదన్, టిడిపి రాప్తాడు నాయకులు పరంధామ, ఇతర రైతులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగుకు ప్రాచీన హోదాపై
కోర్టు తీర్పు చారిత్రాత్మకం
* మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి
అనంతపురం సిటీ, ఆగస్టు 8: తెలుగు భాషకు ప్రాచీన హోదాపై మద్రాసు హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఐటి, పౌర సంబంధాలు, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన కొంతమంది తెలుగు భాషకు ప్రాచీన హోదా కేంద్రం కల్పించడానికి సవాలు చేస్తూ 2009 వేసిన పిటీషన్‌ను మద్రాసు హైకోర్టు సోమవారం కొట్టివేసింది. ఇందుకు సంబందించిన వివరాలను మంత్రి పల్లె వెల్లడించారు. తెలుగుకు ప్రాచీన హోదాకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసిందన్నారు. ఈ తీర్పును స్వాగతిస్తామని, యావత్ తెలుగు ప్రజానీకం ఈ తీర్పును హర్షిస్తోందని తెలిపారు. దీంతో తెలుగు భాష వ్యాప్తి, అభివృద్ధికి కేంద్రం ప్రతి ఏటా వంద కోట్ల రూపాయలు వరకు నిధులు వస్తాయని, ఈ నిధులతో భాష వ్యాప్తికి సర్వతోముఖాభివృద్ధికి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలుగు పీఠం మైసూరులో ఉందని, ప్రాచీన హోదా తెలుగుకు రావడంతో ఆ పీఠాన్ని ఏపికు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు.
ఆగిన లేపాక్షి అభివృద్ధి
హిందూపురం, ఆగస్టు 8:లేపాక్షిని పర్యాటక కేంద్రంగా అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత ఫిబ్రవరి మాసంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నంది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందుకు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఇక్కడికి రప్పించి లేపాక్షి వైభవాన్ని చాటేందుకు ప్రయత్నించారు. లేపాక్షి నంది ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున నిధులను తీసుకొచ్చి అప్పట్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఉత్సవాల వరకు హడావుడి చేసిన అధికారులు అనంతరం అటు వైపు తిరిగి చూడకపోవడంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. లేపాక్షిలో దాదాపు రూ.5.50 కోట్లతో ప్రారంభించిన పనులు ప్రస్తుతం ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఏ ఒక్క పని కూడా పూర్తి స్థాయిలో కాలేదంటే అతిశయోక్తి కాదు. అధికారులు, ప్రజాప్రతినిధులు కనీస స్థాయిలో కూడా లేపాక్షి అభివృద్ధి పట్ల దృష్టి సారించకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన రహదారిని వెడల్పు చేసి అభివృద్ధి చేస్తామని ప్రకటించి ఆక్రమణలను తొలగించడంతోపాటు వందేళ్ల క్రితం నాటి వృక్షాలను కూడా నరికివేశారు. సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయగా అది పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోకపోవడంతో స్థానికులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే నంది విగ్రహం నుండి జఠాయువును ప్రతిష్టించే కొండ వరకు మంజూరైన రహదారి అర్థాంతరంగా ఆగిపోయింది. జఠాయువుఘాట్ పురోభివృద్ధి కోసం రూ.21 లక్షలు మంజూరు కాగా ఇప్పటి వరకు ఏమాత్రం ముందుకు కదల్లేదు. నంది విగ్రహం సమీపంలోని బసవన్న బావి అభివృద్ధి ఏమాత్రం జరగకపోవడంతో ప్రజలు అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నంది విగ్రహం నుండి రుద్రపాదం గుండ్లు, దేవాలయ తూర్పు వైపు నుండి పడమర వరకు తారు రోడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు కాగా కేవలం మట్టిని కప్పి అర్థాంతరంగా వదిలేశారు. అదే విధంగా గజాగుండాన్ని శుద్ధి చేసి అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో రూ.30 లక్షలు మంజూరు కాగా కేవలం పూడికతీతకే పరిమితమయింది. ప్రస్తుతం గ్రామంలోని మురికినీరు తిరిగి గజాగుండంలోకే చేరుతోంది. ఇకపోతే పాత మరుగుదొడ్లు తొలగించి రూ.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించాల్సిన మరుగుదొడ్ల పనులు కూడా ప్రారంభానికి నోచుకోలేదు. ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణలో భాగంగా కేవలం ప్రహారీ నిర్మాణాలు మాత్రమే పూర్తి అయ్యాయి. పర్యాటకులు నిలువ నీడ లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కాగా జఠాయువుఘాట్ అభివృద్ధిలో భాగంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ ప్రాంతాన్ని సందర్శించి ఐదు ఎకరాల స్థలాన్ని సేకరించడానికి ప్రతిపాదనలను పంపాలని స్థానిక అధికారులను ఆదేశించినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఉత్సవాల నేపథ్యంలో దాదాపు రూ.5.50 కోట్ల దాకా నిధులు మంజూరు కాగా పూర్తిస్థాయిలో వాటిని వినియోగించుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా లేపాక్షి అభివృద్ధి నంది ఉత్సవాల వరకు ఆఘమేఘాలపై జరగ్గా అనంతరం రెండుమార్లు ఇక్కడ పర్యటించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పెద్దగా దృష్టి సారించలేదన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
పుష్కరాలకు 175 బస్సులు
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, ఆగస్టు 8:రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో యాత్రికుల సౌకర్యార్థం జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు తరలి వెళ్లాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనంతపురం ఆర్టీసీ రీజియన్ నుంచి మొత్తం 175 ఆర్టీసీ బస్సులను వివిధ ప్రాంతాలకు కేటాయించారు. సోమవారం రాత్రే అవ న్నీ నిర్దేశించి ప్రదేశాలకు వెళ్లాయి. ప్రస్తుతం జిల్లాలోని మొత్తం 12 ఆర్టీసీ డిపోల్లో 1033 దాకా ఉన్నా యి. వీటిలో ఎక్స్‌ప్రెస్‌లు, తెలుగు వెలుగు కలిపి మొత్తం 914 బస్సులు ప్రతి రోజూ జిల్లా వాసులను పలు ప్రాంతాలకు చేరవేస్తుండేవి. మిగతావి స్పేర్ (అదనం)గా ఉండేవి. అయితే కృష్ణా పుష్కరాల కోసం ఎక్స్‌ప్రెస్‌లు 105, తెలుగు వెలుగు బస్సులు 70 చొప్పున 175 బస్సుల్ని పంపించారు. దీంతో జిల్లా వాసుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు స్పేర్‌గా ఉన్న బస్సులను జిల్లా అవసరాలకు ఉపయోగించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. పుష్కరాల కోసం పంపిన వాటిలో అనంతపురం డిపోనుంచి 15 బస్సులు, గుత్తి-9, గుంతకల్లు- 17, ఉరవకొండ-7, హిందూపురం-16, పుట్టపర్తి-11, కళ్యాణదుర్గం-15, రాయదుర్గం-12, తాడిపత్రి-27, ధర్మవరం-19, కదిరి-22, మడకశిర నుంచి 5 చొప్పున ఉన్నా యి. వీటిలో 100 బస్సులు గుంటూ రు, 75 బస్సులు కర్నూలు ప్రాం తాల్లో సేవలందించనున్నాయి. అలాగే పుష్కర సేవల కోసం విజయవాడకు 16, బీచ్‌పల్లికి 14, సంగమేశ్వరానికి 4, శ్రీశైలానికి 7 చొప్పున పంపారు. అలాగే కండక్టర్లు, డ్రైవర్లు ఒక్కో బస్సుకు ఇద్దరు చొప్పున నలుగురు, సూపర్‌వైజర్లు, డిఎంలు, మెకానిక్‌లు మొదలు కింది స్థాయి వరకు మొత్తం 823 మంది సిబ్బందిని పుష్కర విధులకు కేటాయించారు. కాగా ఈ నెల 12 నుంచి 24వ తేదీ వరకు కృష్ణా పుష్కరాల నిమిత్తం జిల్లా వాసుల సౌకర్యం కోసం జిల్లాలోని 10 డిపోల నుంచి 16 ఎక్స్‌ప్రెస్ బస్సుల్ని ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఈ బస్సులు ప్రతి డిపో నుంచి సాయంత్రం వేళల్లో వివిధ సమయాల్లో బయలుదేరనున్నాయి. ఈ నెల 11న సాయంత్రం బయలుదేరి 12న పుష్కరాల ప్రదేశాలకు చేరుతాయి. అలాగే పుష్కరాల ముగింపు రోజు 23వ తేదీ రాత్రి ఆఖరు సర్వీసులుగా విజయవాడ నుంచి బయలుదేరి 24న జిల్లాకు చేరనున్నాయి. విజయవాడకు వెళ్లే ఈ బస్సులన్నీ అక్కడికి సుమారు 15 కి.మీ. దూరంలో ఉన్న గోరంట్ల వరకు మాత్రమే నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అక్కడి నుంచి విజయవాడ వెళ్లేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేసిన ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. కాగా హిందూపురం నుంచి 2, అనంతపురం నుంచి 2, ఉరవకొండ నుంచి 2, తాడిపత్రి నుంచి 2, కదిరి నుంచి 2, గుంతకల్లు నుంచి 2, కళ్యాణదుర్గం, ధర్మవరం, పుట్టపర్తి, రాయదుర్గం నుంచి ఒక్కొక్కటి చొప్పున బస్సులు పుష్కరాల కోసం బయలుదేరనున్నాయి. కాగా మడకశిర, గుత్తి డిపోల్లో సర్వీసుల సంఖ్య తక్కువగా ఉన్నందున పుష్కరాలకు అక్కడి నుంచి బస్సులు నడపడం లేదు. పుష్కర బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. టికెట్ ధరలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యథాతథంగా ఉంటాయన్నారు. కాగా జిల్లాలోని హిందూపురం, అనంతపురం నుంచి బయలుదేరే రెగ్యులర్ ఆర్టీసీ సర్వీసుల్ని యథావిధిగా నడుస్తాయి. అలాగే ఇతర డిపోల నుంచి వెళ్లే బస్సులు కూడా మామూలుగా నడుస్తాయి. వీటికి పుష్కరాల బస్సులు అదనం. హిందూపురం నుంచి విజయవాడకు బయలుదేరే మూడు బస్సుల్లో ఒకటి కర్నూలు మీదుగా, రెండు నంద్యాల మీదుగా నడుస్తాయని ఆర్టీసీ ఆర్‌ఎం డి.చిట్టిబాబు తెలిపారు.
మైదుగోళంలో ఎస్‌ఎంసి ఎన్నికల వివాదం

లేపాక్షి, ఆగస్టు 8:రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు మండల పరిధిలో అటు టిడిపి ఇటు వైకాపా వర్గీయులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వైకాపాకు పట్టు ఉన్న గ్రామాల్లో ఇటీవల ఆయా ఎన్నికలను తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించేందుకు దృష్టి వహించింది. ఇందులో భాగంగా మండల పరిధిలోని మైదుగోళంలో వైకాపాకు పట్టు ఉండగా సోమవారం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వర్గీయులు పెత్తనం సాగించేందుకు ప్రయత్నించగా వాయిదా పడ్డాయి. మైదుగోళం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉదయం 9.30 గంటలకు ఎస్‌ఎంసి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే రావాలని, ఇతరు ఎవరూ రావడానికి వీల్లేదని అధికారులు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రయత్నించారు. ఆ సమయంలో పాఠశాల బయట ఉన్న టిడిపి వర్గీయులు చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మహిళలు కారం పొడి చల్లడంతో దాడులు చేసుకున్నారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు లాఠీచార్జీ జరిపి ఇరు వర్గాలను తరిమి వేసే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో వైకాపాకు చెందిన రవి, మంజులు గాయాలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న రూరల్ సిఐ రాజగోపాల్‌నాయుడు, ఎస్‌ఐ ఆంజనేయులు హుటాహుటీన మైదుగోళం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘర్షణకు గల కారణాలను ఆరా తీశారు. వెంటనే ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తామని సిఐ చెప్పారు. కాగా గాయపడ్డ వైకాపా వర్గీయులను చికిత్సల నిమిత్తం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెలుసుకున్న నియోజకవర్గ పార్టీ సమన్వయ కర్త నవీన్‌నిశ్చల్ హుటాహుటీన ఆసుపత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
రాష్ట్రంలో అవినీతి పాలన
* మాజీ ఎంపీ అనంత
కదిరిటౌన్, ఆగస్టు 8: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో అవినీతి పాలన సాగుతోందని, మురికి కాలువల నిర్మాణం నుండి ప్రాజెక్టుల వరకు అవినీతి జరుగుతూ రాక్షస పాలన సాగుతోందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనంతపురం మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. సోమవారం కదిరి నియోజకవర్గ వైకాపా సమన్వయ కర్త డా. పి.వి. సిద్దారెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేం ద్రం, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా అభివృద్ధి జరగకపోగా అవినీతికి గేట్లు తెరిచారన్నారు. పంచాయతీ సర్పంచ్ నుండి ముఖ్యమంత్రి వరకు అవినీతిమయ పాలన సాగుతోందన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధు ల్లో కూడా భారీ అవినీతి జరుగుతుందన్నారు. వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టులు 70శాతం పూర్తి అయినప్పటికి మిగిలిన 30శాతం పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఖర్చు భారమయిందన్నారు. జిల్లా నుండి ఇద్దరు ఎంపీలు, 12మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించినా ముఖ్యమంత్రి జిల్లా అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. పర్సెంటేజీలు లేనిదే పనులు జరగడం లేదన్నారు. ప్రధాని మోదీ కూడా అవినీతి ముఖ్యమంత్రిని చు ట్టూ పెట్టుకొని నీతివంతమైన పాలన సాగిస్తాం అని చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. హంద్రీనీవా పనులు పూర్తి అయితే జిల్లాలోని 3 లక్షల 42 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వచ్చని అయితే ముఖ్యమంత్రి జిల్లా ప్రజలకు ఎగనామం తీసుకెళ్లేందుకు కుట్రపన్నారన్నారు. హోదా విషయం లో కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని అటు చంద్రబాబు కూడా తన అవినీతిపై ఎక్కడా విచారణ చేస్తారో అని కేంద్రంపై వత్తిడి తీసుకురావడం లేదన్నారు. వైకాపా సమన్వయ కర్త డా. పి.వి. సిద్దారెడ్డి, మాజీ మంత్రి మహ్మద్ షాకీర్, వైకాపా రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ వేమలఫర్హానా, వైకాపా పట్టణ అధ్యక్షులు బాహుద్దీన్, కౌన్సిలర్లు అజ్జికుంటి రాజశేఖర్‌రెడ్డి, కినె్నర కళ్యాణ్, కె.ఎం. ఖాదర్‌బాషా, కొలిమి జిలాన్, జగన్‌యాదవ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పెరుగుతున్న తుంగభద్ర నీటిమట్టం
బొమ్మనహాల్, ఆగస్టు 8:తుంగభద్ర జలాశయంలో పెరుగుతున్న వరద నీటిమట్టంతో రైతులు ఆశించిన విధంగా పంటల సాగుకు మార్గం సుగమమైంది. జలాశయ పరివాహక ప్రాంతాలలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు శివమొగ్గ, చిక్కమంగళూరు, కర్తనహళ్లి, శృంగేరి, అగుంటి, భద్రావతి ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు జలాశయంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు 20వేల క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు జలాశయం ఎస్‌ఇ శశిభూషన్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతకంటే నీటి మట్టం పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నీటి మట్టంపై కనీసం 30 రోజులు రాగలిగితే జలాశయం అయకట్టు రైతులకు పూర్తి నీటి మట్టం కాకపోయినా, ఆరుతడి పంటలు, తాగునీరైనా ఇవ్వవచ్చన్నారు. గత సంవత్సరం జలాశయంలో 60 టిఎంసీలు నిల్వ ఉండి 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండేదన్నారు. ప్రస్తుతం భద్రావతి జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిన కారణంగా ఆపై వచ్చే నీరు మొత్తం తుంగభద్ర జలాశయానికే చేరునన్నారు. తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 41 టిఎంసీలు నిల్వ ఉన్నట్లు అందులో హెచ్‌ఎల్‌సికి 3,500 క్యూసెక్యుల నీరు విడుదల చేసినట్లు వారు తెలిపారు. ఆంధ్ర సరిహద్దులో 1366 క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు సరిహద్దు ఆంధ్ర జెఇ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా వరదనీరు వచ్చి చేరడం వలన ఆరుతడి పంటలకైనా వస్తాయనే ఆశ చిగురించినట్లు ఆయకట్టు సంఘం అధ్యక్షులు కాంతారావు, గౌడ అన్నారు. రైతులు సైతం ఆయకట్టు భూములను సర్వం సిద్ధం చేసి ఎదురు చూస్తున్న తరుణంలో ఇది శుభసూచకం అన్నారు. గత వారం రోజుల నుండి ఇన్‌ఫ్లో 4,820 క్యూసెక్యులు, అవుట్‌ఫ్లో 7,200 క్యూసెక్కులు ఉండేది. ప్రస్తుతం పరిస్థితులు ప్రకృతి కరుణించిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టిడిపికి పతనం తప్పదు
* రాష్ట్ర ఎరుకల పోరాట సమితి
హిందూపురం టౌన్, ఆగస్టు 8:రాష్ట్రంలోని గిరిజనుల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే తెలుగుదేశ ప్రభుత్వం గిరిజనుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఎరుకల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్‌కుమార్ ధర్మ, నాయకులు అశ్వర్థప్ప, వెంకటరమణ, శివ, ఆంజనేయులు తదితరులు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ గిరిజనులను కేవలం ఓటుబ్యాంక్‌గా మాత్రమే ఉపయోగించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి భర్తీలో కూడా గిరిజనులకు అన్యాయం జరిగిందన్నారు. కనీసం ఒక్క డైరెక్టర్ పోస్టును కూడా గిరిజనులకు కేటాయించలేదని పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటి వరకు గిరిజన కార్పొరేషన్ పదవి కూడా భర్తీ చేయలేదన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి పదవి కూడా భర్తీ చేయకపోవడం దురదృష్టకరమన్నారు. కనీసం గిరిజన ఎమ్మెల్యేకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మంత్రులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తనకు అనుకూలమైన వ్యక్తులకు మంత్రి పదవులు కట్టబెట్టి అనంతరం ఎమ్మెల్సీగా నియమించారన్నారు. అయితే గిరిజన మంత్రిత్వ శాఖను కేటాయించడంలో నిర్లక్ష్యం వహించినట్లు పేర్కొన్నారు. పోలవరం ప్రాంతంలో ఎక్కువ మంది నివాసం ఉంటున్న గిరిజనుల భూములను ప్రభుత్వం లాక్కొని ఖాళీ చేయించిందన్నారు. కాపులను బిసి జాబితాలో చేరుస్తామని, వాల్మీకులను ఎస్టీ జాబితాలో పునరుద్ధరిస్తామని ప్రకటనలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కులాల నడుమ చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో పునరుద్ధరించడం కలలో కూడా జరగలేదన్నారు. ఒకవేళ అదే జరిగితే రాష్ట్రంలోని గిరిజనులందరూ తిరగబడతామని హెచ్చరించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా గిరిజనులకు తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. కోటికి పైగా ఉన్న గిరిజనులను రాజకీయ పార్టీలు ఓటుబ్యాంక్‌గా ఉపయోగించుకుంటున్నాయే తప్ప రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం లేదన్నారు. పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అధికారులు పట్టించుకపోకపోవడంతో పందులు ఆ పనిని చేస్తున్నాయన్నారు. ఎరుకల కులస్తులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజనులను సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కూడా ప్రక్కదారి పట్టించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
టిడిపి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గిరిజనుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ సమావేశంలో నాయకులు హనుమంతరాయప్ప, వెంకటేష్, కెఎన్ వెంకటేష్, హనుమంతరాయప్ప తదితరులు పాల్గొన్నారు.
పంద్రాగస్టు ఏర్పాట్లు పూర్తి చేయండి

ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, ఆగస్టు 8:ఈ నెల 15న రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని రాయలసీమ ఐజి ఎన్.శ్రీ్ధర్‌రావ్ ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టంగా, ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవాల వేదిక అయిన నగరంలోని పిటిసి స్టేడియంలో చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లు, జాగ్రత్తలపై సోమవారం అనంతపురం రేంజ్ డి ఐజి జె.ప్రభాకర్‌రావు, జిల్లా ఎస్పీ ఎస్‌వి. రాజశేఖరబాబులతో కలిసి ఐజి పరిశీలించారు. ముందుగా పోలీసు అతిథి గృహంలో కొంత సేపు సమావేశమయ్యారు. అనంతరం పంద్రాగస్టు వేడుకలు నిర్వహించే నీలం సంజీవరెడ్డి(పిటిసి) స్టేడియం, అక్కడి పరిసరాలతో పాటు పరేడ్ గ్రౌండ్‌లో ఆయన కలియదిరిగారు. సభా ప్రాంగణం, వేడుకలు నిర్వహించే మైదానం, వీక్షకుల గ్యాల రీ, సిఎం, ఇతర వివి ఐపిలు పర్యటించే దారులు, పార్కింగ్ ప్రదేశం, తదితర అంశాలపై డిఐజి, ఎస్పీలతో చర్చించారు. పోలీసు శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో వేడుకలు విజయవంతమయ్యేందుకు చేపట్టిన ప్రణాళికలు, ఇతర చర్యల్ని డిఐజి, ఎస్పీలు ప్రత్యేకంగా రూపాందించిన మ్యాప్ ద్వారా ఆయనకు వివరించారు. పిటిసి ప్రిన్సిపల్ వెంకట్రామిరెడ్డి, డిఎస్పీలు పాల్గొన్నారు.

అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
పరిగి, ఆగస్టు 8:మండల పరిధిలోని ఊటుకూరులో మూర్తి (27) అనే యువకుడు సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మూర్తికి తరచూ మూర్చ వ్యాధి వచ్చేదని, ఇందులో భాగంగానే ఉన్నఫళంగా కిందకు పడి కాళ్లు, చేతులు ఆడిస్తూ మృతి చెందినట్లు చెబుతున్నారు. కాగా మూర్తికి కల్లు తాగే అలవాటు ఉండగా స్థానికంగా ఉన్న ఓ కల్లు దుకాణంలో కల్లు సేవించిన అనంతరం ఇలా మృతి చెందాడని, కల్లులో కల్తీ కారణంగానే మృతి చెందినట్లు స్థానికులు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటనపై ఎలాంటి పోలీసు కేసు నమోదు కాకపోవడం గమనార్హం.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పరిగి, ఆగస్టు 8:మండల పరిధిలోని కాలువపల్లి గార్మెంట్స్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెట్రోలు బంక్‌లో పనిచేస్తున్న వెంకటరాముడు (42) మృతి చెందాడు. స్వంత పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో కల్లుమర్రికి వెళ్ళి వస్తుండగా ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో కిందకు పడ్డ వెంకటరాముడి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు వెంటనే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్సలు పొందుతూ ఆయన మృతి చెందాడు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ధర్మవరం రూరల్, ఆగస్టు 8: పట్టణంలోని రైల్వే స్టేషన్‌లో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే స్టేషన్‌లోని 5వ ప్లాట్‌ఫాం పట్టాలకు దూరంగా ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళారు. వ్యక్తి మరణించి కొన్ని గంటలపాటు అయినా అక్కడకు అతని బంధువులు ఎవరూ రాకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా పోలీసులు పేర్కొన్నారు. అయితే మృతునికి 60 ఏళ్ళ దాకా వయసు వుంటుందని, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. తెల్ల చొక్కా, ఎరుపు రంగు డ్రాయర్ వేసుకున్న వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
గోరంట్ల, ఆగస్టు 8:మండల పరిధిలోని సాములపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీర్లు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఒక ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్న బాబిరెడ్డి , శేషిరెడ్డి గోరంట్ల నుండి ద్విచక్ర వాహనంలో కంపెనీకి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారికి పిహెచ్‌సిలో ప్రాథమిక చికిత్సలు చేయించి మెరుగైన చికిత్సల కోసం హిందూపురంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
నీటి పంపు యంత్రాలు పంపిణీకి సిద్ధం
వజ్రకరూర్, ఆగస్టు8:మండల కేంద్రములోని ఎఒ కార్యాలయంలో పొలాలకు నీటిని సరఫరా చేసే యంత్రాలు సిద్ధంగా ఉన్నట్లు ఎఒ లీలావసుంధర పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హులైన రైతులకు ఎంపిక చేస్తామన్నారు. పొలాల సమీపంలో ఫారంఫాండ్స్ ఉన్న వారికి పంపిణీ చేస్తామన్నారు. సకాలంలో వర్షాలు రాక తడి ఆరిపోతున్నా సమయంలో ఫారంఫాండ్స్ నీటిని సరఫరా చేసేందుకు యంత్రాలు ఇస్తున్నట్లు ఎఓ తెలిపారు.