ఆంధ్రప్రదేశ్‌

కాపులు, బహుజనులు ఒకటైతే రాజ్యాధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 16: రాష్ట్రంలో కాపులు, బహుజనులు ఒకటైతే రాజ్యాధికారం సాధ్యమవుతుందని, ఆ దిశగా ఆలోచనతో ఐక్యతకు కృషిచేయాలని పలువురు మేధావులు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వేదికగా ఆదివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి దళిత, బహుజన, మైనార్టీ, కాపు(డీబీఎంకే) రాజకీయ చైతన్య వేదిక సమావేశంలో ఈమేరకు వక్తలు అభిప్రాయం వ్యక్తంచేశారు. సదస్సులో పాల్గొన్న కర్ణాటక బీసీ తరగతుల కమిషన్ పూర్వ ఛైర్‌పర్సన్ డాక్టర్ సీఎస్ ద్వారకానాథ్ మాట్లాడుతూ అంబేద్కర్, లోహియా కాన్షీరామ్ ఆలోచనలతో ఇది సాధ్యమవుతుందన్నారు. డాక్టర్ రాం మనోహర్ లోహియా, డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలకు రూపునిచ్చిన మహనీయుడు కాన్షీరాం కులాలు, ఉప కులాలుగా విడిపోయిన సమాజాన్ని దగ్గరచేసి ఉత్తరప్రదేశ్‌లో రాజ్యాధికారం సాధించారన్నారు. ఇదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్‌లో పునరావృతంచేసి, చిన్న కులాలకు సాధికారత కల్పించడం ద్వారా రాజ్యాధికారం పొందవచ్చన్నారు. 15 శాతం వున్న రెండే రెండు కులాలు పాలకులుగా ఉంటే, 85 శాతం వున్న కులాలు పాలితులుగా ఉండటానికి ప్రధాన కారణం రాజకీయ చైతన్యం లేకపోవడమేనన్నారు. వెయ్యి కోట్లు, రెండు వేల కోట్లు ప్రకటించడం కాదని, చిత్తశుద్ధివుంటే రాజ్యాధికారం ఇస్తే వేల కోట్లు మేమే ఇస్తామనేంతగా కాపులు, బహుజనులు చైతన్యవంతులు కావాలన్నారు.రాష్ట్రంలో కాపులకు ప్రత్యేక కేటగిరీలో బీసీ రిజర్వేషన్లు ఇవ్వొచ్చని, రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఇవ్వకూడదని అంబేద్కర్ ఏమీ చెప్పలేదని ద్వారకానాథ్ అభిప్రాయపడ్డారు. ఏపీలో రిజర్వేషన్లపై గందరగోళ స్థితి నెలకొందన్నారు. 1920కి ముందు నుంచి 1932 వరకు ఎస్సీలుగా వున్న కాపులు, 1952 వరకు బీసీలుగా ఉండి ఆపై మార్పునకు గురయ్యారన్నారు. రిజర్వేషన్లకు పరిమితి లేదని, 9వ షెడ్యూల్డ్‌లో చేర్చి రిజర్వేషన్ కేటగిరీలు, క్రీమిలేయర్‌ను అమలుచేయవచ్చన్నారు. ఏపీలో 73 శాతానికి రిజర్వేషన్లు పెంచాలన్నారు. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు అన్యాయం అనే వాదన పక్కదారి పట్టించడమేనన్నారు. అదనపు కేటగిరీ పెట్టి కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. కర్ణాటకలో మాదిగలు పెద్దన్న పాత్ర పోషిస్తారని, ఇక్కడ కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. పవన్‌కళ్యాణ్ అంబేద్కర్, పూలే ఆలోచనా విధానంలో పయనిస్తున్నారనిపిస్తోందని, ఈ పార్టీ సామాజిక మార్పు కోసం రాజకీయ చైతన్యం దిశగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా ఉందని ద్వారకానాథ్ పేర్కొన్నారు.
రాజకీయంగా వెనుకబడిన తరగతులు రాజ్యాధికారం సాధించుకునే దిశగా ఆలోచన చేయాలని సదస్సు తీర్మానించింది. పల్స్ సర్వే రిపోర్టు ప్రకారం, ఏ సామాజిక వర్గానికి, ఎన్ని ఓట్లు ఉన్నాయో, ఆ నిష్పత్తి ప్రకారం అన్ని రాజకీయ పార్టీలూ సీట్లు ఇవ్వాలని, పల్స్ సర్వే రిపోర్టును వెంటనే బహిర్గతం చేయాలని సదస్సు డిమాండ్ చేసింది. నాలుగు శాతం వున్న సామాజికవర్గం నుండి 34 మంది శాసన సభ్యులు, ఐదు శాతం వున్న మరో సామాజికవర్గం నుండి 39 శాసన సభ్యులు ఉండటం ఎంత వరకు సమంజసమని సదస్సు ప్రశ్నించింది. ఎవరెవరు ఎంత శాతం వున్నారో వారికి అంత శాతం ప్రజా ప్రతినిధులు వుండాలని తీర్మానించింది. విద్య, వైద్య రంగాలు ప్రజలకు అందించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలే వహించాలని, అలా చేయడానికి కొంత సమయం అవసరమైతే, ప్రజల నెత్తిపై పడే భారాన్ని ప్రభుత్వాలే భరించాలని సదస్సు తీర్మానించింది. సీనియర్ న్యాయవాది రామారావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ధొండపాటి సత్యంబాబు, క్రెడయ్ స్థానిక ఛైర్మన్ నందెపు శ్రీనివాస్, భారత న్యాయవాదుల సంఘం సభ్యుడు ముప్పాళ్ళ సుబ్బారావు, క్రెడయ్ వైస్ ఛైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, తుమ్మిడి రామ్‌కుమార్, ఎన్ ఎస్ ఎస్ చంద్రశేఖర్, న్యాయవాది శ్రీనివాస్, మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిపోగు కోటేశ్వరరావు, సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు.