ఆంధ్రప్రదేశ్‌

పోక్సో కేసుల దర్యాప్తుకు సిట్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైమ్), మే 18: రాష్ట్రంలో నిత్యం ఏదోఒకచోట బాలికలపై, మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రాష్ట్ర పోలీసు శాఖ పోక్సో కేసుల దర్యాప్తు కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ ఎం.మాలకొండయ్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలి కాలంలో గుంటూరులో చోటు చేసుకున్న వరుస లైంగిక దాడుల ఘటనలు రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. దాచేపల్లి ఘటనలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సుబ్బయ్య ఆత్మహత్యకు పాల్పడగా, ఇటీవల పాత గుంటూరులో మరో ఘటన ఈకోవకు చెందినదే. దీంతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బాలికలు, మహిళలపై లైంగిక దాడులకు సంబంధించిన కేసులు వరుసగా నమోదవుతున్నాయి. వీటిపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా ఘటనలను నియంత్రించాలని పోలీస్ శాఖను ఆదేశించింది. దీంతో డీజీపీ మాలకొండయ్య ఉన్నతాధికారులతో కొద్ది రోజులుగా భేటీ అయి పోక్సో కేసులకు సంబంధించి సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు. ఫలితంగా రాష్ట్రంలోని 18 పోలీసు జిల్లాలను రెండుగా విభజించి మహిళలపై లైంగిక దాడులు, పోక్సో కేసుల దర్యాప్తు నిమిత్తం రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు (సిట్)లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బృందంలో ఒక మహిళా అధికారి సహా ఇద్దరు డీఎస్పీలు ఉంటారు. మొదటి సిట్‌లో విజయనగరం జిల్లా బొబ్బిలి ఎస్‌డీపీఓ పి.సౌమ్యలత, తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఎస్‌డీపీఓ కె.కృష్ణ ప్రసన్నలతో ఏర్పాటు చేయగా ఈ బృందం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ రూరల్, విశాఖ అర్బన్, రాజమండ్రి అర్బన్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, విజయవాడ పోలీస్ కమిషనరేట్ జిల్లాలకు సంబంధించిన పోక్సో కేసులను దర్యాప్తు చేయనుంది. అదేవిధంగా రెండో బృందానికి సంబంధించి గుంటూరు వెస్ట్ ఎస్‌డీపీఓ కేజీవీ సరిత, కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటాద్రితో ఏర్పాటు చేసిన సిట్ గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, తిరుపతి అర్బన్, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తుంది. ఈ రెండు బృందాలను రాజమండ్రి ఎస్పీ వి.రాజకుమారి పర్యవేక్షిస్తారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, పోక్సో కేసులకు సంబంధించిన నమోదైన వాటిలో 14 కేసులను తీవ్రంగా పరిగణించిన పోలీసు శాఖ ఆయా కేసుల దర్యాప్తును ఈ రెండు బృందాలకు అప్పగించనున్నాయి. ఈ కేసులతో పాటు కొత్తగా నమోదైన కేసులను కూడా ఈ సిట్ బృందాలు త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి సకాలంలో ఛార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంటుంది. కాగా ఈ మొత్తం బృందాల పనితీరు, ఆయా కేసులకు సంబంధించిన సమాచారాన్ని సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ ద్వారకా తిరుమలరావు పర్యవేక్షిస్తారు. ప్రతి వారం ఈ రెండు బృందాలు కేసుల పురోగతికి సంబంధించి వారాంతపు నివేదకను సీఐడీ అడిషనల్ డీజీకి సమర్పించాల్సి ఉంటుంది.ఈ తరహా ఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా కృషి చేయాలని సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రత్యేక బృందాలకు డీజీపీ మాలకొండయ్య దిశా నిర్దేశం చేశారు.