ఆంధ్రప్రదేశ్‌

ఏలూరు మేయర్ భారీ వితరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జూలై 5: మాకు వేతనాలు పెంచండంటూ ప్రజాప్రతినిధులు సైతం ఇటీవలి కాలంలో విజ్ఞప్తులు చేయటం, సొంతంగానే తీర్మానాలు చేసుకుని అమలుచేసుకోవటం ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం. కానీ పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ ఇందుకు పూర్తి భిన్నమైన శైలిలో సంక్షేమ బాట దిశగా అడుగులువేసి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు. మేయర్‌గా బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు ముగిసిన సందర్భంగా ఇంతకాలం తనకు వచ్చిన గౌరవ వేతనం, భత్యాలతోపాటు తన భర్త, కార్పోరేషన్ కో-ఆప్షన్ సభ్యుడు ఎస్‌ఎంఆర్ పెదబాబుకు వచ్చిన గౌరవ వేతనం రూ.9.40 లక్షలకు మరో రూ.60 వేలు జోడించి మొత్తం పదిలక్షల రూపాయలను రంజాన్ పర్వదినం సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు పంపిణిచేశారు. మంగళవారం నిర్వహించిన భారీ కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగువేల మందికి రూ.250 చొప్పున రంజాన్ తోఫా అందజేశారు. కార్పొరేషన్ పరంగా ఇంతకుముందే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మేయర్ దంపతులు తాజా వితరణతో మరింత ఆదర్శంగా నిలిచారు. వాస్తవానికి మేయర్ దంపతులు రాజకీయాల్లోకి రాకముందు నుంచే వితరణ విషయంలో అందరికి ఆదర్శంగానే నిలుస్తూవచ్చారు. ప్రధానంగా మతభేదం లేకుండా మసీదులు, చర్చిలు, దేవాలయాలకు ఎన్నో లక్షల రూపాయలు విరాళాలుగా అందజేశారు. ఏ ప్రార్ధనాలయం నుంచైనా తమకు ఈ అవసరం ఉందని సాయంచేయాలని వస్తే కొంతమొత్తం ఇవ్వటమే కాకుండా, ఆ కార్యక్రమానే్న భుజాన వేసుకుని ముందుకు తీసుకువెళ్లటం వీరికి అలవాటు. ఏలూరు నగరంలోని ప్రార్ధనాలయాల్లో వీరి థార్మిక సహాయం అందుకోని సంస్థ ఉందంటే ఆతిశయోక్తికాదు. ఇక రాజకీయాల్లోకి వచ్చాక నగర మేయర్‌గా నూర్జహాన్ టిడిపి తరపున ఘనవిజయం సాధించారు. కార్పోరేషన్‌లో 50 డివిజన్లు ఉంటే ఏకంగా 42 డివిజన్లు టిడిపి గెలిచే విధంగా తమ పలుకుబడి ఉపయోగించగలిగారు. ఇక ఆ తర్వాత నుంచి కూడా కార్పోరేషన్ వ్యవహారాల్లోనూ సంక్షేమ బాటలోనే ముందుకు సాగుతూ మంగళవారం నాటి పరిణామాల్లో ఒకరకంగా రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు ఏలూరు నగర మేయర్ దంపతులు ఆదర్శంగా నిలిచారు.

చిత్రం.. పేద ముస్లింలకు నగదు పంపిణీ చేస్తున్న మేయర్ నూర్జహాన్ దంపతులు