ఆంధ్రప్రదేశ్‌

ప్రజాస్వామ్య విలువలకు సుప్రీం భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 19: కర్నాటకలో ముఖ్యమంత్రిగా అడ్డదారిలో పీఠమెక్కిన ఎడ్యూరప్ప సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శాసనసభను సమావేశపర్చి రాజీనామా చేయడం శుభపరిణామమని అటవీ పర్యావరణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. ఎన్నికల అనంతరం మెజార్టీలో ఉన్న కాంగ్రెస్, జెడి(ఎస్) కూటమిని కాదని, ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపిని గవర్నర్ ఆహ్వానించడం అప్రజాస్వామికమన్నారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలు పతనం కాకుండా సర్వోన్నత న్యాయస్థానం కాపాడిందన్నారు. 118 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్, జెడియు కూటమిని కాదని, 104 మంది సభ్యులు గల బీజేపీని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనుమతించడం గవర్నర్ చారిత్రాత్మక తప్పిదానికి నిదర్శనమన్నారు. గవర్నర్ వ్యవహారశైలి ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్రపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. కేంద్రప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా నిక్కచ్చిగా వ్యవహరించిన కాంగ్రెస్, జెడి(ఎస్) ఎమ్మెల్యేలను మంత్రి అభినందించారు. అసోం, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో మెజార్టీ లేకపోయినా దొడ్డిదారిన ప్రభుత్వాలను ఏర్పాటుచేసుకున్న బీజేపీ రాష్ట్రానికొక అజెండాను అమలుపరుస్తూ దేశంలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షకు మద్ధతుగా కర్నాటక ప్రజలు బీజేపికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన 65 గంటల్లోపే బలపరీక్షలో నెగ్గలేక రాజీనామా చేయాల్సిన పరిస్థితి బీజేపి స్వయంకృత అపరాధ ఫలితమేనన్నారు. ఇప్పటికైనా బీజేపీ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని విజ్ఞప్తిచేశారు.