ఆంధ్రప్రదేశ్‌

అమానుషం, దుర్మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 23: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యల పట్ల రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వీరిద్దరూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ వచ్చారని ప్రగాఢ సంతాపం తెలిపారు. కిడారి, సోమ హత్యను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తీవ్రంగా ఖండించారు. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన నేతను మావోయిస్టులు హతమార్చడం దుర్మార్గమైన చర్య అంటూ కిడారి, సోమ కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే కిడారి హత్యను మావోల పిరికిపంద చర్యగా జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అభివర్ణించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కిడారి, సోమ హత్యలు మావోల కిరాతకానికి నిదర్శనమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. మావోల ఘాతుకం గర్హనీయమన్నారు. గిరిజనుల అభివృద్ధికి వీరిద్దరూ ఎంతగానో కృషి చేశారని నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ మావోల ఘాతుకాన్ని ఖండించారు. కిలారు, సోమ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సర్వేశ్వరరావు, సోమల హత్య పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కే రామకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్త పరిచారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసకు తావులేదన్నారు. నక్సల్స్ ప్రభావం తగ్గిందని గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను ప్రారంభిస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారుతోందనటానికి ఇటీవల జరుగుతున్న పలు ఘటనలే తార్కాణమని ఆయన పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు కూడా తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. హత్యలు దురదృష్టకరమన్నారు. హింసాత్మక చర్యల ద్వారా ప్రజాసమస్యలు పరిష్కారం కావని ఆయన పేర్కొన్నారు. కిడారి, సోమ హత్యలు పాశవికమని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఖండించారు. మావోల పిరికిపంద చర్యకు నిదర్శనమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బుల్లెట్లు, హత్యలతో ఏదీ సాధించలేరన్నారు. కేవలం బ్యాలెట్ ద్వారా మాత్రమే ప్రజాసమస్యలను తీర్చగలమని స్పష్టం చేశారు.
మావోల చర్య పాశవికం
రాజమహేంద్రవరం: అరకు శాసన సభ్యుడు, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చడం తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. విశాఖ మన్యంలో ఆదివాసీల సమగ్ర అభివృద్ధి కోసం క్షేత్ర స్థాయి పర్యటన చేస్తున్న అరకు శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ శాసన సభ్యుడు, ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు సివేరి సోమను మావోలు పాశవికంగా హతమార్చడాన్ని కారెం శివాజీ తీవ్రంగా ఖండించారు. సర్వేశ్వరరావు, సోమ కుటుంబ సభ్యులకు వ్యక్తిగతంగాను, కమిషన్ తరపున సంతాపం ప్రకటించారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పునరుద్ధరణ జరిగిన అనంతరం సభ్యునిగా ఎంపికైన సివేరి సోమ విశాఖ మన్యం గిరిజనుల అభివృద్ధి కోసం నిర్వరామంగా పనిచేశారని శివాజీ కొనియాడారు. గతంలో కమిషన్ విశాఖ మన్యంలో పర్యటించిన సందర్భంలో అరకు, పాడేరులో ఆదివాసీల అభివృద్ధికి చేపడుతున్న పథకాల పురోగతిని సమీక్షించి తనవంతు సూచనలు చేశారని కారెం శివాజీ సివేరి సోమను గుర్తు చేసుకున్నారు. మన్యం విషాదం తీవ్రంగా కలచివేసిందన్నారు. ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి విశాఖకు బయలుదేరి వెళ్లారు.
మావోలది పిరికిపంద చర్య
గుంటూరు: విశాఖ జిల్లా అరకు శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ శాసనసభ్యుడు సివేరు సోములును మావోయిస్టులు హత మార్చడం పిరికిపంద చర్య అని, అత్యంత హేయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఖండించారు. ఇక్కడి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనుల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ సేవ చేస్తున్న సర్వేశ్వరరావు, సోములు పట్ల అభద్రతా భావంతో మావోలు హత్యకు పాల్పడ్డారన్నారు. ఏవైనా డిమాండ్లు ఉంటే ప్రభుత్వం నుంచి సాధించుకోవాలే తప్ప హత్యలు చేయడం అమానుషమన్నారు. ఇటీవలి కాలంలో ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో మావోలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. సర్వేశ్వరరావు తనను ఎప్పుడు కలిసినా గిరిజనుల సమస్యలు, అభివృద్ధిపైనే మాట్లాడేవారని, గిరిజనులకు 50ఏళ్లకే పింఛన్లు అందించటంలో సర్వేశ్వరరావు కీలకపాత్ర వహించారని గుర్తుచేశారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం ప్రజల్లో ఉంటూ విశేష సేవలు అందించారన్నారు. వైఎస్ హయాంలోనే బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని, తెలుగుదేశం ప్రభుత్వం వాటిని రద్దు చేసిందన్నారు. కిడారి, సోము కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. మావోయిస్టుల దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని మంత్రి ఆనందబాబు పిలుపునిచ్చారు.
ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించండి
విజయవాడ: విశాఖ జిల్లా లిపిటిపుట్టు ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఆదివారం సమీక్షించారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్వే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో ఆయన ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి పూర్వాపరాలను సీఎస్‌కు అధికారులు వివరించారు. గ్రామదర్శినిలో పాల్గొనే ప్రజాప్రతినిధులకు తక్షణం తగిన రక్షణ కల్పించాలని కలెక్టర్లు, పోలీస్ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలను అనుక్షణం పర్యవేక్షించాలని డీజీపీ (ఇన్‌చార్జి) హరీష్ గుప్తాకు సూచనలు చేశారు.
యనమల, లోకేష్ సంతాపం
విజయవాడ: ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. మావోయిస్టుల ఘాతుకాన్ని ఆయన ఖండించారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి కిడారి, సోమ చేసిన కృషిని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కిడారి, సోమ హత్యలను మంత్రి లోకేష్ తీవ్రంగా ఖండించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెపుతూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఆనందబాబు