ఆంధ్రప్రదేశ్‌

‘కందుకూరి’కి ‘నన్నయ’ బ్రేకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: సంఘసంస్కర్త, నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటుచేసిన విద్యా సంస్థలను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో విలీనం చేసే ప్రయత్నానికి చెదలు పడుతున్నాయి. విలీనానికి ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపట్టినప్పటికీ నిధుల కోసం నన్నయ విశ్వవిద్యాలయం చేసిన ప్రతిపాదనతో బ్రేక్ పడింది.
దీంతో కందుకూరి మహదాశయానికి నన్నయ యూనివర్సిటీ మోకాలడ్డుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. విలీన తతంగమంతా పూర్తయిపోయిందని అనుకుంటున్న సమయంలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుంచి వెళ్ళిన ఒక లేఖ కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఈ విద్యా సంస్థల లక్ష్యం నీరుగారుతోంది. వందలాది మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది భవితవ్యం డోలాయమాన స్థితిలో పడింది. రూ. కోట్ల విలువ చేసే ఆస్తులు కలిగిన విద్యా సంస్థలు ప్రస్తుతం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధీనంలోవున్నాయి. ఈ సంస్థలను కందుకూరి వీలునామా ప్రకారం ప్రస్తుత ప్రభుత్వం ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయంలో విలీనం చేయడానికి రంగం సిద్ధంచేసింది. చివరి దశలో పెండింగ్‌లో పడడంతో ఈ ప్రతిపాదనకు మళ్ళీ కాలదోషం పడుతోంది. కందుకూరి విద్యా సంస్థల్లో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు వివిధ రకాల కోర్సులు అభ్యసిస్తున్నారు. 480 మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ విధానంలో పనిచేస్తున్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు 1903లో హితకారిణీ సంస్థ ఆధ్వర్యంలో పలు విద్యాసంస్థలను నెలకొల్పారు. ప్రస్తుతం ఈ సంస్థ ఆధ్వర్యంలోఎస్‌కెవీటీ ఇంగ్లీషు మీడియం, ఎస్‌కేవీటీ తెలుగు మీడియం హైస్కూళ్లు, ఎస్‌కెఆర్ ఉమెన్స్ కాలేజి, ఎస్‌కెఆర్ ఎంబీఏ ఫర్ ఉమెన్స్ కాలేజి, ఎస్‌కెఆర్ ఉమెన్స్ డిఎడ్ కాలేజి, ఎస్‌కెఆర్ డిగ్రీ కాలేజి, ఎస్‌కేఆర్ జూనియర్, డిగ్రీ కాలేజీలు పనిచేస్తున్నాయి. ఈ విద్యా సంస్థల నిర్వహణ బాధ్యత హితకారిణి సంస్థకు అప్పగించారు. భవిష్యత్తులో ఈ సంస్థ ఈ విద్యా సంస్థలను నిర్వహించలేకపోయినా, పర్యవేక్షించలేకపోయిన ప్రభుత్వం గానీ, ప్రభుత్వం తరపున ఏదైనా సంస్థగానీ తీసుకోవాలని కందుకూరి వీలునామా రాశారు. హితకారిణి సమాజం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్‌కెవీటి విద్యా సంస్థల్లో పనిచేసే ఎయిడెడ్ లెక్చరర్లతో పాటు సమాన అర్హతలు కలిగిన లెక్చరర్లు అన్ అయిడెడ్‌లో పనిచేస్తున్నారు. రెండేసీ పీజీ డిగ్రీలు కలిగి, పాతికేళ్ళకు పైబడిన సీనియారిటీ కలిగివున్నప్పటికీ కనీస వేతనాలు కూడా లేకుండా పనిచేస్తున్నారు. రూ.10 వేల కంటే తక్కువ జీతంతో పాతికేళ్లకు పైగా పనిచేస్తున్న వారున్నారు. నెట్ పాసైన అధ్యాపకులు కూడా అన్ ఎయిడెడ్‌లో గడుపుతున్నారు. అదే అర్హతలు కలిగిన అధ్యాపక సిబ్బంది యూజీసీ జీతాలు రూ.లక్షకు పైగా పొందుతున్నారు. అన్ ఎయిడెడ్ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి ఈ విద్యా సంస్థల్లో విద్యార్ధులు చెల్లించే స్పెషల్ ఫీజుల నుంచి జీతాలు తీసుకునే అగత్యంలో గడుపుతున్నారు. దేవాదాయ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇదే స్పెషల్ ఫీజు ద్వారా వసూలయ్యే సొమ్ము నుంచే జీతాలు చెల్లిస్తుండటం విచిత్రం.
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీగా ప్రొఫెసర్ అల్లం అప్పారావు పనిచేసిన సమయంలో కందుకూరి విద్యా సంస్థలను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో విలీనంచేసే ప్రక్రియకు అంకురార్పణ జరిగింది. అనంతరం ఇన్‌చార్జి వీసీగా రిజిస్ట్రార్ ధనుంజయ పనిచేసిన సమయంలో ఈ ప్రతిపాదనకు సుముఖత వ్య చేస్తూ ఫైలు కదిలినా అనంతరం వివిధ కారణాలతో మరుగున పడింది. ఏడాది క్రితం మళ్ళీ కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎస్‌కెవీటీ కాలేజిలో రాష్ట్ర మానవ వనరుల శాఖ, ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ అధ్యక్షతన భారీ సమావేశాన్ని ఏర్పాటుచేసి ఎంతో ఆర్భాటంగా కందుకూరి విద్యా సంస్థలను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. అప్పటికే అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తయినట్టు ప్రకటించారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి విలీనం అమల్లోకి వస్తుందని ప్రకటించారు.
ఈ క్రమంలో 2017 డిసెంబర్‌లో నన్నయ రిజిస్ట్రార్ తాము నూతనంగా విలీనం చేసుకోబోయే కందుకూరి విద్యా సంస్థలలో వౌలిక సదుపాయాల కల్పనకు రూ.50 కోట్లు, రికరింగ్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఫండ్‌గా రూ.15 కోట్లు ఇవ్వాలని ఉన్నత విద్యా సంస్థ స్పెషల్ సెక్రటరీకి లేఖ రాశారు. అంతే ఈ లేఖతో విలీన ప్రక్రియకు కాలదోషం పట్టేసింది. ఈ విద్యా సంస్థల ఆశయాలను కాపాడాలన్నా, ఆకలి చావులకు తావులేకుండా అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని సంరక్షించాలన్నా తక్షణం విలీన ప్రక్రియ పూర్తి చేయాల్సివుందని సర్వత్రా కోరుతున్నారు.