ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ గెలుపు చారిత్రక అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు/కందుకూరు, మే 17: రానున్న ఎన్నికల్లో కూడా టిడిపి గెలవడం చారిత్రాత్మక అవసరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం నీరు-ప్రగతి రెండవ దశ జల సంరక్షణ ఉద్యమంలో భాగంగా ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వివి పాలెంలోని పోకూరు చెరువులో నీరు-ప్రగతి కార్యక్రమం చేపట్టారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శిలాఫలకాలను ఆవిష్కరించి, బడేవారిపాలెంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కందుకూరు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ 2029 నాటికి ప్రపంచంలోనే ఏపిని మొదటి స్థానంలో నిలబెడతానన్నారు. ఏపిలో 25 ఎంపి సీట్లును గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని, అప్పుడే దేశంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలంటే టిడిపి కీలకమైన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారుతుందన్నారు. రాష్ట్ర విభజన అసంబద్దంగా జరిగిందన్నారు. రాజధాని, పరిశ్రమలు, విద్యాలయాలు లేకుండానే నెత్తిన అప్పు పెట్టుకుని కట్టుబట్టలతో బయటకు వచ్చామన్నారు.
ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు కోసం బిజెపితో పొత్తు పెట్టుకున్నామని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా ఇవ్వాలని, విభజన హామీలు ఇవ్వాలని అడిగామని, 29సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని ప్రాధేయపడితే నాలుగేళ్లు బడ్జెట్‌లో అన్యాయం చేసారని ఆరోపించారు. 5వ బడ్జెట్‌లో కూడా కేంద్రం ఆంధ్రాకు మొండిచేయి చూపడంతో ఎన్‌డిఎ నుంచి బయటకు వచ్చి ధర్మపోరాట దీక్ష చేసానన్నారు. కేంద్రానికి రాష్ట్ర ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారని మన సమస్యలు పరిష్కరించడం కేంద్రం బాధ్యత అని, మన హక్కులు కోసం పోరాడదామన్నారు. నదుల అనుసంధానం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన కేసులను మాఫీ చేసుకునేందుకు బిజెపితో లాలూచి పడ్డారని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల లాంచీ మునక ఘటన జరిగిన సమయంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఆ జిల్లాలో పర్యటిస్తూ కనీసం అక్కడకు వెళ్లకుండానే అవి ప్రభుత్వ హత్యలని విమర్శించడం సబబు కాదన్నారు.
ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టులన్నింటిని వేగంగా పూర్తి చేసి కరవు రహిత జిల్లాగా తీర్చిదిద్దుతానని సిఎం నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.4వేల కోట్లు ఖర్చు చేశామన్నారు.
డిసెంబర్ నాటికి వెలుగొండ ప్రాజెక్టు టెన్నల్ -1 ను పూర్తి చేస్తామన్నారు. మే నాటికి టెన్నల్ -2 పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు, తాగునీరు అందించి జిల్లాను సస్యశ్యామలం చేస్తానన్నారు. తాను ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టును తానే పూర్తి చేస్తానన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తానన్నారు. నిబంధనలు సడలించి జిల్లాలో రామాయపట్నం పోర్టు సాధించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.
రాళ్లపాడుకు నీరు అందించే సోమశిల కాలువ పనులకు గల అడ్డంకులను తొలగించి కాలువ పనులు పూర్తి చేసి నెల రోజుల్లో రాళ్లపాడు ద్వారా సాగు, తాగునీరు అందిస్తామన్నారు. జిల్లాను విద్యాహబ్‌గా తీర్చిదిద్దేందుకు వెటర్నరీ, ఉద్యానవన కళాశాలలు ఇస్తున్నామన్నారు. నాగులుప్పలపాడులో మైనింగ్ విశ్వ విద్యాలయం ఏర్పాటుకు, పామూరు మండలం దూబగుంటలో ట్రిపుల్ ఐటి ఇప్పటికే ప్రకటనలు చేసి ఉన్నామన్నారు. అంతే కాకుండా దొనకొండను పారిశ్రామిక కారిడార్‌గా ఏర్పాటు చేసి ఉపాధి కల్పనకు కృషి చేస్తానన్నారు. జాతీయ ఉత్పాదక జోన్ ఏర్పాటు చేస్తామని, పరిశ్రమలు, వ్యవసాయం, నీరు తదితర ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి నీతివంతమైన పాలన అందిస్తానన్నారు. ఈ సమావేశంలో మంత్రులు శిద్దా రాఘవరావు, నారాయణ, దేవినేని, బాపట్ల ఎంపి మాల్యాద్రి శ్రీరామ్, ఎమ్మెల్సీలు కరణం బలరామ్, పోతుల సునీత, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
చిత్రం..బడేవారిపాలెం గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు