ఆంధ్రప్రదేశ్‌

వర్సిటీల్లో ‘జ్ఞానధార’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 12: ఏపీని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు జ్ఞానధార పేరుతో భారీ కార్యాచరణ ప్రణాళికను విశ్వవిద్యాలయాల నుంచి ప్రారంభిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇకపై రాష్ట్రంలో రెండంచెల విద్యా వ్యవస్థను అమలు చేయనున్నామని, వర్సిటీల్లో అంతర్జాతీయ స్థాయి పోటీ వాతావరణం నెలకొల్పేందుకు వీలుగా జూలై మూడవ వారం నుంచి జ్ఞానధార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రంలోని 17 వర్సిటీల వీసీలతో గురువారం సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏపీని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్య సాధనలో వర్సిటీలు ముఖ్య భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. నాలెడ్జ్ ప్రమోషన్ వర్సిటీల నుంచే జరగాలని, అందుకే అన్ని వర్సిటీల్లో స్ఫూర్తిదాయకమైన ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వర్సిటీల్లో చదువుతున్న 18 లక్షల మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ పోటీ వాతావరణంలో నిలబడేందుకు వీలుగా ఈ కార్యక్రమం రూపకల్పన చేస్తున్నామన్నారు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలు నెలకొల్పడం, నిరంతర విద్యకు ప్రాధాన్యం, సాంకేతిక అనుసంధానం, నైపుణ్యాభివృద్ధి, నవ్యావిష్కరణలు, స్టార్ట్‌అప్‌లకు ప్రోత్సాహం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నామన్నారు. జూలై మూడవ వారం నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి జ్ఞానధార అని పేరు పెట్టాలని భావిస్తున్నామన్నారు. ఇంతకంటే మంచిపేరు వస్తే పరిశీలిస్తామని తెలిపారు. విద్యా రంగంలో రానున్న కాలానికి అవసరమైన నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. విద్యా, సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో ప్రముఖులను ఆహ్వానించి, వారి నుంచి స్ఫూర్తి పొందేలా కార్యక్రమానికి రూపకల్పన చేయాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును ఆదేశించారు. ఒక్కో వర్సిటీల్లో ఒక్కో రోజు నిర్వహించే కార్యక్రమంలో తాను పాల్గొని 10 వేల మంది విద్యార్థులతో నేరుగా మాట్లాడుతానని తెలిపారు. విద్యార్థులు చేసిన నూతన ఆవిష్కరణలతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయాలని, వివిధ రంగాలకు చెందిన నిపుణులను భాగస్వాములను చేయాలన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి స్ఫూర్తినిచ్చేలా వ్యాపార దిగ్గజాలను ఆహ్వానించాలన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ బాధ్యతను కలెక్టర్లకు అప్పగిస్తున్నానని తెలిపారు. ఈ ఈవెంట్ కోసం ప్రత్యేక యాప్‌ను త్వరలో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ నెల 18న శ్రీకాకుళం అంబేద్కర్ వర్సిటీ నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం అవుతుందని, ఆగస్టు 2న జెఎన్‌టియులో, 17న ఏయులో, 31న వైఎస్సార్ హార్టికల్చర్ వర్సిటీలో, సెప్టెంబర్ 14న నన్నయ్య వర్సిటీలో, 30న కృష్ణా , హెల్త్ వర్సిటీల్లో, అక్టోబర్ 12న నాగార్జున, ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయాలకు కలిపి నిర్వహిస్తారు.
ప్రస్తుతం మూడు అంచెలుగా ఉన్న ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా వ్యవస్థలను రెండంచెల విద్యా వ్యవస్థగా మార్చుతున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ విద్యను త్వరలో పాఠశాల విద్యలో మిళితం చేయనున్నామన్నారు. ఇప్పటికే జాతీయ స్థాయిలో పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ భాగం కావడాన్ని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలకు వీసీలు సహకరించాలని, విద్యా రంగంలో మార్పులపై మార్గదర్శనం చేయాలని కోరారు. వీసీలుగా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని, తమ వర్సిటీలను అత్యుత్తమ చదువులకు నెలవుగా తీర్చిదిద్దాలంటూ దిశానిర్దేశం చేశారు.

చిత్రం..వైస్‌చాన్సలర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు