ఆంధ్రప్రదేశ్‌

బాబులో ఒత్తిడి తగ్గించిన కన్నడ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: రాష్ట్ర ప్రయోజనాల అంశంలో కేంద్రంతో విభేదించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మానసికంగా ఎదుర్కొంటున్న ఒత్తిడికి కన్నడ ఎన్నికల తరువాత ఉపశమనం లభించినట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర ప్రయోజనాలను కల్పించడం లేదని ఆరోపిస్తూ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులను మంత్రివర్గం నుంచి ఉప సంహరించుకోవడంతో ప్రారంభమైన రాజకీయాలు చంద్రబాబును వ్యక్తిగతంగా దెబ్బ తీసే స్థాయికి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారని స్వయంగా చంద్రబాబే చెప్పుకున్నారు. గోద్రా అల్లర్ల నేపథ్యంలో తాను చేసిన విమర్శలు, రాజీనామా డిమాండును మనసులో పెట్టుకుని ఆయన తీవ్ర స్థాయిలో వేధించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం రాష్ట్రానికి మొండిచెయ్యి చూపారన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్టు చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే. ఆ తరువాత వారం లోపే ఎన్డీయే నుంచి కూడా వైదొలుగుతున్నానని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఆయన చేపట్టిన కార్యక్రమాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన తీరుపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబుపై ప్రతిదాడి ప్రారంభించారు. చంద్రబాబుకు కర్నాటక ఎన్నికల అనంతరం చుక్కలు చూపుతామని, అలిపిరి సంఘటన గుర్తుచేసుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన ప్రకటన చంద్రబాబు మనసులో కలకలం రేపింది. బీజేపీ తనను లక్ష్యంగా చేసుకుని ఏదైనా ప్రమాదం తలపెడుతుందా అన్న ఆలోచన ఆయనను తీవ్ర మానసిక వేదనకు గురి చేసినట్టు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. వీర్రాజు మాటలతో అప్రమత్తమైన చంద్రబాబు వెంటనే అమిత్ షా, నరేంద్రమోదీ వేస్తున్న అడుగులను నిశితంగా గమనిస్తూ వచ్చారు. వీర్రాజు ప్రకటన సమయంలోనే ‘ఆపరేషన్ గరుడ’ అనే కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని, వేల కోట్లను రాష్ట్రానికి చేరవేసిందని సినీనటుడు శివాజీ మరో సంచలన ప్రకటన చేశారు. ఆ వెంటనే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ హైదరాబాదు ఫిలిం ఛాంబర్ వద్ద హడావుడి చేయడం చంద్రబాబు ఆలోచనను తీవ్రతరం చేసిందని తెలిపారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా రాజకీయ పార్టీలు చేపట్టిన బంద్ సమయంలో తిరుపతిలో ఒక మోటారు సైకిలును అనవసరంగా తగులబెట్టిన సంఘటనతో చంద్రబాబు తీవ్ర ఒత్తిడికి గురయ్యారని టీడీపీలోని ఒక కీలకనేత అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇలా ఉన్న సమయంలో మూడేళ్ల క్రితం జరిగిన ఓటుకు నోటు కేసును హైదరాబాదులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించడం, ఆ సమావేశంలో జరిగిన చర్చకు సంబంధించిన పూర్తి విషయాలు తెలవకపోవడంతో ఒత్తిడి రెట్టింపయిందని ఆయన అన్నారు. ఆ ఒత్తిడిలో కూడా తిరుపతిలో ఒక మోటారు సైకిలును తగులబెట్టిన చిన్న సంఘటనను కూడా వదలకుండా జాగ్రత్త పడేందుకు సిద్ధపడ్డారని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యక్తిగతంగా తనను, 2019లో ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని అమిత్ షా, నరేంద్రమోదీ జనసేన, వైకాపాను పావులుగా వాడుకుని ఇబ్బందులకు గురి చేస్తారన్న నిర్ణయానికి వచ్చారు. వారి ఎత్తుగడలను ఎదుర్కొనేందుకు నిత్యం జనంలోనే ఉంటూ వారి సానుభూతి పొందడం ద్వారా బీజేపీ, వైసీపీ, జనసేనను ఎదుర్కొనాలని నిశ్చయించుకున్న చంద్రబాబు కర్నాటక ఎన్నికలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. అక్కడ బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటే అమిత్ షా, మోదీల పరుగునకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన భావించినట్టు తెలుస్తోంది. దాంతో కర్నాటకలో తెలుగువారు ఉన్న చోట టీడీపీ శ్రేణులతో భారీ ప్రచార కార్యక్రమం చేపట్టి బీజేపీ ఓట్లకు గండి కొట్టడంలో కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు. అయితే ఎన్నికల అనంతరం పూర్తి ఆధిక్యం రాకపోయినా యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో ఒత్తిడి తారాస్థాయికి చేరుకుందని ఆయన తెలిపారు. అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ ప్రలోభాలకు లొంగకపోవడంతో ఆ పార్టీ జాతీయ స్థాయిలో పరాభవానికి గురైందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు కుమారస్వామిని గవర్నర్ ఆహ్వానించడంతో చంద్రబాబు మనసు తేలికపడిందని ఆయన తెలిపారు. ఇంతకాలం తీవ్ర ఒత్తిడికి లోనైన ఆయన గవర్నర్ నిర్ణయం వెలువడగానే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందారని ఇక మోదీ, అమిత్ షా వెనక్కి తగ్గి తన వైపు, రాష్ట్రం వైపు దృష్టి సారించి అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేయరని ఆయన ధీమాతో ఉన్నారు. గత నెల రోజులకు పైగా చంద్రబాబు ఎదుర్కొంటున్న ఒత్తిడి సగానికిపైగా తగ్గిందని, ఇక ఆయన రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించి 2019లో గెలుపే లక్ష్యంగా మరింత పకడ్బందీగా కృషి చేస్తారని టీడీపీ కీలక నేత స్పష్టం చేశారు.