రాష్ట్రీయం

ఆన్‌లైన్‌లో చిత్ర ధ్రువీకరణ .. దగ్గుబాటి సురేష్‌బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: ప్రస్తుత డిజిటల్ యుగంలో కాలయాపనకు అవకాశం లేకుండా సినిమాలకు ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ (సెన్సార్‌షిప్) ఇవ్వాలని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు సూచించారు. ప్రాంతీయ సెన్సార్ బోర్డులో సభ్యులుగా నియమితులైన వారికి వర్క్‌షాప్ సందర్భంగా నగరంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సెన్సార్ ధ్రువీకరణలో ఆలస్యం కారణంగా నిర్మాతలు, సినీ పరిశ్రమపై ఆధారపడిన వేలాది కళాకారులు, సాంకేతిక నిపుణులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. నిర్మాతలకు మేలు చేకూర్చేలా సెన్సార్‌షిప్‌ను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. సెన్సార్ బోర్డు అనుమతి వచ్చిన తర్వాతే సినిమాలకు సంబంధించి వాణిజ్య ప్రకటనలు టీవీల్లో ఇవ్వాలని సురేష్‌బాబు అన్నారు. సెన్సార్ బోర్డు ప్రాంతీయ అధికారి టి.విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ, సినిమాల వల్ల ఎలాంటి వివాదాలు తలెత్తకుండా నిర్మాతలే స్వీయ సెన్సార్ పాటించాలని సూచించారు. సమాజాన్ని తీవ్రంగా ప్రభావం చేసే సినిమా రంగంపై కొంత నియంత్రణ ఉండాలన్నారు. వినోదం కోసం ఉన్న ఈ మాధ్యమం వివాదాలకు ఆజ్యం పోయకుండా ఉండాలని సూచించారు.
వర్క్‌షాప్‌ల వల్ల సెన్సార్ బోర్డు సభ్యులకు వారి బాధ్యతలపై చక్కటి అవగాహన కలుగుతుందని కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు, సినీనటి జీవితా రాజశేఖర్ అన్నారు. రచయితలు, దర్శకులకు,నిర్మాతలకు కూడా ఇలాంటి వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. విడుదల తేదీకి ముందు ఆదరాబాదరాగా సినిమాలను పంపడం వల్ల సెన్సార్ బోర్డు సభ్యులపై ఒత్తిడి పెరుగుతోందని ఆమె అన్నారు. ఫిల్మ్ చాంబర్ ద్వారా ఒక వరస క్రమంలో సినిమాలను సెన్సార్ బోర్డుకు పంపితే వాటిని క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంటుందన్నారు. సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు తేజ, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రధాన కార్యదర్శి మురళీమోహన్ కూడా మాట్లాడారు.

పట్టుబడినవారు
పర్యాటకులే!

ఒడిశా పోలీసుల తప్పుడు సమాచారం
ఇరాన్ దేశీయులను వదిలేస్తామని చెప్పిన ఎస్పీ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 28: ఒడిశా పోలీసులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో ఇరాన్ దేశానికి చెందిన ఒక కుటుంబం అనవసరంగా పోలీసుల విచారణను ఎదుర్కోవలసి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇరాన్‌కు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు భారత దేశంలో పర్యటించేందుకు వచ్చారు. ఈ ఐదుగురిలో ఇద్దరు డిసెంబర్ 25న ఢిల్లీకి చేరుకుని, చుట్టుపక్కల ప్రదేశాల్లో పర్యటించారు. జనవరి 12న మరో ముగ్గురు వారితో వచ్చి చేశారు. ఢిల్లీలో ఒక కారును అద్దెకు తీసుకుని వీరంతా ఢిల్లీ, యుపి, బీహార్, బెంగాల్, అస్సాంల్లో పర్యటించి, కోల్‌కత్తా మీదుగా 25వ తేదీన భువనేశ్వర్‌కు చేరుకుని, మంచి హోటల్ కోసం వెతికారు. చివరగా ఓ హోటల్‌కు ఈ కుటుంబం అంతా వెళ్లగా, హోటల్ సిబ్బంది వీరిని పాస్‌పోర్ట్ అడిగారు. పాస్‌పోర్ట్ ఇవ్వకుండా వారు వెనుదిగారు. హోటల్ నచ్చకపోవడంతో ఈ కుటుంబం వెనుదిరిగింది. కానీ హోటల్ సిబ్బంది మాత్రం పాస్‌పోర్ట్ అడిగితే పారిపోయారంటూ ఒడిశా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు రెండు రోజులపాటు భువనేశ్వర్ మొత్తం గాలించినా, ఇరాన్ కుటుంబం ఆచూకీ లభించకపోలవడంతో 27న ఆంధ్రా పోలీసులకు సమాచారం అందించారు. 27న విశాఖ మీదుగా కారులో బెంగళూరు బయల్దేరారు. అప్పటికే విశాఖ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ కుటుంబం విశాఖ నగరాన్ని కూడా దాటేసి, సుమారు 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న నక్కపల్లి చెక్‌పోస్ట్ వద్దకు చేరుకున్నప్పటికి కానీ నగర, జిల్లా పోలీసులకు వీరి ఆచూకీ లభ్యం కాలేదు. జిల్లా పోలీసులు వెంటనే ఈ కుటుంబాన్ని బుధవారం రాత్రి విశాఖకు తీసుకువచ్చి పూర్తి స్థాయిలో విచారించారు. ఇమ్మిగ్రేషన్, ఎంబసీ అధికారుల నుంచి కూడా వివరాలు తెప్పించుకుని చూడగా, వీరు భారతదేశంలో విహార యాత్రకు వచ్చారని తేలింది. దీంతో విశాఖ పోలీసులు నాలుక కరుచుకున్నారు. జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ గురువారం విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఇరాన్ నుంచి వచ్చిన వారు పర్యాటకులే, కథ సుఖాంతమైందని చెప్పి వెళ్లిపోయారు. ఇరాన్ దేశీయులను వదిలేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.

ప్రజా చైతన్యంతోనే
అవినీతి అంతం

ఉద్యోగుల కృషి ఉంటే పథకాలు విజయవంతం
పదవీకాలంలో ఒడిదుడుకులూ ఎదుర్కొన్నా
విద్య, వైద్యం అందరికీ అందాలి

హైదరాబాద్, జనవరి 28 : ప్రభుత్వం చేపట్టే పథకాలు, కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉంటుందని, అందువల్ల ఉద్యోగులు శ్రద్ధగా, చిత్తశుద్ధితో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు పిలుపు ఇచ్చారు. ఐఎఎస్ అధికారిగా 37 సంవత్సరాలు (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 20 నెలలు), అంతకుముందు ఎపిఐఐసిలో అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా, ఇతర బాధ్యతల్లో రెండు సంవత్సరాల పాటు పనిచేసిన కృష్ణారావు ఈ నెల 31 న పదవివిరమణ చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఘనత ఆయనది. పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా ఆంధ్రభూమి ప్రతినిధికి గురువారం ప్రత్యేక ఇంటర్య్యూ ఇచ్చారు.
ఉద్యోగ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, వాటిని సమర్థతగా తట్టుకున్నానని కృష్ణారావు చెప్పారు. 39 సంవత్సరాల ఉద్యోగ జీవితం తర్వాత సంతృప్తిగా పదవీ విరమణ చేస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం అనేక పథకాలు, కార్యక్రమాలు ప్రకటిస్తూ ఉంటుందని, అధికారంలో ఏ పార్టీ ఉన్నా వారి బ్రాండ్ పథకాలు, కార్యక్రమాలు ఉండటం సహజమని, ఉద్యోగులు (ఎగ్జిక్యూటివ్) ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. పాలకులు, ఉద్యోగులు కలిసి పనిచేస్తేనే ప్రగతి ఫలితాలు ప్రజలకు చేరతాయన్నారు. అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ఉద్యోగుల బదిలీలు ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా కొనసాగతాయని వివరించారు. అవినీతి అనేది సమాజంలో కొనసాగుతోందని, ఎవరూ దీనికి అతీతం కాదని కృష్ణారావు అభిప్రాయపడ్డారు. అవినీతిని తొలగించడం, రూపుమాపడం అనేది క్లిష్టమైన అంశమని, వ్యక్తిగతంగా అందరిలోనూ మార్పు వస్తేనే ఈ జాడ్యం తొలగిపోయేందుకు అవకాశముందని వివరించారు. సమాజం పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని, ఇందుకోసం వ్యక్తుల్లో పరివర్తన రావాలే తప్ప, డబ్బుఅవసరం ఉండదన్నారు. మన సమాజానికి కాలుష్యం పెద్ద సమస్యగా మారబోతోందని, దీన్ని ఎదుర్కొనేందుకు సామాజికంగా చైతన్యం రావాల్సి ఉందన్నారు. విద్య, వైద్యం ప్రజలకు చేరువగా ఉండాలని, ఈ రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు అత్యంత ప్రతిభావంతులని గుర్తు చేశారు. వీరి సేవలు పూర్తిగా సమాజానికి ఉపయోగపడాల్సి ఉందన్నారు. ఈ అంశంలో వైద్యుల్లో, ఉపాధ్యాయ వర్గాల్లో అంతర్మథనం అవసరమని, తమ సేవలు పూర్తిగా ప్రజలకు అందాలన్న తపన వారిలో ఉండాలన్నారు. విద్య, వైద్య రంగాలను ప్రక్షాళన చేస్తూ, ఈ రంగాలు సమర్థతగా పనిచేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని వివరించారు.
దేవాదాయ, ధర్మాదాయ శాఖపై ప్రభుత్వ పెత్తనం పోవాలన్న అభిప్రాయం చాలా మందిలో ఉన్న విషయం నిజమే అయినప్పటికీ, ఈ విభాగం సజావుగా పనిచేసేందుకు, ప్రత్యామ్నాయ మార్గాలేమిటో చూపించాలని ఐవైఆర్ పేర్కొన్నారు.