ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి వైకాపాకు రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: వైకాపాలో వ్యక్తిగత గౌరవ మర్యాదలకు స్థానం లేదని, పార్టీ అధినాయకుడు నియంతలా వ్యవహరిస్తున్నాడని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల వైకాపాలో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా మనస్థాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతవరకు ఆదరించి సహకరించిన శ్రేయోభిలాషులు, కార్యకర్తలకు కృతజ్ఞతలన్నారు. నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా 2014లో అందరి సహకారంతో ఎన్నికయిన నాటి నుండి సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూనే నాలుగేళ్లు వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చూస్తున్నానన్నారు. జగన్మోహన్ రెడ్డి గత నెలలో తనను పిలచి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలోకి వస్తున్నారని చెప్పారన్నారు. అందుకు నేను కూడా సమ్మతించి ఆనందం వ్యక్తం చేశారన్నారు. అయితే జగన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఆనం 50కోట్లు ఖర్చు చేయగలనని భరోసా ఇస్తున్నాడని, మీరెంత ఖర్చు చేయగలరని ప్రశ్నించారన్నారు. అయితే వెంకటగిరి నియోజకవర్గాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన నాతో సంభాషించారన్న విషయం అపుడు నాకు అవగతం కాలేదన్నారు. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తామని ఆయనే స్వయంగా తనతో చెప్పడంతో ఆ నియోజకవర్గం విషయం కాదనుకున్నానన్నారు. ఇప్పటి వరకు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నానని, సర్వేల్లో కూడా నా పనితీరు బాగుందనే అభిప్రాయం వచ్చిందన్నారు. జగన్ పాదయాత్ర సమయంలో వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నా ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని సైదాపురంలో స్థూపం సైతం ప్రారంభించామని గుర్తు చేశారు. కానీ ఇటీవల పార్టీలో పరిణామాలు కొన్ని తనను తీవ్రంగా బాధించాయన్నారు. ప్రత్యేకించి ఆనం ప్రవేశం సమయంలో తాను లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో ఉన్నానని కనీసం మాటమాత్రం చెప్పలేదని, అధినాయకుడు చెప్పి ఉంటే బావుండేదన్నారు. అధినాయకులకు ఉండవలసిన ప్రధాన లక్షణం అదేనన్నారు. అలాగే తిరుపతి పార్లమెంటరీ సమన్వయ కమిటి సమావేశాలకు సైతం తనకు ఆహ్వానం అందక పోవటం దారుణమన్నారు. పార్టీల్లో అభిప్రాయబేధాలు, సర్దుబాట్లు సహజమని అందుకోసం ఆనం చేరిక నుండి ఇప్పటి వరకు చాలా వేచి చూశానని కనీసం పెద్ద తరహాలో ఒకమాట చెప్పి ఉంటే బాగుండేదన్నారు. తన విషయంలో పార్టీ అధి నాయకుడు ప్రవర్తించిన తీరు బాధాకరమన్నారు. వ్యక్తిగత గౌరవ మర్యాదలు ప్రజాప్రతినిధులకు ప్రధానమని అలాంటివి లేని చోట ఇమడలేనన్నారు. భవిష్యత్‌లో జగన్ ముఖ్యమంత్రి అయితే మాలాంటి వాళ్ల పరిస్థితులు ఏమిటని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితుల్నే పరిగణనలోకి తీసుకుంటారా? సేవలు తీసుకోరా? అని ప్రశ్నించారు. అన్ని విషయాలను మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకు తెలియజేశానని వారికి సైతం నోరు మెదిపే శక్తి లేదన్నారు. పార్టీలో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పార్టీ అధినాయకునికి చెప్పుకుంటాం. కాని వైకాపా ఏకస్వామ్య పార్టీ అందులో జగన్ ఓ నియంత. ప్రజాస్వామ్య పార్టీ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి పనికిరాడన్నారు. అధినాయకుడు సరిలేనపుడు ఎవరిని నమ్మాలి. తనకు జరిగిన అవమానానికి మనస్థాపం చెంది పార్టీకి తక్షణమే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి జడ్పి చైర్మన్‌గా కొనసాగుతానని ఉద్ఘాటించారు. రానున్న ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీలో ఉంటానన్నారు.