ఆంధ్రప్రదేశ్‌

నవ నగరాల సమాహారం అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 9: నవనగరాల సమాహారంగా ప్రపంచ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో అంతా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్ఘాటించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సోమవారం ప్రపంచనగరాల ప్లీనరీ సెషన్‌లో ‘పట్టణీకరణ- నీరు, పర్యావరణం, ప్రజారవాణా నిర్వహణ’ అనే అంశంపై ప్రసంగించారు. భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఘన చరిత్ర, సుసంపన్నమైన వారసత్వం ఉంది.. దేశ చరిత్రలోనే అమరావతిది ప్రత్యేక స్థానంగా చెప్పారు. రాజధాని నిర్మాణం ఎంతో కష్టసాధ్యం.. ఒకవైపు ప్రాచీన సంస్కృతిని ప్రతిబింబింపచేస్తూ మరోవైపు ఆధునికత మేళవించాలని, ఇది అంత సులువైన అంశం కాదన్నారు. రాజధాని అమరావతి ఐదున్నర కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా నిర్మిస్తున్నాం.. ఎక్కడా రాజీపడకుండా ఆధునిక టెక్నాలజీ వినియోగంతో చిరస్థాయిగా నిలిచే విధంగా నిర్మితమవుతోందని తెలిపారు. ప్రపంచంలోని ఐదు అగ్రశ్రేణి నగరాల్లో అమరావతిని నిలపాలనేదే తన ధ్యేయమన్నారు. నివాసయోగ్యమైన నగరాల రూపకల్పనలో నీరు, పర్యావరణ లక్ష్యాలను అధిగమించేందుకు సాంకేతికత, వౌలిక సదుపాయాల కల్పన అత్యంత అవసరమన్నారు. నవనగరాల సమాహారంగా రూపుదిద్దుకుంటున్న అమరావతి అభివృద్ధిలో అంతా భాగస్వాములు కావాలని కోరారు. వనరుల నిర్వహణలో వైజ్ఞానిక సమాచార సాంకేతికత దోహదపడుతుందని తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాధనాల ద్వారా భూగర్భ, ఉపరితల నీటివనరులు, ఉష్ణోగ్రతలు, గాలిలో స్వచ్ఛత తదితర సమాచారాన్ని కచ్చితంగా తెలుసుకునే వీలు ఉంటుందన్నారు. వనరులను సమర్థంగా వినియోగించి ప్రజలకు మెరుగైన జీవనం అందించేందుకు ఈ సమాచారం ఉపకరిస్తుందన్నారు. సమర్థ నిర్వహణ పద్ధతుల ద్వారా రాష్ట్రంలో భూగర్భజలాలను పెంచగలిగామని వివరించారు. నదుల అనుసంధానం, శుద్ధిచేసిన భూగర్భజలాల పునర్వినియోగం, వ్యర్థ నీటి నిర్వహణ తదితర చర్యలతో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు. నదుల అనుసంధానం, జలసంరక్షణతో తాగునీటితో పాటు వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు తగినంత నీటిని అందించగలిగే పరిస్థితి తీసుకువచ్చామన్నారు. కరవు ఛాయలను తరిమికొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ, ఘన, వ్యర్థాల నిర్వహణను సమర్థమైన పద్ధతిలో చేపడుతున్నామని చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించామని హరిత రాజధాని అమరావతికి ఆధునిక సాంకేతిక పద్దతులు ఉపయోగిస్తున్నామని వివరించారు. ప్రజలకు మెరుగైన సుపరిపాలన అందించాలని, మరిన్ని సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో 5-10-15 అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. అత్యవసర గమ్యాలను చేరుకునేందుకు 5 నిముషాలు, సామాజిక అవసరాలకు 10, కార్యక్షేత్రాలకు 15 నిముషాల్లో చేరుకోవచ్చనే భావనను అమలు చేయాలనేది తమ సంకల్పమన్నారు. ఎరువులు, క్రిమి సంహారక మందులు దీర్ఘకాలంలో జీవజలానికి హానిచేస్తాయనే ఉద్దేశ్యంతో పైసా పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం దిశగా రైతాంగాన్ని జాగృతం చేస్తున్నట్లు చెప్పారు. తొలిదశలో 5లక్షల మంది రైతుల భాగస్వామ్యంతో జీరోబేస్డ్ నాచురల్ ఫార్మింగ్ (జడ్‌బీఎన్‌ఎఫ్)వైపు మళ్లించ గలిగామన్నారు. ఏ పని అయినా విజయవంతం కావాలంటే అది సమర్థ నాయకత్వం ద్వారానే సాధ్యమవుతుందని, అప్పుడే తలపెట్టిన కార్యక్రమం సజావుగా, ప్రభావ వంతంగా ముందుకు సాగుతుందని అభిప్రాయపడ్డారు. ఇవే పద్ధతులను అనుసరిస్తూ సవ్యదిశలో పయనించడం ద్వారా ప్రపంచంలో నివాస యోగ్యమైన నగరాలను తీర్చిదిద్దుకోవచ్చని సమావేశానికి హాజరైన నగరపాలకులకు సూచించారు. సదస్సుకు ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక మంత్రి పి నారాయణ, సీఎంఒ ముఖ్యకార్యదర్శి జి సాయిప్రసాద్, ఏపీఈబీడీ సీఈఒ జాస్తి కృష్ణకిషోర్, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, రియల్‌టైమ్ గవర్నెన్స్ సీఈఒ అహ్మద్‌బాబు, సమాచార, పౌరసంబంధాలశాఖ కమిషనర్ పాలడుగు వెంకటేశ్వర్, ఆర్టీజీ డైరెక్టర్ బాలాజీ ఆదివిష్ణు, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
సింగపూర్ తరహాలో గృహనిర్మాణం
సింగపూర్ తరహాలో రాష్ట్రంలో గృహనిర్మాణ సముదాయాలను పరిమిత స్థలంలోనే చేపట్టే విషయమై సమగ్ర ఆధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ప్రపంచ నగరాల సదస్సు నిమిత్తం సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి సోమవారం సిటీ సొల్యూషన్స్ సింగపూర్ ఎగ్జిబిషన్‌ను ఆసక్తికరంగా తిలకించారు. పేదలకు భవిష్యత్తులో నిర్మించే ఇళ్లు మరింత మెరుగైన పద్ధతిలో ఉండాలని, మరిన్ని పేదకుటుంబాలకు ఆవాసం కల్పించేదిగా ఉండాలని నిర్ణయించారు. మరిన్ని ప్రత్యేకతలతో నివాసగృహాల సముదాయం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించారు. సింగపూర్‌లో జీవ వైవిధ్యానికి సంబంధించి అత్యుత్తమ విధానాలపై ఆధ్యయనంచేసి వాటిని మన రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతితో సహా నవ్యాంధ్ర నగరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దటానికి, పెట్టుబడుల ఆకర్షణకు ఉద్దేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సింగపూర్ పర్యటన సోమవారం రెండోరోజుకు చేరింది. ముందుగా సీఎం సిటీ సొల్యూషన్స్ సింగపూర్ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఇందులో ఆకర్షణీయ నగర ప్రాంత నివాస గృహాలు (స్మార్ట్ అర్బన్ హేబిటేట్) విభాగాన్ని ఆసక్తిగా పరిశీలించారు. పట్టణ జనాభా అవసరాలకు తగ్గట్టుగా వినూత్న విధానాలతో పరిమిత స్థలంలోనే అందరికీ ఇళ్లనిర్మాణం ఎలా చేపట్టవచ్చో నిశతంగా పరిశీలించి నిర్వాహకులను వివరాలడిగి తెలుసుకున్నారు. ఇక్కడి అత్యుత్తమ విధానాలన్నింటినీ అసరించి ఏపీలో ‘ఎఫర్డబుల్ హౌసింగ్’ చేపట్టాలని సూచించారు. ఎగ్జిబిషన్ విశేషాలను నిర్వాహక ప్రతినిధి ఖో టెంగ్ ఛో ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో సింగపూర్ సస్టయినబుల్, అఫర్డబుల్ పబ్లిక్ హౌసింగ్, డిజైనింగ్ సస్టయినబుల్ హ్యాబిటేట్స్, ఇన్నోవేషన్ వాటర్, సీవరేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్, కనస్ట్రక్షన్, పబ్లిక్‌హెల్త్ తదితర విభాగాలను ప్రతినిధులను ఆకట్టుకునే రీతిలో ఏర్పాటుచేశారు.
మహానగరానికి చారిత్రక స్ఫూర్తి అవసరం
ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలంటే చారిత్రాత్మక స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. సోమవారం సింగపూర్‌లో ‘పట్టణీకరణ- నీరు, పర్యావరణం, రవాణా వ్యవస్థ’పై జరిగిన బృంద చర్చలో సీఎం మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రాజధానిని నిర్మిస్తున్నామని తెలిపారు. ముందుగా రైతులను ఒప్పించి రాజధానికి భూసమీకరణ చేశామని గుర్తుచేశారు. తనపై విశ్వాసంతో భూములిచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన రైతుల త్యాగాలను మరువలేనన్నారు. అమరావతిలో అభివృద్ధి ఫలాలను రైతులకే అందిస్తామన్నారు. వనరులు, సాంకేతికత, వినూత్న ఆలోచనలు ఉన్నాయని వీటన్నింటితో ప్రజారాజధాని నిర్మాణం తథ్యమని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో ప్రాజెక్టులు విజయవంతమయ్యేందుకు పాటించాల్సిన కొన్ని అంశాలను చర్చకు హాజరైన ప్రపంచబ్యాంక్ సీఈఒ క్రిస్టెలినా వివరించారు. ఒక నిర్మాణ ప్రాజెక్టు తలపెడితే అది విజయవంతంగా పూర్తికావటానికి నీరు, పర్యావరణ రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు, ఆలోచనలు అవసరమన్నారు.
వనరుల వినియోగానికి ప్రాధాన్యతను అనుసరించి సరైన ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. సమాజంలో అన్నివర్గాల ప్రజలకు మేలుజరగాలంటే, పథకాల ఫలాలు అందాలంటే అనేకస్థాయిల్లో ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. నగరాలను మరింత నివాసయోగ్యంగా, సుందరంగా తీర్చిదిద్దే కృషిలో ప్రజల్లో కూడా సహకారభావం రావాలని, సంస్కరణల అమలుకు తోడ్పాటు అందించాల్సి ఉందని చైనా వైస్‌మినిస్టర్ సూచించారు. ఏసియా వాటర్ వీక్ ప్రతినిధి సహానా సూద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నిరంగాల్లో సమర్ధులని ప్రశంసించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్లైమేట్‌ఛేంజి మినిస్టర్ థాని అహ్మద్ అల్-జీయూది మాట్లాడుతూ నీరు, ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచేందుకు వివిధ ఏజన్సీలు, ప్రజలతో భాగస్వామ్యాలు ఏర్పాటుచేసుకుంటున్నట్లు తెలిపారు.