ఆంధ్రప్రదేశ్‌

వన సంరక్షణలో విద్యార్థులే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు: విద్యార్థులంతా వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటి, వాటిని సంరక్షించి పెద్ద పెద్ద వృక్షాలుగా పెంచడం బాధ్యతగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. మొక్కలు పెంచటం సామాజిక బాధ్యతగా గుర్తించాలని, దీనిని దృష్టిలో ఉంచుకుని తన మనుమడు దేవాన్ష్‌తో మొక్క నాటించానని చెప్పారు. కృష్ణా జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో మిషన్ హరితాంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా 69వ వన మహోత్సవం శనివారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనుమడు దేవాన్ష్‌తో మొక్కలు నాటించి, నీరు పోయించారు. విద్యార్థులతో వనం-మనం ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో గ్రీనరీని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి, గ్రీనరీ పెంచిన సంస్థలకు ప్రోత్సాహకాలు అందచేస్తామని తెలిపారు. వన సంరక్షణను ఒక మహోద్యమంగా చేపట్టామన్నారు. ఇందులో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్రంలో ఉన్న అయిదు కోట్ల మంది ప్రజల్లో ఒక్కొక్కరు పది మొక్కలు చొప్పున నాటితే 50 కోట్ల మొక్కలు అవుతాయన్నారు. దీంతో రాష్ట్రంలో పచ్చదనం 50 శాతం పరుచుకుంటుందన్నారు. రాష్ట్రంలో ప్రసుత్తం 26 శాతం మాత్రమే ఉందన్నారు. దీనిని 2029 నాటికి 50 శాతానికి తీసుకువెళ్ళడం ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో 69వ వనమహోత్సవంలో భాగంగా వివిధ ప్రాంతాలలో 26 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమం కార్తీక పౌర్ణమి వరకు సాగుతుందని ఆయన వివరించారు. వివిధ రకాల చెట్లతో రాష్ట్రం నందనవనంగా మారితే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని చెప్పారు. కృష్ణా, గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించి, జలాల ప్రాముఖ్యతపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చామని అన్నారు. అదేవిధంగా ప్రకృతి పరంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. నీరు, మట్టికి సంబంధించిన రహస్యాలను తెలుసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. రసాయనిక ఎరువులు వినియోగించకుండా ప్రకృతి సేద్యంపై రైతులు దృష్టి సారించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహాకాలు అందిస్తోందన్నారు. పుట్టిన రోజు లాంటి పండుగల సమయంలో మొక్కలు నాటే సంస్కృతికి ప్రజలు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. చెట్లతోనే జీవనం-చెట్లతోనే అభివృద్ధి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కోరారు. ప్రతి నెలా నాలుగో శనివారం విద్యార్థులు సామాజిక అంశాలపై దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆ శనివారం నాడు విద్యకు స్వస్తి చెప్పి, గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటించి సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని, పర్యావరణ, అటవీ రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ వనం-మనం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని చెప్పారు. అటవీ శాఖ ప్రధాన కార్యదర్శి వి అనంతరాము, సీసీఎఫ్ రిజ్వీ, ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పత్తిపాటి పుల్లారావు, నారాయణ, కొల్లు రవీంద్ర, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, టీడీపీ జిల్లా అద్యక్షులు బచ్చుల అర్జునుడు, కలెక్టర్ బి లక్ష్మీకాంతం, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురికి గ్రీన్‌ఫీల్డు అవార్డులను అందజేశారు.
చిత్రాలు..వనం-మనం కార్యక్రమంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
*నూజివీడులో వనం-మనం కార్యక్రమ పైలాన్ ఆవిష్కరించిన సీఎం