ఆంధ్రప్రదేశ్‌

గెర్డౌ ఉక్కులో భద్రత డొల్ల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, జూలై 13: అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని గెర్డౌ స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న కార్మికుల జీవితాలకు భద్రత లేకుండా పోతోందని గురువారం జరిగిన సంఘటన స్పష్టం చేస్తోంది. ఫ్యాక్టరీలోని అంత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో కాంట్రాక్టు కార్మికులతో యాజమాన్యం పనులు చేయిస్తోందని తెలుస్తోంది. వీరి భద్రతకు ఎలాంటి ముందుస్తు చర్యలు తీసుకోకపోవడంతో బడుగు జీవులు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మృతులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడం ద్వారా అప్పటికప్పడు సమస్యను పక్కదారి పట్టిస్తున్న యాజమాన్యం శాశ్వత రక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
పరిశ్రమ ప్రధాన గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఐడీ కార్డు, హెల్మెట్ లేనిదే కార్మికులకు లోపలికి పంపకుండా కఠినంగా వ్యవహరిస్తారు. అయితే లోపల మాత్రం కాంట్రాక్టు ఉద్యోగులు ఏమాత్రం సేఫ్టీ మెజర్స్ ధరింకుండానే విధులు నిర్వహస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో పనిచేసేటప్పుడు మాస్క్‌లు, గ్లౌజులు, హెల్మెట్ ధరించాల్సి ఉండగా అవేవీ కార్మికులకు అందుబాటులో ఉంచడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, యాజమాన్యం తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రం కాంట్రాక్టు కార్మికులను దూరంగా ఉంచి కంపెనీ ఉద్యోగులకు మాస్క్‌లు, గ్లౌజులు, హెల్మెట్‌లు, రోప్‌లు అందజేసి పనిచేయిస్తున్నట్లు సమాచారం. సుమారు 900 ఎకరాల్లో విస్తరించిన గెర్డౌ పరిశ్రమలో కీలక ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు యాజమాన్యం కనీస రక్షణ కల్పించడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలో ఇదే ఫ్యాక్టరీలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ కావడంతో రాజస్థాన్‌కు చెందిన కార్మికుడు మృతి చెందగా, ఆ విషయం బయటకు రాకుండా యాజమాన్యం జాగ్రత్త వహించిందని సమాచారం. గ్యాస్ టనె్నల్ వద్ద గత నాలుగు రోజులుగా పనులు జరగకపోవడంతో గురువారం ఇద్దరు కార్మికులు ఆక్సిజన్ సిలిండర్ ధరించకుండా, మానిటర్ సైరన్ తీసుకుని టనె్నల్‌లోకి వెళ్లినట్లు సమాచారం. మానిటర్ సైరన్ పనిచేయకపోవడంతో లీక్ అవుతున్న సీఓ గ్యాస్‌ను పీల్చిన వారు అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. లోపలికి వెళ్లిన వారు ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో మరో నలుగురు కార్మికులు టనె్నల్‌లోకి వెళ్ళారు. ఆక్సిజన్ అందక రంగనాథ్, మనోజ్, లింగమయ్య, గురువయ్య, వసీం, గంగాధర్ టనె్నల్‌లో మృతి చెందారని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న మెయిన్‌వాల్‌ను లాక్ చేయడంతో పెనుప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన ప్రమోద్ ఆచారి, రంగనాథ్‌ను మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రి నుంచి బెంగళూరుకు తరలించారు.
గెర్డౌ స్టీల్‌ప్లాంట్‌లో బిందు, నాగార్జున, శ్రీలక్ష్మి, షర్మిలా, సోమిరెడ్డి తదితర ఏజెన్సీలు ఔట్‌స్పోర్సింగ్ కింద కార్మికులను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసి పని చేయిస్తున్నాయి. ఏజెన్సీల ద్వారా నియామకం అయిన కార్మికులకు ఎలాంటి రక్షణ కల్పించకుండానే అనేక విభాగాల్లో పనులు చేయిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమ యాజమన్యం కార్మికులకు రక్షణ కల్పించాలని సంఘాల నేతలు కోరుతున్నారు.
కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టరాదు: ఆర్డీఓ మలోలా
సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టరాదని ఆర్డీఓ మలోలా అన్నారు. శుక్రవారం రాత్రి ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ సంఘటనా స్థలంలో మీటర్‌లో కార్బన్ మోనాక్సైడ్ ఎంత పరిమాణంలో ఉందో తెలుసుకుని లోపలికి దిగాలనే బోర్డు ఉందని అన్నారు. అయితే కనీస జాగ్రత్తలు తీసుకోకుండానే కార్మికులు లోపలికి వెళ్లారని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండస్ట్రీయల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి, అడిషినల్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి బృందంగా ఏర్పడి ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. సంఘటనపై విచారణ జరుగుతున్నందున మీడియాను లోపలికి అనుమతించలేదన్నారు. కాగా గెర్డౌ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదంపై వాస్తవాలు తెలుసుకునేందుకు పరిశ్రమ వద్దకు చేరుకున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను లోపలికి పపించేందుకు యాజమాన్యం నిరాకరించింది. దాంతో పరిశ్రమ గేటు వద్దే సాయంత్రం వరకు వేచి ఉన్న మీడియా ప్రతినిధులు నిరాశతో వెనుదిరిగారు.