ఆంధ్రప్రదేశ్‌

సీమపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 15 : 2024లో అధికారంలోకి రావాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకుని 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తిరిగి పుంజుకోవాలంటే 2024 ఎన్నికల్లోనే సాధ్యమని నిర్ధారించుకున్న ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు 2019లో ప్రతిపక్ష వైసీపీని దెబ్బ తీయడమే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర నాయకులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోని వైసీపీని 2019లో అధికారంలోకి రాకుండా అడ్డుకుంటే 2024లో తమదే అధికారమన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాయలసీమలో బలంగా ఉన్న వైసీపీని అడ్డుకోవాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలికను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని పథక రచన చేసినట్లు తెలుస్తోంది.
రాయలసీమలోని 52 శాసనసభా స్థానాల్లో వైసీపీ బలంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి ఊమెన్ చాందీ పార్టీకి దూరంగా, ఇతర పార్టీల్లో ఉన్న నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఆయన జిల్లాల పర్యటనలో తీరికలేని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన పర్యటన అనంతరం తిరిగి పార్టీలో చేరే నేతల వివరాలు తెలిసే అవకాశం ఉంది. రానున్న ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల్లో అత్యధిక భాగం పార్టీ భరించే విధంగా కూడా ఆయన ఆలోచిస్తున్నట్లు పార్టీ సీనియర్ నేతల ద్వారా సమాచారం అందుతోంది. దీంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి కీలక నేతలు అంగీకరించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. రాయలసీమలోని మొత్తం 52 నియోజకవర్గాల్లో సుమారు 30 నియోజకవర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైసీపీకి కాకుండా కాంగ్రెస్, ఇతర పార్టీలకు వెళ్లేలా పథక రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా వైసీపీ అభ్యర్థుల విజయాన్ని అడ్డుకోవచ్చని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. రాయలసీమలో 2014 ఎన్నికల్లో కర్నూలు, కడప జిల్లాలో వైసీపీ అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించారు. చిత్తూరు జిల్లాలో కూడా టీడీపీ కంటే మెరుగైన ఫలితాలను వైసీపీ సాధించింది. ఈ మూడు జిల్లాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అంతేగాక కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో రాష్ట్ర నేతలను ఎక్కువగా ప్రచారంలో వినియోగించాలని కూడా వారు భావిస్తున్నట్లు సమాచారం. రాయలసీమలో వైసీపీ విజయాన్ని అడ్డుకుంటే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో టీడీపీ సాధించే అత్యధిక స్థానాలతో ఆ పార్టీ మరోమారు అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. తమ వ్యూహం ప్రకారం అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 2019 ఎన్నికల్లో కూడా జగన్ ముఖ్యమంత్రి కాలేడని దాంతో ఆ పార్టీ మూసివేయడం, మరో పార్టీలో విలీనం చేయడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. తమ పథకం సత్ఫలితాలు ఇవ్వాలంటే రాయలసీమపై ప్రధాన దృష్టి సారించాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు కాంగ్రెస్‌పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది.