ఆంధ్రప్రదేశ్‌

ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరిగింది. దీనివలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాన్ని పూడ్చుతామని భరోసా ఇచ్చిన కేంద్రం, ఇప్పుడు సహకరించడం లేదు. ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలస్యం చేస్తే ప్రయోజనం ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సుమారు 6,688 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి అనకాపల్లి వరకూ జాతీయ రహదారి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కొన్ని రోడ్లను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కేంద్రం చేయూతనివ్వాలన్నారు. పూర్తిగా అభివృద్ధికి 10 నుంచి 12 సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికే నాలుగేళ్లు గడిచిపోయాయి. ఏపీ ప్రజలకు సెంటిమెంటైన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, దుగరాజుపట్నం పోర్టు వంటి 18 అంశాలపై కేంద్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోపోవడం వలన ప్రజలు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారు. మొన్నటి వరకూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేశాయి. కొన్ని కారణాల వలన వేరయ్యాం. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ ఇవ్వకపోతే, రాష్ట్రం నష్టపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని మీరు చూస్తున్నారని గడ్కరీని ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మరో ఎనిమిది సంవత్సరాలు పడుతుందని చంద్రబాబు అన్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్రాన్ని ఆదుకోవలసిన బాధ్యత కేంద్రానికి లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్ని వివరాలు సంబంధిత శాఖకు తెలియచేయడానికి రాష్ట్ర అధికారులు సోమవారం ఢిల్లీ వెళుతున్నారని చంద్రబాబు చెప్పారు. తనను రమ్మన్నా తాను కూడా ఢిల్లీ వస్తానని సీఎం చెప్పారు. పోలవరం భూసేకరణ సమయంలో గిరిజనులకు అన్యాయం చేశామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చంద్రబాబు చెప్పారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఇచ్చే నిధులు నేరుగా రైతులకు ఇచ్చినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం వలన ప్రయోజనం లేదని అన్నారు. కేంద్రం తనకు పూర్తిగా సహకరిస్తే, కావేరీ జల సమస్య లేకుండా వారికి కావల్సిన నీటిని ఏపీ నుంచి ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమిళులంతా ఏకోన్ముఖంగా పోరాడతారు. ఏపీకి కేంద్రం నుంచి రావల్సినవన్నీ వచ్చేలా చూడాలని కేంద్ర పోర్టుల శాఖ సహాయ మంత్రి రాధాకృష్ణన్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. గడ్కరీకి కేంద్ర ప్రభుత్వంలో చాలా పలుకుబడి ఉంది. ఆయన పరపతిని ఉపయోగించి, ఏపీకి న్యాయం చేసేలా మోదీకి నచ్చచెప్పాలని, దీనివలన వచ్చే క్రెడిట్ ఎవ్వరు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏపీకి కేంద్రం అండగా ఉంటుంది:గడ్కరీ
కేంద్ర పోర్టులు, జాతీయ రహదారులు, నీటిపారుదల శాఖ మంత్రి గడ్కరీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. దాన్ని రాజకీయ కోణంలో చూడద్దని ఆయన హితవు పలికారు. ఎన్నికలలో ఎవరి రాజకీయం వారిది. రాజకీయాన్ని అభివృద్ధితో ముడివేయద్దని అన్నారు.
ఏ ప్రాంతంలోనైనా రోడ్లు అభివృద్ధి చెందితే, ఆ ప్రాంతం ప్రగతి సాధిస్తుంది. అందుకే ప్రధాని మోదీ దేశంలో రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. తాను జాతీయ రహదారుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రోజుకు రెండు కిలో మీటర్ల రోడ్డు వేసేవారు. ఇప్పుడు రోజుకు 28 కిలో మీటర్ల రోడ్డు నిర్మిస్తున్నారు. వచ్చే మార్చినాటికి దీన్ని 40 కిలో మీటర్లకు పెంచనున్నామని ఆయన తెలియచేశారు. ఏపీలో రోడ్ల అభివృద్ధికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఆయన తెలియచేశారు. ఇందులో ఎక్స్‌ప్రెస్ హైవేకే లక్ష కోట్లు కేటాయించామని ఆయన తెలిపారు. సాగరమాల ప్రాజెక్ట్ కింద ఏపీలో లక్షా 38 వేల కోట్ల రూపాయలతో 108 ప్రాజెక్ట్‌లు చేపట్టామని అన్నారు. 1,717 కోట్ల విలువైన 34 ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాయని గడ్కరి చెప్పారు. మత్స్య పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఏపీలో తీరం వెంబడి షిపింగ్ హార్బర్‌లను నిర్మించనున్నామని ఆయన తెలిపారు. 16 నుంచి 18 శాతం వరకూ లాజిస్టిక్ కాస్ట్‌ను ఆరు నుంచి ఎనిమిది శాతానికి తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియచేశారు.
ఎంపీ హరిబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య లేకపోయినా, ఏపీ అభివృద్ధిలో కేంద్రం వెనక అడుగు వేయదని అన్నారు.
గడచిన నాలుగు సంవత్సరాల్లో కేంద్రం ఏపీకి అనేక ప్రాజెక్ట్‌లు, సంస్థలు ఇచ్చిందని అన్నారు. ఎంపీ అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ రైల్వే జోన్ కోసం నాలుగు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇక్కడి ప్రజల సెంటిమెంట్‌ను గుర్తించి, కేంద్రంలో మీ పలుకుబడిని ఉపయోగించి, జోన్ వచ్చేలా చేయాలని మంత్రి గడ్కరిని కోరారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాధాకృష్ణన్, మనుసుఖ్ మాండవీయ, రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సభలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి గడ్కరీ పరస్పరం అభినందించుకుంటున్న దృశ్యం